
12
నానా స్వామికి ప్రియ శిష్యురాలని చాలా మందికి తెలియదు. స్వామి విదేశ పర్యటనలో ఉన్నప్పుడు వియోగిని ప్రేమాతుర అయిన నానాను ఫ్రాన్సు లొ కలుసుకొన్నాను. ఆశాభంగం వలనా ఆసత్యం వలనా అలమటించి పోతున్న ఈ స్త్రీ మూర్తి ని, ముక్త సంగుడూ తత్త్వవేత్తా అయిన ఈ భారతీయ యోగి దుఖాన్నుంచి తప్పించిన విషయం నాగేశ్వరరావు కు గాని బాలచంద్ర కు గాని తెలియదు.
నానా ఇండియాకు రావటానికి ముఖ్య కారణం స్వామి. అయన జన్మస్థలం ఆంధ్రదేశం అన్న సంగతి కూడా ఆమెకు ఒక్కదానికే తెలుసు.
"స్త్రీ తన ప్రియుడి కోసం పడే వేదనలో సగం వేదన భగవంతుడి కోసం పడితే అతను తప్పక లభిస్తాడు నానా! మీరా అనే భారతీయ యోగిని ఈమార్గం చేతనే తరించింది" అని ఒక కృష్ణ విగ్రహాన్ని నానాకు బహూకరించారు స్వామి.
ఆరోజునే ఇలా నిశ్చయించు కొంది నానా--
"ఆనందమూర్తి అయిన కృష్ణ భగవానుడే నాప్రియుడు. అతనే నా సర్వస్వం" అని. కాని బాలచంద్ర ను మరిచిపోవటం ఆమెకు చాలా దుస్సాధ్యంగా ఉంది. బాలచంద్ర ఎదురుగా ఉన్నప్పుడు అతనిలో కృష్ణ దర్శనం పొందుతుంది. కృష్ణ విగ్రహానికి ఎదురుగా ధ్యానిస్తున్నప్పుడు బాలచంద్ర తన ఏకాగ్రతను నిలవనీయటం లేదు. ఆ పైన మానినీ సహజమైన లాలస తనను విడిచి పెట్టి పోవటం లేదు.
ఈ విషయమే విజయవాడ లో స్వామి ఉన్నప్పుడు అడిగి విలపించింది నానా.
స్వామి చిరునవ్వు నవ్వి--
"ఏ ప్రాణినీ లాలస విడిచి పెట్టదు నానా. ఏ ప్రాణి కూడా హృదయంతో మొదటనే పవిత్రత సాధించలేదు. అనుభవంతో నే పవిత్రత ప్రాప్తిస్తుంది. బాహ్య కారణాలను, బ్రహ్మ చర్యాన్ని బలవంతంగా ఆచరించి ఆత్మ పారిశుధ్యాన్ని సాదించామను కోవటం పొరపాటు. నీవు లాలసకు దూరంగా ఉండటానికి ప్రయత్నించినంత కాలమూ అది నిన్ను లొంగ దీసుకుంటుంది. దాన్ని దగ్గరగా ఉంచి పరిశీలించటం ప్రారంభిస్తే సర్వమూ అర్ధమయి పోతుంది. ప్రియుడూ భగవంతుడూ ఏకాకృతిగా కనిపించటం దోషం కాదు" ఆన్నారు.
"కాని స్వామీ...."
"నీవు అడగదల్చు కొన్న ప్రశ్న నాకు అర్ధమయింది. జపానులో కొన్ని వందల సంవత్సరాల నాటి దేవదారు చెట్లు అడుగున్నర కన్నా ఎదగనివ్వనివి కొన్ని ఉన్నాయి. వాటి కొమ్మలనూ వెళ్ళనూ ఎప్పటి కప్పుడు కత్తిరిస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుల సహజాభివృద్ది , అసహజాలైన మత బేదాల చేత, పాప పుణ్యాల నీతి అవినీతుల గాభరాల చేత అణగగొట్టబడింది. మానవులు పేరు పెట్టిన ఈ పశు వాంఛ విషయంలో మానవుల కన్నా పశువులే నిగ్రహాన్ని చూపిస్తున్నాయ్. డానికి కారణం వాటికి విధి నిషేధాల ఇనప వలయాలు లేక పోవటం . శాసనాలూ, నిర్భందాలూ లేని ప్రేమ లాలసలె సక్రమమైన మానసికాభివృద్ది ని కలిగిస్తాయి. అదే ఈశ్వర నియతి. డానికి దూరంగా ఉండనవసరం లేదు" అన్నారు స్వామి.
'అంతటి సర్వజ్ఞత ఈ చాంచల్యం లో ఎలా సాధ్యం స్వామీ? ఇది ఉత్త పిపాసా నివృత్తి మాత్రమె అవునేమో?' అన్నది నానా-- ఆమె హృదయం లోని సందేహపు తెరలను ఒకటొకటి గా తొలగిస్తూ.
"సర్వ జీవ హృదయాల్లో నూ నీ హృదయ స్పందన వినిపించి తీరాలి నానా. అప్పుడే నీకు సర్వ జ్ఞాత్వం సంప్రాప్తిస్తుంది. నామరూపాలలోనూ , పర్వత శ్రేణుల మధ్యనూ , నదీ నదాల గాన మాధుర్యం లోనూ, స్త్రీ పురుష విలాస వాహిని లోనూ అది ఏకమై అవిచ్చిన్నమై నిరంతరం వెలిగినప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అలాటి స్థితి నీలో కలిగినప్పుడు ఈ సర్వ జగతీ నీతో చేయి కలుపుతుంది" అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు స్వామి.
జితేంద్రియాలు సౌందర్యారాధకులూ అయిన స్వామి స్త్రీ పురుష సంబంధాల విషయానికి బొత్తిగా ప్రాధాన్యం ఇవ్వరు. అది ఒక దేహా వసరం. అంతే. అంతకన్నా ప్రత్యేకత గాని ప్రాధాన్యం గాని డానికి లేదు. మానవుడు తన సర్వ జీవితానికీ దాన్ని కేంద్ర బిందువు చేసుకోటం తెలివి తక్కువ అంటారు వారు. మనసుకూ, శరీరానికీ ఉన్న సంబంధం లాగానే ఆత్మకు సర్వేశ్వరు నికి కూడా ఒక ఘనిష్ట సంబంధం ఉంది. దాన్ని తెలుసుకో గలిగితే విశ్వమంతా ప్రానవిభుడి మందిరమే అవుతుంది అన్నది అయన సిద్దాంతం.
సాయంత్రం ఒంటరిగా కూర్చుని స్వామి వాక్యాన్ని మననం చేసుకుంటున్న నానాకు విశ్వరహస్యం అర్ధమయి పోయినట్లే అనిపించింది.
తను నివేదిత. తను మిసెస్ నెల్సన్ తను నానా.
బాలచంద్ర కారాగిన చప్పుడుకు కళ్ళు తెరిచి చూసింది నానా. కొన్ని క్షణాల్లోనే నాగేశ్వరరావూ, బాలచంద్రా పైకి వచ్చారు.
పరమ సౌందర్య వంతుడైన ఈ యువకుడి మీద ఉండే మమతను తను వదులుకోలేక పోతున్నది. అందుకేనేమో ఆడవాళ్ళు సన్యాసినులు కాలేనిది. మరి నాగేశ్వర్రావు కూ తను దూరంగా లేదు. కాని ఇప్పుడతను తనను వాంచించటం లేదు. దేనికైతే నిషేధం ఉండదో దాని కోసం ఆరాటమూ ఉండదు. అదే జీవిత రహస్యం. ఒకవిధమైన సంస్కారం పెంపొందిన తరువాత నిషేధాలను ఎత్తి వేస్తె లోకం నిగ్రహ వంత మవుతుంది.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?' అన్నాడు బాలచంద్ర తీరిగ్గా కుర్చీ ముందుకు లాక్కుని కూర్చుంటూ.
"బహుశా నిన్ను గురించే అయి వుంటుంది" అన్నాడు నాగేశ్వరరావు నవ్వుతూ.
'ఆ సంగతి తెలియటానికి జ్యోతిషం దానవసరం లేదు. నానా ఇద్దర్నీ గురించి ఆలోచిస్తుందని అందరికీ తెలుసు" బుంగమూతి తో సమాధానం ఇచ్చింది నానా.
"ఆ రెండో వాడెవడో చెప్పు-- వాడిని వెతికి ..." ఆవేశంతో అందంగా అన్న బాల చంద్రను చూసి నవ్వింది నానా.
"ఏం చేస్తావు?"
"ఫిలిం డిస్ట్రిబ్యూషర్ ను చేస్తాను....అదే వాడికి శిక్ష."
"అదేమిటి. లక్షలు వచ్చే వ్యాపారం గదా?"
"అందుకే. దానితో నీకు దూరం అయి పోతాడు. సమస్య తీరిపోతుంది' అని సిగరెట్ వెలిగించాడు బాలచంద్ర.
"ఈ తడవ అన్నీ హిందీ ఫిల్ము లేనా ఏమిటోయ్ నీకు?' అన్నాడు నాగేశ్వర్రావు.
"మొన్న ఒక హిందీ డబ్బింగ్ ఫిల్ము విడుదల చేశాం. ప్రేక్షకులు కావలెను . మొదటాట తరువాత రోడ్డు మీద నిలబడి వచ్చే పోయే వాళ్లకు టికట్ కొనిచ్చి పైన మరో అర్ధ రూపాయి ఇచ్చి లోపలికి పంపించాం" గంబీరంగా సమాధానం చెప్పిన బాలచంద్ర ను చూసి పకపకా నవ్వాడు నాగేశ్వరరావు.
నానా కూడా చిరునవ్వు నవ్వి, "ఇంకా ఆడుతుందా ఆ సినిమా?' అన్నది.
"వెడతావేమిటి? టికెట్ తెప్పించనా?"
"వద్దు, వద్దు."
"మా ప్రొడ్యూసర్ గుండె పగిలి చచ్చే స్థితిలో ఉన్నాడు. పోనీ లేవయ్యా, ఏది శాశ్వతం ఈ సినిమా వ్యాపారం లో? అంటే వినటం లేదు. "సిగరెట్ పొడిని యాష్ ట్రేలో విదుపుతూ తన అందమైన కన్నులను అరమోడ్చి సమాధానం చెప్పాడు బాలచంద్ర.
"వచ్చినదంతా నువ్వు ముందే జేబులో వేసుకుని వాడికి వేదాంతం చెపితే ఏడవడూ?" నవ్వాడు నాగేశ్వరరావు.
"అబ్బాయ్, ఈ దిక్కు లేని లోకంలో ఎవడి బాగు వాడిదే. స్వార్ధం అనేది ఊపిరి పీల్చటం లాటిది. నాకు మేడలూ కార్లూ అందమైన ఆడపిల్లలూ అన్నీ కావాలి. కావాలంటే డబ్బుండాలి. డబ్బుండాలంటే స్వార్ధం అవసరం."
"ఇప్పుడీ జీవిత రహస్యాన్ని చెప్పటానికేనా తమరు దయ చేసింది?' అని నాగేశ్వర్రావు చూడకుండా అతని మోకాలు మీద చిన్న దెబ్బ వేసి అడిగింది నానా.
బాలచంద్ర సమాధానం చెప్పక మునుపే నాగేశ్వరరావు గారూ అనే పిలుపు వాకిట్లో వినిపించింది. కొంచెం సేపట్లో దాసీదీ జగన్నాధాన్ని పైకి తీసుకొచ్చింది.
