Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 20


    నెఫ్టి నెంట్ సీమని చంపలేదనీ-ఆమే స్వయముగా పర్వతం మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందనీ కర్నల్ చాల చెప్పబోతాడు. కాని సర్దార్ అవతలికి తెలియజేస్తాడు. -" మాజాతిలో ఒక ఆధారం వుంది. కన్నెపిల్ల నిరాశగా మరణించిన మీదట ఆమె ప్రియుణ్ణి కూడా ఆమె శవంతోపాటు పూడ్చివేస్తాం. లేక పోతే ఆజీవి నిరాశగా తిరుగుతూనే వుంటుంది. అందుకే లెఫ్టినెంట్ ని కూడా సీమతో పాటు పూడ్చిపెడతాం." ఆ నాలుగు ముక్కలు అని సర్దార్ తన ముఠాతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.    
    ఆ రోజంతా రెండువైపులా యుద్ధ సన్నాహాలు జరుగుతూనే వుంటాయి. లెఫ్టినెంట్ తన టెంట్ లోనే పడి వుంటాడు. కేంప్ వారికి ప్రాణాపాయం కల్గటానికి తనే బాధ్యుడా? మిషన్ ఆశయం విఫలమై పోవడానికి తనే కారణమా? అతని కళ్ళముందు క్రిందటి దాడిలో గాయాలు తగిలిన సైనికులు విలవిలా తన్నుకొంటున్న హృదయవిదారకమైన దృశ్యం సాక్షాత్కరిస్తుంది. తిరిగీ అదే దృశ్యం కొంతసేపటిలో సజీవమై వుందన్న వూహ తట్టగానే లెఫ్టినెంట్ కంపించిపోతాడు.
    అప్పుడే కేంపులో నాలుగు గంటలుకొట్టారు. అటునుంచి నగారాలు జోరుగా మ్రోగుతున్నాయ్.
    సిపాయిల్లో హడావిడి ప్రారంభమైంది. కంగారుగా లేచి కూర్చుంటాడు. ఇక ఎంతో ఆలస్యంలేదు. నాగగూడెం అంతా క్రోధంతో పిచ్చిదైపోతుందని అతనికి తెలుసు. కేంప్ ని ధ్వంసం చేసి తీరుతుంది.
    లెఫ్టినెంట్ కి క్రితంరోజు కర్నల్ జోన్' చెప్పిన ఆ మాటలు స్మరణకొస్తాయి-"నీవు వీరుడవైన సిపాయివీ, దేశభక్తుడివి,, బాధ్యత గల ఆఫీసరువీ, మిషన్ ని సఫలం చేస్తానని వాగ్దానం చేశావు. సరైన మార్గమే ఎన్నుకుంటానని నా ఆశ."
    అవును తను వీరుడిగా, దేశభక్తుడిగానో, తన ఒక్కడి కోసం కేంపునంతటినీ బలిపెట్టడు. వెంటనే లేచి సిపాయిడ్రెస్ వేసుకుంటాడు. పిస్తోలు తీసి వేరే పెట్టెస్తాడు. టెంట్ సరదా తొలిగించుకొని బయటికి వస్తాడు. దూరంగా పర్వతాలచాటునుంచి తూర్పు వైపున పల్చటి వెలుగు వ్యాపిస్తూ వుంటుంది. అదే అతని జీవితంలో ఆఖరి ఉదయం. లెఫ్టినెంట్ కేంప్ వారి నుద్దేశించి సైనిక వందనం చేస్తాడు. -" శెలవు, మిత్రులారా!" అనుకుంటాడు. తర్వాత నెమ్మదిగా ఆ రాతి గుట్టల వెనక్కి అర్ధరాత్రుళ్ళప్పుడు తన సీమ ప్రేమ ప్రేమగా పిలిచే చోటుకి నడిచి పోతాడు. కాని అతనారోజు సీమ పిలుపు వల్ల కాదు. తల కర్తవ్య నిర్వహణకోసం వెళ్తున్నాడు. నిజమైన దేశభక్తుడిలా వెళ్తున్నాడు. అదే అతనికి సంతోషం.
    సీమకి దగ్గిరగా వెళ్తాడు. పూలు పరిచిన రాతి తిన్నెమీద పడుకుని సీమ చేతులెత్తి తనని పిలుస్తోంది. సీమమీదికి ఒంగుతూవుండగా నాలుగు వైపుల నుంచీ వాడివాడిబాణాలు వచ్చి తగిలి లెఫ్టినెంట్ బలిష్టమైన శరీరం తూట్లు పడిజల్లెడయి పోయింది. లెఫ్టినెంట్ సీమ కళేబరం మీద ఒరిగి పోతాడు.
    నగారాలు ఒక్కసారి జోరుగా మోగి ఆగిపోతాయి. కల్నల్ బోస్ లెఫ్టి నెంట్ టెంట్ లో కెళ్ళి చూస్తాడు-మిషన్ ఆశయాన్ని సఫలం చెయ్యటానికే వెళ్తున్నానని రాసిపెట్టిన చీటీ, పిస్తోలూ వుంటాయి. కల్నల్ కళ్ళలో నీళ్ళు నిండుకుంటాయి-" బహాదూర్ లెఫ్టినెంట్" అనుకుంటాడు.
    తెల్లవారుతూనే స్వయంగా త్రూబా మూడు రంగుల జెండాని కేంప్ మద్యలో ఎగుర వేస్తాడు స్నేహపూర్వకంగా.
    అదీ కథ. కల్నల్ బోస్ లానే మనమూ "బహాదూర్ లెఫ్టినెంట్" అనుకొని వూరుకో లేము. నా మట్టుకు నేను ఆకథకి చలించి పోయాను. ఆరాత్రి అన్నమే ముట్టుకోలేదు. ఒకవారం రోజులవరకూ ఆ సీమాలెఫ్టినెంటూ నా చుట్టూ తిరుగుతూనే వుండిపోయారు. "ఏం ప్రణయం ప్రభూ! ప్రళయంలోకి దించింది" అనుకునే దాన్ని, సీమ అంత సాహసం చేస్తుందని అనుకునివుంటే లెఫ్టినెంట్ తీసుకునైనా వెళ్ళిపోయేవాడు సుమా! అదేం ఆడదో? చచ్చి సాధించటం అంటే ఇదే కాబోలు. ఎలాగైనా ఈ లంబాడీ జాతంతా కరుకు జాతి.
    ఆకథ చదివిన మాధవ్ రాశాడు. "కథ చాల బాధాపూరితంగా వుంది. నుదుటిరాత అంటే అదె అనుకోవాలేమో! కథకన్నా ఆకథ రాయటంలో నీవుద్దేశ్యం మరీ బావుంది. లంబాడీవాళ్ళ జోలికి పోయేరుసుమా! అనే కదూ నువ్వు హెచ్చరించేది? ఆడదాన్నని ఋజూ చేసుకున్నావ్ కృష్ణ వేణీ! లంబాడీ పనిమనిషిని గురించి రాశానని నీకు అసూయ కదూ? నాకు చాల సంతోషమైంది వేణూ! ఈనాటికైనా ఓ ఆడది నాగురించి బాధ పడేది వుందని. ప్రేమవున్న చోటే బాధావుంటుంది. నేనెలా పోయినా నీకు తప్ప ఎవరికీ అక్కర్లేదు. నేను కోరేదీ అదే. నేను దురదృష్ట పంతున్నని వాపోయాను గానీ ఇంతటి అదృష్టం ఇలా వరిస్తుందని ఏనాడైనా అనుకున్నానా? కృష్ణా! ఏవో వూరికే రాసి పంపిస్తాననుకోకు. నీవుత్తరాలు నాకెంత వూరడిస్తున్నాయో తెలుసా? మరొక్క ఎనిమిది నెలలు. ఇలా నీనామం ధ్యానిస్తూ, నీరూపం వూహిస్తూ, గడుపు తాను. తర్వాత నీపరీక్షలైన వెంటనే తెలుసుగా? నీసన్నిధిలో, నీచేతుల్లో శాశ్వతంగా నన్ను నీకు అర్పించుకుంటాను. అలా ఆక్షణం వూహించు కొంటే ఎందుకో సంతృప్తి పడి మైమరచి నిద్ర పోతాను కృష్ణవేణీ! నేను నిజంగా అదృష్టవంతుణ్ణి సుమా?" - అదె ధోరణి మాధవ్ వుత్తరాలలో - రాబోయే రోజులూ- ఆ రోజులు గడిపే తీరులూ!
    ఆ వుత్తరాలు చదువుకొనేటప్పుడూ-మళ్ళా ఆవిషయాలు, గుర్తువచ్చినప్పుడూ, నాకు తెలీకుండానే నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకొనేవి. నాలో ఆ ధైర్యమేమిటో పరీక్షలయ్యాక జరిగే సంగతి గురించి స్థూలంగా నేనేం నిర్ణయించు కున్నానో నాకే తెలీదు - స్నేహితుడిగా మాధవ్ కి నా దృష్టిలో అభిమానం వుంది-ప్రియుడిగా మాధవ్ కి నా మనసులో అనురాగం వుంది. అన్నివిధాలా మాధవంటే నాకు పరిపూర్ణమైన తృప్తి!
    బహుశా నా పెళ్ళికి మా అమ్మావాళ్ళు అంగీకరించకపోవచ్చు. తల్లిదండ్రులు అంగీకరించని పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి. అన్నయ్య మాటేమిటి? కాలం గడుస్తూంటే ఎంతటి సమస్యలైనా సర్దుకుపోతాయి. నాకు కావలసింది
        నన్ను మెచ్చిన మనిషి!
        నాకు నచ్చిన మనిషి!
    ఆ పైన ఏదీ ఆలోచించ నవసరం లేదు- అదే నేను అనుకొనివుంటాను. మాధవ్ ఫోటో డైరీ లోనే వుంచాను-ఆ మోటు పెదవులూ - ఆ నొక్కుల జుట్టూ ఎంతచూసినా చూడాలనిపించేది.        
    'నీ పెదవులు మోటు బాబూ! చూడటానికే భయంగా వుంటుంది." అన్నదానికి మాధవ్ జవాబు గిలిగింతలు పెట్టింది.
    "ఛ! భయందేనికి? చిరకాలం వాడాల్సిన నీ చెక్కిళ్ళనెంత అపురూపంగా చూసుకోవాలో నాకు తెలీదా?"
    "నీకెంత నొక్కులజుట్టు వుంటేమాత్రం ఎందుకలా బుట్టలాగా పెంచుకోటం? నాకేంనచ్చలేదు."
    "నేనేం చెయ్యను చెప్పు వేణూ? అదేమిటో ఆ జుట్టు ఏ ఆయిల్ కీ లొంగదు. ఓసారి జ్యోస్యం అడిగితే దానికో రహస్యం వుందనిచెప్పారు.
    ఎప్పుడో ఓ బంగారుక్షణాన కృష్ణవేణి అనే కన్నెపిల్ల ఆ జుట్టు వెళ్ళుపెట్టి దువ్వుతుందటా! ఆ మరుక్షణంలోనే పడగెత్తిన నల్లత్రాచువంటి ఆ జుట్టంతా శాంతించి లొంగిపోతుందట. ఆ జుట్టు తాలూకు వ్యక్తి మైమరచి మోకరిల్లుతాడట. ఆ బంగారు క్షణం కనుచూపు మేరలోనే వుందటా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS