Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 21


                                     29
    కొడుకు చెడు సావాసాలు చేసినా, సినిమాలకు వెళ్ళినా, రేసులకు వెళ్ళినా, తనకు తగని పాలిటిక్స్ లో పడి సతమత మయినా...సేతుపతి మానసికంగా బాధ పడ్డారే గానీ , మనసు విరగ గొట్టు కోలేదు. సామ దాన భెదోపాయాలు పని చేయ్యనప్పుడే దండో పాయాన్ని గురించి ఆలోచించు కోవచ్చనుకున్నారు. పరీక్షలయిపోయాయి. వేసవి సెలవులు కాశ్మీరు లో గడుపు తానన్నాడు రఘు. సేతుపతి సరే నన్నారు. అన్ని ఏర్పాట్లు చేయించారు. అరుణ, సెలవుల్లో మామూలుగా అయన గారి సెక్రెటరీ పని చేస్తూ....ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు సంపాదిస్తుంది.
    ఈ కాలమన్న మహా సముద్రంలో చిన్నచిన్న కెరటాల్లాటి రెండు నెలలు ఎంతసేపు గడిచిపోతాయి? పరీక్షా ఫలితాలు ప్రకటించబడే నాటికి రఘు కాశ్మీర్ నించి తిరిగి వచ్చాడు.
    సేతుపతి గారు ఇద్దరి నెంబర్లు తన డైరీ లో వ్రాసుకుని ఉంచుకున్నారు. మొదట, మొదటి తరగతి లో ఉత్తీర్ణులయిన వారి నెంబర్లు చూశారు సేతుపతి. అనుకున్నట్లుగానే అరుణ పాసయింది. రఘు అన్ని పార్టు ల్లోనూ తప్పిపోయాడు. ఆ తండ్రి ఆవేదనకు అంతు లేకపోయింది. మానసికంగా విపరీతంగా బాధపడి పోయారాయన. అరుణ మీద అసూయతో కాదు. రామరామ అయన బాధ అంతా ఒక్కటే. తనే లోటు చేశాడని రఘు తన నిలా అసంతృప్తి పాలు చెయ్యడం? 'ఛీ ఛీ' అనుకున్నాడు తనలో తాను. అంతటితో ఆ ఆరాటం ఎలా చల్లారుతుంది? తండ్రిగా తనకూ ఒక కర్తవ్యమంటూ ఉందిగా? ఇక ముభావంగా ఉండిపోయి, ముద్దు ముద్దుగా గోముచేస్తూ రఘునూ ఏనాడూ తాను దారికి తెచ్చుకో లేడనుకున్నారు. ఈలోగానే అరుణ అయన గారికి బెడ్ కాఫీ తెచ్చింది.
    అప్పటికే ఆమె స్నానమూ, పూజా ముగించింది. భగవంతుని పాదపద్మాలాశ్రయించిన ఒక పద్మాన్ని దూముడి లో తురుముకుంది. ముఖాన కానీ బిళ్ళంతటి కుంకుమ బొట్టు మెరిసి పోతుంది. ప్రపంచం లోని పవిత్రత అంతా అరుణ రూపంలో అయన ఎదట సాక్షాత్కరించినట్టుంది సేతుపతి గారికి.
    "కంగ్రాచ్యులేషన్స్ ఆరూ, నేననుకున్నట్టు ఫస్టు లో పాసయ్యావు!"
    "అంతా మీ ఆశీర్వాద బలం మామయ్యగారూ!" అంటూ, అయన పాదాల మీద తల ఆనించి మొక్కింది అరుణ. మనసా , వాచా, కర్మణా అయన ఎల్లప్పుడూ అరుణ బాగునే కోరేవారు. ఇంకా ఏమని ఆశీర్వదించగలరు? అంతటి అనుభవశాలి కళ్ళు కూడా చెమ్మగిల్లినాయి. ప్రియమార అరుణ ను లేవదీసి తల నిమిరి ఊరుకున్నారు సేతుపతి.
    పాపం , అరుణ కూ తెలుసు , రఘు ఫేయిలయ్యాడని. అరుణ వంచిన తల ఎత్తకుండా, కాఫీ కలుపుతున్న నెపంతో అయన వంక కన్నెత్తి చూడడం లేదు.
    "నీవేమీ బాధపడకమ్మా , అరుణా. పరిశ్రమ లేనిదే ఫలితం దానంతట అది వచ్చి, ఎవరి ఒడిలోనూ వాలదు. రఘు చదవలేదు. అసలు చదవదలచు కోలేదు వాడు! ఇక, వాడు పాసవుతాడని నేను మాత్రం ఎలా ఆశపడతాను? నేనేమీ నిరాశ చెందడం లేదు...."
    అరుణ ఆయన చేతికి కాఫీ కప్పు అందించింది. ఆలోచనా నిమగ్నులై, పుడిసెడు కాఫీ తాగి, అరనిమిషం అలోచించి, మరో పుడిసేడు కాఫీ తాగుతూ కూర్చున్నారు సేతుపతి.
    "అరుణా!"
    "ఏమండీ, మామయ్యగారూ?"
    "నిన్ను కంగ్రాచ్యులేట్ చేసినప్పుడు "అంతా మీ ఆశీర్వాద బలం మామయ్యగారూ! అన్నావే? నా కొడుకును, నిన్ను ఆశీర్వదించినంత హృదయ పూర్వకంగా నేనాశీర్వదించడం లేదంటావా అమ్మా?"
    అరుణ బదులు పలుకలేదు.
    "ఇక లాభం లేదు తల్లీ. వాడికిక చదువబ్బదు. వాడికేదో ఒక పని అప్పజెప్పి వాడికి కూడా జీవితంలో కష్టసుఖాలు తెలియవచ్చేలా చెయ్యాలి. నీవు మాత్రం చదువు తల్లీ! డిగ్రీ పుచ్చుకో. నిన్ను పై చదువులకు అమెరికా పంపిస్తాను. ణా జీవితంలో నిన్ను చదివించి అయినా....నేనొక మహత్తరమైన ....మనోరంజక మైన....సకల జన సమ్మత మయిన కార్యం సాధించానని గర్వపడతాను."
    "అయినా...రఘు మాత్రం ఇప్పుడప్పుడే ఉద్యోగం చేయవలసిన అవసరం ఏం వచ్చిందండీ , మామయ్యగారూ? ఏ ట్యూటోరియల్ కాలేజీ లోనో........"
    "లాభం లేదమ్మా! నా కొడుకు మీద నాకా మాత్రం మమకారం లేదంటావా? ఉంది. కానీ, దాన్ని తగు పాళ్ళల్లో చూర గోనడానికి వాడనర్హుడు. పట్టపగల్లా అది స్పష్టంగా అగుపడుతుంది మనకు. దేశంలో కాలేజీ ఫీజు కట్టుకోడానికీ, పుస్తకాలు కొనడానికీ, కాస్త నీటుగా ఇస్త్రీ బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్ళడానికి కూడా నోచుకోలేని వారెందరున్నారు? వారిలో ఎంతమంది ఎంతెంత చదువులు చదివి, గొప్పవారు కావడం లేదు? వీదికేం తక్కువయిందని? అన్నీ ఎక్కువయ్యాయి కాబట్టే వీడిలా చేదిపోయాడు! అన్నిటినీ తగ్గించి చూస్తా. ఇక వాడి విషయంలో నీ కన్నీరు గానీ, చండి పోలి కేకలు గానీ నా నిశ్చయాన్ని మార్చలేవు . అదుగో! మళ్ళీ కన్నీళ్ళు. తప్పు అరుణా! వాడి మీద జాలి పడకూడదు."
    "నేను మీకేమంత అత్మీయురాలినని, మీరు నాకు పై చదువులు చెప్పించడం , అమెరికా పంపించదలచు కొడం? రఘు మీకేమంత పరాయి వాడని అతని చదువు మాన్పించడం?"
    "నీవు నా ఇంటి దీపాని వమ్మా! వాడు ఆ దీపాన్ని కూడా ఆర్పగల గాలి! నీకూ, వాడికే ఉన్న తేడా అదే! మనసు బాగులేకపోతే , నీ స్నేహితురాళ్ళ తో కలిసి, కారులో అలా మహాబలి పురమో..కంచో ..వెళ్లిరా. నేనీ విషయాన్ని గురించి మీ ఎవ్వరి తోనూ చర్చించదలచు కోలేదు. ప్లీజ్! గో!" అది అజ్ఞ అని కాదు, అరుణ కు అయన బాధ తెలుసు. అందుకనే వెళ్ళిపోయింది.

                           

                                      30
    స్వతస్సిద్ధముగా సేతుపతి పధకాలు వెయ్యగలిగిన వారు. అందుకనే అయన గ్రౌండ్ లెవెల్ నించి, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నున్న దశకు రాగలిగారు.
    ఏదో పని ఉన్నట్టు అరుణ ను బొంబాయి పంపించారు. కారణం, తాను కార్యరూపం లోకి తీసుకు రావాలనుకున్న తన పధకం , ఆ అమ్మాయి ఆ ఇంట ఉండగా జరుగ కూడనిది. చండి , ఆవేశం కొద్ది అసభ్యంగా మాట్లాడవచ్చు. అది విని, అరుణ , మనసు కష్ట పెట్టుకోవచ్చు. ఆ తరవాత ఈ గొడవలన్నీ తన కెందుకని ఆ చల్లని తల్లి , ఆ ఇల్లు వదిలి వెళ్లి పోవచ్చు! అదంతా జరగరాదనే ఆఫీసు పని అన్న నెపంతో అరుణ ను అయన బొంబాయి పంపించారన్న మాట.
    చాముండేశ్వరి ని, రఘూ నూ తన గదికి పిలిపించుకుని, మిగిలిన వారందరినీ క్రిందికి వెళ్లి పొమ్మన్నారు సేతుపతి.
    "కూర్చో చండి. కూర్చో బాబూ. కాశ్మీరు కబుర్లు కూడా చెప్పడానికి రాలేదేం నా దగ్గిరికి?" అన్నాడు సేతుపతి ప్రతిదాన్నీ తూచి తూచి. ఈ తూకాలూ, కొలతలూ చాముండేశ్వరికేం తెలుసూ? అందుకని, ఒక్క పెట్టున విరుచుకు పడింది.
    "ఎందుకోస్తాడూ? ఎలా వస్తాడూ? అసలు కొడుకన్న వాడొకడు ఉన్నాడన్న ధ్యాస మీకుంటేగా? వీడు తప్పాడు, ఆ మహాతల్లి పాసయింది! ఆమె ను పొగడ్త లతో, ఆకాశాని కెత్తడం లోనూ....ముభావం తో వీణ్ణి పాతాళ లోకానికి దిగ దోక్కడం లోనూ మీరు నిమగ్నులై ఉన్నప్పుడు, ఏ మొగం పెట్టుకుని నా బిడ్డడు మిమ్మల్ని చూస్తాడు?"
    "అందుకనా? అయితే అది కూడా సంతోషించవలసిన విషయమేనే చండీ! మన రఘుకు నిజంగా అంత పౌరుష మన్నదే ఉంటె , ఈనాడు కాకపొతే రేపయినా వాడు బాగు పడడానికి అవకాశాలున్నాయి! ఈ మాత్రం పౌరుషం రఘుకు తోలి నించీ ఉంటె , వాడు ఫెయిలయ్యే వాడూ కాదు, నేను వాణ్ణి పాతాళలోకానికి తోక్కదలుచుకునే వాణ్ణి కాదు! ప్రారబ్ధం, మనమేం చేస్తాం?"
    "ప్రారబ్ధమే మరి! లేకపోతె , దానాదర్మాలు చేసేవారూ, దయాదాక్షిణ్యాలు చూపెవారూ లోకంలో లేకనా? అందరూ మీలాగే దిక్కూ మొక్కూ లేని పక్షుల్ని తెచ్చి ఇంట ఉంచుకుని, తలకేక్కించు కుంటున్నారా? ఏం? ఆ బొంబాయి లో పని ఆ నంగనాచే చెయ్యగలదా? మన రఘు చెయ్యలేడా? ఇక్కణ్ణించి విమానంలో పోక, అక్కడ్నించీ విమానంలో రాక, అదేదో ఒక మహారాణి అయినట్టు అక్కడ తాజ్ లో బస! ఈ మాత్రం వెలగబెట్టి నందుకు దానికి నెలకు మూడు వందల యాభై రూపాయలు జీతం! రఘు పైని ఏనాడయినా మీరా మాత్రం కనికరం చూపారా? ఎన్ని ఏళ్ళు గడిచినా, ఆ ముష్టి అరవై రూపాయలేగా వాడి నెల ఖర్చులకు? మీరు అరుణను ఉబ్బించడం రఘును తబ్బిబ్బు చేయడం తోనే వాడి మనసు పాడైపోయింది! ఇక చదువు మీద వాడు శ్రద్ధ ఎలా చూపగలడు?"
    "మరి కూటికి కూడా లేక, వారాలు చేసుకుని చదువుకునే కుర్రాళ్ళు ఎలా చదువు మీద శ్రద్దా సక్తుల్నీ చూప గలుగుతున్నారే చండీ?"
    "మా సంబరంగా ఉంది మీ ధోరణి! లేనివారు , వారూ బాధపడి, ఇంత ఉండీ, మన బాబు బాధపడితే , ఈ ఉన్నదంతా ఏం చెయ్యను? ఆ పెన్నలో పోయ్యనా?"
    సేతుపతి గారికి విపరీతమైన టైం సెన్సు ఉంది. వాచీ చూసుకున్నారు.
    "సరి, అరగంట మనం పోట్లాడడం లోనే గడిచింది. నువ్వు నమ్ము నమ్మకపో! నేనూ మన బాబు క్షేమాన్ని కోరేవాడ్నే చండి. అబ్బాయిని ఎదురుగా ఉంచుకుని , మనమిద్దరమూ ఎందుకు నోరు పారేసుకోడం? వాడ్నే అడుగుదాం. వాడికేది నచ్చితే ,అదే చేద్దాం . ఏమంటావు?"
    "ఏమంటానూ? ఏనాడయినా ఈ కొంప లో నా మాట చెల్లింది కనకనా!"
    ఇక చాముండేశ్వరి గొడవ అణిగి పోయిందనే అనుకున్నారు సేతుపతి. అందుకని దృష్టి రఘు వైపు మరల్చి "ఎరా బాబూ , ఏం చేద్దామను కుంటున్నావు?" అన్నారు. రఘు మౌనంగానే ఉండిపోయాడు. చాముండేశ్వరికి ఒళ్ళు మండింది.
    "ఒహోహో! ఏం ప్రశ్న వేశారండీ? "ఏరా బాబూ! ఏం చేద్దామను కుంటున్నావు?' గాడిదల్ని కాద్దామనుకుంటున్నాడు!"
    "వాడా పని చేసినా నా కిష్టమేనే! నువ్వు నోరు మూసుకో. నీ సలహా అవసరమైనప్పుడు నిన్నడుగుతాను. ఏరా, రఘూ, చెప్పు మరి! చదువు సాగిస్తావా?'
    "ఉహు. నేనిక చదవ దలచు కోలేదండీ నాన్నగారూ!"
    "రఘూ! అదేం?...."
    "చండీ! నిన్ను నోరు మూసుకో మన్నాను!" అని, సేతుపతి రఘు నుద్దేశించి "వెరీగుడ్ , చదువుకోవద్దు. మరేం చేస్తావు?" అన్నారు.
    "చదువుకోకపోతే, నా కొడుకు మరేదయినా ఊడిగం చేసి బ్రతకాలని ఉందా? ఉన్నదీ, భగవంతుడిచ్చినదీ తింటూ కూర్చుంటాడు!" అంది ఆ తల్లి . ఆమె నాపడం అడిదేవునికి కూడా శక్యం కాదని సేతుపతి కి తెలుసు! అందుకని మళ్ళీ ఆమె తోటే వాదనలోకి దిగారు.
    "ఉన్నది , ఏముందే? భగవంతుడు , జానపద చిత్రాల్లోలా ఆకాశయానం చేస్తూ నిన్నూ నన్నూ చూచి జాలిగొని ఈ ఇరవై ముప్పై లక్షల ఆస్తిని ఇచ్చి పోయాడా? ఇదంతా సంపాదించింది నేను! రఘుకు ఇందంతా దానం చెయ్యడం నా కిష్టం లేనప్పుడు దీన్నంతటిని నేనేమైనా చెయ్యచ్చు! అది నా ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుంది."
    "అవ్వ! అవ్వ! ఇవేం మాటలండీ?"
    "అవునే, ఈ ఆస్తి అన్నది నేను సంపాదించ లేదనుకో. అప్పుడు, రఘు లాటి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటావు?"
    రఘుకు కూడా రోషం వచ్చింది.
    "ఏదో ఒకటి చేస్తాను. ఆ మాట కొస్తే....కూలీ, నాలీ చేసుకుని బ్రతుకుతాను. మీఅస్తిలో నాకొక్క ఎర్రటి ఏగాణీ వద్దు!"
    "గుడ్, ఆ మాట మీదే నిలబడు!"
    "అయ్యో ....అయ్యో...."
    "నువ్వు నోరు ముయ్యి. రఘూ , నేను నిజంగా గర్విస్తున్నాను! చదువుకొడం నీకిష్టం లేనప్పుడు, సంతోషంగా మానెయ్యి. నాకేమీ అభ్యంతరం లేదు. ఇక కూలీ, నాలీ సంగతా? ...ఎక్కడో ఒకచోట నీవు పని చెయ్య వలసిందేగా? అది, నా దగ్గిరే చెయ్యి! ణా కొడుకువని నిన్నే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి లోనో కూర్చోబెడతానని అనుకోవద్దు. కింది నించీ మొదలెట్టు! ఆఫ్టరాల్ ....నీ చదువెంత? బెంగాల్ లో ...కేరళ లో ఎం.ఎ. లు చదివిన వారు బస్ కండక్టర్లు గా పని చేస్తున్నారు! మామూలు కూలీలా నా సంస్థల్లో దేనిలోనో చేరు. పని నేర్చుకో. పని చేసేవారిని గురించి తెలుసుకో. నేను నీ తండ్రిని గానీ....నీ శత్రువును కాను. అన్డుకని అనుభవం సంపాదించి అందరి చేతా బుద్ది మంతుడవనిపించుకో. ఆనాడు -- నేను దిగిపోతాను. నా స్థానంలో నిన్ను కూర్చోబెడతాను. కళ్ళారా చూసి సంతోషిస్తాను! ఏమంటావు?...ఇప్పుడప్పుడే నీవు నాకు సమాధానం చెప్పక్కరలేదు. రేపీ పాటికి నాకు నీ నిశ్చయాన్ని వినిపించు. కానీ....నీవూ ...నీ తల్లి కూడా ఒక విషయాన్ని మాత్రం మనసులో ఉంచుకోండి! నేను చెప్పినదంతా నీ భావి జీవితాన్ని గురించి ఎంతెంత గానో అలోచించి చెప్పాను. ఆపైని మీ ఇష్టం! ఇక ఇద్దరూ వెళ్ళచ్చు!" రఘు వెంటనే వెళ్ళిపోయాడు.
    "నా నాన్నే....నా తండ్రే ....ఈ ఒక్క సంవత్సరం ఫెయిలయినందువల్ల నీకేం గతి పట్టిందిరా! వాళ్ళ చేతులు పడ! ఆ మార్కులేసే వాళ్ళు నీకూ పాసు మార్కు లేసు ఉంటె వాళ్ళ సొమ్మేం పోయేది?" అంటూ ఆపసోపాలు పడుతూ కొడుకు వెంటనే పరుగు తీసింది చాముండేశ్వరి. సేతుపతి కాలుకాలిన పిల్లిలా తిరిగారు ఆ గదిలోనే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS