Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 20


    "మీలాంటి మగాళ్ళదగ్గర సిగ్గేమిటిలెండి కానీ-కాసేపు కవిత్వాన్ని కట్టిపెట్టి విందు ఆరగించండి" అంది రాధిక.
    అతను తన బుగ్గలుగురించి విసిరిన విసురు సుజాతకు అంతగా నచ్చలేదు. కాస్త ఇబ్బందిగా నే ఫీలయిందామె. అది గమనించి కూడా తెలియనట్లూరుకున్నాడు మధు.
    "ఆహా గుత్తివంకాయ కూడా. నాకివి ఇష్టమని మీకు ఎలా తెలుసు?" అన్నాడు సుధాకర్ ఆనందంగా-చేత్తో ఓకాయ తీసిపట్టుకుని.
    "గుత్తివంకాయ ఇష్టంకాని ఆంధ్రుడెక్కడుంటాడు చెప్పండి" అన్నాడు మధు.
    "అది తినవద్దు" అంది రాధిక చటుక్కున.
    "నేను వచ్చింది విందుకి. తినవద్దంటే ఎలా?" అన్నాడతను.
    "డాక్టర్ మిమ్మల్ని కొంతకాలంపాటు వంకాయ తినవద్దన్నాడు" అంటూ గుర్తుచేసింది రాధిక.
    "అలాంటప్పుడు ప్లేటులోకి రాకుండా జాగ్రత్తపడాల్సింది. ఇటీజ్ టూ లేట్!" అన్నాడు సుధాకర్.    
    "ప్లీజ్-ప్లీజ్ అని తినవద్దు" అందామె.
    "అబ్బ, ఎంతసేపూ ఒకటే డైలాగు. తినొద్దు, తినొద్దు అని నేను నువ్వు చెప్పినమాట వినడానికిక్కడకు రాలేదు. నీ వాగుడు భరించలేకుండా వున్నాను. నువ్వూ విందు చేయవలసివుంది కాబట్టి కానీ లేకపోతే నీ నోటికి టేపు బిగించి ఉండేవాణ్ణి-"అన్నాడు సుధాకర్ నవ్వుతూ.    
    రాధికమాత్రం నవ్వలేదు. అభ్యర్ధనగా సుజాతవంక చూసి "మీరు చెబితే వింటారు. వంకాయకూర ఆయనకు చాలా ఇష్టం కానీ కొంతకాలంగా ఆయన శరీరానికి పడడంలేదు. తిన్నారంటే రాత్రికి చాలా ప్రమాదం జరగవచ్చు" అంది.
    సుజాత వెంటనే సుధాకర్ వంక చూసి "మా ఇంటికి వచ్చి మీరు అనారోగ్యానికి గురికావడం నా కిష్టంలేదు. ఎందుకయినా మంచిదని రెండుకూరలు చేశాను. మీరు బంగాళాదుంపలకూర వేసుకోండి" అంది.
    "మీరు చెబుతున్నారు కాబట్టి మానేస్తున్నాను. అయినా మా రాధికకు కంగారు ఎక్కువ. నాది యెడమ చేతివాటం. కుడిచేత్తో తినటం నాకు రాదు" అంటూ అతనా వంకాయను ప్లేట్లోనే వదిలేసి, ఎడమ చేత్తోనే తినడం ఆరంభించేడు.
    ఆ దృశ్యంచూసిన సుజాత మ్రాన్పడిపోయింది. జరిగినదంతా ఒకసారి పునశ్చరణ చేసుకొని సుధాకర్ ముఖం వైపు చూసింది. ఆ ముఖంలో క్రూరత్వంలేదు. అమాయికంగా వున్నా లేకపోయినా అందంగా మాత్రముంది.

                                  3

    "నాకేమిటో భయంగా వుందండీ" అంది సుజాత.
    "ఏం-ఏమయింది?" అన్నాడు మధు.
    "ఆ సుధాకర్ మాటలు విన్నారా?"
    "విన్నాను మనిషి కాస్త చురకయినవాడు. మనసులో ఏమీ కల్మషముండదు. అతన్ని అపార్ధం చేసుకోకు" అన్నాడు మధు.
    "అదికాదండీ, అతని మాటలు అచ్చు నా కలలోని హంతకుడి మాటల్లా వున్నాయి" అంది సుజాత.
    మధు ఉలిక్కిపడి "ఏమిటన్నావ్?" అన్నాడు.
    సుజాత వివరంగా చెప్పి, "వాగుడు వినలేనని నోటికి టేపు అంటిస్తానన్నాడు. తనది ఎడమచేతి వాటం అన్నాడు. అన్నపద్ధతి అచ్చు ఆ హంతకుడన్నట్లే వుంది." అంది.
    మధు పకపక నవ్వి, "అయితే ఆ కల నువ్వింకా మర్చిపోలేదన్నమాట" అన్నాడు.
    "ఎలా మర్చిపోతానండీ మీక్కూడా అలాంటి కల వచ్చివుంటే తెలిసుండేది."
    "నువ్వు కలను సీరియస్ గా తీసుకుంటావని నాకు తెలుసు. అందుకే నా కలలు నీకు చెప్పను. మగాడన్నాక అందమయిన అమ్మాయిల కల్లోకి రాకుండా వుండరు. నువ్వెదురుగా వున్నప్పటి సంగతి వేరుగానీ కలల్లో నేను వాళ్ళనుచూస్తూ  వూరుకోలేను" అన్నాడు మధు.
    "మీరు వేళాకోళం చేయకండి. సుధాకర్ ని చూసేక నాకు అనుమానంగా వుంది. నేను చూసిన కల నిజంగా జరిగినదే ఏమోనని...."
    "కొంపదీసి నీ కలలోని హంతకుడు సుధాకర్ కానీ కాడుగదా" అన్నాడు మధు.
    "ఆ హంతకుడి ముఖం నా కళ్ళముందు కదుల్తూనే వుంది. వాడెక్కడ కనబడ్డా గుర్తించగలను. వాడికీ మీ సుధాకర్ కీ పోలికలు లేవు."
    "అయితే గొడవేలేదు."
    "అది కాదండీ వాడు సుధాకర్ కీ బాగా దగ్గర బంధువై వుండవచ్చు. సుధాకర్ కీ వాడికీ కొన్ని కామన్ హాబిట్స్ వుండి వుండవచ్చు. నా అనుమానం ఆ హత్య నిజంగా జరిగిందని!" అంది సుజాత.
    "అయితే ఏం చెయ్యాలంటావ్?"
    "ఎలాగో అలా ఆ హంతకుణ్ణి బయటపెట్టాలి!" అంది సుజాత.
    "బాగానే వుంది. నాకో కలవచ్చింది. ఆ కలలో ఓ అమ్మాయి హత్య చేయబడింది. హత్య చేసినవాడికీ, సుధాకర్ అనబడే వ్యక్తికీ కొన్ని అలవాట్లలో పోలిక వుంది. మీరు హంతకుణ్ణి పట్టుకుని ఉరితీయండి, అని పోలీసులకు చెప్పాలంటావా?" అన్నాడు మధు విసుగ్గా. "మామూలుగా వచ్చే సమస్యలకే తట్టుకోలేక చస్తూంటే కలలోవచ్చే సమస్యలు కూడా నాకు తగిలించకు. నామాట విని కొంతకాలంపాటు సితెక్తివ్ పుస్తకాలు చదవడం కట్టిపెట్టు. లేకపోతే లేనిపోని ఆలోచనలతో సైకోలా తయారు కాగలవు."
    "మాట్లాడితే పుస్తకాల ప్రసక్తి తీసుకొస్తారు. మీరు ఎన్నిచేసినా నన్ను పుస్తకాలు చదవకుండా ఆపలేరు. ఆ మాటకొస్తే అలా ఆపితేనే నేను సైకోనయ్యే ప్రమాదముంది" అంది సుజాత.
    
                                   4

    "ఎందుకో అర్జంటుగా బయల్దేరి రమ్మనమని మీనాన్న గారు ఉత్తరం రాశారు. నాకు శెలవులేదు. నువ్వు ఒక్కత్తివీ వెళ్ళొచ్చేయి" అన్నాడు మధు.
    సుజాత ఉత్తరం చదువుకొని "ఏమిటో - అసలు విశేషం రాయలేదు. కంగారుగావుంది. ఎలాగో అలా సెలవు చూసుకొని నాతో బయల్దేరి రాకూడదూ" అంది.
    "చెప్పానుగా, సెలవులేదు అని!" అన్నాడు మధు.
    సుజాత ఒక్కర్తే బయల్దేరి వెళ్ళింది.
    "అల్లుడు రాలేదా?" అంటూ పలకరించింది సుజాత తల్లి గుమ్మంలోనే.
    "లేదమ్మా, ఆయనకు సెలవులేదట." అంటూ చెప్పి ఆత్రుతగా అక్కడి విశేషాలడిగింది. విషయమేమిటో అని ఆమెకు చాలా కంగారుగా వుంది.
    సుజాతకు పద్దెనిమిదో ఏట పెళ్ళయింది. ఇప్పుడామెకు ఇరవై నిండాయి. సుజాత అన్న రవికి పాతికేళ్ళు. అతనికి పెళ్ళి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే అతనొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని తప్ప చేసుకోనని భీష్మించాడు. అమ్మాయి చాలా బాగుంటుంది కానీ కులం వగయిరాలు కలవలేదు. మొత్తంమీద తల్లిదండ్రులు అంగీకరించక తప్పలేదు. పెళ్ళి కుదిరినట్లే అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆ అమ్మాయిజాడ తెలియకుండా పోయింది. ఆ పిల్లకోసం రవి అన్నాహారాలు మానేసి పిచ్చివాడిలా ఐపోయాడు.
    "బాగానే వుంది. ఎలాగో అలా నచ్చజెప్పలేక పోయారా?" అంది సుజాత.
    "ఎలా నచ్చజెప్పేదే తల్లీ-వాడు మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడు. నాన్నగారే ఆ పిల్లను మాయంచేశారని వాడి అనుమానం" అంది సుజాత తల్లి.
    సుజాత ఉలిక్కిపడింది. ఆమెతండ్రి ఆ ఊళ్ళో ధనవంతుడైన వ్యాపారస్థుడు. ఊళ్ళో పలుకుబడి, గౌరవం వున్నాయి. చేతిలో గూండాలు వున్నారని లోపాయికారీగా చెప్పుకుంటూంటారు. ఇంట్లో మాత్రం అందరితోనూ ఎంతో సౌమ్యంగా మాట్లాడుతాడు. పిల్లలంటే ప్రేమ ఆయనకు. తన ప్రతికక్షులను కాలరాచడంలో ఆయనకు సరదా ఉందని ఎందరో చెప్పుకున్నప్పటికీ సుజాత ఆ విషయాలేవీ నమ్మదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS