Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 20


    అందుకా వృద్దుడు నిట్టూర్చి "మాదొక విచిత్ర మైన కధ బాబూ! పేరుకు ప్రతీప దేశ వాసులమైన మమ్మల్ని రక్షించే నాధుడు లేడు. మా కష్టాలు రాజుకు చేరవేసే దారిలేదు. మా ఊళ్ళో బంగారం గని ఉంది. ఆ గనిలో పనిచేసి బంగారాన్ని వెలికి దీసి పోరుగూళ్ళలో అమ్ముకుని హాయిగా బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నాం. మాలో ఎవరికీ యుద్ద విద్యలు తెలియవు. అవి నేర్చుకునే ఉద్దేశ్యం కూడా మాకు లేదు. అందువల్ల ఇక్కడున్న బంగారం గని విషయం చాలా రహస్యంగా ఉంచాం. బంగారం గని సంగతి ఉళ్ళోనే అందరికీ తెలియదు.
    గని ప్రాంతాలకు వెళ్ళడానికి ఊళ్ళో నుంచి ఒక రహస్య సొరంగ మార్గముంది. ఆ మార్గం మాలో కొంతమందికే తెలుసు. ఇలా ఉండగా ఈ ఊరికి ఒక మహానుభావుడు వచ్చాడు. అయన తనకున్న సమస్త సంపదలూ వదిలిపెట్టి మునిగా మారినాడు.
    మా గ్రామంలో బంగారు గనికి ఉన్న సొరంగ మార్గంలో పవిత్రమైన శివలింగ మొకటి ఉన్నదట. ఒక సంవత్సరం పాటు దానికి పూజలు చేస్తే ఊరికి పరమేశ్వరుడి ప్రమధ గణాలు నిత్యం కాపలాగా ఉండి సంరక్షిస్తుంటాయని అయన చెప్పాడు.
    ఆ శివలంగాల్ని అర్చించి తరించడం కోసమే అయన మా ఊరికి వచ్చాడు. మేము వెళ్ళి చూస్తె నిజంగానే అయన చెప్పిన చోట శివలింగం ఉన్నది. మేము వెంటనే అయన కాళ్ళ మీదపడి మా ఊరి కోసం మా తరపున కూడా శివలింగానికి పూజలు చేయమని కోరగా , అయన అంగీకరించి, పూజ ఫలించాలంటే మొత్తం గ్రామస్తులంతా పగలు తమ కార్యక్రమాలు యధావిధిగా నిర్వర్తించుకుని రాత్రి అయ్యే సరికి మౌనవ్రతం అరంభిస్తూ ఉండాలని చెప్పాడు. మాకోసం అయన మా గ్రామంలో ఒక సంవత్సరం పాటు ఉండడానికి అంగీకరించాడు.
    అయితే ఈలోగా దురదృష్టం మమ్మల్ని వెన్నాడింది. మా వాడొకడు పొరుగూర్లో బంగారం అమ్మడానికి వెళ్ళినపుడు అక్కడకు ఓ దొంగల ముఠా వచ్చింది. అది వాడ్ని కూడా ఎదుర్కొని వాడ దగ్గరున్న బంగారాన్ని చూసింది.
    వెంటనే దొంగలు మావాడ్ని తన్ని ఆ బంగారం ఎక్కడిదో ఎలా వస్తుందో నిజం చెప్పమన్నారు. వాళ్ళ దెబ్బల బాధ భరించలేక వాడు మా ఊరు సంగతి చెప్పేశాడు. వెంటనే పదిమంది దొంగలు మా ఊరు వచ్చారు. వాళ్ళు ఊరందరినీ బెదిరించారు.
    అప్పుడు మేము వాళ్ళతో ఒప్పందానికి వచ్చాం. వాళ్ళకు రోజూ కొంత బంగారం ఇస్తామని. ఏమనుకున్నారో వాళ్ళు దానికి అంగీకరించారు. బంగారం తీసుకునేందుకు వాళ్ళు రాత్రిళ్ళు వచ్చేవారు. రాత్రిళ్ళు మేమంతా మౌనంగా ఉండేవాళ్ళం.
    ఈ విషయం ఎవరికయినా కుతూహలం కలిగిస్తుంది. దొంగలు మమ్మల్ని బాధించి అసలు విషయం తెలుసుకున్నారు. అప్పట్నించి ప్రతిరాత్రీ వచ్చి మా మౌన వ్రతాన్ని భగ్నం చేసి ముని ఆచూకీ అడిగి వెడుతున్నారు. మేము మా కష్టాలు మునికి చెప్పుకున్నాం. పూజ ప్రారంభించాక మధ్యలో ఆపకూడదనీ , తను దొంగల మధ్యకు రాకూడదనీ అయన అన్నాడు.
    పూజా విధానం పూర్తి కావడాని కింకా మాసం రోజులు పడుతుంది. దొంగలు మా మౌనవ్రతం భంగం చేస్తున్నా కారణంగా ఆ మాసం ఎప్పటికీ పూర్తీ కావడం లేదు. ఇన్నాళ్ళ కు నీవు వచ్చావు. నీ కారణంగా మళ్ళీ మాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి" అన్నాడు.
    వీరచంద్రుడి కీ కధ విచిత్రంగా అనిపించింది. ఏది ఏమైనా కొందరు అమాయక గ్రామ ప్రజలను తను అనుకోకుండా రక్షించగలిగినందుకు అతడికి అంతులేని సంతోషం కూడా కలిగింది.
    మర్నాడు వృద్దుడు వీరచంద్రుడ్ని సొరంగ మార్గం ద్వారా ముని దగ్గరకు తీసుకువెళ్ళాడు. రాత్రి జరిగిన కధంతా చెప్పాడు.
    ముని వీరచంద్రుడి కధ కూడా విని, "తాండవ వనానికి దారి నాకు తెలుసు. అక్కడికి నువ్వు సులభంగా చేరే ఉపాయం కూడా చెప్పగలను. నేను హిమాలయాలకు పోతూ పవిత్రమైన ఈ శివలింగాన్ని అర్చించిపోదామని ఇక్కడికి వచ్చి ఈ అమాయక గ్రామ ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించడం కోసమని తాత్కాలికంగా కొంతకాలం ఇక్కడ ఆగిపోయాను. నువ్వు కూడా ఈ పూజా విధులు పూర్తయ్యే వరకూ ఇక్కడ ఉండి వెళ్ళమని కోరుకుంటున్నాను" అన్నాడు.    
    వీర చంద్రుడు ఆలోచించాడు. ఈ విధంగా ఇక్కడ ఆగిపోతే స్వయంవర వ్యవహారంలో తను బాగా వెనుకబడి పోతాడు. కానీ మునివల్లె గ్రామప్రజలను శాశ్వతంగా రక్షణ ఏర్పాటు కావడం కంటే తన వివాహం ముఖ్య విశేషం కాదు గదా!
    వీరచంద్రుడు అక్కడ మాసం రోజులున్నాడు. ఈ మాసం రోజుల్లోనూ మరి ఒక్క పర్యాయం మాత్రం మరో పది మంది దొంగల గుంపు వచ్చింది. గ్రామస్థుల మౌనవ్రతం భంగం కానావసరం లేని విధంగానే అతడు వారిని ముందుగానే ఎదుర్కొని మట్టి కరిపించాడు. వాళ్ళను కూడా గ్రామస్థులు బందీలుగా ఉంచుకున్నారు.
    మొత్తం మీద పూజ పూర్తయింది. ముని గ్రామస్థులందర్నీ సమావేశపరిచి, "ఈరోజు నుంచీ మీ గ్రామానికి ఎవ్వరూ హాని కలిగించలేరు. మీలోనే ఎవరికైనా దురేద్దేశ్యం కలిగినా ప్రమధ గణాలు వాళ్ళని శిక్షిస్తాయి. మరి నాకు సెలవిప్పించండి. " అన్నాడు. తర్వాత ముని వీరచంద్రుడికి ఓ మంత్రం ఉపదేశించి, "ఆపదలో ఉన్నప్పుడు దీన్ని పఠించావంటే వెంటనే నువ్వు అదృశ్యుడివై పోతావు. ఇది నీవు అవసరానికి ఉపయోగించగలదు. అయితే ఈ మంత్రం రోజుకు ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుంది. గుర్తుంచుకో !" అన్నాడు. అయన వీరిచంద్రుడి గుర్రాన్ని తన చేతులతో నిమిరి , "ఈ అశ్వాన్నధిరోహించి అది ఏ దారిన వెడితే అలా వెళ్ళు. తాండవవనానికి చేరుస్తుంది. ఆ తర్వాత నుంచి నీ అదృష్టం " అన్నాడు.
    వీరచంద్రుడు ముని వల్లే గ్రామ ప్రజల వద్దనూ, ముని వద్దనూ సెలవు తీసుకుని ఉత్సాహంగా అశ్వాన్నదిరోహించాడు. వెంటనే గుర్రం తనకు దారి తెలిసినట్లు శరవేగంతో పరుగెత్తసాగింది.
    

                                   3

    అలా ఒక రోజంతా ప్రయాణం చేసి వీరచంద్రుడు ఓ గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం పేరు సిరిపల్లె అని తెలియగానే అతడికి కలిగిన ఆనందమంతా ఇంతా కాదు. తనకు గ్రామం పేరు చెప్పిన మనిషిని అతడు, " తాండవవనం ఇక్కడికి సమీపంలోనే ఉంది కదా ?" అని కూడా అడిగాడు.
    ఆ మనిషి ఆశ్చర్యంగా, "తాండవవనంలో మీకేం పని బాబు ?" అనడిగాడు.
    "నేనా వనంలోకి వెళ్ళాలి ?" అన్నాడు వీరచంద్రుడు.
    ఆ మనిషి వెంటనే కెవ్వుమని కేకవేసి, "తమకు జీవితం పైన ఆశ లేదా ?' అన్నాడు. ఆ మనిషి వీరచంద్రుడికి తాండవ వనం గురించి చెప్పాడు. 'అది ఒక మహా భయానకరారణ్యం . అందులో అడుగు పెట్టి ప్రాణాలతో బైట పడ్డ వారెవ్వరూ లేరు. సుమారు సంవత్సరం నుంచి అందులో ఒక బ్రహ్మ రాక్షసి తిరుగుతోంది. అది తాటిచెట్టు ప్రమాణంలో ఉంటుంది. దాని కళ్ళు చింత నిప్పుల్లా ఉంటాయి. సిరిపల్లె గ్రామ పౌరులు దాన్ని చాలా పర్యాయాలు చూశారు. అరణ్యంలో తిరుగుతుంటే నడుము పై భాగం నుంచి అది సిరిపల్లె గ్రామ పౌరులకు కనబడుతూనే ఉంటుంది. అదృష్ట మేమిటంటే ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా అది అడవి దాటి రాలేదు. అయినా అది ఏదో ఒక రోజున  తమపై విరుచుకు పడుతుందని గ్రామ పౌరులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. అసలీ మధ్య వారు ఆ ప్రాంతాలకే వెళ్ళడమే పూర్తిగా  మానేశారు. అయినా అప్పుడప్పుడు వారికి దాని పెడబొబ్బలు వినిపిస్తూనే ఉంటాయి."
    వీరచంద్రుడి కధ విని కంగారు పడలేదు. స్వరూపరాణి తన కిచ్చిన సమస్య ఎంత కష్టమైనదీ అతడు తెలుసుకోగలడు. ఏది ఏమైనా తను వెనక్కు మళ్లేది లేదు. ఆ అరణ్యంలో అడుగు పెట్టాల్సిందే !
    అతనక్కడ మకాం పెట్టి తాండవ వనం గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నించాడు. అందరూ అతన్ని భయపెట్టిన వారే! అతను బస చేసిన పూటకూళ్ళవ్వ , "నీకులా ఇక్కడికి చాలా మంది రాజకుమారులు వచ్చి అరణ్యంలోకి వెళ్ళారు. తిరిగి వెళ్ళేటప్పుడు నాకు మంచి బహుమానం ఇస్తామని ఆశ పెట్టారు. అయితే ఇంతవరకూ ఒక్కరూ తిరిగి రాలేదు ----- నాకు బహుమానం దొరకలేదు " అంది.
    "ఇంతవరకూ అ వనంలోకి ఎంత మంది రాజకుమారులు వెళ్ళారో చెప్పగలవా ?' అనడిగాడు వీరచంద్రుడు.
    "చెప్పలేకేం ? ఎవరో స్వరూపరాణి స్వయం వరమట అందు గురించి ఈ అరణ్యం లోకి వెళ్ళాలట. ఇలా చెప్పి ఒకో రాజకుమారుడే వన ప్రవేశం కావించినప్పుడల్లా నేను గోడ మీద మసి బొగ్గుతో ఓ గీత పెట్టుకుంటున్నాను. ఇప్పటికీ చాలా గీతలయ్యాయి. లెక్కపెట్టి చెబుతాను " అంటూ అవ్వ గోడ మీద గీతలు లెక్కపెట్టి, "వందకు సరిగ్గా ఒకటి తక్కువ . నువ్వు కలిశావంటే నూరు పూర్తవుతుంది."
    వీరచంద్రుడు ఉలిక్కిపడి, "అయితే బయల్దేరిన వాళ్ళంతా అప్పుడే అడవిలో ప్రవేశించడం అయిందన్న మాట !" అనుకున్నాడు.
    "స్వయంవరం కంటే ప్రాణాలు ముఖ్యమనుకునే వాళ్ళేవ్వరూ ఆ వనంలో అడుగుపెట్టకూడదు. ఇదే నీకు నేను చెప్పగలిగింది " అంది అవ్వ.
    "ఈ మాట నేనెలాగూ వినను. ఇంకేమైనా చెప్పు. అడవిలోకి వెళ్ళిన రాజకుమారులెవ్వరూ తిరిగి రాలేదంటున్నావు కదా! కారణమేమిటో చెప్పా గలవా ?" అనడిగాడు వీరచంద్రుడు.
    "రాజకుమారుడేవరైనా అడవిలో ప్రవేశించిన కాసేపటికి బ్రహ్మరాక్షసి పెడబొబ్బ ఒకటి మా గ్రామస్థులందరికి వినపడుతుంది. దాంతో ఆ రాజకుమారుడి పని అయిపోయిందని నేను అనుకుంటున్నాను" అంది అవ్వ.
    వీరచంద్రుడు ఆలోచనలో పడడం చూసి, " ఏమిటి ఆలోచిస్తున్నావు?" అనడిగింది అవ్వ మళ్ళీ.
    "ఆ వనంలోకి వెళ్ళి ఏ ప్రమాదమూ లేకుండా ఎలా బయట పడదామని ఆలోచిస్తున్నాను. నిన్నడిగితే నువ్వే ఉపాయమూ చెప్పలేదు" అన్నాడు వీరచంద్రుడు.
    "నేను నీకే ఉపాయమూ చెప్పలేను. కానీ నువ్వు నాకో ఉపకారం చేయాలి. ఇక్కడికి తాండవవనం ఎంతో దూరం లేదు. కాలినడకన వెళ్ళి చేరుకోవచ్చు. బయల్దేరేటప్పుడు నీ గుర్రాన్ని నా శాలలో కట్టేసి వెళ్ళు. కొంతకాలం దానిని అద్దె కిచ్చుకుని బ్రతుకుతాను. నీకోసం ఆరు మాసాలు ఎదురు చూసి అప్పటికీ రాకపోతే ఆ గుర్రానమ్ముకుని సొమ్ము చేసుకుంటాను " అంది అవ్వ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS