4
అనుకున్న ప్రకారం ముగ్గురూ వాళ్ళవాళ్ళ యిళ్ళదగ్గర చెప్పి-సూర్యారావు గదికి బయలుదేరారు. ఆ స్మగ్లర్లు అంతవరకూ ఎవరిళ్ళకూ వెళ్ళలేదని రూడి అయింది. దారిలో రామారావు సూర్యారావు హోటల్లో భోజనంచేశారు.
గది చేరుకున్నాక-"మనకు కాలక్షేపమెలా అవుతుంది కాసేపు పేకాడదాం...." అన్నాడు సాంబమూర్తి.
"అలాగేకాని గది తలుపులు గడియవేసేయ్...." అన్నాడు రంగనాధం.
"రాత్రి పడుకునేటప్పుడు తప్ప అలాచేయడం నా కలవాటులేదే-" అన్నాడు సూర్యారావు.
"అవుననుకో కానీ ఇప్పటి పరిస్థితివేరు. హఠాత్తుగా తలుపులు తోసుకొని స్మగ్లర్ వచ్చాడనుకో. మనం సిద్దపడి వుండం. వాడే ఆయుధాన్నయినా చూసి బెదిరించవచ్చు. అలాగాకుండా తలుపు వేసివుంటే వాడు తలుపు తడతాడుకదా. అప్పుడు మనం పొజిషన్స్ టేకప్ చేసి తలుపులు తీయవచ్చు. సులభంగా పట్టుబడే అవకాశముంటుంది...." అన్నాడు రంగనాధం.
"రంగనాధం చెప్పింది బాగానేవుంది..." అన్నాడు సాంబమూర్తి. అతనేవెళ్ళి గది తలుపులు వేసి వచ్చాడు కూడా.
తర్వాత పేకాట ప్రారంభమయింది. జోరుగానే కొనసాగింది ఓపావు గంటసేపు. అంతలో ఎవరో తలుపులు తట్టారు.
మిత్రులందరూ ఒకర్నొకరు హెచ్చరించుకొని ముగ్గురు తలోమూల నక్కారు. రంగనాధం వెళ్ళి తలుపులుతీశాడు. మిగతా ముగ్గురూ ఊపిరిబిగబట్టి జరగబోయే దానికోసం ఎదురుచూస్తున్నారు.
తలుపులు తెరుచుకోగానే వచ్చిన ఆడమనిషిని చూసి సూర్యారావు నవ్వుకుంటూ తన స్థానంలోంచి బయటకు వచ్చాడు.
ఆమె ఎదురింటివాళ్ళ పనిమనిషి. తమదగ్గర తీసుకున్న పత్రిక ఈమెద్వారా తిరిగి పంపించారు వీళ్ళు. పత్రిక అందుకోగానే ఆమె వెళ్ళిపోయింది. రంగనాధం తలుపులు వేసి-"నా గుండె లింకా కొట్టుకుంటూనే వున్నాయ్...." అన్నాడు.
"అందుకేగా నిన్ను తలుపులు తీయమన్నది. నిన్ను చాటునపెడితే ఇవతలవాళ్ళు చస్తున్నా బయటకు రావు...." అన్నాడు.
"బాగుంది-నా దగ్గరున్న కెమేరా మీ అందరి దగ్గరున్న వస్తువులకన్నా విలువైనది...." అన్నాడు రంగనాధం.
"విలువ అవసరాన్నిబట్టి వాడు ఇంట్లోంచి పారిపోవాలనుకుంటే నా బాల్ పెన్నే ఉపయోగిస్తుంది. కెమేరా ఎందుకు? దేని విలువ దానిది...." అన్నాడు రామారావు.
"అదీ నిజమే!" అన్నాడు రంగనాధం.
ముగ్గురూ వారివారి వస్తువులు బయటపెట్టి వాటిని పరీక్షించసాగారు.
"వాడింక మన దగ్గరకు రాడని నాకు అనుమానంగా వుంది. వాడి స్మగ్లింగ్ కు ఈమూడు వస్తువులుబాగా ఉపయోగ పడుతున్నట్లున్నాయి. మనంకూడా వీటినుపయోగించి స్మగ్లింగ్ ప్రారంభిస్తే...." అన్నాడు సూర్యారావు.
"అలా ఎలా కుదుర్తుంది? వాడేదో ముఠాకు చెందిన వాడయివుంటాడు. ఇంకా రకరకాల వస్తువులుపయోగిస్తూండి వుంటాడు. నాడా దొరికింది గదా అని గుర్రంకొనమన్నట్లుంది నీ ఆలోచన...." అన్నాడు సాంబమూర్తి.
తిరిగి పేకాట ప్రారంభమయింది. మూడో రౌండు అయింది. మూడుసార్లు రామారావు ఆల్ కౌంట్ ఇచ్చాడు. నాలుగోసారికూడా అతనికి ముక్కలు సరిగా కలవలేదు. చాలా విసుగ్గా వుందతనికి. ఆటయింకా రెండుసార్లు తిరక్కుండానే సాంబమూర్తి షో అన్నాడు. రామారావు పేకముక్కలు నేలమీద విసిరికొట్టాడు. మళ్ళీ ఆల్ కౌంట్!
అలా విలాసంలో రెండుపేకలు జారి మంచంక్రిందకు వెళ్ళిపోయాయి.
"మరీ అంత విసురు పనికిరాదు. రేపు పెళ్ళయితే ఏంచేస్తావ్?"-అన్నాడు సాంబమూర్తి.
రంగనాథం నవ్వుతూ-"ఆడవాళ్ళకి పేకాట చాలా ఇష్టం. కానీ ఓడిపోవడం వాళ్ళకిష్టముండదు. పేకాటలో ఓడారో-ఆరోజు మగాడికి భోజనముండదు. అందుకే వాళ్ళతో ఆడేప్పుడు-నెగ్గడానికి కాక. ఓడడానికే ఆడతాను నేను అఫ్ కోర్స్-వాళ్ళ చేతిలో ఓడిపోవడమే ఎక్కువ బాగుంటుంది కూడా..." అన్నాడు.
"మరింకా నాకలాంటి అలవాట్లు లేవుకదా...." అంటూ రామారావు లేచాడు-మంచంక్రింద పడిన పేకముక్కలు తీయడానికి.
"దూరగలవా మంచం క్రిందకు....." అన్నాడు సూర్యారావు నవ్వుతూ.
"ఇదీ అలవాటు లేనిపనే అనుకోవాలి. కానీ తప్పదు" అంటూ రామారావు ముందుకు నడిచాడు. అంతలోనే వెనక్కి రెండడుగులు వేశాడు. కారణం-మంచంకింద నుంచి ఆ రెండు పేకముక్కలు వాటంతటవే వెనక్కు వచ్చేశాయ్.
"మైగాడ్-మంచంకింద ఎవరో ఉన్నారు!" అన్నాడు రంగనాధం. అతనిలో బెదురు ప్రారంభమయింది.
అప్పుడే మంచం క్రిందనుంచి చటుక్కున ఒకవ్యక్తి లేచి వచ్చాడు.
"ఎస్-అయాం స్మగ్లర్ హియర్. ఒకరు మాత్రం ఎవరూ ఉన్నచోటునించి కదలవద్దు....."
అతని చేతిలో రివాల్వర్ ఉంది.
"ఉదయం నన్నెవరో వెంటాడుతుంటే తప్పించుకొని ఈగదిలో దూరాను. అప్పుడీగదిలో మనిషి స్నానంచేస్తున్నాడు. స్నానం పూర్తయ్యేసరికి నేను మంచంక్రింద దూరాను. అతను వెంటనే వెళ్ళిపోతాడనుకోలేదు. కానీ క్షణాల మీద తాళం వేసికొని వెళ్ళిపోయాడు. నా వస్తువులు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదామనుకున్న నేను అనవసరంగా ఇక్కడ చిక్కడిపోయాను. కానీ నా అదృష్టం కొద్దీ మీరంతా ఈగదికే వచ్చారు నా వస్తువులతో సహా. జీవితంలో అదృష్టం ఇంతగా తటస్థపడటం యిదేమొదటి సారి నాకు. మీ యందరికీ నా ధన్యవాదాలు. ఆ వస్తువుల నాలాగే వదిలేసి మీరు బాత్రూంలోకి వెళ్ళండి. లేకపోతే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను...." అన్నాడతడు.
మిత్రులు నలుగురి ముఖాల్లోనూ కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. నలుగురూ బాత్రూంలోకి నడిచారు. అతడు బయటనించి బాత్రూం తలుపులు వేసేశాడు. ఆ తర్వాత అక్కడున్న తన వస్తువులు తీసుకొని.....తనవేషం త్వర త్వరగా మార్చుకొన్నాడు. గదిలోంచి బయటపడి తలుపులు దగ్గరగా వేసాడు. ఆ తర్వాత బయట జనంలో కలసిపోయాడు.
బాత్రూంలో మిత్రులు సూర్యారవుని తిడుతున్నారు-"ఉయ్యాల్లో పిల్లాడినెత్తుకొని ఊరంతా వెదికినట్లు-ఇంట్లోనే వాన్నుంచుకొని తెలుసుకోలేక పోయావు. నీ మూలంగానే పదివేలు పోయాయి మనకు...."
"నాగదిలో నాకుచెప్పి దూరలేదుగదా వాడు. అసలే డబ్బవసరంలోకూడా ఉన్నా నేను...." అంటూవాపోయాడు సూర్యారావు.
"సరే-ఈగదిలోంచి బయటపడే మార్గం చూడండి. సెలవుపూటా ఇంట్లోనయినా గడపకపోతే మా ఆవిడ గోలెడుతుంది. డబ్బాశ ఎలాగూ తీరలేదుగదా!" అన్నాడు రంగనాధం.
మిత్రులు నలుగురూ దివాలా తీసిన మొఖాల్తో గది బయటపడే మార్గం గురించి ఆలోచించసాగారు.
* * *
