Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 20

 

                         వలచి వచ్చిన వనిత

                                                                        వసుంధర
    "వాడికి మూడింది"- అన్నాడు శ్ర్రీధరబాబు.
    శ్రీధరబాబు ఉద్దేశ్యంతో వాడు అంటే పుల్లరావని నాకు అర్ధమయింది.
    శ్రీధరబాబుని మా కాలేజీలో మోసగాళ్ళకు మొనగాడని చాలామందికి చాటుగాను, కొంతమంది ఎడురుగానూ కూడా అనుకుంటూ, అంటు ఉంటాడు. రౌడీ అన్న పేరు కూడా అతనికి లేకపోలేదు.
    అతను క్లాసులో బాగా అల్లరి చేస్తాడు. మేష్టర్లని ఏడిపిస్తాడు. ఆడపిల్లల వెంటబడడమూ, వాళ్ళు వినేలా అసభ్యపదాలు మాట్లాడడమూ అతని హాబీ . ఆడపిల్లలకు శ్రీదర్ బాబు అంటే సింహస్వప్నం అనవచ్చు.
    నేను బుద్ది మంతుడిగా పేరు పడ్డానని చెప్పడం కంటే కాలేజీలో ఒక అనామకుడినని చెప్పుకుంటే బాగుంటుంది. నన్ను గురించి ఆఖరికి శ్రీధరబాబు రూమ్ మేటుగా నైనా కూడా ఎంతో మంది ఎరుగరు. అందుకు కారణాలు లేకపోలేదు. నేను రూమ్ వదిలాక సాధారణంగా అతన్ని తప్పించుకుని తిరగడమే జరుగుతుంటుంది. అనవసరపు టనుమానాలకు లోనికాగలనన్న భయంతో క్లాసులో అతని ప్రక్కన కూర్చొను నేను, ఆడపిల్లల వెంట బడడం ఊహలో నాకు ఆనంద కరంగానే అనిపించే విషయం నిజమే అయినా - ఆ పద్దతి వల్ల వచ్చే చెడ్డ పేరుకు నేను సిద్దపడని కారణంగా శ్రీధర్ బాబుతో బయట షికార్లు అట్టే చేసేవాడిని కాదు.
    అసలు నేనూ, శ్రీధర్ బాబు హాస్టల్ రూమ్ మేట్సు గా ఆరునెలలు గడపగలడం నన్ను తెలిసిన కొంతమంది స్నేహితులకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఒక్కమాట మాత్రం నిజం. నేనూ, శ్రీధర బాబు నిజంగా స్నేహితులం, ఒకళ్ళ పద్దతి ఒకరికి నచ్చనట్లు కనపడినా చాలా విషయాల్లో మా అభిప్రాయాలు ఒకటే! రూమ్ లో ఉన్నప్పుడు మేమిద్దరమూ గంటల తరబడి మాట్లాడుకుంటుండే వాళ్ళం. నా పరిజ్ఞానాన్ని అతను మెచ్చుకుంటుండేవాడు. అతని నిర్భాయత్వానికి ఆశ్చర్యాన్ని వ్యక్త పరస్తూ ఉండేవాడిని.
    ఒకరోజు మాటల ప్రసక్తిలో అతను --" నీతో మాట్లాడం కోసం కాకపోతే అసలు నేను రూముకి రావలసిన అవసరమే కనపడదు పంతులూ!.. అన్నాడు. అది నాకు కాంప్లిమెంటు.
    నాపేరు పంతులు కాదు. కానీ శ్రీధర బాబు రూమ్ మేటుగా వచ్చిన క్రొత్తలో నన్నలా పిలవడం మొదలు పెట్టాడు. నన్నేడిపించాలన్నది బహుశా అతని అభిమతం అయుండవచ్చు. కానీ నేను ఆపిలుపుకు పలకడం మాత్రమే కాక -- "నీ పలకరింపులో ఎంతో సాన్నిహిత్యం కనబడుతోంది -బావా! అన్నాను. శ్రీధర్బాబు ముఖం అప్పుడు అంత బాగాలేదు. అతను నాకేసి అదోకలా చూసి -- "బావా అంటున్నావు --నీకు ఇంతకీ చెల్లెళ్ళున్నారా పంతులూ --" అన్నాడు.
    నేను చలించకుండా -- బావా అనిపిలవడానికి నాకే చెల్లెళ్ళు వుండాలా ---నీకుంటే సరిపోదూ ?" అన్నాను.
    భయంకరమైన ముఖం అనే పదానికి అర్ధం ఆక్షణంలో నాకు తెలిసింది. శ్రీధరబాబు ఒకసారి కుడిచేతి పిడికిలితో ఎడమ అరచేతిలో ఘట్టిగా కొట్టుకుని-- "నేను నిన్ను నిజంగానే ప్రేమతోనే పంతులూ అని పిలిచాను. కానీ నువ్వు మాత్రం ఉద్దేశం ఏమైనా -- బావా అని మాత్రం పిలవద్దు. బహుశా నా పదిహేనవ సంవత్సరంలో అనుకుంటాను- నేను హంతకుడు కావలసిన సంఘటన ఒకటి కొద్దిలో తప్పిపోయింది కారణం తెలుసా?" అని ప్రశ్నార్ధకంగా నావైపు చూశాడు.
    నిజం చెప్పొద్దూ నాకా క్షణంలో అతని ముఖం చూస్తుంటే భయమేవేసింది. నేను మరి మాట్లాడలేదు.
    శ్రీధరబాబు కూడా ఒకటి రెండు నిముషాల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత చెప్పడం ప్రారంభించాడు.-- నాకు ఒక్కగా నొక్క చెల్లెలు. పేరు పార్వతి , ఆరుగురు మగపిల్లల తర్వాత లేక లేక మాఇంట్లో పుట్టిన పిల్ల పార్వతి. మగపిల్లల్లో - నేనే ఆఖరి వాడిని కావడం చేతనూ, పార్వతికి నాకు ఏణార్ధం మాత్రమే తేడా ఉండడం వల్లనూ -- మా ఇద్దరి అనుబంధం ఇంతా అంతా అని చెప్పలేను . చిన్నప్పట్నించి ఇద్దరూ ఒకే ప్రాణంగా పెరిగాం- " శ్రీధరబాబు ఆగాడు .
    నేను కుతూహలంగా వింటున్నాను. భయం కూడా కాస్త తగ్గింది.
    అతను మళ్ళీ మొదలు పెట్టాడు--" నాకప్పుడు పదిహేను సంవత్సరాలు . ఫోర్త్ ఫారం చదువుతుండేవాడిని. అదే స్కూల్లో పార్వతి సెకండ్ ఫారం చదువుతుంది. నాకప్పుడూ కాస్త పెద్ద పరిచయాలే. చాలా మంది స్కూల్ ఫైనల్ చదువు తున్న కుర్రాళ్ళతో నాకు పరిచయముండేది. అందులో సుదర్శనం అనే అతనితో నేను చాలా తరచుగా తిరుగుతుండేవాడిని. సుదర్శనం గత మూడు నాలుగు సంవత్సరాలుగా అదే స్కూల్ విద్యార్ధి నాయకుడిగా ఉంటూ వస్తున్నాడు. ఒకో తరగతి ఒక సంవత్సరం కంటే ఎక్కువసార్లు చదువుతూ వచ్చిన కారణంగా అప్పటికి అతని వయసు ఇరవై కి పైనే ఉంటుంది. ఆకారణంగా అతను క్లాసులోని వయసు సొగసులను మగ దృష్టితో చూచి వర్ణించగల సమర్ధత అప్పటికే సంపాదించాడు. అతని వర్ణనలు విని ఆనందించడం కోసమే నేనతనితో ఎక్కువగా తిరుగుతుండేవాడిని --' అని ఒకసారి నాకేసి చూసి "వింటున్నావా?" అడిగాడు శ్రీధర్ బాబు.
    "ఊ" అన్నాను నేను.
    శ్రీధర్ బాబు చెప్పడం కొనసాగించాడు-" సుదర్శనం మంటే స్కూల్లో ఆడపిల్లలు హడలి చచ్చేవారు. అతనితో పాటు నేను కూడా ఎన్నో పర్యాయాలు అడ్డపిల్లల వెనక పడి నోటి దురద తీరేలా బూతులు మాట్లాడి సంతోషించేవాడిని. ఒకసారి సుదర్శనం నాకు ముందు చూపు గురించి చిన్న లెక్చరు దంచాడు --" వయసులో ఉన్న ఆడపిల్లలకు తమ వెంట మగావాళ్ళు పడతారని గర్వంగా ఉంటుందట. అందుకు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు పిల్లలను మచ్చిక చేసుకుంటే -- వాళ్ళు అప్పటికి అమాయకంగా చెప్పిన మాట వినడమే గాక రెండుమూడేళ్ళ తర్వాత అన్నింటికీ పనికొస్తారు. అందువల్ల ఒక అందమైన అవయసు పిల్లని ఇప్పట్నించి పట్టుకోవదాన్ని ముందుచూపు అంటారని అతను నాకు చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ "------
    శ్రీదరబాబు ముఖం మళ్ళీ కోపంగా మారింది. ఉద్రేకం వల్ల కాబోలు అతని చేతి పిడికిలి బిగుసుకుంది. తడబడుతూ అతను "- "ఆరోగ్ , ఆఫూల్ , ఆ ఇడియట్ , ఆ రాస్కెల్ అస్కౌండ్రల్ -- సుదర్శనం గాడు ఉదాహరణగా నాకు నా చెల్లెలిని చూపించి "-- మన ముందు చూపుకీ అమ్మాయేలా గుంటుందంటావు !" అడిగాడు. నేను షాక్ తిన్నాను. ఆక్షణంలో చటుక్కున పార్వతి నా చెల్లెలని వాడికి చెప్పాలని కూడా తట్టలేదు.
    నేను గట్టిగా సుదర్శనం చేయి నొక్కి - వెనక్కు లాగాను. "నాతోరా!" అన్నాను. మా స్కూల్ వెనకాల ఒక పెద్ద తోట ఉంది. అందులోకి వాడిని తీసుకు వెళ్ళి -- హటాత్తుగా అక్కడ వాడిని గట్టిగా ఒక్క తోపు తోశాను. సుదర్శనం క్రింద పడ్డాడు. నేను ఎగిరి వాడి పొట్ట మీద కూర్చుని గొంతు నులమసాగాను. సుదర్శనం అసహాయుడై తన్నుకుంటున్నాడు. తన చేతులతో నన్ను తొయ్యడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు. నా చేతులు అతడి గొంతుకు గట్టిగా బిగుసుకుంటున్నాయి. ఆ సమయంలో ఎవరో నన్ను వెనక్కు లాగేరు. సుదర్శనం మాత్రం కదల్లేదు. నన్ను లాగినదేవరా అని వెనక్కు తిరిగాను. మా లెక్కల మేష్టారు. ఆయన నా చెంప చెళ్ళు మనిపించాడు.....
    శ్రీధర్ బాబు మళ్ళీ ఒక్క క్షణం ఆగి చెప్పసాగాడు .-" స్పృహ తప్పినా సుదర్శనం చావలేదు. నేను హంతకుణ్ణి కాలేదు. కానీ -- సుదర్శనమంతటి వాడిని దెబ్బ తినిపించిన మొనగాడిగా స్కూల్లో నాకు పేరు వచ్చింది. నాకూ సుదర్శనానికి శత్రుత్వం ఏర్పడలేదు. మేమిద్దరం ఇంకా మిత్రులయ్యాం. ఒకరి చెల్లెలి జోలికి మరొకరు పోరాదని - పార్వతి నా చెల్లెలలని తెలియక పొరబాటు చేసినందుకు క్షమించవలసిందని -- సుదర్శనం నన్ను కోరాడు --"
    శ్రీధర్ బాబు చెప్పినది వింటూ నేను ఆలోచిస్తున్నాను. ఇతగాడికి పరాయి ఆడదంటే ఏమాత్రం గౌరవం లేదు. తను అందరి ఆడపిల్లల వెనక పడలేడు. కానీ - తన చెల్లెలిని ఎవరేమాన్న సహించలేడు. ఏమిటీ విచిత్ర మనస్తత్వం?..... నిజం చెప్పాలంటే ఒక్క శ్రీధర్ బాబుకే కాదు - ఇటువంటి మనస్తత్వం ఎంతో కొంత ప్రతి మగవాడిలోనూ కూడా ఉన్నదేమో నని నన్ను నేను ఆత్మ విమర్శ చేసుకోవాలనిపించింది.    
    "వింటున్నావా -- నా చెల్లెలని తెలియక సుదర్శనం పొరబాటు చేసినపుడే నేను క్షమించలేకపోయాను. అటువంటప్పుడు తెలిసి ఎవరైనా సొల్లు మాటంటే ...."శీధర్ బాబు వాక్యం పూర్తీ చేయకుండా నాకేసి చూశాడు. అతని చూపుల్లో ఆ తర్వాత వాక్యం కనిపించింది.
    నేను కాస్త నెమ్మదిగా అన్నాను -" చావంటే నాకు భయం లేదు. అలాగని కోరు చావుని ఆహ్వానించను. కానీ ఒక్క సందేహం ప్రతి ఆడది నీ చెల్లెలిలాంటిదేనని ఎందుకు భావించవు?"
    శ్రీధర్ బాబు సినిమా విలన్లా వికటాట్టహాసం చేసి -" చాలా చచ్చు ప్రశ్న నీది. మగాడికీ ఆడదాన్ని చూస్తె వెర్రెత్తితుంది. మీసమున్న మగవాడిగా నాకు తోచినట్లు ప్రవర్తిస్తాను. బావుంటే ఎవడి నైనా అడ్డుకోమను. ప్రతి ఆడదానికీ నాకు లాంటి అన్న దొరకడు. అందుకు శిక్ష వాళ్ళనుభవించవలసిందే -" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS