Previous Page Next Page 
విశాలి పేజి 20


    గట్టిగా నిట్టూర్చి సూట్ కేసు అందుకున్నాడు రాజేంద్ర.
    "సరే, వస్తాను." పెద్ద పెద్ద అంగలతో బయట చీకట్లో కలిసిపోయాడు-
    "ఏడి వాడు? ఎక్కడా?"
    రామం ప్రశ్నకి నీరసంగా జవాబిచ్చింది విశాలి: "వెళ్ళిపోయారు."
    పగలబడి నవ్వాడు రామం.
    "వెళ్ళిపోయాడా? హూఁ! నే నంటే హడల్ పుట్టింది" అంటూనే విసురుగా విశాలి ముందుకి వచ్చిపడ్డాడు. "చెప్పు. ఎప్పటినించీ మీ రిద్దరూ ఈ నాటకం ఆడుతున్నారు?"
    మారు మాట్లాడకుండా అన్నయ్య చేతిని పట్టుకొని గదిలోకి తీసుకువెళ్ళింది విశాలి.
    చెప్పులు విసురుగా చెరో మూలా విసిరి మంచం మీద వాలిపోయాడు రామం-
    జరిగింది తలుచుకుని కుమిలిపోయింది విశాలి.
    "నేను మీతో ఒక విషయం మాట్లాడాలి' అన్న రాజేంద్ర మాటలే చెవుల్లో మోగుతుండగా ఆ విషయం ఏమిటై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది.    
    ఎంతో అభిమానంతో వచ్చిన స్నేహితుడికి ఆదరణ లభించకపోవడమేకాక ఎటువంటి మాటలతో వెళ్ళగొట్ట వలసి వచ్చింది! ఆలోచనలో ఆ రాత్రంతా నిద్ర పట్ట లేదు విశాలికి.

                               *    *    *

    తెల్లారి లేచిన తరవాత, రాత్రి ఏమీ జరగనట్టే చాలా మామూలుగా తిరిగాడు రామం.
    అలా ఉండలేకపోయింది విశాలి.
    అన్నయ్య ముఖంలోకి చూడటానికికూడా ఇష్టం లేకపోయింది.    
    'చెల్లెలు అనైనా లేకుండా ఎటువంటి మాట అన్నాడు రాత్రి!' పదే పదే రాత్రి సంఘటన గుర్తు వచ్చి రామంమీద కోపం అంతెత్తున లేచింది.
    మళ్ళీ అంతలోనే కోపం జారిపోయి జాలి నిండిందా అనురాగమయి ఎదలో.
    అవునుమరి! తాగిన మైకంలో అన్న మాట లవి. వాటిని లెక్కచెయ్యవలసిన అవసరం ఏమిటి?
    అసలు తాగడం మాత్రం మంచిపనా?
    అన్నయ్యతో చెప్పాలి, ఆ అలవాటు మానుకోమని, జీవితం, ఆరోగ్యం నాశనం చేసుకోవద్దని.
    అప్పుడే చాలా రోజులైంది అన్నయ్య ఈ అలవాటుకి దాసుడై.
    కానీ ఎలా? ఎలా చెప్పాలి అన్నయ్యతో? తనమాట లక్ష్య పెట్టడు.
    ఒక రోజు తను చెప్పడానికి ప్రయత్నించడం, చీవాట్లు తినడంకూడా అయ్యాయి.
    ఇవన్నీ చూడటానికి, చిత్రహింస మానసికంగా అనుభవించడానికీ తప్ప తనెందుకు బ్రతికి ఉన్నట్టు?
    "అత్తా! నాకు పలవ చేసిపెట్టు." కాగితం పట్టుకుని చేతులూ, కళ్ళూ తిప్పుతూ అడుగుతున్న రాజేంద్రని కౌగిట్లోకి తీసుకుంది.
    "అవునురా! మీ అమ్మ కిచ్చిన మాట నిలబెట్టుకో డానికి నేను బ్రతకాలి. నీ కోసం..."
    ముద్దులతో వాడి ముఖం నింపింది. ఉక్కిరి బిక్కిరై బిత్తరచూపులు చూశాడు వాడు.
    
                               *    *    *

    రోజులు భారంగా గడుస్తున్నాయి విశాలికి.
    రోజులు మైకంలో నడుస్తున్నాయి రామానికి.
    వ్యాపారంలో అశ్రద్ధ ఎక్కువై, నిర్లక్ష్యం పెరిగిపోయింది.
    అన్నయ్యని చూసి అపరిమితమైన జాలితో కన్నీరు కారుస్తూంది విశాలి.
    చెల్లెల్ని చూసి పలకరించడానికికూడా అట్టే ఇష్టం ఉండక ముఖం చాటేస్తాడు రామం.
    కొన్నాళ్ళలో ఈ మనిషికి పిచ్చెత్తుతుందేమో అన్నట్టు ఉంటున్నాడు.
    ఎవరితోనూ మాట్లాడడు.
    సీసాలకి సీసాలు తాగి పొట్ట నింపుకుంటాడు. నిద్రలో అస్తమానం "విజయా! విజయా!" అంటూ పలవరిస్తాడు.
    "నాది తప్పే కావచ్చు. నన్ను క్షమించలేవా?" అంటాడు. చటుక్కున లేచి కూర్చుని చుట్టూ చూస్తాడు పిచ్చిగా.
    కన్నీరు కారుస్తాడు నిస్సహాయంగా.
    అంతా చూస్తూ కూడా ఏమీ చెయ్యలేక అర్ధంకాని అయోమయంలో పడింది విశాలి.
    మొత్తం మీద పరిస్థితి మాత్రం అన్నయ్య ప్రవర్తనని బట్టి, పలవరింతల్ని బట్టి అర్ధం చేసుకుంది.
    కానీ ఆ విజయ మాత్రం అన్నయ్యకి ఎందుకు దూరంగా తొలగిపోయిందో, అసలు వాళ్ళిద్దరికీ మధ్య ఏం గొడవలొచ్చాయో అది అర్ధంకాక ఆ సమస్యలోనే రోజులు నెట్టుకొస్తూంది.
    ఆ రోజు రాత్రి చిత్రమైన కల వచ్చింది విశాలికి.
    ఒంటరిగా కూర్చుని కన్నీరు కారుస్తూంది మహాలక్ష్మి.
    "వదినా! ఎందుకలా దుఃఖిస్తున్నావు? నాతో చెప్పవా?" దగ్గరగా వెళ్ళింది విశాలి.
    "విశాలీ! నే నంటే నీ కిష్టమేనా?"
    "అదేమి టొదినా? అలా అడుగుతావు! నీకు తెలియదూ?" మృదువుగా వదిన చేతి నందుకుంది విశాలి.
    "అయితే మరి నా కోరిక తీర్చు. మీ అన్నయ్యని మళ్ళీ మమూలు మనిషిని చెయ్యి. ఏం కావాలో అది ఇస్తే మళ్ళీ మామూలు మనిషి కావడాని కెన్నో రోజులు పట్టదు. లేకపోతే పరిస్థితి విషమించి....అబ్బ! తలుచుకుంటేనే భయంగా ఉంది."
    "కానీ! వదినా!..." ఏదో అడగబోయింది విశాలి.
    అదృశ్యమైంది మహాలక్ష్మి.
    మెలకువ వచ్చింది విశాలికి.
    పక్కనే పడుకున్న రాజేంద్ర చిన్ని చెయ్యి తన చేతిలో ఉంది.
    చాలాసేపు ఆ కల గురించే ఆలోచిస్తూ ఉండి పోయింది.
    అన్నయ్య మళ్ళీ నవ్వుతూ, సంతోషంగా, బాధలన్నీ మరిచి బ్రతుకు మీద ఆశతో జీవితం సాగించేటట్టు చేయడం తనవల్ల అవుతుందా?

                            *    *    *

                     

    "నే నొకటి అడుగుతాను, రామం! ఏమనుకోవు కదా?"
    రాజేంద్ర ప్రశ్నకి కొద్దిగా తడబడ్డాడు రామం. ఏమడుగుతాడు? నువ్వెందుకిలా తాగుతావు? ఇల్లూ, ఒళ్ళూ గుల్ల చేసుకుంటావెందుకు? బుద్దిగా ఉండరాదా? అంటాడేమో?
    రామం ఆలోచనలకి విరుద్ధంగా రాజేంద్ర నోటి నుంచి వెలువడింది ప్రశ్న.
    "నీ చెల్లెల్ని తన జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని మనఃస్ఫూర్తిగా కోరుతూ తనంత తనే వచ్చి నిన్ను అడిగితే ఆ వ్యక్తికి ఏం చెపుతావు?"
    ఆ ప్రశ్నతో విస్తుపోయిన రామం మనసు ఒక్క నిమిషం ఆలోచించి, ఏదో తట్టినట్లయి అంతలోనే తేరుకుంది.
    తనకి లేని సుఖం తన చెల్లెలికి మాత్రం ఎందుకు ఉండాలి? తన స్నేహితుడికి మాత్రం ఎందుకూ? మొదటినించీ రాజేంద్ర మీద ఉన్న ఈర్ష్యాసూయల తోనే ఆలోచించాడు రామం.    
    పాషాణహృదయం కరగడమన్నది కల్ల అని నిరూపించుకున్నాడు.
    కుర్చీమీద వేలితో రాస్తూ, బలవంతంగా పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చుకుని అన్నాడు: "అటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చినా విశాలి ఒప్పుకోదు. ఎందుకంటే రాజేంద్రని పెంచి పెద్దచేసే బాధ్యత తన మీద ఉంచుకుంది విశాలి. రాజేంద్ర నా ఎదురుగా, నా ఇంట్లో తప్ప వేరేచోట ఉండడానికి నే నొప్పుకోను. ఏదైనా వదులుకుంటుందిగానీ తన మేనల్లుడిని వదులుకోదు విశాలి. వాడిని విడిచి దూరంగా బ్రతకలేదు. అందుకని విశాలి వివాహాని కిష్టపడుతుందన్న నమ్మకం లేదు నాకు" అప్పుడే అటు వచ్చి ఈ సంభాషణ విన్న విశాలి కంటినీటితో కదిలిపోయిందక్కడినించి.
    రామం జవాబుతో రాజేంద్ర కన్నులుకూడా తడిశాయి.
    'నీ మీద కే నిందా రాకుండా ఎంత డొంక తిరుగుడుగా చెప్పావు, రామం? అసలు సంగతి నీ కిష్టం లేదిది. కానీ, నీ అయిష్టం పైకి కనపడనీయకుండాం నీ చెల్లెలి ముందరి కాళ్ళకిబంధాలు వేస్తున్నావు. నీ చెల్లెలు సుఖపడటం నీకు మాత్రం సంతోషం కాదూ? నా చెల్లెలి జీవితం ఇప్పటికైనా ఒక దారిన పడితే నాకు మాత్రం ఇష్టం కాదా? అని జవాబు చెప్పవలసింది పోయి, నీ కొడుకు బాధ్యత తనదేనని, దానికోసం ఈ ఇల్లు వదిలి పోదని ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు?' తనలో తఃనే పరిపరివిధాల వాపోయాడు రాజేంద్ర.
    ఏం చెయ్యాలి తనిప్పుడు?
    విశాలి తన మనోరాణి, తనకి తెలియకుండానే తన మనసులో చోటు చేసుకుంది. ఆలస్యంగా జీవితంలో తటస్థపడిన, తనకి నచ్చిన స్త్రీ ఆమె. ఆమె ఒప్పుకుంటే శేషజీవితం ఇరువురిదీకూడా ఆనందమాయం చేసుకోవాలనుకున్నాడు. పోనీ ఏదీ? ఎలా? వెళ్ళి ఆమెనే తిన్నగా అడిగితే? ఫలితం ఏమైనా ఉంటుందా? రామం చెప్పినట్టు ఆమె ఆ పిల్లవాడిని వదిలి, ఈ ఇల్లు కదిలి  రాకపోవచ్చు. ఏమయినాసరే ఈ రోజు ఆమె అభిప్రాయం తెలుసుకుని వెళ్ళాలి. చివరికి దృఢనిశ్చయంతో లేచాడు రాజేంద్ర.
    లైటన్నా వేసుకోకుండా, చీకటిలోనే కూర్చుని రెండు చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖాన్ని ఆపుకోవడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూంది విశాలి.    
    రాజేంద్ర మాటలనిబట్టి అతనికి తనంటే ఇష్టమని అర్ధమవుతూనే ఉంది. తనకి మాత్రం అతనంటే గౌరవం, అభిమానం, ఇష్టం లేవూ? అన్నయ్య అటువంటి జవాబు ఇవ్వకుండా ఉంటే తను రాజేంద్రతో జీవితం పంచుకోవడానికి సిద్ధం కాదూ? కానీ ఇప్పుడెలా? తను పెళ్ళి చేసుకుంటే అన్నయ్య ఇంట్లో ఉండడం ఎలా కుదురుతుంది? పెళ్ళయినా ఈ ఇంట్లోనే, అన్నయ్య దగ్గిరే ఉంటాననడం హాస్యాస్పదం. తనతో రాజేంద్రని వేరొక చోటికి పంపడం అన్నయ్య  కిష్టం లేదు. ఖచ్చితంగా చెప్పనే చెపుతున్నాడు.
    అటువంటప్పుడు మమత తెంచుకోలేనందుకు, మాట నిలబెట్టుకుందుకు పెళ్ళి అనే మాట తలపెట్టకూడదు తను. అంతే.
    గుమ్మం దగ్గిర అడుగుల చప్పుడై కంగారుగా లేచి నిలబడింది.
    విశాలి నా స్థితిలో చూసి జాలితో కరిగిపోయాడు గుమ్మంలో ఆగిపోయిన రాజేంద్ర.
    ఆమె తమ సంభాషణ విన్నదని వెంటనే అర్ధం చేసుకున్నాడు.    
    అయినా తను అడగదలుచుకున్నది అడిగెయ్యడం మంచిది అనుకుని, యౌవనంగా తల దించుకుని నిలబడ్డ విశాలి నుద్దేశించి మెల్లిగా అన్నాడు: "నే నిదివర కోసారి మిమ్మల్ని ఒక విషయం అడగాలన్నాను చూడండి. దిప్పుడు...."
    "అత్తా! నా కన్నం పెత్తు." వచ్చి విశాలి కాళ్ళని చుట్టేశాడు రాజేంద్ర.
    వాడిని దగ్గరికి తీసుకుంది విశాలి.
    "మీ రడగబోయేది నాకు తెలుసు. మీరు నా మీద చూపే శ్రద్ధకి నే నెంతో ఋణపడి ఉన్నాను. నా మనసులో మీ కెన్నడో ఉన్నతస్థానం ఇచ్చాను. కానీ నేను నిస్సహాయురాల్ని అన్నయ్య జవాబు విన్నారుగా? నా సుఖం కోసం ఈ చిన్నవాడిని వదిలి రాలేను. వదిన కిచ్చిన మాట తప్పలేను. న్నయ్య జవాబుకి వ్యతిరేకంగా నేను చెప్పేది కూడా ఏమీ లేదు." ఆప్యాయంగా రాజేంద్రని మరింత దగ్గరికి తీసుకుంది విశాలి. వాడు రెప్పవేయడం మరిచిపోయి అత్త ముఖంలోకి చూస్తున్నాడు.
    "ఒక్కటి మాత్రం నిజం. మీరు నన్ను మరిచి పోయినా, ఏమయినా కూడా నేను మాత్రం మిమ్మల్ని మరిచిపోవడమన్నది కలలోకూడా జరగదు. మీ రెప్పుడూ నా కళ్ళలోనే ఉంటారు. మీ పేరు రోజూ పదే పదే పిలుచుకుంటూ ఉంటాను. వీడిపేరు న మనసు కోరిన పేరు. భగవంతుడి ఒక్క సంతోషాన్నయినా ఇచ్చాడు నాకు. అంతే చాలు." తల పక్కకి తిప్పి కన్నీరు దాచుకుందుకు ప్రయత్నం చేసింది విశాలి. ఒక్కక్షణ మాగి మళ్ళీ తనే అంది: "ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీలేదు. నా గురించి మీరు బాధపడకండి. మీకు శుభం కలగాలనీ, మీరు సంతోషంగా ఉండాలనీ కోరడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు."
    బాధగా విశాలి కన్నుల్లోకి చూశాడు రాజేంద్ర.
    "నా మాట..."
    రెండు చేతులూ జోడించింది విశాలి.
    "వద్దు! ఇంకేమీచెప్పకండి. మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే కోరికలకి లొంగిపోతానేమో అని భయంగా ఉంది. బలవంతాన మీ ఎదుటనించి నా మనసుని అమిత ప్రయత్నంతో దాచుకుంటున్నాను. అందుకు బాధ కలిగినా తప్పదు మరి. మిమ్మల్నికూడా బాధిస్తున్నందుకు నా మనసు రంపపుకోత ననుభవిస్తోంది. అందుకు నన్ను క్షమించండి."
    "సరే, వస్తాను. మీకు భగవంతుడు మేలు చేయాలి." రెండు అంగల్లో ఆకక్దినించి వెళ్ళిపోయాడు రాజేంద్ర.
    రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని కూలబడి పోయింది విశాలి.
    
                            *    *    *

    ''ఇంకా ఏవన్నా కావాలేమో చూడు. తీరా ఇంటికి వెళ్ళాక ఇది మరిచిపోయాను, అది మరిచిపోయాను అంటావు." నవ్వాడు సారధి ఫాన్సీషాపులో కావలసిన వన్నీ కొన్నాక.
    "ఒకవేళ మరిచిపోయినా మరేం ఫరవాలేదు. కాళ్ళున్నాయి. కాళ్ళలో శక్తీ ఉంది. మళ్ళీ రేపొద్ధాం." మునిపంటితో క్రింది పెదవి నొక్కిపట్టి నవ్వాపుకుంది సువర్ణ.
    "అబ్బ! ఏం బుర్రతమది! ఎంతబాగా పనిచేస్తోంది?"
    "అది సరేగానీ, బావా! అటు చూడు. ఆ అమ్మాయి నీకు తెలుసా?" సందేహంగా చూసింది సువర్ణ.
    "ఎవరో నాకు తెలియదు. ఎందుకలా అడుగుతున్నావు?"
    "ఇందాకటినించీ ఆ అమ్మాయి నీ వంకే చూస్తోంది. ఒక వేళ మీ ఇద్దరికీ పరిచయం ఉందేమో? పలకరించడానికి సందేహిస్తోందేమో అనుకున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS