"దానికేముంది చూడండి!'అన్నాడు ఆ యువకుడు.
రామం ముందు నడువగా ఆ యువకుడు అతన్ని అనుసరించాడు. ఇద్దరూ ఒక గదిలోకి వెళ్ళారు. గదిలో మూలగా ఒక వీణ పెట్టి ఉంది.
"ఆ పెట్టి నేను తెరిచి చూడొచ్చా?" అన్నాడు రామం.
ఆ యువకుడు రామం వంక ఆశ్చర్యంగా చూసి -- "చూడాలంటే చూడండి!" అన్నాడు.
రామం వీణ పెట్టి తెరిచి చూసి ఆశ్చర్య పడ్డాడు-- అందులో వీణ ఉంది. శవం లేదు.
"అరే-- ఇందులో వీణ ఉంది!" అన్నాడు రామం ఆశ్చర్యంగా.
ఆ యువకుడు నవ్వుతూ -- "వీణ పెట్టెలో వీణ లుండక శవాలుంటాయా?" అన్నాడు.
రామం ఉలిక్కిపడి -- "కానీ -- ఇందులో శవమే ఉండాలి!" అన్నాడు.
ఆ యువకుడతని వంక తీవ్రంగా చూసి -- "ఇలాంటి జోకులు నాకు నచ్చవు --" అన్నాడు.
10
రామానికి సునంద వివరాలు తెలియలేదు. రెండు రోజులు అతడు వృధా ప్రయత్నాలు చేసి విసిగిపోయాడు. మూడో రోజు బీచికి వెడితే అతడికి అక్కడ సునంద కనబడింది. ఆశ్చర్యంగా అతడామెను సమీపించి -- "నువిక్కడున్నావా ?' అన్నాడు.
ఆమె నవ్వి -- నీ పేరు రామం కదూ -- ' అంది.
"ఇంకా నయం- నన్నేరాగనన్నావు కాదు...." అంటూ అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు రామం. ఆమె ఇబ్బందిగా కాస్త పక్కకు కదిలింది.
"నువ్వు హంతకురాలివి....." అన్నాడు రామం.
"నువ్వు మోసగాడివి....." అంది సునంద.
"నేను హంతకురాలి కే మోసగాడినెమో!" అన్నాడు రామం.
"బాగా చెప్పావు. అయితే నేను హంతకురాలినని మోసగించానేమో -- ఆ విషయం ఊహించావా?" అంది సునంద.
రామం ఉలిక్కిపడి - "నువ్వు నన్ను చాలా విధాలుగా మోసం చేశావేమోనని నాకు అనుమానంగా వుంది-"అన్నాడు.
"అవును చేశాను...."అంది సునంద తాపీగా.
"ఎందుకు?" అన్నాడు రామం.
"అందుకు నువ్వే కారణం ....." అంది సునంద.
"నేనా?"రామం ఆశ్చర్యపడ్డాడు.
"అవును, నువ్వే? ఈ ఊళ్ళోని కళ్యాణి దియేటర్ మాదేనన్నావు. మీ నాన్న నీకా దియేటర్ వదిలేస్తాడన్నావు. మీకింకా చాలా వ్యాపారాలున్నాయన్నావు. నిన్ను పెళ్ళి చేసుకోమని మీ నాన్న, ఆడపిల్లల తండ్రులు బలవంత పెడుతున్నారన్నావు. ఇవన్నీ చెప్పి నన్ను పెళ్ళి చేసుకుంటానన్నావు .....గుర్తుందా" అంది సునంద.
"గుర్తుంది."
'నువ్వు చెప్పిందాంట్లో నీవాళ్ళ గురించే కానీ నీ గురించి ఏమీ లేదు. నీ చుట్టూ వున్న వాతావరణం చూసుకుని అది నీ గొప్పతనమేనన్నట్లు మాట్లాడావు. రెండ్రోజులు కాలేజీ చుట్టూ తిరిగి -- నా క్లాసు వివరాలు తెలుసుకున్న నువ్వు -- నీవాళ్ళ వివరాలు చెప్పగానే యెగిరి గంతేసి నీతో పెళ్ళికి ఒప్పుకుంటాననుకున్నావు. కానీ నేను నీకు నా వాళ్ళ గురించి చెప్పదల్చుకోలేదు. నా అర్హతల గురించి కూడా మాట్లాడదల్చుకోలేదు. నేనేం చేయగలనో చేసి చూపించాను. ఇరవై నాలుగు గంటల్లో నిన్నూ, మీ నాన్నానూ గడగడలాడించాను. మీ జాతకాలు మారిపోయేలా చేయగలను. ఇప్పుడు నీకు నా ప్రేమ భిక్ష అడిగే అర్హత ఉన్నదో లేదో ఆలోచించుకో -- " అంది సునంద.
రామం ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తున్నాడు.
"నేను అహంకారాన్ని సహించను. మరోసారి నా దగ్గర అహంకారాన్ని ప్రదర్శించకు...."అంది సునంద.
"ఎలా సాధించావన్నీ!" అన్నాడు రామం.
'అవన్నీ నీకెందుకు చెప్పాలి?" అంది సునంద.
"నా కళ్ళ ముందు సుందరాన్ని చంపావు. దాంతో నా మతి పోయింది. అదెలా జరిగిందో ఇప్పటికీ నేనూహించ లేకపోతున్నాను...." అన్నాడు రామం.
"అదో పెద్ద సందేహమా? నాతొ రా ...." అంటూ సునంద లేచింది. ఇద్దరూ బీచి రోడ్డు మీదకు వచ్చారు. అక్కడ ఓ పిట్టగోడ కు అంటించిన పోస్టర్ రామానికి చూపించింది సునంద.
"ప్రముఖ మెజీషియన్ , హిప్నాటిస్ట్ డాక్టర్ సుందర్రావు అద్భుత మహేంద్ర జాల ప్రదర్శన ...." అని వుంది దాని మీద. పోస్టర్ మీద ఓ యువకుడి బొమ్మ ఉన్నది. అతడి గుండేల్లోకీ కత్తి దిగి వున్నది. కత్తి దిగిన చోట నుంచి రక్తం ధారలుగా కారుతున్నది.
"సుందర్రావు నా బావ!" అంది సునంద -- "నిన్ను సాధించడం లో అతడు చాలా చోట్ల నాకు సాయపడ్డాడు. అతడి కారణంగానే ఎవరైనా మేమడిగింది చేయడానికి ఒప్పుకున్నారు. మీ రంగడిని తేలికగా మన్ను కరిపించింది అతనే! మీ షెడ్లో బాంబు పెట్టించింది అతనే!"
"మరి కాంతారావు గారు మా యింటికి వీణ పెట్టి పంపుతారని నీకెలా తెలుసు!" అన్నాడు రామం.
"అది తెలిసే కదా పధకం మొత్తం బావ రూపొందించాడు...." అని నవ్వింది సునంద.
"అదే....అదే.... ఎలా తెలిసింది ?"
"కాంతారావు గారు మా నాన్నగారు ...." అంది సునంద.
రామానికి నోట మాట రాలేదు.
"నా ఎదుట చాలా గొప్పలు చెప్పావు. నువ్వూ మీ నాన్నా కలిసి మా యింటి కొచ్చి నాముందు లెంప లేసుకుంటే మా నాన్నగారికి అసలు విషయం చెప్పి మళ్ళీ మీ వ్యాపారం వృద్ది పొందేలా చేస్తాను. ఆలోచించుకో!"
రామం అక్కడే కూర్చుండి పోయాడు.
సునంద లేచి వెళ్ళిపోయింది. అప్పుడామే ఈ ప్రపంచానికే మహరాణిలా నడుస్తోంది.
----అయిపొయింది-------
