Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 21


    "అవును పొరుగింటి పుల్లకూర ఎవరికైనా రుచి" అంది ప్రియ నవ్వుతూ.
    "అదే....అదే మన పెరట్లోని ఓషధులు మన ఇంట్లో మందుకు పనికి రావు" అన్నాడు సరదాగా రాజగోపాలం.
    "రవిచంద్ర అదృష్ట వంతుడు. ఐ.యెస్ ఆఫీసరు కావడానికి కాబోలు ఇక్కడకు వచ్చాడు. ముందు ఏం జరిగేది నిజంగా మనం చెప్పలేం కదా?' ప్రియ సాలోచనగా అంది.
    రాజగోపాలం తల ఊపుతూ ఆమె మాటలు విన్నాడు.
    "మా అన్నయ్య రాసిన ఉత్తరం చూశారా?" అంది ప్రియ. "రవిచంద్ర సంగతి తెలిసి చాలా సంతోష పడ్డాడు. పాపం, అతని భార్య సంగతి కూడా వ్రాశాడు.' కొంచెం విచారం ధ్వనించింది ఆమె మాటల్లో.
    "అన్నయ్య కు ఎవళ్ళో చెబుతుంటే తెలిసిందిట. రవిచంద్ర ఇక్కడికి వచ్చిన తరవాత అతని మామగారు మంచ మెక్కి చాలా రోజులు తీసుకొని చనిపోయారట. తండ్రి మాత్రం తీర్ధ యాత్రల కని ఈ మధ్యనే బయలు దేరాడట. వెళుతూ వెళుతూ కోడల్ని కూడా పాపం, వెంట తీసుకొని వెళ్లారట!" కాసేపాగి మళ్ళీ ప్రియ అందుకుంది. "ఏముందీ పాపం, ఆ అమ్మాయి జీవితం అలా తెల్లవార వలిసి వచ్చింది.' ఆమె కంఠం లో తోటి స్త్రీ దుర్భర జీవితాన్ని తలుచుకొని పడే వేదన, సానుభూతి స్వచ్చంగా ధ్వనించాయి. ఆ మాట లానేటప్పుడు ఆమె గొంతు కొంచెం జీర పోయింది. కళ్ళల్లో నీళ్ళు కూడా నిండుకున్నాయి.

                                
    "మూగపిల్ల గా జన్మించడం ఆమె తప్పంటారా? ఎందుకీ శిక్ష?" ఆవేదన తెచ్చిన ఆవేశంతో కొంచెం పెద్దగానే అంది.
    రాజగోపాలం సానుభూతి తో అమెను చూశాడు. హృదయాన్ని కొంచెం కదిలించే విషయాలు అతని ముందర ఎత్తడం సభావిస్తే , అతను మాట్లాడడు. మౌనం కవచంగా ధరిస్తాడు. అందువల్లనే అతని భావాలు ఏమిటో తెలుసుకోవడం ఒక్కొక్కప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది.
    మాట మారుస్తూ, "వచ్చే శనివారమే రవిచంద్ర వచ్చేది. ఇదివరకటి తవిచంద్ర కాదు. ఇప్పుడు రవిచంద్ర , ఐ.ఎ.యస్! మనం బ్రహ్మాండమైన స్వాగతం ఇవ్వాలి. ఏమంటావు?' అన్నాడు.
    ప్రియ ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వు బలవంతాన పెదిమల మీద వెలిగిస్తూ లోనికి వెళ్ళింది.

                                  14
    నాగపూర్ స్టేషను చాలా కోలాహలంగా ఉంది. డిల్లీ నుంచి వచ్చే ఎక్స్ ప్రెస్ కోసం సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
    రాజగోపాలం, ప్రియంవద, సురేంద్ర, రవిచంద్ర రాకకోసం ఎదురు చూస్తున్నారు స్టేషన్లో.
    సురేంద్ర చిత్రం దెబ్బతిన్నప్పటికీ జనం అతన్ని గుర్తు పడుతున్నారు. ఫలానా చిత్రంలో నటించిన సురేంద్ర ని ఫస్టు క్లాసు వెయిటింగు రూం లో వెయిట్ చేస్తుంటే, చూడడానికి కొద్దిగా గుంపు కూడా మూగింది.
    రాజగోపాలం జనాన్ని చూస్తూ నవ్వుతూ, "చిత్రం దెబ్బతిన్నా జనం మిమ్మల్ని దెబ్బ తినిపించలేదు. చూడండి , మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారో!" అన్నాడు. సురేంద్ర మందహాసం చేస్తూ, "ఏం లాభం? ప్రొడ్యూసర్లు దెబ్బ తినిపించారుగా కోలుకోకుండా!" అన్నాడు.
    ప్రియ చిరునవ్వుతో అతన్ని చూసింది.
    ఇంతలో ట్రెయిను వస్తున్న కోలాహలం వినిపించింది.
    సురేంద్ర కు గుండెల్లో ఒక విధమైన ఆదుర్దా కలగసాగింది.
    రెండేళ్ళ తరవాత తను రవిచంద్ర చూడబోతున్నాడు. ఇంతక్రితం చూసినట్లుగా కాదు. ఇప్పుడు రవిచంద్ర ఆఫీసరు; పెద్ద అధికారి కాబోతున్నాడు. ఈ రెండేళ్ళ ల్లో ఎన్ని మార్పులు! తను సినిమా యాక్టరవడము, ఘోరంగా దెబ్బ తినటము, తిరిగి రావటము జరిగాయి. మళ్ళీ పాత జీవితం పాత నాటకాలు, పాత నిస్పృహ , పేరుకుపోయిన ఒంటరితనము!
    అందుకనే రవిచంద్ర ఇక్కడికే వస్తున్నాడన్న ఉత్తరం అందిన నాడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. గుండెల్లో ఆనందం, మనసులో ఏ మూలో గర్వం కూడా తొంగి చూసింది. రవిచంద్ర ఐ.ఎ.యస్ . తన చిన్ననాటి మిత్రుడు. తనవల్లె తన సలహాను మన్నించడం కోసమే పరీక్ష కు కూర్చున్నాడు. తన కృషి మాత్రం లేదా ఈ విధంగా అతడు పైకి పోయే విషయంలో? ఇప్పుడు అధికారి కావచ్చు. కాని జీవితం అంటే భయపడి గమ్యం లేని బాటసారి లా అతడు దిక్కు, దరి కానక ఉన్నప్పుడు తను ఆదుకున్నాడు. అతణ్ణి మామూలు మనిషిగా చేయడం కోసం తను పాటు పడ్డాడు. ఆ క్షణం లో రవిచంద్ర మీద ఎందుకనో అతనికి అధికారం ఉన్నట్లుగా, ఎన్నో జన్మల నించి సాన్నిహిత్యం ఉన్నట్లుగా అనుభూతి కలిగి చిత్రమైన భావాలతో అతని హృదయం నిండుకుంది.
    ట్రెయిను స్టేషను లోకి వస్తుంటే ఆదుర్దాగా అందరూ లేచి ఎదురు వెళ్ళారు.
    ఉరుకుల పరుగులతో వచ్చిన ట్రెయిను అలిసి పోయినట్లుగా నెమ్మదిగా అగసాగింది.
    వాళ్ళు కంపార్టు మెంట్లు వెతకసాగారు, రవిచంద్ర కోసం.
    ఫస్టు క్లాసు కంపార్టుమెంటు లోంచి రవిచంద్ర వాళ్ళను చూసి చప్పట్లు కొట్టాడు.
    క్షణ కాలం అతణ్ణి చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.
    రవిచంద్ర కొంచెం ఎరుపు ఎక్కాడు. ఇదివరకటి కంటే మీసాలు అందంగా కత్తిరించు కున్నాడు. పుల్ సూటు లో ఉన్నాడు. ఇప్పుడు ఇదివరకెన్నడూ కనపడని దర్పం, హుందా అతనిలో కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయి.
    సురేంద్ర అమాంతం వెళ్లి అతణ్ణి వాటేసుకొని పూలదండ మెళ్ళో వేశాడు. ఆ దండ సగభాగం అతను చిరునవ్వుతో సురేంద్ర మెళ్ళో వేసి ఆప్యాయంగా కౌగలించు కున్నాడు.
    రెండు అడుగులు వేసిన తరవాత రాజగోపాలాన్ని చూశాడు. సదా వెలిగిపోయే చిరునవ్వుతో అతను కుడిచేతిని ముందుకు ఉంచి షేక్ హ్యాండ్ కోసం వేచి ఉన్నాడు.
    గౌరవ భావంతో నమస్కారం చేసిన తరవాత అతడి చేయిని అందుకొని కండ్ల లో నీళ్ళు తిరుగుతుంటే రవిచంద్ర  నొక్కుతూ, "చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తరవాత కలుసుకున్నాం" అన్నాడు.
    అతని భుజం మీద చేయి వేస్తూ "ప్రయాణం కులాసాగా జరిగిందా?" అని అడిగాడు.
    "ఆ! " అంటూ అతని వెనకనే చిరునవ్వుతో నిల్చొని ఉన్న ప్రియంవదను అప్పుడు చూశాడు రవిచంద్ర.
    "నమస్కారం . మీరు కూడా అనవసరంగా శ్రమ తీసుకొని ఇక్కడకు వచ్చారే!" అన్నాడు.
    "మిమ్మల్ని చూడాలనే ఆదుర్దా ఆపుకోలేక....అంది ప్రియ కులాసాగా అతణ్ణి చూస్తూ.
    "థాంక్స్" అన్నాడు రవి. ఆ పదం అతని గుండెల్లోంచి వచ్చింది. ఇంకా ఎవరి కోసమో రవిచంద్ర కళ్ళు వెతికి, నిరుత్సాహం చెందాయి.
    "సురేఖ రాలేదే?" అన్నాడు అందరూ కలిసి స్టేషను లో నించి బయటకు రాబోతున్నప్పుడు.
    "సురేఖ ఈమధ్యన చాలా రోజుల నించీ కనపడడం లేదు" అన్నాడు రాజగోపాలం.
    సురేంద్ర ముఖం సురేఖ ప్రసక్తి రాగానే కొంచెం నల్లబడింది. సురేఖ విషయం గురించి అతడు ఏదైనా చెబుతాడేమో నని అందరూ ఎదురు చూశారు కాని, అతడు ఆ విషయాన్ని విననట్లే నటించి మాట్లాడలేదు.
    స్టేషన్ నించి బయటికి రాబోతుండగా ఇంతలో ఎవరో వీళ్ళ దగ్గరికి ఆదుర్దాగా వచ్చి, "మేము రవిచంద్ర, అసిస్టెంటు కలెక్టరు గారి కోసం వచ్చాం" అన్నారు ఇంగ్లీషులో.
    "నేనే రవిచంద్ర ను" అన్నాడు రవిచంద్ర ఇంగ్లీషులో.
    "నమస్కారం సార్. నన్ను కలెక్టరు గారు పంపించారు. మీ బస అది కూడా ఏర్పాటు చేశాం. కారు రెడీగా ఉంది" అన్నాడు, దాదాపు అతను ఎటేన్ష్ న్ ఫోజులో కంగారుగా.
    "ఓ, అలాగా! సరే అయితే" అని రాజగోపాలం ఇంటి అడ్రసు చెప్పి, "సాయంకాలం దాకా అక్కడే ఉంటాను. అక్కడికి రండి. తర్వాత క్వార్టర్స్ కు వెళ్ళొచ్చును" అని పంపించాడు.
    అతని వెంబడి వచ్చిన బంట్రోతు రవిచంద్ర సామాన్లు రాజగోపాలం కారులో పెట్టిన తరవాత రాజగోపాలం ఇంటికి కారు స్టార్టయింది.

                            *    *    *    *
    "చాలా హుషారుగా ఉందన్న మాట ట్రెయినింగ్ " అన్నాడు రాజగోపాలం రవిచంద్ర చెప్పే కబుర్లు వింటూ.
    రవిచంద్ర లోని బెరుకుతనం పూర్తిగా పోయింది. అతణ్ణి చూస్తుంటే అందరికీ చాలా కొత్తగా ఉంది. ఆ రవిచంద్ర సంశాయాత్ముడు. ఈ రవిచంద్ర తను అనే ప్రతి విషయం లోను నమ్మకం ఉన్నట్లుగా గోచరిస్తున్నవాడు. ఆ రవిచంద్ర లో అప్పటికి కుర్రతనం వదల్లేదు. ఈ రవిచంద్ర కు ఆ లేతదనం పోయి దాని స్థానే హుందాతనం వచ్చింది. ఆ రవిచంద్ర సంభాషణ లో మాటకు మాట మధ్య కొంచెం తడుముకుంటూన్నట్లుగా ఉండేది. ఈ రవిచంద్ర సంభాషణ మంచినీళ్ళ ప్రాయంగా ఉంది. అయినప్పటికీ కొట్ట వచ్చినట్టు ఒక పోలికమాత్రం మిగిలింది. ఆ రవిచంద్ర లాగానే ఈ రవిచంద్ర గూడా తన మనస్సు కు నొప్పించే విషయం జరిగినా, ఎవరైనా మాటలు అన్నా, బాధపడే తత్త్వం , బయటకు ప్రదర్శించే ధోరణి మార్చుకోలేదు.
    రవి చుట్టూ ప్రియంవద , సురేంద్రా, రాజగోపాలం చెరి భోజనాలయిన తరవాత అతను చెప్పే విశేషాలు కబుర్లు వినసాగారు.
    మూడు గంటల సమయంలో రవి ఆదుర్దాగా లేస్తూ, "అరెరే, మర్చిపోయాను" అని ఫోను దగ్గిరికి వెళ్లి ఏదో నెంబరు డయల్ చేసి , "హల్లో, ఐ యామ్ రవిచంద్ర , అసిస్టెంటు కలెక్టరు. ఐ వాంట్ టు స్పీక్ టు కలెక్టర్"అన్నాడు.
    ఒక్క క్షణం తరవాత మళ్ళీ "ఫోనులో , "నేను రవిచంద్ర ను. మీరనుమతిస్తే రేపు ఉదయం నుంచి డ్యూటీ లో జాయిను అవుతాను" అన్నాడు ఇంగ్లీషులో.
    అటునించి వచ్చిన జవాబు విని నవ్వి, "అదంతా మీ చలవ. మిమ్మల్ని ట్రెయినింగ్ ఆఫీసర్ ఖోస్లా అడిగినట్లు చెప్పమన్నారు. మిస్టర్ కౌల్ కూడా మిమ్మల్ని గురించి చాలాసార్లు అనుకున్నారు. వచ్చే నెలలో మిస్టర్ సిన్హా ఇక్కడికి వస్తారట...." అన్నాడు.
    తరవాత "తప్పకుండా....రేపు ఉదయం కలుసుకుంటాను, సార్" అని ఫోను పెట్టేసి వచ్చి కూర్చున్నాడు.
    "కలెక్టరు ధర్మరాజు తో మాట్లాడారా?' రాజగోపాలం ప్రశ్నకు , "అవునండీ!" అన్నాడు రవిచంద్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS