మృత్యు కళ!
వసుంధర
:హత్యలదేముందండీ , ఏమీ ప్రమాదం లేదు" అన్నాడు రాము చాలా మాములుగా.
వెంకట్రావు రాము వంక ఆశ్చర్యంగా చూసి "నా సమస్య అంతా హత్యల్లోనే వుంది. ప్రమాదం లేకుండా హత్యలు జరిగితే అంతకంటే కావలసినది ఏముంది?" అన్నాడు.
"మీక్కావలసింది హత్యలు, నాక్కావలసింది డబ్బు. మీరు డబ్బుకు వెనుకాడని పక్షంలో యెన్ని హత్యలయినా చేసి పెడతాను. మీకూ ప్రమాదముండదు. నాకూ ప్రమాదముండదు" అన్నాడు రాము.
"ఎంతకావాలి?"
"ఎంతో అక్కర్లేదు -- హత్య కోక లక్ష."
"కొంచెం ఎక్కువే" అన్నాడు వెంకట్రావు.
"ఎక్కువ కాదనుకుంటేనే ఈపని అప్పగించండి"
వెంకట్రావు సాలోచనగా తలపంకించాడు. తర్వాత నెమ్మదిగా "సుదర్శనరావు తెలుసా నీకు?" అనడిగాడు.
"తెలియదు " అన్నాడు రాము.
"సరస్వతీ విలాస్ కాఫీ హోటల్ ప్రోప్రయిటర్."
"ఓ ఆయనా, నాకు బాగా తెలుసు ...." అన్నాడు రాము.
"ఎలా?"
"వాళ్ళబ్బాయికీ నాకూ క్లబ్బు లో పరిచయం. వాళ్ళ అమ్మాయికీ నాకూ రోడ్డు మీద పరిచయం. మొదటి పరిచయం అతనికి సరదా, రెండో పరిచయం నాకు సరదా"
"నీతో పరిచయం సుదర్శనరావు కొడుక్కు సరదా గా ఉంటుందా?" ఎందుకు?" అన్నాడు వెంకట్రావు.
"పేకాటలో ఎప్పుడూ నేనే ఓడిపోతుంటాను. నా మూలంగా అతడికిప్పటి వరకూ అయిదారు వేల వరకూ వచ్చింది "అన్నాడు రాము.
"అయిదారు వేలే. అంత డబ్బెక్కడిది నీకు?'
"ఇప్పటికీ పాతికవేలు అప్పుంది నాకు. మీరిచ్చే లక్ష రూపాయల ఆశతో నేను చాలా జోరుగా డబ్బు ఖర్చు పెడుతున్నాను"అన్నాడు రాము.
"పేకాట మంచి అలవాటు కాదు. ఎన్ని లక్షలు సంపాదించినా పోతాయి."
"పేకాట నా అలవాటు కాదు. సుదర్శనరావు కొడుకు చెంగల్రావుతో పరిచయం కోసమే పెకాడుతున్నాన్నేను" అన్నాడు రాము.
"చెంగల్రావు తో పరిచయమెందుకు ?'
"చెంగల్రావు చెల్లెలు స్వాతిని నేను ప్రేమిస్తున్నాను."
వెంకట్రావు నవ్వి , "మిస్టర్ రామూ, నీలో చాలా ఆశలున్నాయి. స్వాతీ అందమైనదే కాక చురుకయినది కూడా. నీలాంటి వాడినామే పెళ్ళాడాదు" అన్నాడు.
"సుదర్శనరావుని మీరు చంపలేక పోతున్నారు. ఆ పని నాకు అప్పజేప్పాలనుకుంటున్నారు. అంటే మీవల్ల కానిపని నావల్లనౌతుందనే కదా మీరనుకుంటున్నారు! స్వాతిని పెళ్ళి చేసుకోవడం మీకు అసాధ్యమేమో గాని నాకు కాదు" అన్నాడు రాము.
"సుదర్శనరావు ఇంటికి చాలా రక్షణ సదుపాయాలు వున్నాయి. గేటు దగ్గర గూర్ఖా వుంటాడు. వాడికి మాత్రమే తెలిసిన స్విచ్ ఒకటి గేటు దగ్గర ఉంది. వాడి ప్రాణం తీసినా దాని సంగతి చెప్పడు వాడు. గూర్ఖా అనుమతి లేకుండా ఎవరింట్లో అడుగు పెట్టినా పెద్ద అలారం మోగుతుంది. ఎవరయినా ఆ ఇంట్లో అడుగు పెట్టేముందు గూర్ఖాకు చెప్పాలి. అప్పుడు వాడు అక్కడున్న స్వీచ్ సపరేట్ చేస్తాడు. అదెలా ఆపరేట్ చేస్తాడో ఆ పరమాత్మునికే తెలియాలి. వాడా స్విచ్ ఆపరేట్ చేయక పొతే మాత్రం అలారం మ్రోగితీర్తుంది. ఆ విధంగా ఆదిలోనే హంసపాదు" అన్నాడు వెంకట్రావు.
'అయితే?" అన్నాడు రాము నిర్లక్ష్యంగా.
"ఇలా అడుగడుగునా రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం వల్లనే సుదర్శనరావు ని ఎవ్వరూ ఏమీ చేయలేక పోతున్నారు" అన్నాడు వెంకట్రావు.
'అయినా సుదర్శనరావును చంపడానికి యింటికి వెళ్లడమెందుకు? ఏ నడి రోడ్డు మీదనో చంపేస్తే వదిలి పోలేదు ?" అన్నాడు రాము.
"అది ప్రమాదంలో కూడిన పని ."
"అందరికీ కావచ్చు. కానీ నాకుమాత్రం కాదు."'
వెంకట్రావు ఆశ్చర్యంగా రాము వంక చూసి "సరే మిస్టర్ రాము ! నీకు లక్ష రూపాయలిస్తాను. ఎల్లుండి కల్లా పని ముగించుకుని రావాలి. అయితే పని పూర్తయ్యాక నీకు డబ్బు ముడుతుంది. సరేనా?" అన్నాడు.
'అలాగే -- యెల్లుండికి లక్ష రూపాయలు సిద్దం చేసి ఉంచండి "అని అక్కడ్నించి కదిలి వెళ్ళాడు రాము.
2
"మిస్టర్ వెంకట్రావ్ - చెప్పిన పని చేశావా?" అన్నాడు గోవిందరావు.
"పనింకా కాలేదు కానీ యేర్పాట్లు జరుగుతున్నాయండి. ఎల్లుండి కల్లా సుదర్శనరావు పని పూర్తవుతుంది. అయితే మొదట్లో అనుకున్నట్లు కాక ఖర్చు రెండు లక్షలు అయ్యేలా గుంది."
"డబ్బు కేముంది? అలాగేకానీ..... కానీ ఎల్లుండి కల్లా...."
'అందులో మీకేమీ సందేహం లేదండి" అన్నాడు వెంకట్రావు.
గోవిందరావు సంతృప్తిగా తలాడించాడు.
గోవిందరావు ఆ ఊళ్ళో పేరు మోసిన ఇనుప వ్యాపారస్తుడు. ఇనుప వస్తువుల తయారీకి సంబంధించి ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా ఉందాయనకు. ఇది అయన న్యాయంగా సంపాదిస్తున్న డబ్బు.
ఆవూళ్ళోనే నడపబడుతున్న "సెక్స్ అండ్ ఒన్లీ సెక్స్ " నైట్ క్లబ్ లో ఆయన ముఖ్య భాగస్తుడన్న విషయం చాలామందికి తెలియదు. ఆ నైట్ క్లబ్ చూడ్డానికి సామాన్యంగానే ఉన్నప్పటికీ -- అందులో దొరకని సదుపాయాలూ లేవు. అయితే అక్కడి సదుపాయాలూ అప్పటికప్పుడు లభించవు. ముందుగా ఏజెంట్ల ద్వారా అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళిన వాళ్ళకు అది మామూలు బార్స్ లాగే వుంటుంది. ఆ క్లబ్ లో చాలా రహస్యపు స్థలాలున్నాయని అంతా అనుకుంటుంటారు.
సుదర్శనరావు గోవిందరావు సాయంతో పైకి వచ్చిన సామాన్యుడు. అయన ఇచ్చిన పెట్టుబడి డబ్బులతొటే సరస్వతీ విలాస్ కాఫీ హోటల్ చిన్న యెత్తున ప్రారంభమై ఇప్పటికి పెద్ద హోటలయ్యంది. ఉళ్ళో ని మంచి హోటళ్ళ లో అది ఒకటైనప్పటికీ సుదర్శనరావు అసలు ఆదాయం వేరే వుంది. అదే "సెక్స్ ఆడ్ ఓన్లీ సెక్స్ నైట్ క్లబ్" ద్వారా వచ్చేది. అక్లబ్ కు అతను యజమాని, ఆ యాజమాన్యం పేరుకు మాత్రమె నని అసలు యజమాని గోవిందరావనీ చాలా తక్కువమందికి తెలిసిన నిజం.
సుదర్శనరావు గోవిందరావుకు నమ్మకస్తుడైన భాగస్తుడే. ఎప్పుడూ అయన గోవిందరావును మోసం చేయడానికి ప్రయత్నించలేదు. అందుక్కారణం సుదర్శనరావు విశ్వాసం కాదు. గోవిందరావు అప్రస్తుతత.
అయితే ఇటీవలే చిన్న ఇబ్బంది వచ్చి పడింది. గోవిందరావు కొడుకు ప్రభాకర్ , సుదర్శనరావు కూతురు స్వాతిని ప్రేమించాడు. కానీ స్వాతి ప్రభాకర్ అంటే ఇష్టపడలేదు. స్వాతిని పెళ్ళి చేసుకోకపోతే బ్రతుకలేనని ప్రభాకర్ అన్నాడు. ఈ విషయంలో గోవిందరావు కలగజేసుకుని సుదర్శనరావు పై ఒత్తిడి తీసుకు వచ్చాడు.
'అమ్మాయికి యిష్టం లేదుట...." అన్నాడు సుదర్శనరావు.
"చిన్నపిల్ల. నువ్వు నచ్చచేపితే వింటుంది. నయాన్నో భయన్నో చెప్పి ఒప్పించు" అన్నాడు గోవిందరావు.
"నా బ్రతుకంతా నా పిల్లల కోసం. వాళ్ళ మనసు నొప్పించడం నావల్ల కాదు."
"వాటం చూస్తె అసలు నీకే ఈ పెళ్ళి యిష్టం లేనట్లుంది."
సుదర్శనరావు భయపడలేదు. కానీ విషయాన్ని వదిలి పెట్టలేదు. "మీరు నన్నేమయినా అనండి. పడతాను. నన్ను శిక్షించండి - అనుభవిస్తాను. శాసించండి, అమలు చేస్తాను. కానీ నా పిల్లల్ని శాసించకండి. శాసించమని నాకు చెప్పకండి" అన్నాడు.
"ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు -- తెలుసా?" అని బెదిరించాడు గోవిందరావు.
'భయం లేదు. కానీ నాకు నేనై ఏ పరిస్థితుల్లోనూ అన్యాయం తలపెట్టను. ఇప్పటి కింత వాడ్నయుండీ మీకు నమ్మకంగా పనులు చేసి పెడుతున్నాను. అది మీరూ గుర్తుంచుకోవాలి. మీరు నాకు అన్యాయం తలపెడితే మాత్రం నేను ఎదురు తిరుగుతాను. ఎదురు తిరిగితే బహుశా నేను మీకంటే గోప్పవాడ్ననుకుంటాను" అన్నాడు సుదర్శనరావు.
'సరే - వెళ్ళు. అలోచించి మళ్ళీ కబురు చేస్తాను" అన్నాడు గోవిందరావు. సుదర్శనరావు వెళ్ళిపోయాడు. గోవిందరావు అలోచించి కబురు చేశాడు. సుదర్శనరావు కి కాదు, వెంకట్రావు కి.
సుదర్శనరావు, వెంకట్రావు రెండు భుజాలాయనకు. అయితే అందులో ఎవరు కుడి భుజమో, ఎవరు ఎడమ భుజమో చెప్పడం కష్టం.
సుదర్శనరావు కు గోవిందరావు లోని రసికుడు, హంతకుడు తెలియదు. వ్యాపారి మాత్రమే తెలుసును. వెంకట్రావు కు గోవిందరావు రసికత, రక్తదాహం బాగా తెలుసు.
