Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 21


    "ఎవరికీ ద్రోహం చేయకుండా ఒకరు రచయిత కాలేరు. ప్రతి ఉత్తమ రచయితలోను యీ లక్షణం కనిపిస్తూనే వుంటుంది."
    "మీరు ఉత్తమ రచయిత అనుకుంటున్నారా?"
    "అనుకోవటంలేదు. కాని చిత్తశుద్ధితో ___ మీ దృష్టిలో అతి ధోరణి కావచ్చు___రాయగలిగి నందుకు గర్వపడుతున్నాను."
    "ఈ నవల పూర్తయ్యేసరికి మీకు భయంకరమైన చెడ్డపేరు వస్తుంది. రచయితగా మీరు నామరూపాలు లేకుండా నశించిపోతారు."
    "ఒక రచనవల్ల అది నేను సాధించగలిగితే--సాహిత్యానికున్న శక్తిని ప్రపంచానికి నిరూపించగలిగినవాడి నవుతాను."
    "మీకు చాలా ఎగో, ఐ హేటిట్. గుడ్ బై" వనజ లేచి చరచర బయటకు వెళ్లిపోయింది.
    
                                 * * *
    
    వనజ వెళ్ళిపోయాక అనంతమూర్తికి మనసంతా చెదిరిపోయినట్లయింది. గుండె బరువెక్కి పోయినట్లయింది. చాలాసేపు ఆ గదిలో వంటరిగా కూర్చుండి పోయాడు. అతను వంటరిగా కూర్చున్నప్పుడు ఎవరూవచ్చి అతనిఏకాంతానికి భంగం కలగచెయ్యరు.
    వెలుగు పూర్తిగాపోయి, గదంతా చీకటితో నిండిపోయినా అతను కూర్చున్న చోటినుంచి లేవలేదు. చివరకు వసంతవచ్చి లైటు వేసింది.
    "భోజనానికి లేవండి" అన్నది.
    తలఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. "ఇవేళ ఆకలి లేదు వసంతా!" అన్నాడు.
    ఆమె అతనివంక ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ అంత దిగులుగా, వ్యాకులపాటుగా కనిపించలేదు. దగ్గరకు వచ్చి కుర్చీ హ్యాండ్ మీద కూర్చుని అతనిజుట్టులోకి వ్రేళ్ళుపోనిచ్చి దువ్వుతూ "అలా వున్నారేం?" అనడిగింది.
    "వసంతా నేను నవల రాయటం ఆపేద్దామనుకుంటున్నాను!"
    ఆమె ఉలికిపడింది "అదేం?"
    "వసంతా! ఒకటి చెప్పు నేను నా నవల్లో స్త్రీ కాతిని గురించి సంకుచితంగా రాశానా? నా రచనతో కసి, ద్వేషం కనిపిస్తున్నాయా?"
    "అలా అని ఎవరన్నారు? ఇందాకవచ్చిన అమ్మాయి చెప్పిందా?"
    అతను తల ఊపాడు.
    "మీ ఆత్మవిశ్వాసం చెదరగా ఎప్పుడూ చూడలేదు? ఈరోజు ఎందుకిలా అయిపోయారు?"
    "తప్పుదార్న నడుస్తున్నానేమోనని?"
    "చూడండి. జీవితంలో మీరేంచేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ మనస్సునే నమ్ముకున్నారు. ఆ మనసు యీనాడేమయింది?"
    "నా మనస్సు  నన్నే మోసం చేస్తున్నదేమోననీ."
    "ఒక రచయితమీద పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగినంత మాత్రాన అంత నిస్పృహపడిపోవాలా? అయినా మీరేం తప్పుచేశారని? చాలా నిశితంగా చదువుతున్నాను. మీరచనలో మానవతా దృక్పథమే, సమకాలీన జీవితంపై మీ ఆవేదనే కనబడుతున్నదిగాని, సంకుచితత్వం, విశృంఖలత్వం__యివేమీ లేవు. ఒక స్త్రీగా చెబుతున్నాను. మీ నవల నాకెంతో నచ్చిందండీ?"
    అతనామె ముఖంలోకి అమాయకంగా చూశాడు. "నిజంగానా?"
    "నిజమండీ మీరెంతో బాగా రాస్తున్నారు. ఒక విషయం చెప్పనా? మీరెవర్నీ ద్వేషించలేరు, ద్వేషించటం మీకు చేతకాదు నిజంపట్ల, వాస్తవికత పట్ల మీకు  మమకారమే గాని, చిత్తశుద్ధిలేని దండయాత్ర, విరుచుకు పడటం మీరు చెయ్యరు. ఈ నవల్లో దూకుడు కనబడుతున్నదంటే అవి రచయితగా మీలోని ఆవేదనలేగాని ఒకజాతి పైవెలిగ్రక్కే విస్ఫులింగాలు కావు. పిల్లలు తప్పుచేస్తే వ్యధచెందేమాతృ మూర్తిలా మీరా నవల్లో క్షోభిస్తున్నారు. నిజానికి మీకంటే స్త్రీ జన పక్షపాతి ఎవరున్నారు?"
    "అయితే...?"
    "అయితేలేదు గియితేలేదు. మీరా నవలని కొనసాగిస్తున్నారు."
    అతను ఒక్కక్షణం ఆమె కళ్ళలోకి చూసి, తర్వాత గట్టిగా కౌగలించేసుకున్నాడు.
    "కౌగలింతలు తర్వాత ముందు భోజనాలు."
    కొండంతధైర్యం వచ్చినట్లు అతను లేచి నిలబడి, ఆమెను అనుసరించి వెళ్ళాడు.
    
                                                                   * * *
    
    వసంత చెప్పిన మాట నిజమే అయింది. రాను రానూ ఆ నవలమీద విమర్శలు తగ్గి-అది యింటింటి కథగా విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చింది. అందులోని పాత్రలతో పాఠకులు విలీనమయ్యారు. అతని నిశితత్వానికీ, అతనిలోని నిజాయితీకి అందరూ దిగ్భ్రమ చెందారు. ఆ నవలను అందరూ ప్రేమించసాగారు.
    వందలాది పాఠకులు అతనికి ఉత్తరాలు రాయసాగారు. అందులో ఎక్కువ భాగం స్త్జ్రీలే. కొందరతన్ని ఓ అన్నయ్యలా, కొందరు ఆపద్భాంధవుడిగా, కొందరు రహస్యాలు చెప్పుకునే ప్రాణస్నేహితునిగా కొందరు చెడును ప్రక్షాలనంచేసే గురువుగా చూసుకున్నారు.
    నవల పుస్తకరూపంలోకి వచ్చాక యింకా ప్రచారం లోకివచ్చి విపరీతంగా కాపీలు అమ్ముడయిపోయాయి. అన్ని పత్రికల్లోనూ విమర్శలు గొప్పగా వచ్చాయి. ఒక్క వనజే అతన్ని దూషిస్తూ, ద్వేషాన్ని వెలిగ్రక్కుతూ విమర్శ రాసింది. అయితే ఆ అభినందన పరంపరలో, ఆమె విమర్శ దూదిపింజలా ఎగిరిపోయింది.
    
                                      * * *
    అనంతమూర్తి ఆఫీసు పనిలో నిమగ్నమై వుండగా టేబుల్ మీద ఫోన్ మ్రోగింది.
    రిసీవర్ అందుకుని "యస్!" అన్నాడు.
    "ఎవరు? అనంతమూర్తిగారా" అవతలనుండి ఓ స్త్రీ గొంతు.
    "అవును."
    "నేనండి! వనజను."
    "ఓ! నమస్కారమండీ" అన్నాడు ఆదరంగా.
    "మీతో కొంచెం మాట్లాడాలండీ."
    "ఆఫీసుకు రండి."
    "ఆఫీసులో వద్దులెండి యిష్టం లేదు."
    "పోనీ యింటికి రండి."
    "వద్దండీ! మీరే మా యింటికి రాకూడదూ?"
    "మీ ఇంటికా?" అని ఆలోచిస్తున్నాడు.
    "ఏం ఒక్కసారిగా ఆగిపోయారు? భయపడకండి. మా యింట్లో నేను తప్ప ఎవరూలేరు" అవతలనుంచి వనజ కుమారి నవ్వు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS