"మిస్టర్ వీర్రాజు ---ఆ మనిషి యిప్పుడెక్కడున్నాడు?"
"ఊరి చివర ఒక బంగళాలో."
"నేనూ వస్తాను నీతో. ఆ మనిషితో మాట్లాడుతాను. పద!"
"నెగిటివ్స్ కూడా తీసుకురండి."
"అవసరం లేదు. నేనా మనిషితో మాట్లాడి నిన్ను పంపించేస్తాను. వ్యవహారం మేమిద్దరం చూసుకుంటాం" అన్నాడు జగన్మోహన్.
"నాతో వచ్చే ధైర్య ముంటే రండి...." అన్నాడు రవి.
జగన్మోహన్ తమాషాగా నవ్వి "నన్నీమాటానగలిగిన నీధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నిన్ను చూస్తె నాకు ముచ్చట గా కూడా వుంది. నీలాంటి వాడి వల్ల నాకూ చాలా ఉపయోగాలుంటాయి" అన్నాడు.
రవి ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ బయల్దేరి బయటకు వచ్చారు. ఇంటి ముందున్న ఎర్రకారును చూసి -- "ఇలాంటి కారు నేనెక్కడా చూడలేదు!" అన్నాడు రవి.
"ఎక్కడా చూడని వస్తువులు ఎవ్వరూ అనుభవించని అనుభవాలూ సేకరించడం నా హాబీ" అన్నాడు జగన్మోహన్.
ఇద్దరూ కార్లో కూర్చున్నారు. కారు తూనీగలా దూసుకు పోతోంది. ఊరి చివరకు వచ్చ్జేక ఒక బంగళా ముందు కారాపమని చెప్పాడు రవి.
"ఈదారీ, బంగళా కూడా కొత్తవి నాకు" అన్నాడు జగన్మోహన్.
"చాలా కొత్త కొత్త విశేషాలు చూస్తారు మీరు నా దగ్గర"అన్నాడు రవి.
జగన్మోహన్ నవ్వి -- కారు దిగాడు. రవి కూడా కారు దిగి ముందుకు దారి తీశాడు. జగన్మోహన్ అతన్ననుసరించాడు.
ఇద్దరూ బంగళా లో ప్రవేశించారు. లోపలకు వెళ్ళగానే హలోకటుంది. హల్లో సోఫాలు న్నాయి.
"కూర్చోండి. ఆ మనిషిని పిలుస్తాను" అన్నాడు రవి.
జగన్మోహన్ కూర్చున్నాడు. అతని పక్కనే రవి కూడా కూర్చున్నాడు.
"మరి -- ఆ మనిషిని పిలుస్తానన్నావ్ ?' అన్నాడు జగన్మోహన్.
"సోఫా కున్న బటన్ నొక్కితే లోపల బెల్ మ్రోగుతుంది" అన్నాడు రవి. జగన్మోహన్ బటన్ చూడ్డానికి వెనక్కు తిరిగాడు. అప్పుడే అయన భుజం మీద ఏదో గుచ్చుకుంది.
"ఏమయింది?" అన్నాడు జగన్మోహన్ . రవి జవాబు చెప్పలేదు. సరిగా రెండు నిముషాల్లో జగన్మోహన్ కి పూర్తిగా స్పృహ తప్పింది.
రవి అక్కణ్ణించి బయటకు వచ్చి యెర్ర కార్లో కూర్చున్నాడు. కారు కొత్తదారి పట్టింది.
8
"హలో సార్. గుర్తున్నానా?' అన్నాడు రవి.
జగన్మోహన్ కోపంగా రవి వంక చూసి - "నువ్వు నన్ను మోసం చేశావ్" అన్నాడు.
"ఇందులో మోసమేమీ లేదు. నేగేటివ్స్ ట్వంటీ టూ నాక్కావాలి. అవి ఇచ్చేస్తే నాదారిన నేను వెళ్ళిపోతాను."
"ఇవ్వకపోతే?"
"మీ ఎర్ర కారును మీరింక చూడలేరు."
'ఆ" జగన్మోహన్ నోరు తెరిచాడు. ఎర్ర కారు అతని ప్రాణాల కంటే విలువైనది. ఆ రోజు స్పృహ రాగానే తను మొట్టమొదటి దాని కోసమే చూశాడు. అది కనపడక పోగా చాలా కలవరపడ్డాడు. అయితే పోలీస్ రిపోర్టు మాత్రమివ్వలేదు. ఆ కారును పోలీసుల దృష్టిలోకి తీసుకెళ్ళడం అయన కిష్టం లేదు. అది తనకు ప్రాణప్రదమైన కారు మాత్రమేకాక -- ఆ కారులో తన ప్రాణాలూ ఉన్నాయి. "ఈదేశం మొత్తం మీద అలాంటి కారోక్కటే ఉంది. ఎక్కడున్నా కనుక్కోగలను" అన్నాడు జగన్మోహన్ తేరుకున్నాక.
"కనుక్కోవడానికి కారుండాలి కదా" ప్రస్తుతం ఎవ్వరూ కనుక్కోలేని చోట ఉంది. నాపని జరక్కపోతే ఆ కారు నాశనమై పోతోంది" అన్నాడు రవి తాపీగా.
"నీ పని జరిగితే నా కారు తిరిగి వస్తుందని నమ్మక మేమిటి?"
"నమ్మకం లేనిదే మన వృత్తిలో నెగ్గుకు రావడం కష్టం. ఉదాహరణకు మీ కారు సంగతీ తీస్కోండి. దాని గురించి నాకన్ని వివరాలూ తెలుసు. ఈ నేగేటివ్స్ కంటే ఆ కారు మీకు చాలా ముఖ్యమన్నది మీరు దాచినా దాగని నిజమని నాకు తెలుసు.
ఆ కారు విషయంలోనే కాదు, ఈ ఊళ్ళో చాలా మందికి సంబంధించిన చాలా విషయాలు తెలుసు నాకు. కానీ వాటి వల్ల ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు. అవసరం లేనిదే నేనెవరి జోలికి వెళ్ళను. మీ కారుకు రంగు, కొద్దిగా మోడల్ మారిస్తే నాకు చాలా ఉపయోగం. అయినా నేనది తీసుకొను. నెగటివ్స్ కోసం మాత్రం దాన్ని తీసుకున్నాను. అవి చేతికి రాగానే మీ కారు మీకు అప్పగిస్తాను."
జగన్మోహన్ కాసేపు అలోచించి ఏమనుకున్నాడో లోపలికి వెళ్ళాడు. పదిహేను నిముషాల అనంతరం ఓ చిన్న కవరుతో తిరిగి వచ్చాడు. అది రవికి అందించాడు. రవి అందుకుని చూశాడు. దాని మీద N-22 అని వుంది.
"కారు ఎప్పుడిస్తావ్?" అన్నాడు జగన్మోహన్.
"ఈ నేగేటివ్స్ సరైనదేనని తెలిసేక" అన్నాడు రవి.
"మిస్టర్ వీర్రాజు -- ఐ హోప్ యూ డోంట్ ప్లే విత్ మీ- " అన్నాడు జగన్మోహన్.
"మీదీ సేమ్ విత్ యూ...." అన్నాడు రవి.
9
"నాకేమీ ఆశ్చర్యంగా లేదు. రవి ఘటనాఘటన సమర్ధులు" అన్నాడు శంకరం ఆ నేగేటివ్స్ అందుకని పరీక్షించి చూసేక.
"అయితే ఈ పని అయినట్లేనా?" అంది నీరజ.
'ఆహా - అయినట్లే?' అంటూ ఆలోచనలో పడ్డాడు శంకరం.
"నాదో చిన్న అనుమానం . మీకు రవి గురించి బాగా తెలిసినట్లుంది. మీరే స్వయంగా కలుసుకోవడం లేదేం?' అంది నీరజ.
"రవి ఇప్పుడు ఎవరి మాటా వినడు. అతను సంఘంలో సామాన్య జీవనం చేయాలని నిశ్చయించుకున్నాడు. మిమ్మల్ని పెళ్ళి చేస్కోవాలనుకున్నాడు. మీకోసం ఈ పనులన్నీ చేస్తున్నాడు తప్పితే ఇంకొకరి కతని చేత ఈపనులు చేయించడం సాధ్యపడే విషయం కాదు" అన్నాడు శంకరం.
నీరజ నిట్టూర్చింది. తన్ను పెళ్ళి చేసుకుని సామాన్య జీవనం చేయాలనుకుంటున్నాడు రవి. తనకోసం తన పాత జీవితాన్ని వదిలి పెట్టేయదల్చుకున్నాడు. అతన్ని తను పాత జీవితంలోకే నడిపిస్తోంది. ఇంతవరకూ రెండు ప్రమాదాలు గడిచాయి. ఇక ముందు కూడా ఇలా గడిచి పోయి తన యొక్క, అతని యొక్క ఆశయం సిద్దిస్తుందా?
"మీ మూడో పని ఏమిటి?' అంది నీరజ భయపడుతూనే. తడవ తడవకూ ప్రమాదం పెరుగుతుందని ఏకు అనిపిస్తోంది.
"కైలసరావు తెలుసా మీకు?' అన్నాడు శంకరం.
తెలియదని నీరజ ఎలా చెప్పగలదు? ఒక దారుణ హంతకుడిగా అతన్ని పేపర్లభివర్ణించాయి. రెండు రోజుల క్రితమే అతను పోలీసులకు పట్టుబడ్డ వైనం కూడా పేపర్లో చదివింది. కైలసరావు మీద ఎన్నో కేసులున్నాయి. వాటిలో చాలావరకూ హత్యలూ, మానభంగానికి సంబంధించినవి. ఈమధ్యనే అతను ఒక హోటల్లో బస చేసిన ధనవంతుణ్ణి కిరాతకంగా హత్య చేశాడు. ఇప్పుడా కైలసరావును పోలీసుల దగ్గర్నుంచి విడిపించమనడు గదా ఈ శంకరం?
"తెలుసు అతను ప్రస్తుతం పోలీసు కస్టడీ లో ఉన్నాడు"అంది నీరజ.
"అవును" అని శంకరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. రెండు నిముషాల అనంతరం "మీకు శ్యామసుందర్ తెలుసా?" అన్నాడు మళ్ళీ.
"తెలియదు" అంది నీరజ.
"శ్యామసుందర్ లక్ష్మీ నారాయణ గారబ్బాయి."
"నాకు లక్ష్మీ నారాయణరావు గారు కూడా తెలియదు...." అంది నీరజ.
"అయన నీ ఊరే. ఈమధ్య కైలసరావుచే హోటల్లో హత్య చేయబడినది లక్ష్మీ నారాయణగారే...." అన్నాడు శంకరం.
నీరజ కింకా శంకరం చెప్పదల్చుకున్న దేమిటో తెలియలేదు. కానీ ఆమె గుండె జలదరించడం మొదలయింది.... "అయితే !" అంది.
"లక్ష్మీ నారాయణ గారు హత్య కాబడడానికి కారణం నేనే!" అన్నాడు శంకరం.
నీరజ త్రుళ్ళి పడి "అంటే?" అంది.
"కైలసరావు ను నేనే పురమాయించాను. లక్ష్మీ నారాయణ గారిని చంపమని అతనికి నేను చెప్పలేదు. ఒక వస్తువును సాధించామని అతనికి చెప్పాను. అది లక్ష్మీ నారాయణగారి వద్ద వుంది."
"ఏమిటా వస్తువు?"
"బంగారం తాయారు చేసే యంత్రం "అన్నాడు శంకరం.
నీరజకు అర్ధం కాలేదు. కానీ కుతూహలంగా వింటూ కూర్చుంది.
శంకరం చెప్పసాగాడు. "ఆదాట్టే పెద్దది కాదు. కానీ గంటలో యాభై బిస్కట్లు తయారవుతాయి. ఇత్తడి బిస్కట్లు లోపలకు తోస్తే బంగారం బిస్కట్లు మారతాయన్న మాట. అందులో పెద్ద తమాషా ఏమీ లేదు. బంగారం పూత వస్తుందన్న మాట వాటికి.
అయితే ఈ పూతలో ఒక తమాషా ఉంది. ఒక మాదిరి పరీక్ష లో అవి బంగారం కాదని నిర్ణయించడం కష్టమవుతుంది. ఈ పూత మూలంగా. అలాగని బంగారం కూడా ఎంతో పట్టదు. ఇది లక్ష్మీ నారాయణ గారి వద్ద ఉంది. కానీ ఎక్కడ వుందో తెలియదు. ఇది మాకు చాలా అవసరం. ఒకోసారి కస్టమర్స్ ని ఒకోసారి పోలీసులనూ మోసగించడాని కీ యంత్రం మాకు బాగా సహకరిస్తుంది.
లక్ష్మీనారాయణ గారు దాన్నేలాగో ఒక ఫారినర్ దగ్గర సంపాదించాడు. దాంతో అయన గిల్టు నగల వ్యాపారం చేస్తున్నాడు. కానీ ఇత్తడినీ బంగారంగా మార్చడం కూడా వుందని నా అనుమానం.కైల
అది సంపాదించడానికి సరావుని నియోగించాను. అతనికి రవి లాంటి బుర్ర లేదు. అతను దీనికి ప్రయత్నిస్తున్నాడని తెలియగానే లక్ష్మీ నారాయణ గారు తెలివిగా అతన్ని బుట్టలో వేశాడు. దాని మీద అతను రెచ్చిపోయి ఆయన్ను హత్య చేశాడు. అందులో కూడా అట్టే తెలివి ప్రదర్శించ కపోవడం వల్ల చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
ఉన్న సుగుణమల్లా ఏమిటంటే అతను తనవారి గురించిన రహస్యాలు ప్రాణం పోయినా చెప్పడు. నాకు సంబంధించిన వాళ్ళలో ముఖ్యుడు పోతున్నాను. నాకు బాధగానే వుంది. ఆ సంగతలా గుంటే అసలు పని జరుగలేదు గదా - ఇప్పుడా మిషన్ నాక్కావాలి. అది శ్యామసుందర్ దగ్గరుంది."
నీరజ క్షణం అలోచించి , "లక్ష్మీ నారాయణ గారు తెలివిగా కైలసరావు ని బుట్టలో వేశాడంటూన్నారు కదా -- "ఏవిధంగానో చెప్పగలరా?" అనడిగింది.
"ఫలానా చోటికి వస్తే ఆ యంత్రం అతనికిస్తాను అని అయన చెప్పాడు. వీళ్ళ పరిచయం కేవలం టెలిఫోన్ కాల్స్ వరకే పరిమితం. కైలసరావు , లక్ష్మీ నారాయణ గారి మాటలు నమ్మి అక్కడికి తన మనిషిని పంపాడు. వాడి నాయన తన మనుషుల చేత బంధింప చేసి నానా హింసలూ పెట్టాడు. ఈ విషయం పసిగట్టి జరిగిన మోసం గ్రహించడానికి కైలసరావుకు రెండు రోజులు పట్టింది. గ్రహించేక లక్ష్మీ నారాయణ గారు ఘోరాతి ఘోరంగా హత్య చేయబడ్డారు."
నీరజకు భయం వేసింది. "శ్యామసుందర్ ఎటువంటి మనిషి?" అంది.
"చాలా సౌమ్యంగా కనపడతాడు. కానీ సమయం వచ్చినపుడు పచ్చి రక్తం తాగడానికి జంకని మనిషని నా అనుమానం" అన్నాడు శంకరం.
నీరజ మాట్లాడలేదు.
"చాలా ప్రమాదకరమైన పని ఇది. నాకా యంత్రం కావాలి" అన్నాడు శంకరం.
