బాత్రూంలో దీపం వెలుగుతుందని నాకు తెలుసును. నాకున్నదల్లా ఒక్కటే అనుమానం. బయట వున్న దొంగ ఈపాటికి బాత్రూములో చేరుకుంటే అతను నన్నిప్పుడు దెబ్బతీయవచ్చు. అందువల్ల నేను కాసేపు జాగ్రత్తపడవలసి వుంటుంది. అందుకే బోల్టు వదులుచేసి ఓ నిమిషం ఆగాను.
అటువైపునుంచి నాకేవిధమైన చలనమూ తోచలేదు. ఒకటి.....రెండు....మూడు......నిముషాలు గడిచాయి. ఏమీ జరుగలేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
బాత్రూములో శత్రువున్నాడో లేడో తెలియని విచిత్ర పరిస్థితి.....మరో నిముషం ఎదురు చూసి ఆఖరికి ధైర్యం చేసి బాత్రూములో అడుగు పెట్టాను. అక్కడ ఎవరూ లేరు.
ఎన్నడూ లేనిది నాకా క్షణంలో భయం కలిగింది. శత్రువున్నాడన్న అనుమానం కలిగినప్పుడు అతను కనిపించేవరకూ బెంగగా వుంటుంది. ఎక్కడో శత్రువుండి తీరాలి. అతను నా కోసం ఎక్కడ పొంచి వున్నాడో తెలియదు.
బాత్రూమ్ పరిస్థితి చూడగానే నా బెంగ అధికమైంది. అక్కడ కిటికీ రెక్కలు బార్లా తెరిచి వున్నాయి. కోయబాడినంత మేరా అద్దంలో ఖాళీ స్పష్టంగా తెలుస్తూనేవుంది.
అంటే ఆమె కిటికీ రెక్కలు మూయలేదన్న మాట. ఎందుకు తెరిచి వుంచింది? గోడ దూకిన వ్యక్తి ఆమెకు కావలసినవాడేమో? ఆమెకు కావలసినవాడైతే గోడ దూకి ఎందుకు వస్తాడు? వారిద్దరికీ ఏదైనా అక్రమ సంబంధం వుందా? అతని కోసమే ఆమె బాత్రూం తలుపులు తెరిచి వుంచిందా?
అదే సమయంలో నాకు బయట పోలీస్ విజిల్ విని పించింది. ఆ ఈల నేనెంత దూరంనుంచీ కూడా విని గుర్తించగలను. ఈ సమయంలో అది మ్రోగిందంటే ఎక్కడో దొంగని గుర్తించి తరుముతున్నారన్నమాట. ఈ సమయంలో నేను బయటకు వెళ్ళానంటే చాలా ప్రమాదం!
నాకు తెగింపు వచ్చింది. బాత్రూమ్ తలుపు మళ్ళీ వేసేసి, నా మూటతోసహా మళ్ళీ ఆమె పడక గదిలోకి వెళ్ళాను.
అలా నేను వెళ్ళడంలో నాకు దురుద్దేశ్యమేమీ లేదు. బట్టలున్న బీరువాలో ఓ బ్రీఫ్ కేస్ చూశాను. మూటలోని సామానుని బ్రీఫ్ కేసులోకి మార్చేసి-వీధి గుమ్మం లోంచే స్టెయిలుగా బయట పడవచ్చునని నా ఆశ.
నేనామె పడక గదిలోకి వెళ్ళేసరికి ఆమె మంచం మీద లేదు. అద్దం ముందు నిలబడి చీర కట్టుకుంటోంది. నేను వులిక్కిపడి వెనక్కడుగు వేశాను.
"రండి లోపలకు-అనుకున్నదంతా అయింది. ఇంట్లోదంతా ఎవడో ఊడ్చుకుపోయాడు. మీరుకాస్త ముందుగా వచ్చి వుండాల్సింది...." అందామె.
నేను ఆశ్చర్యపడ్డాను. ఆమె ఎవరినుద్దేశించి మాట్లాడుతుందో నా కర్ధంకాలేదు.
"మీకోసం తలుపులన్నీ తీశానా-ఎవరో అప్పటికే నా గదిలో దూరి వున్నాడు. నేను గదిలోకి రాగానే స్పృహ పోగొట్టాడు. బీరువా అంతా ఊడ్చేసినట్లున్నాడు. విలువయినవేమీ మిగలలేదు. ఇప్పుడే నాకు మెలకువ వచ్చింది" అందామె.
ఏం చేయాలో తెలీలేదు నాకు. ఆమెనన్ను తన మనిషనుకుని పొరబడుతోందా? నా ముఖానవున్న ముసుగు తొలగిస్తే ఆమె ఏం చేస్తుంది?
జీవితంలో ఇటువంటి అనుభవం ఎన్నడూ నా కెదురుకాలేదు. ఈమె నాటక మాడుతున్నట్లుగా కూడా నాకనుమానంగా వుంది. అయితే నాటకమాడి ఆమె సాధించదల్చుకున్న దేమిటి? నేను దొంగను కావడంవల్ల అందర్నీ అనుమానించడమే కానీ-ప్రపంచంలో అంతా నాకులాగే వుంటారా?
అయితే ఈమె మరీ అంత సామాన్యురాలనుకోవడానికి వీల్లేదు. ఈమెకోసం ఓ మనిషి పెరటిగోడదూకి వచ్చాడు. ఆ మనిషేనేనని ఈమె అనుకోవడం గానీ-అలా నటించడం కానీ చేస్తున్నది.
నేను కూడా వెంటనే తేలిపోదల్చుకోలేదు. చలించకుండా ఆమె బట్టలు ధరిస్తూన్నది కాబట్టి, గోడదూకిన మనిషికి ఈమెకూ విపరీతమైన చనువుండి వుండాలి. అందుకే మాట్లాడకుండా మరో రెండడుగులు ముందుకు వేశాను.
"ఏదో పెద్దమూటే తెచ్చారే"-అద్దం ముందునుంచి ఉత్సాహంగా నాదగ్గర కొచ్చిందామె. నేను మాట్లాడలేదు. "ఇంకా ఎందుకండీ ఆ ముసుగు...." అంటూ ఆమె నాకు మరింత దగ్గరగావచ్చింది. నాలో రవంత ఆవేశం కలిగింది. ఆమె నన్ను తనకు చనువయిన మగవాడిగా బావిస్తోంది.
ఆమె నా ముసుగును తొలగించకుండా జాగ్రత్త పడ్డాను. మూట క్రిందకుదింపి చేతులు జాపాను.....
బయట పోలీస్ విజిల్ మళ్ళీ వినిపించింది.
అదే సమయంలో నా వీపుమీద ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. మోసం జరిగిపోయింది. నేనింకేదో చేద్దామనుకుంటూనే నిస్సహాయుడనై తలవాల్చేశాను.
* * *
కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఆమె నవ్వుతూ కనబడింది. నాకాళ్ళూ, చేతులూ స్వాధీనంలో లేవు. తాళ్ళతో కట్టబడి వున్నాయి.
"ఎవర్నువ్వు?" అందామె కటువుగా.
మాట్లాడలేదు నేను.
"ఎందుకొచ్చావిక్కడికి?" మళ్ళీ అడిగిందామె.
నేను మౌనంగా ఆమెవంకే చూస్తున్నాను. నాబుర్రలో రకరకాల ఆలోచనలు కదిలిపోతున్నాయ్. ఆమె నావంక చిత్రంగాచూసి-"నిన్ను పోలీసుల కప్పజెబుతాను...." అంది.
నాగుండె బెదిరింది. అయినా మాట్లాడలేదు నేను.
"మూగవాడివా?"
నేనేమీ మాట్లాడకుండా ఆమెవంకే చూస్తున్నాను.
"నీకు ఆశచాలా ఎక్కువగావుంది. మాయింట్లో వున్న దంతా దోచేద్దామనుకున్నావు. మేమేమై పోవాలనుకున్నావ్-" అందామె.
నేను మాట్లాడనని ఎలాగూ తెలిసినట్లుంది-నిముషం ఆగి-"నీ క్లోరోఫాం నామీద ఎంతోసేపు ప్రభావం చూపలేదు. నిన్నోకంట కనిపెట్టాను. నిన్ను తక్షణం పోలీసుల కప్పజెబుదును. కానీ నీ మంచిగుణం నన్నాకర్షించింది. ఒంటరిగావున్న అందమైన ఆడదాన్ని నీకులావదిలి పెట్టే మగవాడు-దొంగ కావడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం-" అంది.
దొంగ కావడమే నన్నామె ననుభవించే అదృష్టానికి దూరం చేసిందని నాకు తెలుసు. నాకు స్త్రీ వ్యసనమున్నట్లు ఆమెకు తెలిసుండదు.
"నిన్ను వదిలిపెడతాను. కానీ ఇంకెప్పుడూ దొంగతనాలు చేసిందని నాకు తెలుసు. నాకు స్త్రీ వ్యసనమున్నట్లు ఆమెకు తెలిసుండదు.
"నేనిచ్చే మాటకు విలువుండదు. నమ్ముతానంటే ఈ క్షణంలో మాటిస్తాను. కానీ నాక్కూడా నీనుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది. చెబుతావా?"
"అడుగు.....?"
గోడదూకిన వ్యక్తిగురించి నాకున్న సందేహాలన్నీ అడిగేశాను.
ఆమె ముఖం బాధగా అయిపోయింది-"ఆయన నా భర్త. కానీ ఆ విషయం పదిమందికీ చెప్పుకోలేని స్థితిలో వున్నారు. ఆయన ఓ దొంగ. ఓసారి దొంగతనం చేసి పట్టుబడ్డారాయన. అప్పట్నుంచీ నేను మకాంమార్చి, ఇక్కడ వడ్డీ వ్యాపారం చేసి జీవియ్తం వెళ్ళబుచ్చుతున్నాను. మా వారు దూరప్రాంతంలో పెద్ద వుద్యోగంలో వున్నట్లు అందరికీ చెప్పుకుంటాను.
ఇటీవలే ఆయన జైలునించి తప్పించుకున్నారు. నేనంటే వెర్రిప్రేమ ఆయనకు. పగలంతా ఎక్కడగడుపుతారో తెలియదు. రాత్రికి మాత్రం నా దగ్గరకు వచ్చి వెడతారు. ఎంత ప్రేమతో వస్తేనేం - బెదురు బెదురుగా వుంటారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.....ఆయన సంపాదించిన దొంగసొమ్ముతోనే నా జీవితం హాయిగా వెళ్ళిపోతోంది. కానీ అటు ఆయనకూ ఇటు నాకూ సుఖంలేదు. ఈ జన్మకు మా జీవితం సక్రమంగా వుంటుందనీ తోచదు."
ఆమె ఒక దొంగకు భార్య అని తెలియగానే నాకు నా భార్య గుర్తుకు వచ్చింది. కట్టుబడివున్న నాకాళ్ళూ, చేతులూ పోలీస్ స్టేషన్ని గుర్తుచేశాయి.
గోడ దూకుతున్న ఆమెభర్త-బాత్రూం తలుపులు-కిటికీ దగ్గర ఆమె-పోలీస్ విజిల్-రకరకాలుగా గుర్తు వస్తున్నాయి.
ఎంత సంపాదించినా దొంగ బ్రతుకు దొంగబ్రతుకే. దురలవాట్లతో నా భార్యకు అన్యాయం చేస్తున్నాననీ దొంగతనంచేసి సంపాదించిన డబ్బుతో నా భార్యను ఆఫీసర్ల భార్యల స్థాయికి తీసుకురావాలనీ అనుకుంటున్నాను. కానీ దొంగ బ్రతుకు దొంగబ్రతుకేననీ-దొంగతనాలు మానితే తప్ప, ఆ బ్రతుకు తీరుతెన్నులు మారవనీ ఇప్పుడే అర్ధమయింది నాకు.
మర్నాడు వుదయం నాకు మెలకువ వచ్చేసరికి, ఆమె ఇంటి వీధి అరుగు మీద వున్నాను.
ఆమెకు మాటిచ్చానో లేదో నాకు గుర్తులేదు కానీ-గోడ దూకుతున్న నేనూ-ఆ ఇంట్లో నా భార్య నా వూహాపథంలో మెదులుతున్నారు.
* * *
