Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 21


    ఎందుకు కృష్ణవేణీ నన్నిలా కవ్విస్తావు? నన్నెంత బాధ పెడుతున్నావో తెలుసా?"
    "బావుంది. ఇంత దూరాన వుండి మిమ్మల్నేం బాధ పెడుతున్నాను?"
    "దూరాన వుండబట్టే బాధ. దగ్గిరకొస్తే అంతా సుఖమే కదూ?"
    మాధవ్ జవాబులు గురితప్పని బాణాల్లా వుంటాయి. మాధవ్ స్నేహం పెంచుకోటంలో నాకో సంతృప్తి వుండేది-మాధవ్ వంటి వ్యక్తిని అనుగ్రహించటం పుణ్యమనీ - భగవంతుడు కూడా మెచ్చుతాడనీ.
    నెలలు వారాల్లాగా-వారాలు రోజుల్లాగా గడిచిపోతున్నాయి. నావిషయం రేణుకి విపులంగా కాకపోయినా సూచాయగా తెలుసు. నిర్మొహమాటంగా తన అయిష్టం వెలిబుచ్చేది- కాని మాధవ్ కన్నా ఎక్కువా రేణు నాకు?
    "నేను ఆనాడే అన్నాను. స్నేహితుల్ని మరిపించే స్నేహితుడు ప్రపంచమంతా అతను తప్ప నీకెవరూ కన్పించరులే." అంది వెటకారంగా.    
    "పోనీ. అలానే అనుకొని నీ సలహాలు మానేస్తే సంతోషం" అన్నాను నవ్వి. వదిన పుట్టింటి నుంచి పాపనెత్తుకొచ్చింది. పాప తెల్లగా ఆరోగ్యంగా వుంది. అన్నయ్య పోలిక-"అన్నయ్యా! మీ పాప డాక్టరుగారి పాపను చూస్తేనే తెలిసిపోతుంది సుమా! డాక్టరుగారి పిల్లలు తప్ప మరెవ్వరూ వుండరు నీకూతురంత బంతుల్లా" అన్నానని అమ్మ మందలించింది - "ఛ! అవేం మాటలు. చిన్నపిల్ల దిష్టి తగిలేను." అని పాప నెత్తుకొచ్చాక వదినంటే మరీ గారం అమ్మకి. అలాగే కొన్నాళ్ళుపోతే అల్లుడంటే ప్రాణమవుతుంది అమ్మకి". అనుకున్నాను.
    శాంత అత్తారింటి నుండి వుత్తరం రాసింది. మూడోనెలట. ఆరోగ్యంగానే వుంటున్నదట.
    ఆ వార్త నా కెంతో సంతోషం కల్గించింది. కాని ఆపైన శాంత రాసిన సంగతికి నిజంగా చిరాకేసింది.
    నీ కెప్పటినుంచో రాయాలని అశ్రద్ధచేస్తూ వచ్చాను. కృష్ణవేణీ! ఐనా నీకు చెప్పడం అంటే అంత యోగ్యత నాకెక్కడిది. స్నేహాన నేను చెప్పే ప్రతి విషయం నువ్వు వింటావని నాకు తెలుసు. నువ్వు చిన్న పిల్లవి కాదుగదా? చదువు కొంటున్నావు. నీనుంచి చెడ్డలు నువ్వు తెలుసుకో లేకపోవుగానీ స్నేహితురాలివిగా నా ధర్మం వుంది కదా?
    మాధవ్ మనమనుకున్నట్లు అవివాహితుడుకాడటగా? అతను ఎటువంటి పరిస్థితిలో వుండనీ-అది మనకనవసరం-ఇంకా అతనితో స్నేహం పెంచుకోవటంలో నీ వుద్దేశ్యం ఏమిటో మరి? ఇది నిర్లక్ష్యం చెయ్య దగ్గ విషయంకాదు కృష్ణవేణీ! ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు చేస్తున్న పనివల్ల చాల చిక్కులుంటాయి. సుఖాన వున్న ప్రాణం దుఃఖాన పెట్టుకోటం తప్ప ఏమీలేదు. నీవుద్దేశ్యం ఏమిటో విపులంగా నాకు జవాబు రాయి."
    నేనేదో నూతిలో దిగిపోతున్నట్టు ఏమిటో చెప్తారు వీళ్ళు. ఎందరెన్ని చెప్పినా మొండికేసి తనకి కావలసిన పెళ్ళి ఎందుకు చేసుకుందో మరి. శాంతకంటే రేణు మీద నాకు చాలకోపం వచ్చింది. ఇది దాని పనే. ఎక్కడేం జరిగినా ఆవిడికి జేర వెయ్యకపోతే ఈవిడికి తోచదు. మర్నాడు క్లాసులో ఆ వుత్తరం రేణుకిచ్చాను.
    "అయితే శాంతకి పాపాయి పుడుతుందన్న మాట." అంది నవ్వి.
    నేనేం మాట్లాడలేదు.
    "నీకు గుర్తుందా కృష్ణా? శాంత గౌనుల్లో తిరగటం కూడా నాకళ్ళకి కట్టి నట్టుంది. నెమ్మది నెమ్మదిగా పరికిణీలూ-ఒణీలూ-చీరలూ! పెళ్ళి చేసుకుంది. అప్పుడే తల్లికాబోతూంది. ఓ బుల్లి యిల్లాలై పోయింది. తల్చుకుంటూంటే గమ్మత్తుగా లేదూ?" అంది నా మొహంలోకి చూస్తూ-"నీకన్నీ గమ్మత్తులుగానే వుంటాయి గానీ మాధవ్ గురించి శాంతకేమిటేమిటి రాశావేమిటి?" అన్నాను.
    రేణు నిబ్బరంగానే చూసింది- "లేనిపోనివి కల్పించిరాయటం నాకేం అవసరం?"
    "ఉన్నవే రాయటంలో మాత్రం నీకేం, అవసరం?"
    "ఐతే శాంత దగ్గిరా నువ్వు దాపరికం చేసేది?
    "అది నీ కనవసరం. కావాలంటే నేను రాసుకొనేదాన్నిగా?"
    రేణుక్షణం నా మొహంలోకి చూసి చూపు మళ్లించుకొంటూ-
    "పొరపాటే, క్షమించు." అంది.
    "అదొకటి నీకు అలవాటే"
    "ఇలామండి పడకపోతే నీ నిర్ణయాలేమిటో అడిగిందిగా? దానికి చెప్పకూడదూ?"
    "నాకేం అవసరం లేదు. అని నన్నడిగి దాని పెళ్ళి నిర్ణయించుకోలేదు"
    అంతే. రేణుమళ్ళా ఏమీ అనలేదు. ఆపూట క్లాసులో ఏమీ మాట్లాడుకోలేదు. కాలేజీ విడిచాక ఎవరి దారిన వాళ్ళు వచ్చేస్తుంటే నాకేమిటో చాలకష్టంవేసింది. ఏనాడు గరల్సు స్కూలుల్లో కలిశామో! ఈ పదమూడుసంవత్సరాల్లో రేణుతో అలా ఘర్షణ పడి ఎరుగను. ఇన్నాళ్ళూ గర్వపడుతూ వచ్చిన ఈ స్నేహన్నే మర్చిపోతున్నా నేమో అనిపించింది. నన్ను దాటి వెళ్ళిపోతూన్న రేణు చెయ్యి పట్టుకొని వెంటనే నడుస్తూ-
    "కోపం వచ్చిందా రేణూ? ఛ! చాల చిరాగ్గా మట్లాడాను కదూ?" అన్నాను. రేణు నవ్వింది." నువ్వు మాట్లాడ్డానికేంలే. నువ్వు అన్నా నేను పడ్డా ఫర్వాలేదు. కాని మేమేది చెప్పినా నీకోసం అన్నసంగతి మర్చిపోవద్దు కృష్ణా!" అంది నా చెయ్యి నొక్కుతూ.
    నవ్వి "నాకు చెప్పేంత అనుభవం నీకుమాత్రమేముంది?" అన్నాను.
    "పోనీ శాంత!"    
    "అదే ఒప్పుకుంది కదా నేను పాలుతాగటం లేదని."
    చాల రోజులైంది రేణూ వాళ్ళింటికెళ్ళి. ఆ సాయంత్రం శాంతకబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ డాబా మీద తిరిగాం.
    తర్వాత శాంతకి జవాబు రాశాను-అది తల్లి కాబోతున్నందుకు నాకు కల్గిన సంతోషం వెల్లడించాను మాధవ్ విషయం గురించి-విపులంగా రాయటానికేముంది శాంతా? మనం కల్సుకున్నప్పుడే మాట్లాడుకుందాం- నేను చిన్నపిల్లను గానని-చదువుకొంటున్నాననీ-నా మంచి చెడ్డలు నేను తెలుసుకోలేకపోననీ నువ్వేగా అంటున్నావు. అదే నేనూ అనుకుంటున్నాను. 'అని రాశాను. ఎందుకు మరి? నా నిర్ణయం వాళ్ళకి నచ్చదు. వాళ్ళ బోధనలు నా తలకెక్కవు. ఐనా నేనేం తప్పుడు పనులు చెయ్యటం లేదే!

                              *    *    *
    
    శాంత విషయం రాయమని మాధవ్ చాలాసార్లు అడిగాడు. ఏవేవో గొడవల్లో ఆవిషయం రాయకుండానే గడిపాను. కాని శాంత తల్లి కాబోతూందన్న సంగతి మాధవ్ కి కూడా చెప్తూ దాని పెళ్ళితర్వాత విషయమంతా తెలియజేశాను. దాని వల్ల శాంత గురించి మాధవ్ కి కూడా తెలుస్తుంది కదా?

                                            
    పెళ్ళి జరిగిన నాటి మర్నాటి వుదయం శాంతని రైలెక్కించి మరీ ఇంటికొచ్చాం కదా? వెంటనే వుత్తరం రాయమని మరీ మరీ చెప్పాం. వారం గడిచినా రెండు వారాలు గడిచినా కబురు లేదు. ఏమీ లేదు. రేణూ నేనూ రోజూ అదే విషయం మాట్లాడుకొనేవాళ్ళం. శాంత మొండిగా ప్రవర్తించి బ్రతుకు పాడుచేసుకొందని బాధపడే వాళ్ళం. తర్వాతేం జరిగిందో-అతను మాట్లాడాడో లేదో తెలుసుకోవాని తహతహలాడిపోయాం. రెండు మూడుత్తరాలు రాసినా శాంత జవాబివ్వలేదు. ఓనాడు రేణూ నేనూ శాంత వాళ్ళింటికెల్లి కబుర్లేమిటని వాళ్ళమ్మ గార్నడిగితే ఆవిడ చెప్పింది-వారం రోజుల క్రిందటే శాంతా వాళ్ళ నాన్నగారు శాంతని తీసుకురావాలని వెళ్ళి వచ్చారట. దాని సంసారమేమీ చక్కబడినట్టు ఆయనకి కన్పించలేదట. శాంతా వాళ్ళాయనా ఒక దగ్గిర తిరగటంకానీ, మాట్లాడుకోవటంగానీ ఆయన చూడలేదట. శాంతని తీసికెళ్తాంనంటే వాళ్ళత్తగారు-"నీ బిడ్డకేం కష్టంలేదన్నయ్యా ఇక్కడ. అబ్బాయి మనసింకా మారకపోవటం నిజమేగానీ అందుకే ఇప్పుడువాళ్ళని వేరుచెయ్యకూడదు. మరొక్క నెల్లాళ్ళు పోనీ. మూడో నెలవొస్తుంది. నేనెందుకు చెప్పానో అర్ధం చేసుకో. నీకు తెలీందేముంది గనకా?" అందట. శాంత కూడా ఇప్పుడు రానందట. ఆయన రెండురోజులుండి వచ్చేశారట.
    "అది దైర్యంగా ఒప్పుకుంది కదా అని మేమూ నిర్భయంగా వూరుకున్నాం. గానీ ఇంత విపరీత మని అనుకోలేదమ్మా! అంతా పుస్తెకట్టిన మర్నాటినుంచీ చిలకల్లా తిరుగుతూంటే దీనికేం గొడవమ్మా ఇది? ఎంత కుమిలిపోతూందో ఏమిటో! అచ్చటా ముచ్చటా లేకపోతే దాని బ్రతుకేంగానూ?" అంటూ వాపోయింది శాంతా వాళ్ళమ్మ.
    "ఆఁ మరేం ఫర్వాలేదండీ! అదే సర్దుకుంటుంది అంతా" అంటూ మాకు కడుపులో లేకపోయినా ఆరిందాల్లా పైకి ఓదార్చి వచ్చేశాం. తర్వాత శాంతకి వుత్తరాలూ రాయలేదు. అప్పుడప్పుడూ వాళ్ళింటికి మాత్రం వెళ్ళి వస్తూండేవాళ్ళం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS