Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 20

 

    కౌముది అతన్ని వదిలించుకుందుకు ప్రయత్నించలేదు. అతడికి మరింత దగ్గరగా జరిగి -- "నా సంగతి నీకు తెలియదు, నాకోసం హత్య కూడా చేసిన నీకు నేను ఏమైనా ఇవ్వగలను. నీలాంటి మగవాడ్ని నేనింతవరకూ చూడలేదు. ఇదివరలో ఒకరిద్దరు నన్ను నమ్మించి మోసం చేశాడు. నమ్మించి మోసం చేసిన వాళ్ళను నేనేమైనా చేస్తాను?' అంది.
    ఆమె అంతదగ్గరగా వుంటే ఏదోలా వుంది రమణరావుకు. అతడి శరీరం, మనసు కూడా వశం తప్పుతున్నాయి. తడబడుతూ -- "అయితే నేను కోరింది నీ దగ్గర్నుంచీ నేను తీసుకుంటాను. నువ్వు మాత్రం అభ్యంతరం పెట్టకూడదు. సరేనా!" అన్నాడతను.
    "సరే!" అందామె నవ్వుతూ.
    కౌముది  అంత సులభంగా తన వశమవుతుందని రమణరావు  అనుకోలేదు. అతను తన అదృష్టానికి  పొంగిపోయాడు. తన సరదా తీర్చుకున్నాడు.
    "చూశావా నా గొప్పతనం. మనకింకా వివాహం కాలేదు. అయినా నేను అభ్యంతర పెట్టలేదు"అంది కౌముది.
    "మన వివాహం జరిగితే అది నా గొప్పతన మవుతుంది. వివాహానికి ముందు మన ఇద్దరికీ సంపూర్ణావగాహన అవసరం. నీ కధ చెప్పు!"అన్నాడు రమణరావు.
    కౌముది అతడికి తన కధ చెప్పింది.

                            *    *    *    *

    ఇందుమతి వివాహితురాలని తెలుసి కూడా రోశయ్య ఆమెను మోహించాడు. చాటుమాటుగా ప్రయత్నించగా ఇందుమతి అతణ్ణి గట్టిగా హెచ్చరించింది. రోశయ్య వినలేదు. ఇందుమతి భర్తకు చెప్పుకుంది.
`    ఇందుమతి భర్త పురుషోత్తం - వ్యాపారం చేస్తున్నాడు. అయన స్నేహితుడు జగన్నాధం కూడా పెద్ద వ్యాపారి. జగన్నాధం వంట్లో ఆరోగ్యం బాగా ఉండకపోవడం వల్ల పురుషోత్తం వాళ్ళకు వ్యవహారాల్లో సాయం చేస్తున్నాడు.
    జగన్నాధం దగ్గర ఇద్దరుద్యోగులున్నారు. వాళ్ళు కనకారావు, రోశయ్య. జగన్నాధం అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళిద్దరూ గాదె కింద పంది కొక్కుల్లా తయారయ్యారు. పురుషోత్తం కారణంగా వీళ్ళ బండారం బయటపడే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వాళ్ళో పధకం ఏర్పాటు చేశారు."
    రోశయ్య వీలున్నప్పుడల్లా జగన్నాధాన్ని కలుసుకుని కనకారావు , మీనాక్షి ల ప్రవర్తన అనుమానాస్పడంగా ఉన్నదని సూచించేవాడు. కనకారావు పురుషోత్తం తో రోశయ్య ఇందుమతి ల ప్రవర్తన గురించి చెడుగా ఉన్నట్లు సూచించేవాడు. రోశయ్య కూ, కనకారావు కూ విరోధం లేదని తెలియడం వల్ల జగన్నాధం, పురుషోత్తం కూడా వీళ్ళ మాటలు నమ్మసాగారు.
    కనకారావు మీనాక్షి వద్దనూ, రోశయ్య ఇందుమతి వద్దనూ అప్పుడప్పుడు అసభ్యంగా ప్రవర్తించి ఆడవాళ్ళ కోపం హద్దులు దాటినట్లు గుర్తించగానే కాళ్ళ మీద పడి తప్పు మన్నించమని వేడుకునేవారు. సహజంగానే ఆ ఆడవాళ్ళ కేం చేయాలో తెలిసేది కాదు.
    రోశయ్య ఒక పర్యాయం బాగా హద్దు మీరాక ఇంక ఆగలేక ఇందుమతి భర్తకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన క్షణం నుంచీ కూడా రోశయ్య పురుషోత్తం ముందు ఎంతో పెద్దమనిషిలా వ్యవహరించాడు. పురుషోత్తం రోశయ్యను ఏమీ అనలేకపోయాడు.
    ఒక పర్యాయం సమయం చూసి కనకారావు పురుషోత్తం తో -- "ఆడవాళ్ళకు ఓ పరాయి మగవాడి మీద మోజుందనుకొండి . ఆ మగాడు తననిబ్బంది పెడుతున్నాడని భర్తకు చెబుతుంది. భర్త ఆ పరాయి మగాడితో గొడవ పెట్టుకుంటారు. అంతవరకూ పెద్దమనిషిలా వ్యవహరించే ఆ పరాయి మగాడి దృష్టి ఆ ఆడదాని మీద పడుతుంది. అప్పుడు కధ ప్రారంభమవుతుంది--' అన్నాడు.
    పురుషోత్తం కు ఇందుమతి పై అనుమానం ఆరంభమైంది. రోశయ్య గురించి నేరం చెప్పినప్పుడల్లా అతడామె నే అనుమానించసాగాడు. దాంతో ఇందుమతి రోశయ్య గురించి భర్తకు నేరం చెప్పే అవకాశం కోల్పోయింది. ఇది కనిపెట్టాక రోశయ్య విజ్రుంభించాడు. ఇందుమతి అతన్ని దేబ్బలాడ్డానికి బదులు బ్రతిమాలడవలసి వచ్చింది.
    అక్కడ జగన్నాధం ఇంట్లో మీనాక్షికి ఇదే పరిస్థితి ఏర్పడింది.
    ఒకరోజు పురుషోత్తం ఊళ్ళో లేడు. రోశయ్య ఇందుమతి ఇంటికి వెళ్ళాడు. ఇందుమతి తన ఆరోగ్యం సరిగ్గా లేదనీ వెళ్ళిపొమ్మని రోశయ్యను కోరింది. రోశయ్య వినలేదు. "పోనీ -- రెండు రోజుల పోయాక  రా-- అప్పటికి నా ఆరోగ్యం కుదుట పడుతుంది" అంది ఇందుమతి.
    "అలా కుదరదు" అంటున్నాడు రోశయ్య. అతడి  కంఠం అధికారయుతంగా వుంది. ఆమె వేడుకుంటోంది.
    ఆ సమయంలో ఇందుమతీ భర్త అక్కడకు వచ్చాడు. ఏదో కారణం వల్ల అతడు ప్రయాణం వాయిదా వేసుకుని వెనక్కు వచ్చాడు. ఇంట్లో జరుగుతున్న సంభాషణ వింటుంటే అతడికి ఇందుమతి రోశయ్య కు చాలా అధికారాన్నిచ్చిందనిపించింది. ఆ అధికారం తన కారణంగానే రోశయ్యకు లభించిందని అతడికి స్పురించలేదు. మన సంప్రదాయం అటువంటిది.
    మధ్యలో వారి మధ్యకు వెళ్ళి భర్యను నానా మాటలూ అన్నాడతను. రోశయ్య అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. భార్య చెప్పే ఒక్క మాట కూడా వినలేదు.
    ఆరాత్రి ఇందుమతి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. అప్పటికామెకు ఓ పాప. చచ్చేముందు ఆమె భర్తకో ఉత్తరం పెట్టింది. ఆ ఉత్తరంలో రోశయ్య తననేలా వేధించాడో, వేదిస్తున్నాడో రాసిందామే. కానీ పురుషోత్తం కు ఆమె పై ద్వేషం పోలేదు. ఆ ఉత్తరానికతడు పెద్దగా విలువనివ్వలేదు.
    పురుషోత్తం విరక్తితో ఆ ఊరు వదిలిపెట్టి మరోచోట వ్యాపారం కొనసాగించాడు. కూతుర్ని పెంచి పెద్దదాన్ని చేశాడు. ఒకసారి జరిగిన అనుభవంతో అతను మళ్ళీ పెళ్ళి జోలికి వెళ్ళలేదు.
    వారి జీవితం సాఫీగానే కొనసాగి పోతుండగా రెండు సంవత్సరాల క్రితం పురుషోత్తాన్ని అనుకోకుండా ఒకామె కలుసుకుంది. ఆమె పేరు మీనాక్షి! ఆమె పరిస్థితి చాలా దయనీయంగా వుంది. ఆ ఇంటా ఈ ఇంటా వంట చేసుకుంటూ బ్రతుకుతున్నదామె!
    పురుషోత్తం మీనాక్షి ని గుర్తించి పలకరించాడు. ఆమె చెప్పిన కధ దయనీయంగా వుంది.
    జగన్నాధం రోశయ్య మాటలు విని తన భార్య గురించి నలుగురిలో చెడ్డగా చెప్పేవాడు. తన ఆరోగ్యం సరిగా లేని ఈ పరిస్థితుల్లో భార్య ఇలా ప్రవర్తించడం తనను మరింత మానసికంగా కృంగదీస్తుందని వాపోయేవాడు. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఓరోజు కనకారావు రోశయ్య తమ అసలు రంగు బయట పెట్టారు.
    బలవంతంగా జగన్నాధం చేత ఆస్తి తమ పేరున వ్రాయిన్చుకున్నారు. భార్య ప్రవర్తన సరిగా లేక మనసు చెడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అతడి చేత ఉత్తరం మీద సంతకం పెట్టించుకుని బలవంతంగా అతడి చేత విషం త్రాగించి చంపేశారు.
    వాళ్ళ అసలు స్వరూపం బయట పడడంతో జగన్నాధానికి అంతకాలమూ జరిగిన మోసం గ్రహింపయింది. అందుకే ఆస్తి రాసేటప్పుడు సర్వహక్కులూ భార్యకే ఉండేటట్లూ వీరిద్దరూ ఆ ఆస్తికి ట్రస్టీలుగా మాత్రమే వుండాలని రాశాడతను. అలా రాయడం రోశయ్య కు కనకరావుకీ ఇష్టం లేదు. కానీ జగన్నాధం మొండి కేత్టడంతో ఒప్పుకోక తప్పలేదు.
    జగన్నాధం చావగానే మీనాక్షిని లొంగదీసుకోడానికి ప్రయత్నించారు. మీనాక్షి ఆ దుర్మార్గుల మోసం బయట పెడతాననీ తన జోలికి రాకుంటే ఊరుకుంటాననీ చెప్పింది. మీనాక్షినికూడా అడ్డు  తప్పించి అక్కణ్ణించి మకాం ఎత్తేయాలని వారు పధకం వేశారు. జగన్నాధం ఆస్తిని క్యాషు రూమ్ లోకి మార్చేశారు. వాళ్ళకు అవసరమైన సంతకాలన్నీ మీనాక్షి పెట్టింది.
    ఆ ఊర్నించి మకాం ఎత్తేసేటప్పుడు మీనాక్షి ప్రమాదం పసికట్టి వారి దగ్గర్నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆతర్వాత ఆ ఇంటా ఈ ఇంటా పని చేసుకుంటూ రహస్యంగా బ్రతకసాగింది. వయసులో వున్న మీనాక్షి ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకడం మరీ అంత సులభం అనిపించా లేదు. కానీ రోశయ్య , కనకారావు ల వంటి దుర్మార్గుల బారి నుండి బైట పడగలిగింది కాబట్టి ఆమెకు మరీ అంత భయం లేదు.
    మీనాక్షి చెప్పిన కధ విని పురుషోత్తం చలించి పోయాడు. తన భార్య ఇందుమతికి ఎంత అన్యాయం చేశాడో గ్రహించి కుమిలిపోయాడు. అతను మీనాక్షి కి ఆశ్రయమిచ్చాడు.
    అయితే అతనింక ఇంట్లో వుండలేడు. తన ఆస్తిని క్యాషుగా మార్చి, ఫిక్సిడ్ డిపాజిట్లో వేసి -- తన కూతుర్ని జాగ్రత్తగా చూడవలసిందిగా మీనాక్షి ని కోరి. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.

                          *    *    *    *    

    "కనకారావు మీ నాన్న అనీ-- నేను ఇందుమతి కూతుర్ననీ నేను వేరే చెప్పనవసరం లేదనుకుంటాను--" అంది కౌముది.
    రమణరావు  ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తూ "అయితే నీకు నామీద కూడా పగ వుండి వుండాలి' అన్నాడు.
    "నీమీద నాకు పగేందుకు? తండ్రి చేసిన తప్పు తనయుడి కెందుకు అంటగట్టాలి? అందులోనూ నా కోరిక మీద నువ్వి రోశయ్య ను చంపి హంతకుడి వైనావు. నీమీద నాకు ప్రేమ తప్ప మరో భావం లేదు"అంటూ అతడి చుట్టూ చేతులు వేసింది కౌముది.
    "కానీ ఎంతో ప్రమాదకరమైన మీనాక్షి నీదగ్గర ఉంది. ఆమె నా తండ్రికి ప్రమాదం , అవునా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS