Previous Page Next Page 
మేఘమాల పేజి 21

 

                                   11

    పదకొండు గంటలయింది.
    రాజేశ్వరి పడుకున్న త్యాగరాజు కు పక్కగా బెడ్డింగు మీద కూర్చుంది.
    సత్యవతి నిద్రలో మునిగి పోయింది.
    "శకుంతల కేలా వున్నది?'
    'బొబ్బలింకా తగ్గలేదు!"
    'ఇంకా ఎన్నాళ్ళు పడుతుందంటున్నారు?"
    'చెప్పలేం... ఆసుపత్రిలో ఇంకా పది రోజులైనా వుండవలసి వస్తుందేమో?' ఒక్క క్షణం ఆగాడు. 'ఇంటికి వెళతానని గోల చేస్తోంది..... ఏమాత్రం తగ్గినా ఇంటి దగ్గర వుండి మందు తీసుకుంటానంటున్నది!'
    'పాపం! ' ....ఆ బాధ భరించటం చాలా కష్టం....ఎలా భరిస్తున్నదో గాని!' నిట్టుర్పు విడిచింది రాజేశ్వరి.
    "ఏం చేస్తుంది, మరి?'
    కొన్ని నిముషాల మౌనం నల్లటి మేఘం లా ఆవరించుకున్నది ఆ ప్రదేశాన్ని.
    'నాకు ఏవీ తోచటం లేదు!' అన్నది రాజేశ్వరి.
    "ఏ విషయంలో?"
    '-సత్యవతి ని చూస్తుంటే !'
    త్యాగరాజు మాట్లాడలేక పోయాడు.
    'సత్యవతి ఎప్పటికి కోలుకునేను?'
    త్యాగరాజు నిట్టుర్పు విడిచాడు.
    "ఏం చేయాలో నాకూ తోచటం లేదు.... ఆమెను ఓదార్చే శక్తి నాకు లేకుండా పోతున్నది!' అన్నాడు బరువుగా.
    మళ్ళా మాట్లాడుకోవటానికి మాటలే లేకపోయినయి.
    'ఇంకా నేనేన్నాళ్ళుండే దిక్కడ?' కంఠం లో భయం తొంగి చూస్తోంది.
    రాజేశ్వరి మాటలకు ఉలిక్కిపడ్డాడు త్యాగరాజు.
    'ఎవంటున్నావ్?'
    'ఎన్నాళ్ళిలా ఇక్కడ వుండమంటారు. నన్ను?' దిగులుగా అడిగింది.
    'నేను నిన్న వచ్చిన ఉద్యోగంలో చేరదామనుకుంటున్నాను !' అన్నాడు త్యాగరాజు.
    నిన్ననే వో కంపెనీ నుండి- హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో, శకుంతల గృహంలో వుండగా అప్లై-- చేసిన వో ఉద్యోగానికి-- జేరమంటూ ఆర్డర్లు వచ్చినయి!
    "మీ గురించి కాదు నేనడిగేది!'
    '-- నేనిక్కడ వుంటే నీవక్కడ వుండవా మరి?' అన్నాడు ఆమె చేతి మీద వేలితో రాస్తూ.
    రాజేశ్వరి నిట్టుర్పు విడిచింది.
    'నాకు తెలుసు నీలోని బాధ, రాజేశ్వరీ!... కాని వోర్చుకోక తప్పదు.... ఏం చేస్తాం.... పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు!' అన్నాడు నిట్టురుస్తూ త్యాగరాజు.
    'నీవూ ట్రాన్స ఫర్ కు అప్లై చేయి... భర్త ఎక్కడ వుంటే భార్యనూ సాధ్యమైనంత వరకూ అక్కడే ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం గదా!' ఆమె మోచేతి మీదగా చేత్తో గట్టిగా పట్టుకున్నాడు.
    రాజేశ్వరి ని  అ క్షణంలో సిగ్గు అవరించగా, ప్రేమగా త్యాగరాజు మొఖంలోకి చూస్తూ చాలా చిన్నగా, మధురంగా నవ్వింది.
    'నేనన్నది అబద్దమా?'
    'నేను మీ కంటే తెలివి గల దాన్ననా-- మీరు అవునన్నది కాదనేందుకు!'
    ఆమె మాటలకు కొన్ని క్షణాలు నవ్వుకుంటూ మనస్సులో మననం చేసుకుంటూ ఆగి, 'మీ అమ్మ చెల్లెలూ మాత్రం అక్కడ దేనికి?... ఇక్కడకు రమ్మనమని జాబు వాశేయ్!' అన్నాడు.
    'ఇది మీ నిశ్చితాభిప్రాయమా?'
    '--ఇంతకు మించి మార్చుకోవాల్సిన అవసరం మాత్రం ఏంవున్నది?'
    'అవసరమంటూ ఏమీ లేదు-- కాని , నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించుకోవటం మంచిదనుకుంటున్నాను?....
    'నిజమే మరి.... అయినా, వాళ్ళు ఇక్కడ వుండటం లో నష్టమే వున్నది? మనకు హైదరాబాద్ లో డబ్బులు చాలవనే భయం ఏవీ లేదు గదా? -- ఇద్దరం సంపాదిస్తూన్నామాయే!' నవ్వాడు త్యాగరాజు.
    రాజేశ్వరి మాట్లాడలేదు. చిరుదరహాసం చేసి ఊరుకున్నది.
    'నాకు తిరిగి మన ఊళ్ళో కాలు పెట్టాలంటే తెలియని భయం ఆవరించి నన్ను పీకుతోంది.... నరాలు జివ్వున్నా లాగుతున్నాయి.... ఏదో అగాధం లోకి కూరుకు పోతున్నా నన్నట్లుగా గుండె దడ దడ లాడుతుంది!' అన్నాడు చాలా చిన్నగా, బరువుగా.
    'నేను మిమ్మల్ని అక్కడకు రమ్మనమాననులెండి!' అన్నది చీరే అంచుని మెలి తిప్పుకుంటూ.
    'మీ చెల్లెలు టైపు పాసవుగానే ఇక్కడే ఏదో ఉద్యోగంలో చేరుద్దాం!' అన్నాడు ఆమె మనస్సు ను తేలిక పరుద్దామన్నట్లుగా.
    'కాని, వివాహం చేద్దాం అన్నట్లయితే మరింతగా సంతోషించి వుండేదాన్ని!' అన్నది నవ్వి.
    ఆమె మాటలకు లజ్జితుడయ్యాడు త్యాగరాజు.
    కొంతసేపాగి , 'వివాహానికి టెన్త్ క్వాలిఫికేషనా?' తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా నవ్వాడు.
    రాజేశ్వరి నవ్వింది.
    క్షణంలో గంబీరుడవుతూ , 'నేను మాత్రం సంతోషించినా నీ ఉద్దేశం!' అన్నాడు.
    'మీకంటే ఎక్కువగా నేను సంతోషిస్తానేమో?' అన్నది రెట్టిస్తున్నట్లుగా రాజేశ్వరి.
    'నేను కాదనను!' అన్నాడు ఆమె మాటలకు అంగీకరిస్తున్నట్లుగా.
    గుర్కా రోడ్డు మీద కర్రతో టకటకా కొట్టుకుంటూ వెళుతూన్నాడు.
    'పదకొండు గంటలయిందేవో?"
    "అయి వుండవచ్చు!' అన్నది రాజేశ్వరి.
    'నిద్ర రావటం లేదా?'
    'ఈరోజు పగలు ఎక్కువసేపు పడుకున్నాను!'
    త్యాగరాజు మాట్లాడలేదు.
    ఆమె ముఖంలోకి , కిటికీ నుండి లోపల పడుతున్న సన్నని వెలుగులో చూడసాగాడు.
    -తదేకంగా ఆమె ముఖాకృతిని కళ్ళల్లో కట్టుకుంటూ లీనమై పోతున్నాడు. ఆ క్షణంలో ఆ కొద్ది వెలుగే మరింత పెద్దదై , మరింత పెద్దదై దేదీప్యమానంగా వేలుగుతున్నట్లనిపించింది. అందులో -- ఆ వెలుగులో -- ఓ దేవతలా , శాంత మూర్తిలా , ఓ నిశ్శబ్దఆశ్రమం లా రాజేశ్వరి కనబడుతోంది -- ఆమెను అలా చూస్తుంటే మనస్సును శాంతి, శరీరాన్ని చల్లదనమూ ఆవరించి -- సర్వం మరిచిపోయి -- ఆనందం లోనో, స్వర్గం లోనో- తిరుగుతున్నట్లుగా వేస్తోంది.
    ఎందుకో ఆ క్షణంలో కనబదినట్లుగా రాజేశ్వరి తన జీవితంలో ఇది వరకేన్నడూ కనబడలేదు!
    'రాజూ!' అన్నాడు కొద్దిగా మోచేతుల మీదుగా లేవబోతూ-- ఆమె ముఖాన్ని దగ్గరగా జేరుస్తూ.
    రాజేశ్వరీ!' అన్నాడు పెదాలు కదిలిస్తూ గొణుగుతున్నట్లుగా.
    ఆమె చేయి అతని పిడికిలిలో బిగుసుకు పోయింది.
    'రాజూ!'
    'ఏవిటిది?' అన్నది. కళ్ళు రెపరెపలాడిస్తూ ఆవేశ పడుతున్న అతడిని భయంగా చూస్తూ. 'నన్ను వెళ్ళమంటారా?'
    త్యాగరాజు తనని తాను అదుపులోకి తెచ్చుకున్నాడు. మాములుగా పడుకున్నాడు.
    తెచ్చుకున్న ఆవేశానికి సిగ్గుపడుతున్నట్లుగా , కళ్ళు మూసుకొని తల ఊగిస్తూ 'వద్దు, వద్దు!' అన్నాడు. 'నీవు ఎదురుగ్గా కూర్చుంటేనే నాకు తృప్తి , శాంతి!' అన్నాడు ఎంతో ఆత్మీయంగా.
    --హృదయం అట్టడుగు నుండి వెలువడినయి ఆ మాటలు!
    'మీరు సాగర్ ఎప్పుడు వెళుతున్నారు?'
    'రెండు మూడు రోజుల్లో వెళ్దామనుకుంటున్నాను!'
    'సామాన్లు అంతగా లేవన్నది.... మీ వెంటే పట్టుకు వచ్చేశేయండి!'
    'అలాగే!'
    -తిరిగి చంద్రం త్యాగరాజు కళ్ళ ముందు మెదిలాడు.
    మనస్సంతా చీకటయింది. వేదన స్పురించింది. దిగులు ఆవహించింది. విచలితుడయ్యాడు.
    "రాజూ! ఒక్కటడుగుతానూ చెబుతావా .... సమాధానం మనస్పూర్తిగా చెప్పాలి!'
    'అడగండి!'
    'సత్యవతి మన దగ్గర వుండడం వలన నీకేవీ అభ్యంతరం లేదు గదా?'
    'మీరు అలా ఎందుకనుకోవాల్సి వచ్చింది?' అన్నది చాలా త్వరత్వరగా.
    'లేదు.... అవేశపడబోకు.... నీ ఉద్దేశ్యం తెల్సుకోవడం నాకు ఎంతో అవసరం.... మనిదరికీ మంచిది గూడా.... తరువాత మనకెప్పుడు- జరిగిపోయిన విషయం మీద ఎలాంటి భిన్నాభిప్రాయాలు రాగూడదు!' అన్నాడు ఆమెకు నచ్చ చెబుతున్నట్లుగా. 'ఈ ఒక్క విషయంలోనే గాదు.... ఏ విషయం లోనైనా సరే!'
    రాజేశ్వరి తల అటూ యిటూ ఊగిస్తూ "కృతజ్ఞురాలీని!' అన్నది.
    'కృతజ్ఞుతలు దేనికి?'
    'నామాటకు నా మనస్సుకు ఎంతో విలువ ఇస్తున్నందుకు!
    'దానిలో ప్రత్యేకత ఏవున్నది!.... బండికున్న రెండు చక్రాలూ సమానమైనవే ....నీవు నన్ను గౌరవించడం లేదా?' అడిగాడు.
    'ఇక పోనీయండి ఆ విషయం.... ఆమె మన దగ్గర వుండటాన్ని నేను హృదయ పూర్వకంగా ఆమోదిస్తున్నాను!'
    'నా కృతజ్ఞతలు స్వీకరిస్తావా మరి!దెబ్బకొట్టారన్నట్టుగా చూస్తూ నవ్వింది.
    'ఇక నేను వెళ్ళి పడుకుంటాను బాబూ, నిద్ర వస్తుంది!' అన్నది లేచి నిలబడుతూ-- ఏదో బరువైన వాతావరణాన్ని తేలిక పరుస్తున్నట్లుగా!
    'నేను ఇందాకటి నుండి పట్టుకు అపానా!' అన్నాడు విచిత్రంగా ఆమె మొఖం లోకి చూస్తూ.
    'ఏవిటి నాతొ వాదన పెట్టుకోవడం సరదాగా వున్నదా మీకు?- ప్రతి దానికీ మరో అర్ధం తీస్తున్నారు!'
    'వెళ్ళి పడుకో!' అన్నాడు భారంగా త్యాగరాజు.

                           *    *    *    *
    రాత్రి పన్నెండు గంటలు దాటినా త్యాగరాజుకు నిద్రపట్టలేదు. అటూ యిటూ కదులుతూనే వున్నాడు.
    ఉండి ఉండి రోడ్డు మీద పోతున్న కార్లూ, రిక్షాల మోత--
    ఎక్కడో అకస్మాత్తుగా ఒక్కసారి కుక్కల అరుపు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS