"అంటే ఆమె స్వేచ్చాభావాలను నువ్వూ ఆమోదిస్తావా?" అన్నాడు చలం విపరీతంగా అవేశాపడుతూ.
"అదేమీ కాదు. ఆమె కామినీ పిశాచి అని నువ్వు ప్రచారం చేయి -- నీ మాటలు నిజమయ్యేలా నేను చూస్తాను --" అన్నాడు స్నేహితుడు.
స్నేహితుడు చలానికి తన పధకం యావత్తు చెప్పాడు. అది వింటూ చలం హడలిపోయి - " నాకోసం నువ్వు మనిషుల్ని చంపేస్తావా ?" అన్నాడు.
"మనుషుల్ని చంపుతుండడం నాకు తప్పదు. ఇప్పుడు నా లిస్టులో కొందరు మనుషులున్నారు. వాళ్ళెలాగూ చావబోతున్నారు . వాళ్ళీవిధంగా చచ్చిపోతే నాకు ప్రయోజనమే .... జనం ఇప్పటికీ మూడ విశ్వాసాలను గాడంగా నమ్మాలను కుంటారు. నీ భార్యకు కామినీ పిశాచి అన్న పేరు వస్తే అది బాగా ప్రచారమవుతుంది. ఆపైన మగాళ్ళు ఆమె అంటే భయపడతారు. అప్పుడు వేరే గతి లేక ఆమె మళ్ళీ నీ పంచనే పడి వుంటుంది. అంతే కాదు -- నీ ప్రేమ ఎంత గొప్పదో కూడా ఆమెకు ఈ విధంగానే తెలుస్తుంది --" అన్నాడు స్నేహితుడు.
చలం స్వతహాగా భయస్థుడు. కానీ భార్య మీద మమకారంతో -- తనామెకు దూరం కాకూడదన్న ఆకాంక్షతో ఇందుకు ఒప్పుకున్నాడు.
"ఇందులో నేను చేసిందేమీ లేదు. మాటలు తప్ప! నేను అబద్దం చెప్పడం లేదు ...." అన్నాడు చలం.
వెంకన్న ముఖం గంబీరంగా అయిపొయింది - " "మిష్టర్ చలం! నిజంగా నీ ప్రాణాలిప్పుడు ప్రమాదంలో వున్నాయి --" అన్నాడు.
"ఎందుకని ?"
"నీ స్నేహితుడు తెలివిగా మూడు హత్యలు చేసి అవి కామినీ పిశాచి మీదకు తోసేశాడు. చాలామంది ఆ విషయం నమ్మరు. రేపు పత్రికల్లో కామినీ పిశాచి వివరాలు రానున్నాయి. బహుశా నీ భార్య ఫోటో కూడా వస్తుంది. తర్వాత నీ విషయం తెలుస్తుంది.
భర్తకు నీకేమీ కాదు. అప్పుడు అందరికీ అనుమానం కలుగుతుంది. అలా అనుమానం కలగడం నీ స్నేహితుడి కిష్టముండదు. కామినీ పిశాచి అన్న పేరు నీ భార్యకు చిరస్థాయి కావడం కోసం అతడు నిన్ను కూడా ..."
చలం వెర్రి మొహం వేశాడు. అతడి కళ్ళలో భయం స్పష్టంగా కనబడింది. అతడు ఆలోచిస్తున్నాడని ముఖం చూడగానే అర్ధమవుతుంది.
"మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ లీల బ్రతుకు ఏమవుతుంది?" అన్నాడతను దిగులుగా.
"లీల జీవితాంతం నీ స్నేహితుడికి ఉపయోగపడుతూ వుంటుంది. తెలిసి తెలిసి ఏ మగవాడూ ఆమెకు ఆశ్రయమివ్వడు. నీ స్నేహితుడే ఆమెకు ఆశ్రయ మిచ్చి అన్ని విధాల ఆమెను ఉపయోగించుకుంటాడు....స్వేచ్చా భావాలున్న నీ బార్యకు అతడి వలలో పడడం చాలా సులభం. ఆ తర్వాత ఆమె గతి అధోగతే!' అన్నాడు వెంకన్న.
'అలా జరగడానికి వీల్లేదు --" అన్నాడు చలం.
"నీ కధ సుఖాంతం అవుతుంది. నీ స్నేహితుడి పేరు చెప్పు --" అన్నాడు వెంకన్న . ఆత్రుతగా చలం ముఖం వంక చూస్తూ .
చలం జాప్యం చేయలేదు -- "శేషగిరి!" అన్నాడు .
'సరే నువ్వు వెళ్ళు , ఒక్క రెండు రోజులు లీలను కలుసుకోకు. ఆమె వంక చూడకు...." అన్నాడు వెంకన్న.
చలం వెళ్ళిపోయాక వెంకన్న సీతమ్మ వంక అభిమాన పూర్వకంగా చూసీ -- "లై డిటెక్టర్ గురించి సమయానికి మంచి అబద్దం చెప్పి -- చలం చేత నిజాం చెప్పించావు. అతడు అబద్దం చెబుతున్నాడని ఎలా గ్రహించావు " అన్నాడు.
"మగవాడి కళ్ళు చూసి ఆడది అన్నీ గ్రహించగలదు ...." అన్నది సీతమ్మ నవ్వుతూ.
"అయితే రోజూ నా ఎదుట కూర్చుని నా కళ్ళను చూస్తూనే వుంటావు. నా గురించి ఏమేం గ్రహించావు అన్నాడు వెంకన్న.
సీతమ్మ ఏదో చెప్పబోయే లోగా బల్ల మీద ఫోన్ మ్రోగింది. వెంకన్న భయంగా ఫోన్ వంక చూశాడు. అది వంటింట్లో నుంచి వచ్చిందని అతడికి తెలుసు. భార్య పద్మావతి దేవి మాట్లాడడం కోసం అతడు వేరే ఫోన్ కనెక్షన్ ఇచ్చాడు.
వెంకన్న ఫోన్ తీసి --"దేవీ!" అన్నాడు.
'అంతా వింటున్నాను. ఆడవాళ్ళతో కనుల బాసల గురించి మీరు మాట్లాడవద్దు--"
అవతల క్లిక్ మంది.
రాజమ్మ కిసుక్కుమంది.
వెంకన్న అదోలా అసిస్టెంట్స్ వంక చూశాడు. తనకే ఫోన్ కాల్ వచ్చినా అసిస్టెంట్స్ వినడానికి సదుపాయం ఉంది. తనకు భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చినపుడు వాళ్ళను వినవద్దని అతడు శాసించాడు. కానీ వాళ్ళా శాసనాన్ని లెక్కచేయరు. ఇప్పుడూ లెక్క చెయ్యలేదు.
12
శేషగిరి -- ఓ పదిమందిలో కలిసి యేవో చర్చలు చేస్తున్నాడు. అంతా పెద్ద మనుషులే! ఆ ఊరి ప్రముఖులే!
సమావేశం మధ్యలో శేషగిరి ఇంటి పనివాడు లోపలకు వచ్చాడు. "బాబూ -- మీ కోసం ఓ అమ్మాయి వచ్చింది. ఇక్కడే మిమ్మల్ని కలుసుకుంటుందిట...."
'సరే - రమ్మనమను ...." అన్నాడు శేషగిరి.
లీల లోపలకు అడుగు పెట్టింది. తన చేతిలోని ఫోటో వంకా అక్కడున్న పెద్ద మనిషులందరి వంకా పరీక్షగా చూసి తిన్నగా శేషగిరిని సమీపించింది.
"ఎవర్నువ్వు?" అన్నాడు శేషగిరి . కానీ అతడామెను గుర్తుపట్టాడు.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను పెళ్ళి చేసుకో --" అన్నది లీల.
శేషగిరితో పాటు - అక్కడున్న పెద్ద మనుషులందరూ తెల్లబోయారు. ఒక్క క్షణం తర్వాత శేషగిరి తేరుకుని - "నాకు వివాహమయిందని తెలుసా ?" అన్నాడు.
"తెలుసు. నాకు నీ భార్యతో సమాన స్థాయి అవసరం లేదు. నెలకింతని జీతం ఇస్తే చాలు. భార్య కంటే నమ్మకంగా పడి వుంటాను ...."
"సమాజంలో నా హోదా ఏమిటో నీకు తెలుసా? భార్యగా నేను బజారు స్త్రీని స్వీకరించని తెలుసా ?"
"నేను బజారు స్త్రీని కాదు. కానీ ఇప్పుడు నీవంటి వాడి ఆశ్రయం లభించకపోతే నా బ్రతుకు బజారు పాలయ్యేలా వుంది -" అన్నది లీల.
"నిన్నిక్కడకు ఎవరు పంపారు?" అన్నాడు శేషగిరి.
"నీ పిలుపు అందుకునే వచ్చాను...." అన్నది లీల.
"నేను పిలిచనా? అబద్దం ....." అన్నాడు శేషగిరి.
లీల వివరించింది. రోజూ తనను కలుసుకునే యువతికి బదులు ఓ కొత్త యువతి ఆమె వద్దకు వచ్చింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేక తనను పంపించినదంది. ఆమె శేషగిరి పేరు చెప్పింది. పదిమంది మగవాళ్ళ మధ్య వుండగా అతణ్ణి ఓ అందమైన ఆడది ప్రేమిస్తున్నదని అంటే కాదనలేడని అంది. ఎందుకంటె ఏ మగవాడి కైనా అది గర్వకారణమట. శేషగిరి చిన్న వయసులోనే పుర ప్రముఖుడయ్యాడు. అతడు సమర్ధుడు. అతడి అండ నీవంటి ఆడదానికి అవసరం.
ఉన్నట్లుండి శేషగిరి -- "నువ్వు....నువ్వు .....కామిని పిశాచివి కదూ?" అన్నాడు అప్పుడే ఆమెను గుర్తించినట్లు.
కామినీ పిశాచి అన్న పేరు వింటూ ఉలిక్కి పడ్డారు.
అప్పుడు శేషగిరి బల్ల మీద వున్న పేపరు అందరికీ చూపించాడు. అందులో ఆమె ఫోటో వున్నది. వివరాలున్నవి. అంతా అవి చదివారు.
"ఎక్కడ చూశానా అని ఇందాకట్నుంచి కొట్టుకు చస్తున్నాను. ఇప్పటికి ముగ్గుర్ని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు నీకన్ను నామీద పడిందా?" అన్నాడు శేషగిరి.
13
"మిష్టర్ చలం! నా మాట విని త్వరగా ఇక్కడ్నించి లీలను తీసుకుని పారిపో --" అన్నాడు వెంకన్న.
"సార్ ....శేషగిరి ఎలా మరణించాడు ?" అన్నాడు చలం కంగారుగా.
"ఆ వివరాలేమీ నన్నడగవద్దు. తను తీసుకున్న గోతిలో తానె పడడమంటారే -- శేషగిరి విషయంలో అదే జరిగింది --" అన్నాడు వెంకన్న.
"మీ మేలు మరువలేను సార్!" అన్నాడు చలం.
"నా మేలు సంగతి తరువాత ....నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడ్నించి లీలను తప్పించాలి. ప్రయాణంలో కూడా ఆమె ముఖం బయటపడనివ్వకు. నీ అదృష్టం ఏమిటంటే -- లీలకు కామినీ పిశాచిగా ప్రచారం లభించింది తప్పితే -- ఆమె ఎక్కడిది- గత చరిత్ర ఏమిటి - అన్న వివరాలు బయటకు రాలేదు. మున్ముందు అవీ బయటకు రావచ్చు. అదీ నీకూ, నీ భార్యకూ కూడా చాలా ప్రమాదం. తక్షణం వెళ్ళు!" అన్నాడు వెంకన్న.
* * * *
"లీలా!" అన్నాడు చలం.
లీల తలెత్తి చూసింది. ఆమె కళ్ళు ఉబ్బి వున్నాయి.
"ఏడుస్తున్నావా ?" అన్నాడు చలం.
"నీ గురించి నాకు తెలుసు. నువ్వు హత్యలు చేయలేవు. నేను నిజంగా కామినీ పిశాచిని. ఈ ఊరిలో ఎందరికో సింహ స్వప్నం అయిన శేషగిరి కూడా నా ప్రేమకు లోనుకాగానే చచ్చిపోయాడు....." అన్నది లీల.
"లీలా! నేను సామాన్యుడినే కావచ్చు. కానీ నా ప్రేమ సామాన్యమైనది కాదు. నువ్వు నన్ను కాదంటే - నువ్వు కోరుకున్న వారెవ్వరూ బ్రతకకూడదని నేను కోరుకున్నాను. నా ప్రేమ బలం వల్ల కాబోలు -- అలాగే జరిగింది. అదే ప్రేమ బలంతో నిన్ను పిలుస్తున్నాను. మనం మళ్ళీ మన ఊరు వెళ్ళిపోదాం -- రాననకు--- అన్నాడు చలం.
"నేను రాను -- నేను వస్తే నువ్వు కూడా చచ్చిపోతావు ...." అంది లీల.
"నేను నిన్ను ప్రేమించాను. మనం కలిసి రెండేళ్ళు జీవించాం. అయినా నేను చచ్చిపోలేదు. ఇక్కడ నీవు ప్రేమించాననుకున్న ప్రతివాడూ చనిపోయాడు. ఎందుకంటె ఇది తప్పు. తప్పును దేవుడు క్షమించడు. నువ్వు వరుసగా తప్పులు చేయాలనుకుంటే నీతో పాటు తప్పులు చేయాలనుకున్న ప్రతి ఒక్కరినీ దేవుడు శిక్షించాడు. నీకూ శిక్షలు పడాల్సిందే -- కానీ నాప్రేమ బలంతో నిన్ను నేను రక్షించుకున్నాను..."
"కానీ ఇప్పుడు నేను నిజంగా కామినీ పిశాచిని ...." అంది లీల.
"నాకా భయం లేదు...." అంటూ చేతులు చాపాడు చలం.
లీల అతడి ముందుకు వచ్చి అతడిలో కరిగిపోయింది.
* * * *
"బాస్ -- మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా వుంది --" అన్నది రాజమ్మ.
"ఎందుకని ?" అన్నాడు వెంకన్న.
"మీరొక నిండు ప్రాణాన్ని తీసేశారు...." అంది రాజమ్మ.
"శేషగిరి వంటి నీచుడు బ్రతికి ఉండడానికి వీల్లేదు వాడి చావు దేశానికే శుభదాయకం ---" అన్నాడు వెంకన్న.
"వాడి గురించి ఎన్నో వివరాలు నాకు తెలుసు. వాడి జీవితాన్ని అంతం చేస్తే తప్ప -- వాడి ఆగడాలకు అంతం లేదని నాకు తెలుసు. ఎన్నాళ్ళనుంచో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను కానీ ...." వెంకన్న ముఖం దిగులుగా అయిపొయింది.
"దిగులు పడకండి బాస్! వాడు సృష్టించిన కామినీ పిశాచితోనే వాడిని అంతం చేశారు. అయితే వాడికి విషప్రయోగం ఎలా చేశారు బాస్!" అంది రాజమ్మ.
"నాకా అవకాశం రాలేదు. లీల కలుసుకున్నాక ఆ మర్నాడు వాడి చావుకు ముహూర్తం పెట్టాలనుకున్నాను. కానీ ఈలోగానే వాడు చనిపోయాడు --" అన్నాడు వెంకన్న.
"అంటే?"
"ఆరోజు సమావేశంలో ఉన్న పెద్ద మనుషుల్లో ఎవరో అవకాశం తీసుకుని తమ పగ తీర్చుకున్నారు శేషగిరి మీద! లీల ఈ విధంగా చాలామందికి ఉపయోగపడే అవకాశమున్నదని స్పురించగానే నేనామెను అర్జంటుగా ఊర్నించి పంపించేశాను ...." అన్నాడు వెంకన్న దిగులుగా .
-----: అయిపొయింది :----
