అతనప్పటికీ జవాబేమీ చెప్పలేదు.
"ఇవేళ నా పుట్టింరోజండీ! మీకు పార్టీ యిస్తాను. రారూ?"
"సరే"
ఆమె యింటి ఎడ్రెసు గుర్తులు చెప్పింది. మరిచిపోకుండా తప్పకుండా రమ్మని మరీ మరీ కోరింది.
ఆ సాయంత్రం ఆఫీసుపని అయిపోయాక రిక్షాలో ఆమె యింటికి బయలుదేరాడు.
ఇల్లు గుర్తుపట్టటం ఏమంత కష్టంకాలేదు. ఆమె వల్లించినట్లు వంటి స్తంభం మేడలాగే వుంది. ఆ మేడమీద వంటరి గదిలో ఆమె వంటరిగా నివసిస్తుంది. గది తలుపు దగ్గర అతను గుర్తుపట్టటం కోసం ఆధారం అన్నట్లుగా నిలబడి క్రిందకి చూస్తూంది, అతను రిక్షా దిగి పైకి చూడగానే చిర్నవ్వుతో చెయ్యి ఊపింది.
అతను మెట్లెక్కి పైకి వెళ్ళగానే "రండి" అంది లోపలకు ఆహ్వానిస్తూ.
ఆమె తలంటుపోసుకుని జుట్టు విరబోసుకుని వుంది. తెల్లచీరె, జాకెట్టు వేసుకుంది. విశాలమైన కళ్ళచుట్టూ కొసలు తేరిన కాటుక. నిజంగా చాలా అందంగా వుంది వనజ.
గది చాలా ఏకాంతంగా, ప్రశాంతంగా వుంది. సామాన్లన్నీ నీట్ గా అమర్చి వున్నాయి. తెల్లటి దుప్పటి కప్పిన మంచం, ఒకే ఒక తెల్లటి పేముకుర్చీ, అల్మైరా చక్కగా సర్దివున్న పుస్తకాలు, ఒకమూల చిన్నస్టవ్, అక్కడే టేబుల్ మీద మితంగా వున్న వంటసామాను, బట్టలు పెట్టుకునే చిన్న బీరువా...
"కూర్చోండి?"
అతను కుర్చీలో కూర్చున్నాక, ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది-
"క్షమించండి యిక్కడ రెండో కుర్చీ లేదు?"
"ఫర్వాలేదు."
"ఎప్పుడూ నా బర్త్ డేకు స్నేహితురాళ్ళని పిల్చే దాన్ని, ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాలనిపించింది. ఇంకెవర్నీ పిలవలేదు?"
"ఎందుకని?"
"ఇటీవలనే నా ఆలోచనల్లో మెదుల్తోన్న వ్యక్తి మీరు ఒక్కరే గనుక?" వనజ నవ్వింది.
"నామీద యింకా కోపం పోలేదా?"
"కోపంగా వుంటేనే ఆలోచించాలా?"
"నా విషయంలో అంతే మరి?"
"మీ గురించి మీకు అంతే తెలుసన్న మాట. ఉండండి ఫలహారం చేద్దురుగాని"
లేచి ఓ ప్లేటులో మైసూర్ పాక్, జీడిపప్పు పకోడీ తీసుకొచ్చి అతని చేతి కందించింది.
"మీరో?"
"నేను తర్వాత తింటాను లెండి. తీసుకోండి."
ఒక్క నిమిషం మౌనంగా గడిచింది.
"స్వీట్ ఎలా వుంది? తింటానికి వీలుగా వుందా? లేక రాయిలా గట్టిగా..."
"లేదు చాలా బావుంది."
"నేను స్వయంగా చేశాను. మీరు మెచ్చుకుంటే చాలా సంతోషంగా వుంది."
టిఫిన్ అయినాక కాఫీ కలిపి తీసుకువచ్చింది. ఈమె ఆనాడు తమ యింటికి వచ్చి దెబ్బలాడిన వనజేనా అనిపిస్తుంది. ఎంత మార్పు! ఎందుకిలా జరిగింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
"మీ గురించే."
"నా గురించా? ఏమని?" అనడిగింది కుతూహలంగా.
"నిజం చెప్పమంటారా?"
"మీరు అబద్దం చెప్పరని నాకు తెలుసు?"
"మీరు మా ఇంటికి వచ్చిన వనజకుమారేనా అనిపిస్తున్నారు."
"నిజం చెప్పాలంటే కాదు. నేనిప్పుడు కనీసం, మీ విషయంలొ యింకో వనజను. ఎందుకిలా జరిగిందో నాకూ అర్ధం కావటంలేదు."
అతనేం జవాబు చెప్పలేదు.
"మిమ్మల్ని ద్వేషించాను, తిట్టుకున్నాను, అతి తీవ్రంగా విమర్శరాశాను. అయినా మీగురించి ఎక్కువగా ఆలోచించటం మొదలుపెట్టాను. నా డైరీలో పేజీలకు పేజీలు మీ గురించి రాసుకున్నాను. ఎంత వద్దనుకున్నా మీ వ్యక్తిత్వం, నిష్కల్మషత్వం నన్నాకర్షించాయి. మీరుతిట్టినా అందులో బాదేగాని స్వార్ధం వుండదు. మీ దూకుడులో వేడివున్నా అది చివరకు మంచులా మారి కోప్పడింతర్వాత ప్రేమగా దగ్గరకు తీసుకున్నట్లు తీసుకుంటుంది. మీ అభిప్రాయలతో ఏకీభవించకపోయినా చివరకు మీమీద గౌరవమేగాని ద్వేషం కలగదు. నిజం చెప్పాలంటే....నౌ ఐ లవ్ యు."
చీకటి పడింది. ఆమె లేచి లైటుకూడా వెయ్యలేదు. ఆ చీకట్లో యిద్దరూ దగ్గరదగ్గరగా కుర్చీలో ఒకరూ, మంచం మీద ఒకరూ కూర్చుని వున్నారు.
"నేను ఒంటరిదాన్ని యింతవరకూ పెళ్ళిమీదకూడా ఆలోచనలంతగా మళ్ళలేదు. స్నేహితులు చాలామంది వున్నారు. ఒక్కోసారి సందర్భాన్నిబట్టి మనసుకు దగ్గరగా వచ్చినవాళ్ళు కూడా వున్నారు. అయినా ఎవరి మీదా నమ్మకం కలగలేదు. ఎవర్ని చూసినా అనుమానం, అపనమ్మకం...దూరంగా జరిగిపోవాలనిపించేది. జీవితంలో ఎక్కడో అక్కడ రాజీపడక తప్పదని తెలుసు. కాని ఆ రాజీని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాను. ఇవేళ రాజీ అక్కర్లేకుండా నూటికినూరుపాళ్ళు ఆకర్షించిన ఒకే ఒకవ్యక్తి మీరు కాని ఏంలాభం? మీరు మీ చుట్టూ ఓ ప్రపంచాన్ని ఎప్పుడో నిర్మించేసుకున్నారు. అక్కడ నాకు చోటు వుండదని.....వుండదని తెలుసు మరి....నేను..."
మాటలు ఆపేసింది. చీకటిలో కనబడకపోయినా ఆమె గొంతులో డగ్గుత్తిక, తడబాటు-అతనర్ధంచేసుకున్నాడు. ఆమె ఏడుస్తోంది.
"మాట్లాడరేం?" కాసేపటికి ఆమె అంది.
"ఏం మాట్లాడమంటారు?"
"ప్లీజ్! ఏదో ఒకటి చెప్పండి. ఉండండి లైటువేసి వస్తాను" ఆమె లేచి గోడదగ్గరకు వెళ్ళి స్విచ్ వేసింది.
ఆమెవంక చూశాడు! తెల్లటి శరీరం, తెల్లటిబట్టలు. కళ్ళుమాత్రం ఎర్రటి బాధతో మెరుస్తున్నాయి.
ఆమె గోడదగ్గరనుండి యివతలకు వచ్చింది. కాని మంచందగ్గరకు పోలేదు. అతని ప్రక్కనే కుర్చీకి ఆనుకుని నిలబడి అన్నది "ఒక్కటి అడగనా"
అడగమన్నట్టు చూశాడు.
"భయంగా వుంది."
"ఇలాంటి సమయంలో భయాలుండకూడదు. నిర్ణయాలే."
ఆమె చెయ్యివచ్చి అతని భుజం మీద వాలింది. అతని భుజం మీద ఆమె చెయ్యి మెత్తగా వొణుకుతోంది.
"ఇలాంటివి నాకు తెలీవు. నిజం. ఇప్పుడు మీరుకావాలనిపిస్తోంది. సిగ్గువిడిచి చెప్పేస్తున్నాను. ఈ రాత్రికి మీరు కావాలి?"
అనంతమూర్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఇందాకటి కన్నా మరింత ఎరుపెక్కి వున్నాయి.
"మాట్లాడరేం?"
"...వొద్దు?"
"ఎందుకని? నేను మీకు నచ్చలేదా?"
"నచ్చినవన్నీ పొందాలనిలేదు."
"మరి...? మీ వసంతకు తెలుస్తుందని భయమా?"
"అలాంటి భయాలు నాకులేవని అందరికన్నా ఎక్కువ వసంతకే తెలుసు!"
"ఆమెమీది గౌరవమా? ఆమెను అన్యాయంచేస్తున్నానన్న బాధా?"
