Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 20

 

    'అయితే సరే. రేపే ఈ ఫోటో పోలీస్టేషన్ నించి తస్కరిస్తాను." అన్నాడు రవి.
    నీరజ, రవి వంక ఆశ్చర్యంగా చూసి , "ఇది చాలా కష్టమైనా పని. బహుశా ఈ ప్రయత్నంలో నువ్వు పోలీసులకు పట్టుబడి పోవచ్చు. అయినా ఆ భయం నీ ముఖంలో కనబడడం లేదు. బజారుకు వెళ్ళి కూరగాయలు తెస్తానన్నంత సులభంగా మాట్లాడేశావ్" అంది.
    "రవి సంగతి నీకు తెలియదు నీరజా! నాకు కష్ట సాధ్యమైనదంటూ లేదు."
    'అయితే ఆ షాజహాన్ నీ అతని ముఠానీ ఎందుకు సర్వనాశనం చేయవు."
    "కృతజ్ఞత అంతే!" అన్నాడు రవి.

                                    5

    రవినిప్పుడు ఎరిగున్న వాళ్ళెవ్వరూ గుర్తు పట్టలేరు. అంతలా మారిపోయింది రూపం. అతను సుమారు పది గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాడు.
    "ఎవరు మీరు?' అనడిగాడు ఇన్స్పెక్టర్ రఘురాం.
    "మీరేనా రఘురాం గారు?"
    "అవును నేనే!"
    "మీతో చిన్న రహస్యం చెప్పాలి. అభ్యంతరం లేకపోతె పక్క నేదైనా చిన్న గది ఉందా?" అన్నాడు రవి.
    రఘురాం క్షణం తటపటాయించి "సరే పదండి!" అన్నాడు. ఇద్దరూ అక్కడున్న చిన్న గదిలోనికి వెళ్ళారు.
    "రెండ్రోజుల క్రితం జరిగిందిది...." అన్నాడు రవి. అర్ధరాత్రి ప్రాంతంలో ప్రవెశించాడతను మా ఇంట. నాది తాకట్టు వ్యాపారం. ఇనప్పెట్టె నిండా నగలున్నాయి. అతను చాలా ఆరితేరిన వాడిలాగున్నాడు. ఎంతో కష్టసాధ్యమైన ఇనప్పెట్టె ను సులువుగా తెరిచేశాడు. ఆ సమయంలో నా భార్యకు మెలకువ వచ్చింది. అతన్ని చూసి దొంగ దొంగ అని అరిచింది. ఇప్పుడే నాకూ మెలకువ వచ్చింది. అతను చేతిలో కత్తితో మమ్మల్నిద్దర్నీ సమీపించాడు. కత్తి చూడగానే మా ఇద్దరి నోళ్ళూ మూతబడ్డాయి. అప్పుడే చిన్న తమాషా జరిగింది.
    "నాభార్య చాలా అందంగా ఉంటుంది. రాత్రి కావడం మూలానూ, భర్త పక్కనే పడుకున్న కారణం గానూ ఆమె ఒంటి మీద దుస్తులు సరిగ్గా లేవు. దొంగను చూసిన కంగారులో ఆమె దొంగ దొంగ అని అరిచింది కానీ ఆ తర్వాత నైట్ డ్రస్సు నుంచి మామూలు డ్రస్సు లోకి మారే అవకాశమేదీ? దొంగకు అత్యాచారం చేయాలనిపించందనుకుంటాను. నా భార్యను చూసి 'బంగారం కంటే బాగున్నావ్ నువ్వు!" అంటూ ఆమెను సమీపించాడు. ఒక మూల కత్తిని నావైపు ఝుళిస్తూనే వున్నాడు.
    మాట్లాడకుండా లొంగిపోతే నీ మొగుడ్నే మీ చేయను. లేకపోతె మాత్రం ...." అని ఆగాడు.
    "వాడి మాటలు నా ఆవేశాన్ని రెచ్చగోట్టాయి. ఆ సంఘటననూ, వాడి బలహీనతనూ ఆధారంగా తీసుకుని నేను వాడి మీద ఎదురు దెబ్బ తీయగలిగాను. వాడు తప్పించుకుని పారిపోయాడు. నా భార్య మానం, నా నగలు కూడా రక్షించబడ్డాయి. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నన్ను నేనే అభినందించుకున్నాను. తర్వాత ఇనప్పెట్టె ను పరిశీలించాను. డిటెక్షన్ నా హాబీ . ఇనప్పెట్టె మీద వేలిముద్రలున్నాయి. మీ పోలీసు పద్దతులే ఉపయోగించి వాటికి ఫోటోలు తీశాను. దాని నమూనా నా దగ్గరుంది. ఇది చూసి మీరు మీ రికార్డు వెరిఫై చేసి ఇదివరలో ఏ పాత నేరస్థుడి వైనా అయితే వెంటనే దొంగను పట్టవచ్చునని నా ఆశ. ఆ మనిషి ముఖం నాకు బాగా గుర్తుంది. ఎప్పుడు కనపడ్డా గుర్తు పట్టగలను."
    రఘురాం బయటకు వచ్చి - వేలిముద్రల నిపుణుల సుందరానికి ఫోన్ చేశాడు. అయన వచ్చి పోలీస్ రికార్డు వెతికి - స్టేషన్ లో ఉన్న తాత్కాలిక సదుపాయలకి ఒక ఫోటో వెతికి తీసి "ఇదీ అదీ ఒకటేనని నా అనుమానం. ఎటొచ్చీ ఖచ్చితంగా చెప్పాలంటే రేపటి వరకూ సాధ్యపడదు. ఈ ఫోటోని నాతొ తీసుకు వెడతాను అన్నాడు.
    "వెంటనే చెప్పడం సాధ్య పడదా....?' అన్నాడు రవి.
    "మీరాయనతో వెళ్ళండి. ఓ గంటలో మీకు విషయం తెలుస్తుంది. అవి రెండూ ఒకటే అయిన పక్షంలో - మీకు మళ్ళీ నేరస్తుడు కళ్ళబడితే మాకు తెలియజేయండి. రెండు నేరాల దొంగ బయటపడతాడు. అన్నాడు రఘురాం.
    'అది సరే -- ఇతనెటువంటి నేరస్థుడు?' అన్నాడు రవి.
    "ఒక స్మగ్లింగ్ వ్యవహారంలో ఈ వేలిముద్రలు దొరికాయి." అన్నాడు రఘురాం.
    రవి, సుందరం కలిసి వెళ్ళారు. సుందరం తన లాబొరేటరీ లో రెండింటిని జాగ్రత్తగా పరిశీలించి "నా అనుమానం నన్ను మోసం చేయదు. అసలు నేను ఫోటోలు చూసి అయిడెంటి ఫై చేసేయగలను. ఈ రెండూ ఒకరివేనని పోలీస్ స్టేషన్లో నే కనిపెట్టేశాను. అయినా ఎందుకైనా మంచిదని....' ఇంకా ఏదో అంటుండగా రవి అయన భుజం మీద ఏదో పిన్ తో గుచ్చాడు.
    జరిగినదేమిటో అయన కర్ధం కాలేదు కానీ మరో రెండు నిముషాల్లో ఆయనకు స్పృహ తప్పింది. రవి రెండు ఫోటోలూ తీసుకుని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

                                   6
    "నాకు తెలుసు రవి ఈ కార్యం సాధించుకురాగలడని...." అన్నాడు శంకరం ఆనందంగా ఫోటోల నందుకుని.
    "మీ రెండో పనియేమిటో చెప్పండి...." అంది నీరజ.
    "జగన్మోహన్ తెలుసా మీకు?"
    "ఏ జగన్మోహన్ ?' అంది నీరజ ఆలోచిస్తూ.
    "ఎర్ర కారు....." అని ఆగాడు శంకరం.
    నీరజకు అర్ధమైంది. ఆ ఊరికే పెద్ద ఆకర్షణ ఆ కారు. జగన్మోహన్ కున్న మూడు కార్లలోనూ అది చాలా ముఖ్యమైంది. చాలామందా ఊళ్ళో ఆయన్ను ఎర్రకారు జగన్మోహన్ అని అంటుంటారు. జగన్మోహన్ కు బట్టల షాపు ఉంది. కానీ ఒక బట్టల షాపు యజమాని కంటే బాగా ఎక్కువగా ఖర్చు పెడతాడాయన. ఆ ఊళ్ళో అగ్రశేణి ధనికుల్లో ఆయనొకడు. కొంపతీసి ఆ కారు గానీ సంపాదించమనడు కదా అనుకుంది నీరజ.
    "తెలుసు" అంది నీరజ.
    'అయన అలా కనపడుతున్నాడు కానీ ఈ నగరానికి పెద్ద బ్లాక్ మెయిలర్ . బ్లాక్ మెయిలింగ్ లో అయన సంపాదించిన దాంట్లో సగ ముండదు బట్టల షాపు మీద అయన కొచ్చే ఆదాయం" అన్నాడు శంకరం.
    ఆశ్చర్యంగా వింటోంది నీరజ. అయన చెబుతున్న విషయాన్ని. జగన్మోహన్ బ్లాక్ మెయిలర్ అన్న విషయం ఆమె ఊహించలేదు. సరిగదా ఇప్పుడు శంకరం చెప్పిన నమ్మలేక పోతోంది.
    శంకరం కొనసాగించాడు. "జగన్మోహన్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏ నేరం జరిగిన చోటున నా వేలిముద్రలున్నాయో - అక్కడే నన్ను ఫోటో తీశాడు. నన్ను రెడ్ హెండేడ్ గా ఫోటోలు తీశాడాయన. ఇప్పుడా ఫోటోతో బెదిరిస్తున్నాడు."
    "అంటే అ నెగిటివ్స్ సంపాదించాలంటారా" అంది నీరజ.
    'అవును."
    "అది పెద్ద కష్టం కాదు. పోలీసుల దగ్గర్నించి వేలిముద్రలు సంపాదించిన మనిషి ఒక మామూలు మనిషి దగ్గర్నుంచి నెగిటివ్స్ సంపాదించడం కష్టం కాదనుకుంటాను" అంది నీరజ.
    "జగన్మోహన్ మామూలు మనిషి కాడు. మొదటి పని కంటే కష్టమైనదిది...." అన్నాడు శంకరం ఆలోచిస్తూ.
    'అయినా తప్పదు కదా. ఆ నేగేటివ్స్ నెలా గుర్తించాలో చెప్పండి" అంది నీరజ.
    "నెగిటివ్స్ ట్వంటీటూ అంటే జగన్మోహన్ కు అర్ధమవుతుంది" అన్నాడు శంకరం.
    నీరజ నవ్వి - "జగన్మోహన్ ని అడిగి తెమ్మనా మీ ఉద్దేశ్యం?' అంది.
    "ఇందుమించు అలాగే చేయాలి. అసామార్ధ్యం రవి కుంది. ఒకవేళ తప్పు నేగేటివ్స్ తెచ్చే మాటయితే అవి మళ్ళీ తిరిగిచ్చేసి సరైనవి తెవాల్సి వుంటుంది. నేను మాత్రం మోసాన్ని సహించను. వేయి కళ్ళతో మీ ఇద్దర్నీ కనిపెడుతూనే ఉంటాను...." అన్నాడు శంకరం.
    "బాగానే ఉంది. మిమ్మల్నీ మళ్ళీ ఎప్పుడు కలుసుకోవాలి?"
    "రోజు విడిచి రోజు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ పార్కుకు వస్తుంటాను" అన్నాడు శంకరం.

                                    7
    "నమస్కారమండీ -- నాపేరు వీర్రాజు" అన్నాడు రవి.
    జగన్మోహన్ అతని వంక చూసి "నువ్వెవరో నేనేరగను" అన్నాడు.
    "నిన్నటి వరకూ నేనూ మిమ్మల్నేరుగను. కానీ ఒక ముఖ్యమైన పనిమీద మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను."
    "ఏమిటా పని?"
    "నెగిటివ్స్ ట్వంటీ టూ గురించి మాట్లాడాలని వచ్చాను."
    జగన్మోహన్ ముఖంలో కలవరం కనబడింది. "ఏమిటి నువ్వనేది? నాకేమీ అర్ధంకావడం లేదు" అన్నాడు.
    'అంతా అర్ధమైంది మీకు. ఊరికే నటిస్తున్నారంతే! నేనేమీ సిబిఐ మనిషిని కాను. మీకులాంటిదే నా వృత్తి కూడా" అన్నాడు రవి.
    "మిస్టర్ వీర్రాజు! నువ్వేం మాట్లాడుతున్నావో నిజంగా నాకర్ధం కావడం లేదు."
    'అయితే వివరంగా చెబుతాను వినండి. ఒక మనిషిని నేరం జరిగిన స్థలంలో ఫోటో తీశారు మీరు. ఆ నెగిటివ్స్ కు నెగిటివ్స్ ట్వంటీ టూ అని పేరు పెట్టారు. వాటితో ఆ మనిషిని బెదిరిస్తున్నారు. ఆ మనిషి నన్ను కలుసుకున్నాడు. మిమ్మల్నడిగి ఆ నెగిటివ్స్ తెచ్చి పెట్టమన్నాడు. సాధారణంగా  ఎవరైనా నేనడిగిన వెంటనే ఎమడిగితే అది ఇచ్చేస్తారు. అ నమ్మకంతో నే ఇక్కడకు వచ్చాను."
    జగన్మోహన్ నవ్వి "ఏమిటి నీ స్పెషాలిటీ?" అన్నాడు.
    "నా స్పెషాలిటీ ఏమిటని అడక్కండి. నేనే ఒక స్పెషాలిటీ"అన్నాడు రవి.    "సరే - ఇప్పుడెం చేయదల్చుకున్నావ్?"
    "మీరు నెగిటివ్స్ ఇవ్వగానే తీసుకుని వెళ్ళి ఆ మనిషి కిచ్చేయాలను కున్నాను."
    'అందుకు ప్రతిఫలం?"
    "ప్రతిఫలం అవసరం లేదు నాకు. అందు మూలంగా నా పెళ్ళి ఆగిపోయింది. అందుకని ఈ పనికి ఒప్పుకున్నాను"అన్నాడు రవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS