Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 20


                          సిద్దేంద్రస్వామి భక్తులు
                                                ---వసుంధర


    ఓ చిన్న పెంకుటింటిముందు కారాపి దిగాను. ఇంటి ముందు పందిరి వుంది ఇంట్లో వేడుక జరుగుతోంది. జగన్నాధం కూతురి కొడుక్కు బారసాల!
    జగన్నాథం నాకు వరుసకు బాబాయవుతాడు. బాగా దూరపు బంధుత్వం. అయినప్పటికీ వాళ్ళింట్లో జరిగే ప్రతివేడుకకీ నన్ను పిలుస్తాడు. నామీద అభిమానంతో కాదు. నా దగ్గరున్న డబ్బు పలుకుబడి ఎంతో కొంత తనకుపయోగపడతాయన్న ఆశ ఒకటీ, తనాకున్న ఎన్నికైన బదువుల్లో నేనొకన్ని కాబట్టి నా రాక ఆయన ప్రెస్టేజిని పెంచుతుందన్న నమ్మకం ఒకటీ- ఆయన్ను నన్ను వాళ్ళింటికి తహర్చుగా పిలిచేలా చేస్తున్నాయి. కేవలం ఈ రెండు కారణాలేకాక-ముఖ్యమైన మూడో కారణం కూడా ఉండడంవల్ల ఆయన నన్ను విధిగా పిలుస్తాడు. అదేంటంటే నే నెప్పుడూ ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తాను.         
    అందుక్కారణం అభిమానమని కొందరూ, వినయ గుణమని మరికొందరు చెప్పుకుంటారు. బంధు ప్రీతి ఎక్కువ అని చాలామంది నా గురించి అంటారు. కానీ అసలు కారణం వేరే వుంది.
    నాకు నాకంటే బాగా తక్కువ హోదాలో ఉన్న బంధుమిత్రులంటే బాగా యిష్టం. అందుక్కారణం చాలా సింపుల్.
    తిరుపతి వెళ్ళడానికి వెయ్యిరూపాయలు పోగుచేసే మధ్యతరగతి మనిషి ఊళ్ళో దేవుణ్ణి చూడ్డానికి రిక్షా ఖర్చులక్కూడా యిష్టపడడు. కారణం డబ్బు! తిరుపతి దేవుడి దగ్గర డబ్బుంది. ఆ దేవుడి దగ్గరకు వెళ్ళినవారికి డబ్బొస్తుంది. కలియుగంలో మనిషి జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తున్న డబ్బుకీ, ఆ దేవుడికీ అవినాభావ సంబంధముంది. ఆ దేవుణ్ణి నమ్మినవారందరికీ ప్రయోజనం సిద్ధించిందనుకునేందుకూ లేదు. అదే నిజమైతే దేశంలో ఇన్ని కోట్లమంది అనాధులుండరు. తిండికి లేని వాళ్ళందరూ నాస్తికులు కారు గదా!
    తిరుపతి దేవుణ్ణి చూసిరావడంవల్ల భక్తుడి హోదా పెరుగుతుంది. అందుకే భక్తులాదేవుడికి అమిత గౌరవాన్నిస్తారు. ఆయన్ను గౌరవించడంలోనే తమకూ గౌరవముందని వారికి తెలుసు.
    నా బంధువులకు నేను తిరుపతి దేవుడివంటివాణ్ణి, నన్ను చూడ్డంలోనే నాతో మాటాడ్డంలోనే వారి గౌరవం హోదా ఉన్నాయని వారనుకుంటారు. ఆ భావనతో వారు నన్నమితంగా గౌరవిస్తారు. నన్ను ప్రత్యక్ష దైవంలా కొలుస్తారు.
    ఊళ్ళో నాకున్న పలుకుబడి కారణంగా యెందరో పెద్దవాళ్ళు నన్ను పిలుస్తూంటారు. నా అవసరాన్నీ, పిలిచినవారి ప్రాముఖ్యతనూ, వెళ్ళకపోవడంవల్ల వచ్చే అనర్దాలనూ అంచనావేసి కొందరి ఆహ్వానాలను మన్నిస్తూంటారు. నేను వెళ్ళినచోట పార్టీ ఘనంగా ఉంటుంది. కానీ అక్కడ పదిమందిలో నేనొకన్ని హలో అంటే హలో అంటారు. అక్కడ కొందరు నాకంటే కాస్త గొప్పవాళ్ళు. కొందరు నాకంటే కాస్త తక్కువ వాళ్ళు. ఏమైనా అక్కడ నన్ను ప్రత్యేకంగా గౌరవించే వాళ్ళు లేరు.
    బంధువు లిళ్ళలో అలా కాదు. అక్కడ నన్ను పదిమంది నుంచీ వేరుచేసి ప్రత్యేకంగా పీటవేసి నన్ను గౌరవిస్తారు. అది నాకిష్టం!
    జగన్నాధం ఇంట్లో అలాంటి ప్రత్యేక మర్యాదలందుకునేందుకే నేను విధిగా వెడతాను.
    కారు దిగిన నా చేతిలో ఓ ప్రెజంటేషన్ ఉంది. దాని ఖరీదు నూటయాభైరూపాయలు. సాధారణంగా పెద్దవాళ్ళింటికి ప్రజంటేషన్ తీసుకుని వెళ్ళినపుడు కనీసం అయిదువందలు ఖర్చవుతుంది నాకు. సాధారణంగా వేలలో వుంటుంది. అయినా నా ప్రజంటేషన్ కక్కడ ప్రత్యేకత లభించదు. నా విలువ తగ్గిపోకుండా నా ప్రజంటేషన్ నన్ను కాపాడుతుంది.
    ఇక్కడ నా ప్రజంటేషన్ ఖరీదు తక్కువైనా ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
    కారాగిన చప్పుడు విన్నట్లున్నాడు. జగన్నాధం పెద్దకొడుకు కొడుకు-ఎనిమిదేళ్ళవాడు-పరుగున అక్కడికి వచ్చాడు. నాకు నమస్కరించి-"రండంకుల! నాన్నగారు మీకోసం చూస్తున్నారు-" అన్నాడు.
    ఇంట్లోకి వెళ్ళాను. మర్యాదలందుకున్నాను. బారసాల భోజనం చేశాను. నాకుత్సాహంగా ఉంది. అక్కడ ప్రతిఒక్కరూ నా వంక ఆరాధనాపూర్వకంగా చూస్తున్నారు. నేను జోక్ వేస్తే పడిపడి నవ్వుతున్నారు. నేనన్న ప్రతిమాటకూ అవునంటున్నారు. నేను కాదన్న ప్రతిమాటనూ వాళ్ళూ ఖండిస్తున్నారు.
    కానీ ఈ ఉత్సాహం మధ్య తళుక్కున ఓ మెరుపు చూశాను. అప్పుడు కాసేపు నా బుర్ర పనిచేయడంలేదు.
    నెమ్మదిగా ఆమె గురించిన వివరాలు సేకరించాను.
    ఆమె పేరు వినీత వయసు ఇరవైఒకటి మూడేళ్ళ క్రితం పెళ్ళయింది రెండేళ్ళ క్రితం కాపురానికి వెళ్ళింది. ఆమె మూడుమాసాల గర్భిణిగా వుండగా యాక్సిడెంట్లో భర్తపోయాడు. అత్తమామలామె నింట్లోంచి పొమ్మన్నారు. ఆమె అన్నగారివద్దకు వెళ్ళింది. అన్నావదినలామెకు పురుడుపోసి-ఇక నీదారి నువ్వు చూసుకో అన్నారు. ఆమెకెవ్వరూ లేరు. ఏదైనా ఉద్యోగం చూపించమని అన్నగారామెను జగన్నాథం ఇంట్లో దిగబెట్టాడు. ఆమె కొడుక్కిప్పుడు ఆరుమాసాలు.
    "ఏం చదువుకుంది?"
    "ఇంటర్మీడియేట్ ఫస్టు క్లాసులో ప్యాసయింది. కాపురానికి వెళ్ళేక తీరికసమయంలో టైపు, షార్టు హ్యాండు కూడా నేర్చుకుంది...." అన్నాడు జగన్నాధం.
    ఆమె వాళ్ళింటికి వచ్చి రెండ్రోజులయింది.
    "సర్టిఫికెట్సుతో రేపు ఆఫీసుకు పంపించండి-" అన్నాను.
    అంతా నా వంక ఆరాధనాపూర్వకంగా చూశారు.

                                        2


    వినీతకు మా కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను. నెలకు ఎనిమిదివందలు జీతం. మా కంపెనీలో నెలకు అంత జీతం పుచ్చుకునే స్టెనో ఆమె మాత్రమే! ఆమెకు పని కూడా తక్కువ.
    వినీత ఉద్యోగంలో చేరాక నేను జగన్నాధం గారింటికి ఆహ్వానం లేకుండా కూడా వెడుతున్నాను. వేడుకలు లేకపోయినా ఆమె కొడుక్కి బొమ్మలు కొనిపెడుతున్నాను. వినీత వాళ్ళింట్లోనే తనకో గది ప్రత్యేకించుకుని వుంటోంది. ఆమె తన వంట తను చేసుకుంటూ-జగన్నాధంగారికి నెలయ్యేసరికి కొంత అద్దె కూడా యిస్తోంది.
    ఆ విధంగా ఆర్నెల్లు గడిచాయి.
    ఒకరోజున వినీత నాతో ఇబ్బందిగా-"మీ అభిమానం మరిచిపోలేను. కానీ తఃరచుగా మా యింటికి రావద్దు. నలుగురూ తలోవిధంగా అనుకుంటున్నారు-" అంది.
    "నువ్వేమీ అనుకోవడంలేదుగా-" అన్నాడు.
    వినీత తల అడ్డంగా ఊపింది.
    "అయితే ఫరవాలేదు. నీ ప్రవర్తనను శాసించడమే తప్ప మరేవిధంగానూ నీకు సాయపడలేని ఆ నలుగురినీ నువ్వు పట్టించుకోకు-" అన్నాను.
    "ఆడదాన్ని-అలా నాకు వీలుపడదు" అంది వినీత.
    "ఆడదానిలా ప్రవర్తించు. వీలుపడుతుంది" అన్నాను.
    వినీత తెల్లబోయి నావంక చూసింది.
    "నేను నీకుద్యోగమిచ్చానని ఆఫీసులో అంతా అందుకేదో కారణంలంటగడుతున్నారు. నా మంచి మనసును వాళ్ళతో పాటు నా భార్య కూడా అపార్ధం చేసుకుంది. కానీ నేను భయపడను. బెదరను".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS