"మరేం! మా అందరి కన్న ముందు వాడికి పెట్టాలని పక్షపాతం చూపితే మరేమవుతుంది? అమ్మా! దేవుడు పక్షపాతం ఇంకెవరిలోనైనా ఉంటె సహిస్తాడట కాని, కన్న తల్లిలో ఉంటే ఒప్పుకోడుట. చూసేవా నిదర్శనం?' ప్రకాశం తల్లిని ఉడికించడం మొదలు పెట్టేడు.
"మరీ చిన్న కుర్రడిలా అంతలా అల్లరి చెయ్యకు, ప్రకాశం! నీకు పులుపూ, చేదూ ఎలాగా ఇష్టం ఉండదు కదా! బెల్లం ముక్క ప్రసాదం నీకోసం దాచి ఉంచెను . రా తీసుకో" అన్నది కనకం.
ప్రకాశం గబగబ గదిలో కెళ్ళి ఒక కాగితం పొట్లం తెచ్చేడు.
వదిన గారిచ్చిన ప్రసాదం అందుకొని ఆ పొట్లం ఆమె చేతిలో పెట్టి, కాళ్ళ కు వంగి దండం పెట్టేడు.
"ఇదేమిటి , ప్రకాశం?"
"చూసుకోండి" అన్నాడు ప్రకాశం చిన్నగా నవ్వుతూ.
కనకం కాగితం విప్పి చూసుకొంది. అది, ఆకాశనీలం ఆకుపచ్చ కలిసిన కలనేతచీర.
"నాకెందుకూ" అన్నాది కనకం.
"వదినా, మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఇటువంటి రంగు చీర కట్టుకొన్నారు. మిగతా వివరాలేమీ నాకు జ్ఞాపకం లేకపోయినా ఆ చీర రంగు మాత్రం ఇప్పుడు చూసినట్లు జ్ఞాపకముంది. ఈ రంగు చీరలో మిమ్మల్ని ఇంకోసారి చూడాలని నా కెందుకో చాలా కాలంగా కోరిక ఉన్నది. నిన్న అనుకోకుండా ఒక కొట్లో ఈ చీర కంటపడ్డది. కొని తెచ్చెను. మీరు కట్టుకు రండి. నాకు బయట పనుంది. ఒకసారి చూసి వెళ్ళిపోతాను." అన్నాడు ప్రకాశం ఉత్సాహంగా.
కనకం తప్పు చేసినదానిలా నిలబడి పోయింది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, తను కొత్త చీర కట్టుకోడం ఏం బాగుంటుంది?
"కట్టుకో , వదినా! వాడు అభిమానంతో తెచ్చేడు" అన్నది జానకి.
"నాకెందుకమ్మా! నువ్వో, శాంతో కట్టుకోండి" అన్నది కనకం.
మాట పైకి వచ్చినా మనసు ఆ చీరను విడిచి రానంటున్నది. ఆ చీర రంగులో ఆమె చవి చూసిన మధురానుభూతులు ఎన్నో పెనవేసుకొని ఉన్నాయి. తల్లీ, తండ్రి , తోడబుట్టిన వాళ్ళు, అత్తవారింట కాలుమోపిన మొదటి రోజు అన్నీ లీలగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నోసార్లు భర్తను అటువంటి చీర కొనిపెట్టమని అడగాలనుకొంది. కాని, ఏవో అడ్డంకులు రావడంతో ఆ మాట బయటికీ రానే లేదు. తనకా చీర మీదున్న మమకారం ప్రకాశాని కేలా తెలిసింది- అనుకొన్నది.
"మాకెందుకులే, వదినా! మా మీద అభిమానముంటే, మాకూ తెచ్చేవాడే కదా? నీకు తెచ్చింది నువ్వే కట్టుకో" అన్నది శాంత మూతి మూరెడు సాగాదీసుకుంటూ.
ఈ విషయంలో ప్రకాశం తప్పు చేసేడు అనుకోంది జానకి. శాంతకు బట్టల మీద నగల మీద ఉన్న మక్కువ తెలిసి కూడా పండుగ పూట వదినకు ఒక్కతెకు చీర తేవడం బాగా లేదనుకొంది. ప్రకాశం అన్తాగా అలోచించి ఉండడు . మనసులో ఉన్న రంగు చీర కళ్ళబడే సరికి వెనక ముందు ఆలోచన లేకుండా తీసుకొని ఉంటాడు అనుకోంది జానకి.
ప్రకాశం తిరిగి వచ్చి, "వదినా, ఇంకా అలాగే ఉన్నారా?" అన్నాడు.
"శాంతకి కూడా ఏదైనా తేలేక పోయావురా" అన్నది జానకి విషయాన్ని వివరిస్తున్నట్లు."
'అరెరే! పొరపాటయింది సుమా! సరే, ఇప్పుడెం మించి పోయింది? పండగంతా ఇంకా ముందే వున్నది. ఇప్పుడే పోయి పట్టుకురానూ?" అన్నాడు.
శాంత ముఖం విప్పారింది. తనకు కావలసిన రంగులు, అంచులు చెప్పుకు పోతున్నది. కనకం లోపలికి వెళ్ళి చీర కట్టుకు వచ్చింది. ప్రకాశం వదిన గార్ని కళ్ళారా చూసి, "వదినా! ప్రతి ఉగాది కి మీరిలాంటి చీర కట్టుకోవాలి. నన్ను ఆశీర్వదించండి" అన్నాడు.
"అదేమిటి, ప్రకాశం , నేను చీర కట్టుకోవాలని నిన్ను ఆశీర్వదించటమేమిటి?" అన్నది కనకం తెల్లబోతూ.
"అది అంతే, వదినా! నాకు డబ్బుంటేనే కదా, నేను మీకు చీర కొనగలిగేది? ఈ రంగు మీకూ, నాకూ మాత్రమే ఇష్టం లాగుంది. నేనీ చీర తీసుకొంటుంటే అక్కడ వున్న అమ్మాయిలూ నన్ను వింత జంతువును చూసినట్లు చూసేరు. నేను తప్ప మీ కిటువంటి రంగు చీర ఇంకెవరూ కొని పెట్టారని నా నమ్మకం." అన్నాడు ప్రకాశం.
"నువ్వు పెద్ద వ్యాపారస్తుడివైనా వదిన గారికిటు వంటి నేత చీరలే కొంటావేమిటి?' అన్నది జానకి.
"నేత చీర కాకపోతే పట్టుచీర. రంగు మాత్రం ఇదే" అంటూ తేలిగ్గా నవ్వుతూ వెళ్లిపోయేడు ప్రకాశం.
'అన్నయ్యా, నాచీర !" శాంత జ్ఞాపకం చేసింది.
"దానికోసమే వెళ్తున్నాను. చీర పట్టుకొనే ఇంటి కొస్తాను" అన్నాడు ప్రకాశం గుమ్మం దాటుతూ.
చెల్లెలి మనసు చిన్నబుచ్చలేక ఆ మాట అన్నాడే కాని, అప్పట్లో ప్రకాశం చేతిలో రూపాయి డబ్బులికి మించి లేవు. దగ్గర ఉన్న సొమ్ము పెట్టి ముందు రోజు వదిన గారికి చీర కొనేసాడు. అరువులు పెట్టడం ప్రకాశం అలవాటుకు విరుద్దం. ఉన్న రోజు ఖర్చు పెట్టుకో; లేని రోజు కోరికల్ని వాయిదా వెయ్యి అన్నది ప్రకాశం నినాదం.
అత్యవసర పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలే కొన్ని నియమాలు పాటించనక్కర లేదనే నిర్ణయాలు తీసుకొంటాయి. కాబట్టి ఆరోజు ;లేనిరోజు అయినా శాంత చీర కోసం పదిహేను రూపాయలు ఖర్చు పెట్టేందుకే ప్రకాశం నిర్ణయం తీసుకొన్నాడు. అలవాటు పడిన రోడ్డు మీద తిన్నగా కాళ్ళు , అప్పన్న కొట్టు ముందు ఆగిపోయాయి. మూసి ఉన్న బల్ల చెక్క తలుపుల్ని చూసిన కళ్ళు మెదడుకు ఏదో వార్త సరఫరా చేసేయి. అప్పన్న ఎవరో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఊరుకు వెళ్ళేడు. రెండు రోజుల పొతే కాని రాడు.
ప్రకాశం కాళ్ళు బజారు వీధికి లాక్కు పోయేయి. అద్దాల బీరువాల్లో అందంగా అమర్చిన నేత చీరలు, మిల్లు చీరలు, పట్టు చీరలు కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి. అలా ఎన్ని కొట్లో దాటుకుంటూ వెళ్లిపోయేడు ప్రకాశం. ఆత్మాభిమానం అతన్ని ఏ కొట్లోకి దూరనివ్వలేదు. ఇంటికి పోయి, ఈరోజు కుదరలేదు. ఇంకో రోజు కొంటానని చెప్పెయాలనుకొని వెనుదిరిగేడు. అల్లంత దూరం నుండీ ఆశతో తన్ను చూసే శాంత ముఖం కళ్ళ ముందు నిలిచింది.
ధైర్యం చేసి ఒక షాపులో అడుగు పెట్టేడు. ఆఖరి నిమిషం వరకు అందవలసిన డబ్బు కోసం ఎదురు చూసి, ఇంక లాభం లేదు పండుగ దాటి పోతున్నాదనుకొని అరువులకు బయలుదేరిన మనుష్యులతో ఆ షాపు కిటకిటలాడిపోతున్నది.
ఉగాది పూట అంతా అరువు బేరం అయినందుకు కొట్టువాడు గింజకుంటున్నాడు. సంవత్సరాది నాడు వచ్చిన బెరాన్ని వదులుకోలేక , అరువు సొమ్ము తిన్నగా అందతుందా అన్న అనుమానం తోనూ షాపుల వారు సతమత మవుతున్నారు.
ప్రకాశం తనకు కావలసిన చీర తీసి, చేత్తో పట్టుకొని కౌంటరు ముందు నించున్నాడు. అతనికి ముందున్న వారితో ఒకరిద్దరు డబ్బు చెల్లించేరు. నలుగురైదుగురు అరువు పెట్టేరు. ప్రకాశం ముందున్న ఆసామీ అరువనగానే కొట్టువాడు ఇంతెత్తున లేచేడు. "కొట్లో సరుకంతా అరువుకే ఇచ్చేస్తే ఇంక మేము వ్యాపారం చేసేదేలాగయ్యా?' అని చీదరించుకొన్నాడు.
ప్రకాశం చీర కోసం బయలుదేరినందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. ప్రతి దానికి అలకలు సాగించే శాంతను కాస్సేపు కసురుకొన్నాడు. ముందురోజు ఆ కల నేతచీర కళ్ళ బడ్డ సమయాన్ని, చోటును మరీ ఎక్కువగా నిందించేడు. తను ఆ రోడ్డున వెళ్ళవలసి రావడానికి కారణం ఏమైందని అలచిస్తుండగానే అతని వంతు వచ్చింది.
కొట్టువాడు చీర మీద ధర చూసి బిల్లు వ్రాయబోతుంటే "అరువు" అన్నాడు ప్రకాశం. అతడు ప్రకాశం వైపు కాస్త సేపు నిదానించి చూసి, తనలో తనే ఏదో గోనుక్కొన్నాడు. అతని మాటలు ప్రకాశానికి వినబడకపోయినా అరువుకు అంత సుముఖంగా లేడని బోధపడుతూనే ఉంది.
"అట్టే కాలం అక్కరలేదు. ఒకటి రెండు రోజులు మాత్రమే...."
బిల్లు వ్రాసి , సర్రున చించి ప్రకాశం వైపు తోసేడు అతడు.
ప్రకాశం చీర పట్టుకుని ఇంటికి చేరేసరికి చాలా వేళయింది. ఇంట్లో రమారమి అందరి భోజనాలు పూర్తయ్యాయి.
"శాంతేది?" అన్నాడు అటు ఇటు చూసి ప్రకాశం.
"ఈరోజు దాన్ని శారద భోజనానికి పిలిచిందిట. నువ్వు చీర తెస్తావేమో కట్టుకు వెళ్దామని ఇప్పటి వరకు చూసి, సణుక్కుంటూ ఆ పాత చీర కట్టుకొని బయలుదేరింది. అయినా బజారు కు పోయిన వాడివి వందలూ, వేలూ కొన్నావా? ఓ చీర తీసుకొని చక్కా రాడానికి ఇంతసేపా? పండునెల్లిన పాచినాడని, ఎప్పుడు కట్టుకుంటుందేం?" అన్నది సుందరమ్మ సాధింపుగా.
"మన జేబులో డబ్బూ మనింటి ముందు కారూ ఉంటె , అనుకున్న వస్తువు అయిదు నిమిషాల్లో తెచ్చుకోవచ్చుమ్మా! కాని నేనంత గోప్పవాడ్ని ఏం కాదు." అంటూ విసురుగా వీధి గుమ్మం దాటేడు ప్రకాశం.
