"నమస్కారమండీ - నా పేరు నాగరాజారావు. చాలామంది నన్ను సింపుల్ గా మిష్టర్ నాగూ అని పిలుస్తూంటారు-" అన్నాడు తను.
ఏజంటు సుబ్బారావు అతనివంక ప్రశ్నార్ధకంగా చూసి-"ఏం కావాలో చెప్పండి-" అన్నాడు.
నాగు రిస్టువాచీవంక చూసుకుని-"ఇప్పుడు పావుతక్కువ రెండయింది కదా-పబ్లిక్ ట్రాన్స్ యాక్షన్సన్నీ మరో పావుగంటలో ముగుస్తాయనుకుంటాను-" అన్నాడు.
"అవును-అన్ని బ్యాంకుల్లాగే మా బ్యాంకు కూడా పబ్లిక్ ట్రాన్స్ యాక్షన్సన్నీ రెండు గంటలకు క్లోజ్ చేసేస్తుంది-" అన్నాడు సుబ్బారావు.
"దట్స్ వెరీగుడ్!" అన్నాడు నాగు.
"ఎస్ మిష్టర్ నాగూ-మీకేదైనా సాయం కావాలన్నా-అంతే టయముంది-" అన్నాడు సుబ్బారావు విసుగ్గా.
"అలాగంటే ఎలాగండీ-నాకు మీతో పని వున్నది రెండుగంటలయిన తర్వాతనే-" అన్నాడు మిష్టర్ నాగు తాపీగా.
"మీ మాటలు నాకర్ధం కావడం లేదు-"
"మీకు వాసుదేవరావు తెలుసా?" నాగు నెమ్మదిగా అడిగాడు.
"ఎవడా వాసుదేవరావు?"
"అన్ని విధాలా మీ కల్లుడిగా వుండడానికి తగిన వాడని మీరనుకున్నవాడు. అతడు కోరిన కట్నం మీరివ్వలేక వదులుకున్నారు. ఆ వాసుదేవరావు...."
సుబ్బారావు ముఖంలో చిరాకు మాయమయింది-"వాసుదేవరావు మీకెలా తెలుసు?" అన్నాడు.
"మీ కారణంగానే అతడు నాకు తెలుసు. అతన్ని పెళ్ళికొప్పించగల శక్తి నాకుంది. మీ కభ్యంతరం లేని పక్షంలో నేనీ పెళ్ళి స్థిరపరుస్తాను...." అన్నాడు నాగు.
"నిజంగా-" అన్నాడాశ్చర్యంగా సుబ్బారావు. ఆయన మనసులో మళ్ళీ కొత్త ఆశలు చిగిర్చాయి. వాసుదేవరావు సుబ్బారావుగారి కన్నివిధాలా వచ్చాడు. తనకూతురికిచ్చి చేయాలని చాలా మనసుపడినా-అడిగిన కట్నం ఇవ్వలేక-సంబంధం వదులుకున్నాడు.
"నిజంగానే-కానీ మీరు నాకో చిన్న సాయం చేయాలి-"
"ఏమిటది?" అన్నాడు సుబ్బారావు అనుమానంగా.
"నేను కొత్తగా చిన్న పరిశ్రమ ప్రారంభించబోతున్నాను. అందుకుగానూ అయిదు లక్షలు అప్పుకావాలి. ఆ లోన్ శాంక్షన్ కావడానికి మీ సహకారం కావాలి-"
"ఏ లోన్ కయినా సహకార ముంటుంది. ఎటొచ్చీ మీ వైపునుంచి కాగితాలు సరిగ్గా వుండాలి. అన్నీ సక్రమంగా వుంటే నావైపునుంచి ఇబ్బందేమీ వుండదు" అన్నాడు సుబ్బారావు.
"అన్నీ సక్రమంగా వుంటే-మీ అమ్మాయి పెళ్ళి బాధ్యత నేను తీసుకోవడమెందుకండీ?" అన్నాడు నాగువేళాకోళంగా.
సుబ్బారావు కూడా వేళాకోళంగా నవ్వి-"సక్రమంకాని పనులు చేసేపక్షంలో - మా అమ్మాయి పెళ్ళికి మీలాంటివాళ్ళు సాయపడ్డమెందుకూ-నాకు నేనే చూసుకోగలను-" అని-"ఇదే మీరు వచ్చిన పనయితే ఇంక మీరు వెళ్ళవచ్చు-" అన్నాడు.
నాగు నవ్వి-"వచ్చిన పని పూర్తిచేసుకోకుండా వెళ్ళడం ఈ నాగుకు అలవాటు లేదు-" అన్నాడు.
"ఎదుటి మనుషుల్ని బట్టి అప్పుడప్పుడు కొత్త అలవాట్లు చేసుకోవాలి. చాలా శ్రమపడి వచ్చారు. వెళ్ళిరండి-" అన్నాడు సుబ్బారావు.
"వెళ్ళిరండి అన్నారు. అదే శుభసూచకం-మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను-" అంటూ లేచాడు నాగు.
3
"నా పేరు మహాలక్ష్మి-సులోచనగారు మీరేననుకుంటాను-" అన్నదామె.
"అవును-నేనెలా తెలుసు మీకు?" సులోచన ఆశ్చర్యంగా అడిగింది.
"ఆడపిల్ల తల్లిని-తెలుసుకోక తప్పుతుందా?" అంది మహాలక్ష్మి సులోచన తనకేమీ అర్ధంకానట్లు ముఖం పెట్టింది. మహాలక్ష్మి అది గ్రహించినట్లుగా-" సురేంద్ర మీ అబ్బాయే కదూ?" అన్నది.
"అవును-వాడెలా తెలుసు నీకు?" అన్నది సులోచన మళ్ళీ ఆశ్చర్యపడుతూ.
"ఆడపిల్ల తల్లిని - తెలుసుకోక తప్పుతుందా?" అంది మహాలక్ష్మి.
"చెప్పేదేదో సూటిగా చెప్పండి. మీ మాటలు నా కర్ధం కావడంలేదు-"
"చెప్పడానికేముందమ్మా - మీ అబ్బాయి మా అమ్మాయి వెంటపడ్డాడు. కుర్రాడు ఎర్రగా బుర్రగా వున్న మూలాన అమ్మాయి అతని మోజులో పడింది. వీళ్ళిద్దరూ నాలుగు రోజుల క్రితం పార్కులో నా కళ్ళ పడ్డారు. నిలదీసి అడిగేసరికి ప్రేమ అన్నారు. బాగానే వుంది- పెద్దవాళ్ళకు తెలియకుండా ఇలా తిరగడం బాగోలేదని మందలించాను. ఈ నాలుగు రోజులూ అమ్మాయతన్ని తప్పించుకు తిరిగింది. ఈ రోజుతను తిన్నగా మా యింటికి వచ్చేశాడు-" అని ఆగింది మహాలక్ష్మి.
"మీరు చెప్పేది మా అబ్బాయి గురించేనా?" అనుమానంగా అడిగింది సులోచన.
"అతడి పేరు సురేంద్ర. విజయా బ్యాంకులో పని చేస్తున్నాడు. అడిగితే మీ అడ్రసిచ్చాడు-" అంది మహాలక్ష్మి.
"ఇప్పుడు వాడక్కడ ఏం చేస్తున్నాడు?" అంది సులోచన కోపంగా.
"ప్రేమించడానికి భయంలేదు కానీ ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి భయమట. ప్రస్తుతం మా యింట్లో మా అమ్మాయితో కబుర్లు చెబుతున్నాడు. కాపలాగా మా పిల్లలున్నారు. ఈ గొప్ప దృశ్యం మీకు చూపించడానికి నేను మీ ఇంటికి పరుగున వచ్చాను-"
సులోచన ఆవేశంగా - "పదండి - మీ యింటికి వెళదాం-" అంది. మహాలక్ష్మి దగ్గర్లో వున్న రిక్షాను పిలుస్తూంటే-సులోచన ఇంటికి తాళంవేసింది.
4
"ఎక్స్ క్యూజ్ మీ-" అంది ఓ తీయని కంఠం, ఉద్రేకంగా ఇంగ్లీషు పాఠం చెబుతున్న కుర్ర లెక్చరర్ చటుక్కున గుమ్మంవైపు చూసి ఒక్క నిమిషం తడబడి- "ఎస్-ప్లీజ్!" అన్నాడు.
"మీ క్లాసులో వున్న దేవీబాల అనే అమ్మాయితో మాట్లాడాలి. చాల అర్జంటు-" అంది గుమ్మం దగ్గర నిలబడ్డ తీయని కంఠంలో కలిగిన అప్సరలాంటి అమ్మాయి.
లెక్చరర్ అనుమతి సూచనగా దేవీ బాల వంక చూశాడు. దేవీబాల క్లాసులోంచి లేచి బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి వెళ్ళిపోతూంటే లెక్చరర్ ఓసారి నిట్టూర్చి మళ్ళీ పాఠంలో పడిపోయాడు.
"మీరెవరో తెలుసుకోవచ్చా?" అంది దేవీబాల ఆశ్చర్యంగా.
"నన్ను మీరెరుగరులెండి. కానీ మా అన్నయ్య మీకు తెలుసుననుకుంటాను-" అందా అప్సరస.
"మీ అన్నయ్యెవరో చెబితే...." అంది దేవీబాల ఆలోచిస్తూ.
"వాసుదేవరావు-" అంది అప్సరస.
"వాసుదేవరావంటే..." ఇంకా ఏదో అనబోయే లోగానే దేవీబాలకతడెవరో గుర్తుకొచ్చేసింది. అతడు తనకు కావలసిన వరుడు. కట్నం దగ్గర బేరం కుదరక సంబంధం చెడిపోయింది.
"మీకు తెలిసిన అతనే - అప్పట్లో కట్నం దగ్గర బేరం కుదరలేదు. కానీ ఇప్పుడు కథ కొత్త దారి తొక్కింది. అందువల్ల ఈ పెళ్ళి వ్యవహారంలోంచి కట్నం సమస్య తప్పుకుంది-" అంది అప్సరస.
"నాకేమీ అర్ధంకావడంలేదు. మీరు నన్నెందుకు పిలిచారో - మీ రిప్పుడేం చెప్పదల్చుకున్నారో కాస్త వివరంగా చెప్పండి-" అంది దేవీబాల.
"చెబుతాను కానీ నేనడిగిందానికి జవాబు చెప్పండి. చూడ్డానికి నేనెలాగున్నాను?"
"అప్సరసలాగున్నారు-" అంది దేవీబాల చటుక్కున.
"నా పేరూ అదేననుకోండి. ఎటొచ్చీ ఒక అక్షరం తక్కువ. అప్సర నా పేరు-" అంటూ నవ్విందామె "ఆ కారణంగానే ఒకబ్బాయి నా వెంటపడ్డాడు-"
