'పిచ్చెత్తింది కాబోలు! మనుష్యులను వదిలి మాకులతో, నోరులేని జీవాలతో నేస్తం కలుపుకొని సంభాషణ సాగిస్తూంది. జరగవలసిందే ఆ శిక్ష' అనుకొన్నాడు. తను ఉద్యోగానికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తాడనగా రూప కనిపించింది ఒకసారి, గోకుల్ మరణం తరవాత. కారులో వస్తున్నాడు. రూప పుస్తకాలతో కారుకు ఎదురుగా వచ్చింది. హారన్ మోగించాడు. తప్పుకోలేదు. వినిపించనట్లే ఎటో చూస్తూంది. కారుకు ఎదురుగా వచ్చానన్న తెలివికూడా లేనట్లుంది.
తోడి లెక్చరర్ కాబోలు "కారు వస్తూంటే ఎదురుగా అలా వెడతావేం? కనబడలేదూ? పక్కకు రా" అంటూ పక్కకు లాగింది.
రూప పిచ్చిగా విరగబడి నవ్వింది. "ఉష్! కారంటే ఏమిటా భయం? పిచ్చిదానివి! కారుమీద ఎక్కి తిరగవచ్చుగాని కిందినుండి పోతేనేం? నేను పోతాను ఉండు." చెయ్యి విదిలించుకొని కారుకు అడ్డంగా రాబోయింది.
నేర్పుగా ఆమెను తప్పుకొని కారు పోనిచ్చాడు. అప్పుడే అనిపించింది, ఆమెకు మతి భ్రమించిందని.
కళ్యాణ్ కొండ దిగి వస్తున్నాడు. కనుచీకటి పడింది అప్పటికి.
సుభద్రమ్మగారి పాలేరు ఎదురై ఆత్రంగా ప్రశ్నించాడు: "ఇక్కడ అమ్మగారు కనిపించారాండి?"
"అమ్మగారెవరు?"
"మా రత్నమ్మగారి ఆడపడుచు రూపవతమ్మ గారు. కనిపించిందాండి?" వెంటనే తన తెలివి తక్కువతనం గుర్తు వచ్చినట్లయి "సన్నగా, తెల్లగా ఉంటుంది చూడండి! కొంచెం పిచ్చి...." పెద్ద అంటూ ఆగిపోయాడు అదేదో చెప్పరాని విషయ మన్నట్లు.
"కనిపించింది కాని, వెదుకుతూ నువ్వు రావడమేం? ఆమె ఇంటికి రాలేదూ?"
"పిచ్చిదానికి దారితెన్నులేం తెలుసు, బాబూ?"
"అలాంటిదాన్ని బయటికి రానిస్తారేం?'
"తెలిస్తే బయటికి రానిచ్చేదెవరు? ఆమె బయటికి రాకుండా ఎందరు కాపలా ఉన్నా ఎప్పుడో కంట కారంజల్లి మాయమౌతుంది. ఇక రత్నమ్మ గారి పురమాయింపుతో చుట్టూ అడవులన్నీ గాలించలేక మాకు పిచ్చెత్తుతూంది. ఈవేళ రఘుబాబుగారు వచ్చారు. వారితో మాటలసందడిలో పడి కొంచెం ఏమరిచారు రత్నమ్మగారు. ఎప్పుడో జారుకుంది ఈ పిచ్చమ్మగారు. ఇంకేముంది? రఘుబాబుగారూ, రత్నమ్మ గారూ తలో దిక్కుకు పరిగెత్తించారు. మూడు గంటలుగా వెదుకుతున్నాం. ఎక్కడుంది, బాబూ?"
కళ్యాణ్ ఆ దిశగా చూపించి, వెళ్ళబోతూన్న నౌకర్ని ఆపి ప్రశ్నించాడు: "ఆ పిచ్చిది ఈ ఊరు ఎందుకు వచ్చింది?"
"ఏం చెప్పను బాబూ? అదో పెద్ద కథ. రూపమ్మ కలిగినింటి బిడ్డే. అపురూపంగా పెరిగింది. బాగా పెద్ద చదువులే చదివిందిట. చక్కగా ఉద్యోగం చేస్తూ పిచ్చిదైపోయిందిట. లోపల ఏదో కథ ఉందిట లెండి. ఎవరినో ప్రేమించి...." చెబుతూనే కొన్ని మాటలు మింగేసి తిరిగి చెప్పాడు. "ఆ బాబేమో పాముకరిచి చచ్చారట. ఈ అమ్మ ఇలా పిచ్చిదై పోయింది. రఘుబాబుగారికి ఈ అమ్మ పంచప్రాణాలు. రత్నమ్మగారు అక్కడ ఉండగా ఇద్దరూ కంటికిరెప్పలా చూచుకొనేవారట. ఆమేమో ఇక్కడికి పురిటికి వచ్చింది, అక్కడ రూపమ్మగారిని చూసే వారు ఉండరని తనతో ఇక్కడికి తీసుకువచ్చింది. పాములతో కరిపించుకు చావాలని అడవుల వెంటపడి తిరుగుతూంది. వెదికి పట్టుకోలేక మా తలప్రాణం తోకకి వస్తూంటుంది." నౌకరు ముందుకు సాగిపోయాడు.
* * * *
కళ్యాణ్ పేషెంట్లను చూస్తున్నాడు.
పొరుగూరి నుండి ఒక రోగి కాలికి గాయమై నడవలేనిస్థితిలో వచ్చాడు.
"కొన్నాళ్ళు ఇక్కడే ఉండి గాయం నయమైన తరవాత వెళ్ళు. ఈ ఊళ్ళో నీకు ఎవరూ బంధువులు లేరేమో?"
"అవును, బాబూ!"
కళ్యాణ్ కాంపౌండ ర్ తో చెప్పాడు. "బయటి రూమ్ ఇయ్యి ఇతడికి. గాయం నయం చేసుకువెళతాడు."
"ధర్మరాజు!"
రోగి కృతజ్ఞత చిరుహాసంతో స్వీకరించాడు కళ్యాణ్.
"డాక్టర్!"
కళ్యాణ్ తలఎత్తి చూశాడు. స్ఫురద్రూపి అయిన అపరిచిత యువకుడు మ్లానవదనంతో కనిపించాడు.
"డాక్టర్, నా చెల్లెలికి చాలా ప్రమాదంగా ఉంది. తొందరగా రావాలి మీరు, డాక్టర్!"
"మీరందరూ అయిదు నిమిషాలు కూర్చోండి. ఇప్పుడే వస్తాను." రోగులను ఉద్దేశించి చెప్పి లేచాడు కళ్యాణ్.
కాంపౌండర్ మందులపెట్టె తెచ్చిపెట్టాడు కారులో.
మూడు నిమిషాల్లో వాడు ఓ పెద్ద భవనం ముందు ఆగింది. కారు దగ్గిరికి వచ్చిన నౌకరికి బాగ్ అందించి ముందు యువకుడు దారి తీయగా అనుకరించాడు కళ్యాణ్!
"నమస్కారం, డాక్టరుగారూ!" రోగి మంచంవద్ద కూర్చున్న రత్నలేచి నమస్కరించింది, కళ్యాణ్ గదిలోకి వస్తూండగానే.
"మీరా!?" కళ్యాణ్ అక్కడే ఆగిపోయి, అనుమానంగా రోగి ముఖంమీదికి దృష్టి సారించాడు. అతడి చూపులకు మంచంమీద నిస్పృహగా పడిఉన్న రూప కొరడా వలె తగిలింది. "నే నీమెకు వైద్యం చెయ్యలేను. క్షమించండి." గిరుక్కున వెనుదిరిగాడు.
"డాక్టర్!" కళ్యాణ్ పరిచయంలేని రఘు విస్తుపోయాడు. అతడిని తెలిసి ఉన్న రత్న అదిరిపోయింది.
"ఏమిటిది, డాక్టర్?" చెరో పక్కగా వెంబడించారు.
"రత్నాదేవీ!" ఆవేశంగా సంబోధించాడు కళ్యాణ్. "మీకు కథ అంతా తెలుసు. నేను రక్తమాంసాలు ఉన్న మానవున్ననే మాట మరవకండి. కరుణ, కాఠిన్యం, ప్రేమ, ద్వేషం, క్షమ పగ అన్నీ నాలోనూ ఉన్నాయి. ఈమె నాకు చేసిన అన్యాయం మామూలిది కాదు. జన్మలో క్షమించేది కాదు."
"కాదు కాని, వృత్తిధర్మం కళంకపరుచుకొంటారా?" గంభీరంగా అంది రత్న. "సరదాగా చేస్తున్నానే గాని ఇది ఇప్పుడు నా వృత్తి కాదు."
"ఏది ఏమైనా మానవత్వమన్నది ఒకటి ఉన్నది."
రఘుమాటలుకూడా కళ్యాణ్ ను నిలపలేకపోయాయి. వెళ్ళి కారులో కూర్చున్నాడు, "మనిషిగా బ్రతికి నన్నాళ్ళూ నేను సుఖపడలేదు, మిస్టర్" అంటూ.
కారు తలుపుమీద చెయ్యివేసి జాలిగా అంది రత్న: "రూప చేసిన పాప మేదైనా ఉంటే శిక్ష అనుభవిస్తూనే ఉంది. ఇంకా ఎందుకు మీకు ఆమెమీద కసి? రాత్రి నుండీ జ్వరంతో తీసుకుంది. ఉదయం చూస్తే మాట నాలుగు డిగ్రీల జ్వరం, డాక్టర్ని తీసుకు రావడానికి కానీ, రూపను పట్నం తీసుకుపోవడానికిగానీ పట్నం చేరువలో లేదు. ఆ అన్నగార్ని ముఖంచూడండి, ఎలాగైపోయారో? రూప ప్రాణంతో సమం వారికి. వారిముఖం చూసి అయినా రూపకు వైద్యం చెయ్యండి. మీరు దయతలచాలి, మా మీద. సామాన్య మానవులవలె స్వార్ధ సంకుచితత్వాలు లేవు మీలో. ఉంటే, రూప బాబును పెంచేవారు కాదు."
"కాదు, కాదు. నేనూ మామూలు మనిషినే. నన్ను బలవంతపెట్టి నాలోని పగ రెచ్చగొట్టకండి. వైద్యం చెయ్యడమే సంభవిస్తే ఆమెను ఏ విషపు ఇంజక్షన్ తోనో అంతం చెయ్యడానికి పురికొల్పవచ్చు నాలో ద్వేషం."
"డాక్టర్!" రఘుకంఠంలో తీక్షణంగా పలికింది. క్రోధంతో కళ్ళు రక్తిమదాల్చాయి. కదిలిపోతూన్న కారును నిరసనగా చూస్తూ ఉండిపోయాడు.
"ఏమిటి ఇప్పుడు గతి?" నీరసంగా రత్న ఇంట్లో నడిచింది.
"రూప బాబును పెంచింది ఇతడేనా, రత్నా?" అడిగాడు రఘు.
"ఇతడే, కల్యాణ చక్రవర్తి. బాబుకు తల్లీ, తండ్రీ అన్నీ తనే అయిపెంచాడు. చివరికి అలా అయిపోయింది."
"రూప చాలా పొరపాటు చేసింది. అలా బాబును తిరిగి తీసుకోవలిసింది కాదు. నిజంగా ఇది క్షమించరాని నేరమే. అతడిని ఏమన్నా ధర్మంకాదు."
రూప మూలుగుతున్నది.
"చెల్లాయ్!" రఘు ఆమె నుదుటిమీద చెయ్యి వేసి పిలిచాడు ఆదరంగా.
"గోధుమవన్నె నాగుపాము అన్నయ్యా. ఎంచక్కా ఉందో! దాని ముద్దుకోసం ఎన్నాళ్ళనుండి తపస్సు చేస్తున్నానో?" పలవరిస్తూంది.
"చెల్లాయ్! అలా అనకమ్మా, మమ్మల్ని వదిలి పోకమ్మా ఎలా ఉన్నా నువ్వు కళ్ళముందుంటే చాలు!" రఘు కళ్ళు తుడుచుకొన్నాడు.
"రంగడు చూడు, వదినా! నేను వెళ్ళకుండా పట్టుకొన్నాడు, వాణ్ణి వదలమనవే.... వదలమనవే......"
రూపకేకలతో దిక్కుతోచకుండా పోయింది రత్నకు. "ఏమిటి కర్తవ్యం?"
"మన కర్మఏమో కాని ఇది బస్ రూటు అయినా కాదు, ఎద్దులబండి కట్టించుకొని పట్నం వెళ్ళడం తప్పితే వేరే దారి ఏముంది?"
"ఇప్పుడు వెడితే ఎప్పుడు చేరడం? జ్వరం చూస్తే కొంప ముంచేటట్లుంది. ముందు ఇప్పుడేదైనా మందపడాలి." దిగులుగా అంది.
రఘు ఏదో నిశ్చయించుకొన్నవాడిలా లేచి గబ గబా చొక్కావేసుకొని వెళ్ళిపోయాడు, ఎక్కడికి అంటూన్న రత్నమాటలు వినిపించుకోకుండానే.
రత్న లోపలికి వెళ్ళిన అయిదు పది నిమిషాలకు ఇంటిముందు కారు ఆగింది.
రత్న బయటికి వచ్చింది ఆత్రంగా.
కల్యాణ్ కారునుండి రఘు దిగాడు. "అడగ్గానే డేవుడు కనికరించినట్లు కారు అయినా ఇచ్చాడు, వైద్యం చెయ్యడానికి ఒప్పుకోకపోయినా. పద, రూపను కారులోకి చేర్చాలి."
రత్న తల్లి అభ్యంతరపెట్టింది. "తీసుకుపోయి ఏం చేస్తావ్, నాయనా? వెంట ఎవరూ ఆడమనిషి తోడు లేందే? జ్వరం మనిషిని తీసుకుపోతే ఇబ్బంది కాదూ? నిండునెలలు. రత్న వచ్చేటట్లుకూడా లేదుగదా?"
"మరి ఏం చెయ్యమంటారు?"
"అమ్మ అన్నది నిజమే. డాక్టర్నే తీసుకురండి. ఫీజు విషయంలో భయపడేదేమీలేదు. రూప ఆరోగ్యం కంటే ఎక్కువా?"
రఘు అంగీకరించి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళి పోయాడు.
* * *
అడుగుల చప్పుడు విని తలఎత్తి చూచింది రత్న.
ముందు కళ్యాణ్, వెనక మందుల బాగ్ పట్టుకొని నౌకరు గదిలో ప్రవేశించారు. కళ్యాణ్ రాకకంటే అతడి ప్రసన్నమైన నిర్మలవదనం ఆశ్చర్యపెట్టింది రత్నను.
కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా రూప మంచం కడకు వెళ్ళాడు. ఆమె చెయ్యి చేతిలోకి తీసుకొనిముఖంవంక పరిశీలనగా చూశాడు. నుదుటి మీద కట్టు కట్టబడి ఉంది. "ఇదేమిటి?"
"గాయమైంది."
"ఎలా?"
"ఊరంచున కొండలమీదికి వెళ్ళింది నిన్న సాయంకాలం. పాముకోసం పరిగెత్తి ముఖం పగల గొట్టుకుంది,రాయి తగిలి కిందపడి, రంగడు వెంటనే ఉన్నాడు కాబట్టి బతికింది కాని పాముచేత కరిపించుకు చచ్చి ఉండేది నిన్న. చివరికి దాని రాత అలానే ఉందేమో తెలియదు. దెబ్బ తగలగానే వాడికి తెలిసిన ఆకు పసరు ఏదో పిండి ఇంటికి తీసుకువచ్చాడు."
కళ్యాణ్ ఇంజక్షన్ చేశాడు. "రఘుబాబు చాలా దిగులుపడినట్లున్నారు. ఏం ఫర్వాలేదు. తగ్గిపోతుంది జ్వరం, అనవసరంగా కంగారుపడవద్దని చెప్పండి."
రత్న కాఫీ ఇచ్చి, "కొంచెంసేపు కూర్చోండి. రూప కథ చెప్పాలి" అంది.
"నాకు తెలుసు."
"మీకు తెలిసింది కొంతమట్టుకే. పూర్తిగా తెలియదు. తెలిస్తే అలా నిరాకరించి వెళ్ళిపోయేవారుకాదు. ప్రతీకారానికి బదులు సానుభూతి కలిగి ఉండేది."
కళ్యాణ్ శాంతంగా కూర్చొన్నాడు, కాఫీ తీసుకొని.
"ఎవరూ అపశ్రుతులతో ఆలపించాలని కోరరు. అందరూ సుశ్రావ్యంగా పాడాలనే వాంఛిస్తారు. కొందరి కంఠం అందుకు అనుగుణంగా ఉండదు. సాధనతో సరిదిద్దుకొంటారు. కొందరు ప్రయత్నించీ విఫలులైతే, నిర్లక్ష్యం చేస్తారు కొందరు. కొందరి కంఠం శ్రావ్యమైనా లయతాళబద్ధం కానప్పుడు అపశ్రుతి పలుకుతుంది.

