Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 20

 

    'నాకు పెళ్ళికెదిగిన కూతురు వుందని నీకు తెలుసా? నీంత ఎదిగిన కూతురున్న పురుషుణ్ణి నీవు భర్తగా పొందబోతూ, నీవేమి ఆలోచించుకున్నావు కామేశ్వరీ? నీ కుటుంబం సౌఖ్యంకోసం నీవీ త్యాగం చేయటానికి వొప్పుకున్నావా? తర్వాత జీవితంలో నీవేమీ పొందలేవని నీకు తెలీదా? మరీ చిన్నపిల్లవు కాదుగా?' ఆగాడు కేశవ! పెళ్ళయిన సంవత్సరకాలానికి భర్తకి, తను అతన్ని పెళ్ళాడటానికి గల కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది! ఏం మగవాళ్ళు? తను ఇంత వయసువచ్చేక, మళ్ళీ పెళ్ళిపీటలమీద కాలుపెట్టటానికి గల కారణాలు తనకీ తెలుసుకోవాలనే వుంది, కానయితే తను భర్తని ఎదురు ప్రశ్నలు వేయకూడదు! అ ఆర్హత తెలుగు స్త్రీకి లేదు!
    'నాకు అన్ని వసుంధర వదిన చెప్పారు!' ఒక్కముక్క ఎలాగో గొంతు పెకలించుకుని అంది.
    'అయితే ఎందుకు తెలుసుండీ ఒప్పుకున్నావ్?' అన్నాడు కేశవ.
    'నాకు పధ్నాలుగేళ్ళు నిండినది మొదలు మా అమ్మా నాన్నా వరాన్వేషణ ప్రారంభించేరు! వచ్చిన ప్రతీవాళ్ళూ, నేను నల్లగా వుంటానని, వెనక్కు తిరిగి వెళ్ళి పోయేవారు! అసలే మావాళ్ళది, అంతంతమాత్రపు సంసారం! ఈ కరువురోజుల్లో నెలకి రెండేసి వందల రూపాయిల జీతాలు తెచ్చుకుంటూన్న ఉద్యోగస్థులకే, కుటుంబాలు జరుపుకోవటం తలకు మించినభారం అవుతోంది! అల్లాంటిది మానాన్నకి, ఉద్యోగం అంటూ ఏమీలేదు! ఇంజక్షన్స్, ఆపరేషన్స్ అంటూ ప్రతీవాళ్ళూ హాస్పిటల్స్ కి ఎగబడుతున్నారుకాని, ఈ ఆయుర్వేదపు మాత్రలకి ఎవరూ రోగులురారు! ఏవో నాలుగుబస్తాల గింజలు వస్తాయి! ఏదో గుట్టుగా తినీ తినక కాలంగడుపుకొస్తున్నాం! అల్లాంటిది నాకు, వేలకు వేలు కట్నాలు పోసి ఎల్లా పెళ్ళిచేస్తారు. ప్రతీవాళ్ళూ నాలుగువేలూ, అయిదువేలూ కట్నం అడిగేవారు! ఇంక మావాళ్ళకి నా కన్నెచెర వదలించటం అసాధ్యమని పించింది! ఆ స్థితిలో దేవతలా వసుంధర, వదిన వచ్చారు. ఆమె మీ గురించి అంతా చెప్పారు. మేమంతా సంతోషంగా ఒప్పుకున్నాము' అంది కామేశ్వరి.
    'డబ్బులేక నీకు తగిన ఈడూ జోడూ, అయిన కుర్రవాడు దొరకలేదన్నమాట! ఇప్పుడా డబ్బు నేనిస్తాను! నిన్ను చేసుకుందుకు ఎవరన్నా ముందుకువస్తే, పెళ్ళి చేసుకుందుకు వప్పుకుంటావా? ఆలోచించుకో!' అన్నాడు కేశవ!
    ఆమాటలు కామేశ్వరికి శరాఘాతంలా తగిలాయి!
    'మీరు! మీరేనా అల్లా అంటున్నారు? నిజమే! నా బ్రతుకు ఎవరేమి అపహాస్యం చేసినా సరితూగేలా వుంది! జీవితానికి, స్త్రీ జీవితానికి ఈమూడుముళ్ళూ పడటంతో ఎంతో నిండుతనం, కాంతి, శాంతీ, లభిస్తుంది! కన్నెమనసులు కలలతో, ఏవేవో కోరికలతో వేగిపోతూ, తూగిపోతూ, ఈమూడుముళ్ళ బంధంకోసం, వేయి వెలుగుల ఆశలతో ఎదురుచూస్తారు కన్నె పిల్లలు! పుణ్యంకొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు అన్న సూక్తి ప్రకారం ఏ పిల్ల పూర్వజన్మ తపస్సు నించి, ఆపిల్ల దానికి ఈ జన్మని భరాయించే భర్త లభ్యమవుతాడు! ఈ పవిత్రబంధాన్ని, శాంతిగా, ఓరిమిగా నిలుపుకోవటం తెలుగు స్త్రీకర్తవ్యం అయివుంది!' దుఃఖంతో కామేశ్వరి గొంతు పూడిపోయింది!
    కేశవ తనలో తాను నవ్వుకున్నాడు! పైకి మటుకు గంభీరంగా.
    'నిజమే కామేశ్వరీ ! నువ్వన్నదీ అక్షరాలా నిజమే! నీ పూర్వజన్మ తపస్సు యొక్క ప్రభావం ఇంకా నీ వ్యక్తిత్వం మీద పడలేదు! ప్రస్తుతం నీకు దొరికిన భర్తను నేనే! నేను రెండోపెళ్ళివాణ్ణి! నన్ను సేవిస్తూ ఇక్కడ్నే నువ్వు జీవితాంతం పడివుండాలని శాసించటానికి నేను నీ మెళ్ళో వేసిన మూడుముళ్ళకీ అధికారం వుంది! నీ మనసేమిటో, నీగత మేమిటో తెలుసుకోకుండా ఆ అధికారాన్నిబలవంతంగా నీ నెత్తిమీద రుద్ధదల్చుకోలేదు! నీకు నీ జీవితాన్ని నిర్ణయించు కునే అధికారంవుంది! నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం, స్వేచ్చా వుంది! మిధ్యా గౌరవాలకు పోయి, నీ విరిసిన పూవులాంటి జీవితాన్ని నాశనం చేయదల్చుకోలేదు! ఆలోచించుకో! నీకు బోలెడు వ్యవధివుంది! ఈ సంవత్సరం వేసంగిలో నళిని పరీక్షలు కాగానే ఆ పిల్లకు పెళ్ళి చేయదల్చుకున్నాను! ఈలోగా నీకు నచ్చిన వ్యక్తి తారసపడితే నీకు సంతోషంగా ఆ ముహూర్తానికే పెళ్ళి చేసి నేను నిశ్చింతుడవుతాను!' అన్నాడు కేశవ! కామేశ్వరికి తల గిర్రుమని తిరిగిపోయింది! కేశవకి తన్ని భార్యగా చూడటం ఏమాత్రం ఇష్టంలేదని స్పష్టపడింది! ఆమాట ఎంత గౌరవంగా, మర్యాద వచనాలతో చెప్తున్నాడు? కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి! ఇంత గౌరవనీయమైన వ్యక్తి సాహచర్యం కన్నా, వెర్రి కోరికలతో పొంగులు వారే యవ్వనంతో, అసహజమైన వెర్రి చేష్టలతోవుండే వయసు కుర్ర వాళ్ళ సాహచర్యం తనకి సుఖప్రదమవుతుందా? ఛఛ! తనలో ఎప్పుడూ అల్లాంటి నీచపు కామతృష్ణ కలగనే కలగలేదు! అయినా కేశవతన్ని ఎందుకని అనుమానించేడు? మనసు అల్లకల్లోల మైపోయింది కామేశ్వరికి! తను చదువు కోవటం అత్తగారి కిష్టంలేదు! సంసారం చేయటం భర్తగారి కిష్టంలేదు! ఎల్లా?

                                                  *    *    *
    తన ఇంటిముందు కేశవ కారు ఆగి వుంటం చూసిన రామనాధం, 'నళిని' వచ్చి వుంటుందని వూహించాడు! కాని ఇంట్లోకి రాగానే 'కేశవ'ని చూసి కొంచెం కంగారు పడ్డాడు. తాతయ్య ఏదో పనిమీద పట్నం వచ్చి కొడుకుల వద్ద నాలుగురోజులనించీ వున్నాడు! తన కొడుకుల కోసం కార్లమీద వచ్చే పెద్ద మనుషులని చూసి తాతయ్య చాలా సంబరపడుతున్నాడు! తన కొడుకుల కాలేజీ చదువులు చదువుతున్నారు! అందుకని అందరి కళ్ళూ వాళ్ళమీద పడుతున్నాయి! అని అనుకున్నాడు! రామనాధం వచ్చేదాకా తాతయ్యా, కేశవా ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. రామనాధం రాగానే.
    'రావోయి కధానాయకా! నీ కోసమే వచ్చాను! అనుకోకుండా, మీ నాన్నగారి పరిచయం కూడా కలిగింది?' అన్నాడు కేశవ! రామనాధం వూరుకున్నాడు.ఇంతలో మాధవకూడా వచ్చాడు. అందరూ కుర్చీల్లో కూర్చున్నారు!
    'మా ఇంట్లో వకమ్మాయి వుంది! కొన్ని కారణాలవల్ల నా ఇంటిలోనే వుంది! ఆ అమ్మాయి పేరు కామేశ్వరి! కట్నం కానుకల విషయం మీరాలోచించక్కర్లేదు!' అన్నాడు. రామనాధం శరీరం జల్లుమంది! ఇదేదో కధలా వుంది! తమ పెళ్ళిచేసుకున్న భార్యకిమళ్ళీ పెళ్ళి చేస్తాడా ఈయన? కామేశ్వరి ఒప్పుకుందా? ఒకవేళ ఆ పిల్లే బలవంతం చేస్తూందేమో! తన తండ్రికి కామేశ్వరి పెళ్ళయిన పిల్ల అని తెలుస్తే ఏమన్నా వుందా? ఇల్లా ఆలోచిస్తూన్నాడు రామనాధం! మాధవ మహదానందపడిపోయేడు! కేశవయొక్క హృదయ సంస్కారానికి జోహార్లర్పించేడు!
    'అయితే చూచివద్దామంటావా రామనాధం?' అన్నాడు తాతయ్య. తాతయ్య కామేశ్వరిని ఇదివరకు చూడలేదు. అంచేత ఇప్పుడు చూసినా ఫరవాలేదు! అనుకున్నాడు మాధవ.
    'రామనాధాన్ని, మా అమ్మగారు ఇది వరకు చూడలేదు! ఒక్కసారి మా అమ్మ చూడాలనుకొంటూంది!' అన్నాడు కేశవ!
    'అయితే వెళ్ళరా!' అన్నాడు తాతయ్య! రామనాధం, మాధవా బయలుదేరారు!
    'నువ్వు తోడు పెళ్ళికొడుకువా? అన్నాడు తాతయ్య.
    'కాదు! అతనూ పెళ్ళికొడుకే! అన్నాడు కేశవ!
    'మీ అమ్మాయికి స్వయంవరమేమిటి?' అని నవ్వాడు తాతయ్య! సెకండురౌండు'లో మీరువద్డురుకాని అన్నాడు కేశవ.
    రామనాధం మనస్సు సంతోషంతో తలమున్కలౌతుంది. కామేశ్వరికూడా తనని ప్రేమించుతూందన్నమాట! ఆ ప్రధమ సమాగమానికి ఉవ్విళ్ళూరుతున్నాడు రామనాధం! మాధవ్ మనస్సు రాకెటులా ఎగురుతోంది. నళినిమీద అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు! 'కామేశ్వరి' పెళ్ళి అయిందని తెలిస్తే రామనాధం ప్రేమించటం మానుకుంటాడని భయపడి ఆ సంగతి తెలీనీ కుండా దాచింది పాపం నళిని! అని నళిని మీద జాలిపడ్డాడు మాధవ! ఇల్లా ఎవళ్ళ ఆలోచనలతో వాళ్ళు సతమతమయి పోయినారు!
    'రామనాధం! మునుపు నీకు కామేశ్వరిని ఇద్దామనుకున్నారట నిజమేనా అన్నాడు కేశవ.
    'నిజమేనండీ!' అన్నాడు రామనాధం.
    'మరెందువల్ల చేసుకోలేదు? కామేశ్వరి అంతనచ్చలేదా నీకు! మరి కట్టం చాల కనా?' అన్నాడు కేశవ. రామనాధం మాట్లాడలేదు! కేశవతో ఏమీ చెప్పటానికి రామనాధాని కెందువల్లో మనస్కరించటం లేదు!
    'కామేశ్వరి నీకు బాగా అంటే మనఃస్ఫూర్తిగా నచ్చింది కదూ!' అన్నాడు కేశవ.
    నవ్వి వూరుకున్నాడు రామనాధం.
    'రామనాధం! మీ నాన్నకోరిన కట్నం మూడువేలూ నేనిస్తాను. నీవు నిస్సంకోచంగా కామేశ్వరిని స్వీకరించు! ఒక అమాయిక కన్నె మెడలో మూడుముళ్ళూ వేసినందుకు నేనీ పరిహారం ఇచ్చుకుంటాను! ఆమె వివాహిత అన్నమాట నీ మనస్సు నించి తరిమివేయి! నాకు మాత్రం వివాహం అన్నది మటుకు- నీ అంతస్సుకి హత్తుకోనీయి!' అన్నాడు కేశవ.    

                             *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS