Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 23


    "నామీద నాకు గౌరవం, నీగురించి బాధ."
    "ఇది ఆధారంగా చేసుకుని మీజీవితంతో ముడిపెట్టుకు కూర్చోను నిజం. ఈ రాత్రి చాలు."
    తన వంటిమీద ఆమెచేతిని మృదువుగా విడిపించాడు కాని అతని చెయ్యింకా ఆమె చేతిలోనే వుంది.
    "క్షణికమైన అనుభవాలకు శాశ్వతమైన విలువల నాపాదించి ఆ మత్తులో ఆత్మవంచన చేసుకోవటం కుర్రతనం వనజా! ఈ నిముషంలో నేను నిన్నెంతో యిష్టపడుతున్న్ను ఈరోజు నీతో గడిపినకాలం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. అంతవరకూ చాలు. జీవితంలో పరిస్థితులనుబట్టి ఏదో రూపంలో తరుచు ఎదురయ్యే ఇలాంటి సంఘటనలకు వ్యామోహపడి వాటికి రూపాంతరాలు చిత్రించుకుంటే సంఘర్షణలే మిగులుతాయి. నా మీద నీకు కోపం రావటం లేదనుకుంటాను. కాలయాపన చెయ్యకుండా యీసారి కుదురుగా రాజీపడి. యీ వంటరితనంనుండి విముక్తి పొందువనజా! యిహ వస్తాను."
    అతనిచేతిని తన పెదవులమీదకు లాక్కుని మృదువుగా చుంబించి "మీ యిష్టం" అన్నది బలవంతాన నవ్వి.
    అనంతమూర్తి లేచి ఆమె చెంపమీద చిటిక వేసి బయటకు వచ్చేశాడు.
    "నాకు కోపంలేదు. ఈసారి అతనిమీద కోపంలేదు" అని వనజ తలుపువేసుకొని మంచంమీదకు వెళ్ళి పడుకుంది. ఆమె కళ్ళనుంచిమాత్రం నీళ్ళు కారుతున్నాయి.
    ఒకరోజు రాఘవ మూర్తి ఇంటికి కంగారుకంగారుగా వచ్చాడు. మనిషి కొంచెం వగరుస్తున్నాడు. "నీతో అర్జంట్ గా మాట్లాడాలి పర్సనల్" అన్నాడు.
    "మేడమీద గదిలోకిపోయి కూర్చుందాం రా అక్కడి కెవరూ రారు" అని పైకి తీసుకువెళ్ళాడు.
    ఆ గదిలో ఎక్కడపడితే అక్కడ అరలనిండా చోటు లేకుండానే పుస్తకాలు, రాజకీయాలు, జర్నలిజం, ఇంగ్లీషు తెలుగువి. అది అతని సామ్రాజ్యంలా గోచరించింది.
    "నువ్వు పిల్లలు పెంపకం అందులో నియమాలు అంటూ ఏవేవో కబుర్లు చెబుతావు. అవతల కొంపలంటుకుపోతున్నా కూడా చూస్తూ ఊరుకుంటావా?"
    "ఏం జరిగింది?"
    "మీ అబ్బాయి మోహన్ ఎవరో క్రిష్టియన్ పిల్లతో తిరుగుతూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా వున్నా రంటే ప్రేమమైకంలో పడినట్టూ బహుశా పెళ్ళిచేసుకునేటట్టు కనిపించారు."
    అనంతమూర్తి ఏమీ మాట్లాడలేదు.
    "మాట్లాడవేం? యిప్పుడు కూడా చీమకుట్టినట్టుగా లేదా!"
    "చీమకుట్టినట్లుగానే వుంది. కాని కుట్టింది పాములు కావు."
    "అంటే...?"
    "ఆ వయసులో నేనెలా ప్రవర్తించానా అని గుర్తుచేసుకుంటున్నాను రాఘవా? ఓ ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే నువ్వు నాకెప్పుడూ చెప్పలేదు. వయసులో వున్నప్పుడు ఏ అమ్మాయినీ చూసి వ్యామోహంలో పడలేదా?"
    రాఘవ అయోమయంగా చూశాడు. "నాకు తెలీదు"
    "ఈ సృష్టిలో ప్రేమ, వ్యామోహం యివన్నీ ఎంత సహజమంటే తల్లితండ్రులు కాదుకదా! సమాజం కాదుకదా సాంఘిక ధర్మాలు కాదుకదా!, ఏవీ వాటిని అరికట్టలేవు. చరిత్రచూడు. పౌరాణిక గాధలు చూడు. కోకొల్లలు గా యిలాంటి వుదాంతాలతోనే నిండివున్నాయి."
    అందుకని నువ్వు మద్దతు యిస్తున్నావా?"
    "మద్దతు యివ్వటంలేదు. నిజాన్ని స్వీకరిస్తున్నాను."
    "ఈ కుర్రకారు చేష్టలను ఇలాగే అలక్ష్యం చేస్తే మన సంప్రదాయం, ప్రతిష్ట, ఆఖరికి దేశం అన్నీ మట్టి గొట్టుకుపోతాయి."
    "ఏ దేశమైనా ఈ సమస్యను అరికట్టగలుగుతుందని నేననుకోవటంలేదు. చాలా దేశాల్లో మనం వులిక్కిపడి నడుచుకునేటంతటి స్థాయిలోకూడా వుంది. అయినా ఆదేశాలు మట్టిగొట్టుకుపోలేదు. అనేకరంగాల్లో మనకంటే ముందడుగు వేస్తూ పురోగమిస్తూనే వున్నాయి."
    "అయితే మీ అబ్బాయిగురించి పట్టించుకోకుండా మానేస్తానంటావా?"
    "పట్టించుకోకుండా మానెయ్యను. ఏదో పరిష్కారం ఆలోచిస్తాను."
    "ఎలా ఆలోచిస్తావు."
    "ప్రేమలో పడ్డవాళ్ళ మీద నాకు జాలేకాని, కోపం వుండదు. ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కువగా కష్టాలుపడుతూ మానసికక్షోభ ననుభవిస్తూ తక్కువ సుఖపడుతూ వుంటారు. వీటి పర్యవసానాలు ఓ స్నేహితుడిలా వాడికి వివరిస్తాను."
    "కొడుకుతో ఇవన్నీ విపులీకరిస్తావా!"
    "తప్పేం? ఓ మంచి స్నేహితుడిగా ఇవ్వవలసిన సలహా నిస్తాను."
    కాసేపుండి రాఘవ వెళ్ళిపోయాడు.
    మూర్తి ఎనిమిదిగంటల దాకా చదువుతున్న పుస్తకాన్ని పూర్తిచేసి క్రిందకు  దిగివచ్చే సరికి ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలకు చేరుతున్నారు.
    మూర్తి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.
    "అమ్మ రేపు అన్నవరం వెడతానంటున్నాది నాన్నా. ఎప్పుడో వేడయనని అనుకుందట" అంది పెద్దకూతురు నందన.
    "అలాగే వెళ్ళిరండి."
    "నువ్వెప్పుడూ గుడికి రావేం నాన్నా!"
    "నువ్వు నాస్తికుడివా?"
    మూర్తి ఏమీ జవాబు చెప్పలేదు. చిరునవ్వు నవ్వి వూరుకున్నాడు.
    "రేపు నువ్వు కూడా రా నాన్నా. అందరం కలిసి వెడదాం."
    "ఇప్పుడు కాదమ్మా! నేను అన్నవరం వచ్చి సత్యనారాయణ వ్రతం చేయిస్తానని ఒకందుకు మొక్కుకున్నాను. నా కోరిక నెరవేరాక అప్పుడు వెడతాను. కావాలంటే మీరంతా నాతో రండి."
    తల్లీ, కొడుకు ఇద్దరు కూతుళ్ళు అతని వంక నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు.
    "నువ్వు దేముడికి మొక్కుకున్నావా!" నందన కళ్ళు పెద్దవి చేసి అంది.
    "అవునమ్మా మీ ముగ్గురు అంటే మీ అమ్మ యిద్దరు అక్కచెల్లెళ్ళు వైర్ బ్యాగ్ లు అల్లటం ఎప్పుడు మానేస్తారో అప్పుడు వచ్చి వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను! ఏం చెయ్యను? నా బాధ ఎవరికి చెప్పుకోలేక దేముడికి చెప్పుకున్నాను."
    ఒక్క నిమిషం మౌనంగా ఉండి అంతా ఒక్క సారిగా గట్టిగా నవ్వేశారు.
    "పో నాన్నా! మమ్మల్ని వెక్కిరిస్తావు." అంది కుమారి.
    "వెక్కిరించటం కాదమ్మా. మీరు ఏపనీ కొన్ని నెలలుపాటు దీక్షగా చెయ్యరు. చిన్నపిల్లలు కొంతకాలం గోలీకాయలను, కొంతకాలం బొంగరాలను, కొంతకాలం గాలిపటాలను సీజన్ వారిగా ఆడుకుంటూ వుంటారు. అలాగే మీరు కొన్ని రోజులు పూసలతో బొమ్మలు చెయ్యటం కొన్ని రోజులు గుడ్డబొమ్మలు చెయ్యటం ప్రస్తుతం సీజన్ వైర్ తో బ్యాగ్ లు అల్లటం...ఫ్లూ అలుముకున్నట్లు ఏ యింట్లో చూసినా ఈ వైర్ బ్యాగ్ లే. కొన్ని నెలలు పోయాక మళ్ళా యివన్నీ ఏ మూలకు పోతాయో అజా పజా వుండదు."
    "నువ్వు కుట్టుమిషన్ల గురించి చెప్పటం మరచిపోయావు నాన్నా!" అన్నాడు మోహన్.
    "కుట్టు మిషనేమిటి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS