మనిషి చేస్తున్న నేరాలు పండి కుళ్ళి పోవటం అక్కడ చూసి వచ్చిన జయప్రదరావు కు చిట్టి నేరస్తురాలు]గా కనిపించటం లేదు. సరిగదా, పరమ పవిత్రురాలుగా గోచరిస్తున్నది.
విజయస్మ్తుతి జయప్రదరావు ను ఏ సమయం లోనూ విడిచి పెట్టడం లేదు. ఏ సమయంలోనూ ఆమె స్టైర్యం పవిత్రత మరపుకు రావటం లేదు. పొరపాటు చేసిన చిట్టి లోను, ఖూనీ చేసిన అప్పలమ్మ లోను కూడా అతను విజయ ను చూడ గలుగుతున్నాడు.
విజయ........ఏమయింది విజయ?
ఈ ప్రశ్న నాగేశ్వరరావు నూ, జయప్రద రావు నూ, జగన్నాధాన్నీ ముగ్గుర్నీ వేధిస్తున్నది. ముగ్గురి జీవిత ధ్యేయం ఒకటే. విజయను వెతికి పట్టుకోవడం .
* * * *
"చిట్టీ !"
"ఏం బావగారూ?"
"మా ఇద్దరికీ వండి పెడుతూ ఇలా కూర్చుంటే నీ గతేమిటి? పోనీ ప్రైవేటు గా పరీక్షలకు కట్టరాదూ" అన్నాడు జయప్రదరావు.
అతని సలహా ఇవ్వటం మొదటి తడవ కాకపోవటం వలన చిట్టి సమాధానం ఇవ్వలేదు. బాలచంద్రుడు వెండి కొడవలి లా ఉదయించటాన్ని చూస్తూ నిలబడింది.
* * * *
ఇంటి కోస్తున్న జగన్నాధాన్ని ఆపి "విజయ సంగతి ఏమైనా తెలిసిందా" అని అడిగింది ధనమ్మాళ్. జగన్నాధం పని చేస్తున్న కొట్లోనే నెలవారీ సరుకులు కొంటుంది ధనం. ప్రతిసారీ జగన్నాధం కనిపించినప్పుడల్లా ఈ ప్రశ్న వేస్తుంది ఆమె.
విజయ పొరపాటు చేయదనే విశ్వాసం గల వాటిలో ధనం ఒకతే. ఊరంతా విజయను అనుమానిస్తున్నా గాని ఆమె మాత్రం విజయను ఎంత మాత్రం అనుమానించదు. "వారిని తప్ప భగవంతుడిని కూడా ప్రేమించలేను నేను"-- అని విజయ అన్న మాటలు అనుక్షణం జ్ఞాపకం వస్తూ ఉంటాయి ధనానికి.
జగన్నాధం లేదని తల తిప్పాడు. ధనం నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది.
జగన్నాధం మనసులో ఎవరో ఏడ్చినట్లనిపించింది. విజయ ఆచూకీ ఏ మాత్రం తెలియటం లేదు. ఎవర్ని అడిగినా ఎవరూ చెప్పటం లేదు.
ఈ విశాల ప్రపంచంలో విజయ అనే చిన్న నీటి బిందువు సంగతి ఎవరికి కావాలి?
జగన్నాధం ఈ మధ్య వేదాంతం లో పడి పోయాడు. జగద్గురు శివానంద స్వాముల వారు నూజివీడు లో మకాం వేసి ఉపన్యసిస్తున్నప్పుడు ప్రతిరోజూ విధిగా వెళ్లి వచ్చాడు. ఆ ఉపన్యాసాల సారాంశమే ఈ వేదాంతం.
శివానంద స్వామి ముప్పయి సంవత్సరాల యువకుడు. ఎంత చిన్న విషయం అయినా వివరించి చెప్పగల వక్త. ఇంగ్లీషు భాషలోను తెలుగులో నూ కూడా అనర్గళంగా మాట్లాడే అయన మాతృభాష ఏమిటో ఎవరికీ తెలియదు. స్వామి కున్న సాంఘిక పరిజ్ఞానం, హాస్య ప్రియత్వం ఇంతా అంతా కాదు. స్వామి దృక్పధం జగన్నాధాన్ని తన వైపుకు ఆకర్షించుకుంది.
అసలే ఆలోచనపరుడైన జగన్నాధం ఇప్పుడు జిజ్ఞాసాపరుడయినాడు . అతని దృష్టి మరింత విశాలమయింది. అతని క్షమా గుణం మరింత అధికమయింది. ఎం.ఏ ప్యాసయిన స్వామి ఒకనాటి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపొయినాడు, అని విన్నప్పుడు భగవంతుడిని ఉద్దేశించి తనకూ ఆ ధైర్య మిమ్మల్ని ప్రార్ధించాడు అతను.
సుమేరు పర్వతాల మంచు ఊబి లో కూరుకు పోయినప్పుడు, ఆకలి తీరక అలమటించి నప్పుడు స్వామిని భగవంతుడు ఆదుకొన్న విషయం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
హిమగిరి శిఖరాగ్రం మీద తన కాషాయ వస్త్రం పరిచి ఈ ప్రపంచం లోని సంతాప ష్టితిలో యోగ నిద్రలో మునిగి పోవాలని అతనూ కలలు కంటున్నాడు.
హిమగిరి పర్వతం మీద తన అనుభవాన్ని గురించి స్వామి ఒకసారి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి జగన్నాధానికి.
"అప్పుడే సూర్యుడు అస్తమించాడు. వర్షం తగ్గింది. మబ్బులు రంగురంగుల నైలాన్ గుడ్డలు అరవేసినట్లు ఇప్పుడిప్పుడే చెదిరి పోయినాయి. వాటి సందుల్లోంచి వెలికి ప్రవహిస్తున్న సంధ్యారుణిమ ఈ హిమాలయాన్ని రాగరంజితం చేస్తున్నది. ఇది చూస్తుంటే నాకనిపిస్తున్నది వీటిని చిత్రించిన చిత్రకారుడి వేళ్ళు ఎంత అందమైనవా? అని. సౌందర్య మయమైన ప్రతి వస్తువూ భగవంతుడి బింబానికి అద్దం. నక్షత్రాలలో, నదీ నదాలలో , రచయితల్లో, శాస్త్ర జ్ఞులలో, నారీ సౌందర్యం లో, సర్వత్రా కనిపించే సౌందర్యమే భగవంతుడు. అదే సత్యం.
"జీవన మను వాహిని అనుక్షమం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహ సౌందర్యమే భగవంతుడి ప్రతిరూపం. భగవంతుడే మానవుడు. మానవుడు భగవంతుడే కావచ్చును. విశ్వమంతా హిమాలయం అవుతుంది అప్పుడు. ప్రభాత కాంతులు ప్రసరించిన వెంటనే ప్రసూన చిరుహాసాలు జగత్తును నింపి వేస్తాయి. రంగురంగుల పిట్టలు పాటలు పాడతాయి. ప్రవాహ నృత్యం ప్రారంభ మవుతుంది. ఆనంద వాహిని ఈ సర్వ జగత్తునూ తనలో లయింప చేసుకుంటుంది.
"మనిషి తన జీవితాన్నంతటిని భయ సందేహాలతో గడపటానికి పుట్టలేదు. నేనెలా జీవించాలి? ముందు నా గతి ఏమిటి? అన్నవి శుద్ధ తెలివి తక్కువ. ఆలోచనలు, నీళ్ళల్లో జీవించే ప్రాణులు, గాలిలో బ్రతికే స్వేచ్చా విహంగాలూ ముందు సంగతి ఏమిటి? అని ఆలోచించవు. వాటి ఆత్మ గౌరవాభిమానాన్ని మానవుడు నేర్చు కోవాలి. వానలోనూ ఎండలోనూ సమానంగా అవి తిరుగుతాయి.
'అంతేకాదు ప్రతి ప్రాణీ ఆత్మ స్వరూపుణీ. నిరంతరం కురిసే వర్షాధార మెరుపులోని శక్తి సౌందర్యాలు -- మేఘ గర్జనలోని శబ్దం -- అన్నీ అతడే అయిన రోజున అతని హృదంతరం నుంచి "శివోహమ్ " అనే నాదం బయలుదేరి అతన్ని సృష్టి కర్తను చేస్తుంది"--
స్వామి వాక్యాలు జగన్నాధానికి చాలా నచ్చినాయ్. అమరునాడు స్వామి బసకు వెళ్లి చాలా విషయాలు తెలుసు కున్నాడు. స్వామి నిరాడంబరుడు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ అందరి సందేహాలు తీరుస్తాడు.
"స్వామీ, మీరు చెప్పే తత్త్వ శాస్త్రానికి ప్రయోజనం ఏమిటి?" బెరుగ్గా బెరుగ్గా ప్రశ్నించాడు జగన్నాధం.
స్వామి చిరునవ్వు నవ్వి--
"తత్త్వ శాస్త్రానికి ప్రధాన ఉద్దేశ్యం జీవన గమనాన్ని సాఫీగా సాగించ గలగటం. హిమాలయం నుంచి వచ్చాను కనుక ఏదో మాయా మంత్రాలు చెప్పక పోతానా అని తరిచే వారికి నేను చెప్పేది అంతగా రుచించక పోవచ్చును. కాని, నాకవేమీ చేతకాదు. తాయెత్తులు, కట్టడం, పుత్రదానం చెయ్యటం, రోగాలు తగ్గించటం నావల్ల కాదు. నేను తాత్త్వికుడి ని మాత్రమె!
"నిత్య జీవితంలో మన శక్తిని పొదుపు చేసుకొని వాంచల నుంచీ లాలసల నుంచీ విడిపించుకొని స్వాతంత్యం పొందటం, ఆత్మ దాస్యం చేత అనుభవిస్తున్న సంకుచిత్వాన్ని వదిలించు కోవటం , కార్యసాధన రహస్యాన్ని అర్ధం చేసుకోవటం , సృష్టి నిర్మాణ జ్ఞానాన్ని తెలుసుకో గలిగి సమతా శాంతులను పొందగలగటం -- ఇవి మాత్రమె మీకు చెప్పగలను నేను"అన్నారు.
"మరి మతం సంగతి?"
"నాకు మత్రం లేదు. హిందూ మహమ్మదీయ బౌద్ద క్రైస్తవ మతాల్లో ఏదీ నాది కాదు. సూర్య నక్షత్ర చంద్ర కాంతుల చేత, నదీ సాగర సరోవరముల చేత, ఆకర్షణానురాగాల చేత, సమస్త చేతన , అచేతన పదార్ధాల చేత అవరింప బడిన విశ్వ రంగ స్థలమే నా మత నిలయం. హిందూ నక్షత్రాలూ మహమ్మదీయ నక్షత్రాలూ అని విడివిడిగా లేవు. అందుచేతనే మానవుడిలో జాతి, మత వర్ణ బేధాలను, పాప పుణ్యాలకు గల అంతరాన్ని అంగీకరించను నేను.
"సూర్య కిరణాలు, నక్షత్రపు వెలుగులు సైకత రేణువులు, జీవజలాల హృదంతరాలు నా మతానికి పునాదులు. నా మతము సర్వప్రాణి మార్గము" అన్నారు స్వామి.
జగన్నాధం మాట్లాడలేదు.
స్వామి మళ్ళీ అందుకున్నారు--
"భారతీయ తత్త్వశాస్త్రం విశిష్ట మైనది అది జాతినీ, మతాన్నీ సమర్ధించదు. గ్రీకు తత్త్వవేత్తలు ప్లేటో, సోక్రటీస్ సైదాగరస్ , ప్లాటినస్ మున్నగు వారు తమ సిద్దంతాలలో ఈ విషయాన్ని సమర్ధించారు. మతం అంటూ వేరే లేదు. మానవత్వమే మతం అన్నారు వారు.
"ప్లేగెల్, పెలింగ్ , యమ్ కజిన్ మొదలైన వారు కూడా ,సాంఖ్య , బౌద్ద మతాల నుంచీ, గీతోపనిషత్తుల నుంచీ భారతీయ తత్త్వశాస్త్రం నుంచీ తమ అభిప్రాయాలను తీసుకున్నారా అనిపిస్తుంది. అలా వారు వ్రాసుకొన్నారు కూడా.
"ఈనాడు అమెరికా జర్మనీ ఇంగ్లాండు లలో చెలామణీ అవుతున్న ఏకేశ్వరోపాసన వివేకానంద రామతీర్దుల సంచార ఫలితమే అనవచ్చును.
'అంతేకాదు . ఎమర్సన్, వాల్టువిట్మన్, మాక్సు ముల్లర్ మొదలైన మహా వ్యక్తులందరూ భారతీయ తత్త్వశాస్త్రాన్ని అంగీకరించారు. అది మానవుడికి ఇచ్చిన ప్రాధాన్యం మతానికి ఇవ్వదు.
"మరి మతాన్ని పట్టుకుని మానవుడు ఇన్నాళ్ళ నుంచీ ఎందుకు వెళ్ళాడు తున్నట్లు?" అని తనలో తనే గొణుక్కున్నాడు జగన్నాధం -- మనిషి అజ్ఞానాన్ని చూసి ఎక్కడలేని జాలి పడుతూ.
"అది తెలివి గల బ్రతుకు తెరువయింది. అందుకే దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. అది తెలుసుకున్న రోజున మతాన్ని తృణ ప్రాయంగా వదిలి వేస్తాడు" అని నవ్వారు స్కామి. జగన్నాధం ఆ తత్త్వవేత్త వంక తెల్లపోయి చూస్తూ ఉండి పోయాడు . యితడు భారత యోగి. ఇది భారతీయ తత్త్వ శాస్త్రము. ఈ గడ్డ మీదనా ఇంత అజ్ఞానము? ఇంత అలోచనా పరులు జన్మిస్తున్న ఈ దేశం లోనా ఇంత సంకుచితత్వం?
స్వామి తిరిగి అన్నారు--
"కొన్నాళ్ళు వశిష్ట గంగా తీరంలో ఒక గుహలో ఉండే అదృష్టం నాకు లభించింది. చుట్టూ పక్కల జనసంచారం ఉండేది కాదు. ఆ ప్రశాంతినీ ఆనందాన్నీ వ్రాసి పెట్టుకున్నాను. భగవంతుడి దృక్కోణం నుంచి చూస్తె విశ్వమంతా ఒకే ఒక సౌందర్య లహరిగా దర్శన మిస్తుంది. సర్వ లోపాలూ తొలిగి పోతాయి. ప్రకృతి శక్తులన్నీ కర్మేంద్రియాలుగా మారి పోలేదు గద అనిపిస్తుంది.
'ఆత్మ ఆనంద రూపమై సర్వ స్వరూప మైన ఆక్షణాలలలో , ఆత్మానుభవమే తనను పరమాత్మగా ప్రకటించు కొంటున్నప్పుడు , సర్వ జగత్తూ ప్రేమామృతం తో నిండి పోయినప్పుడు -- ఎవరిని విమర్శించను? ఎవరిని తిట్టను-- పాప పుణ్యాల, నీతి అవినీతుల వృధా ప్రసంగాలు ఎవరితో చెయ్యను? ఏ మానవుడైనా ఈ సృష్టి లోని వస్తువును సత్యం అని భావించిన మరు క్షణం లో ఆ వస్తువు తనను నమ్మిన వాడిని మోసగించటమనేది ఇంతవరకూ నడుస్తూ వస్తున్న సృష్టి ధర్మం. అలాంటప్పుడు పాప పుణ్యాల, నీతి అవినీతుల గందర గోళాలతో బుర్ర చెడగొట్టడం అనవసరం" అన్నారు స్వామి. అయన నుదుట ఏదో అలౌకిక తేజస్సు వెలిగి పోతున్నది.
"నీవు రచయితవు. భాగవతుడు నీకు ప్రసాదించిన భాషనూ ఆధారం చేసుకొని నీ అంతరంగిక జీవితంలోని సత్యాన్ని గురించి అలోచించి ప్రకటించు. సత్యారాధనమే ఉత్తమమైన కర్మ యోగం."
