Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 20


                                    27
    పై సంఘటన తరవాత, కొన్నాళ్ళ పాటు రఘు సవ్యంగానే ప్రవర్తించాడు. అతడు అరుణతో పాటు కాలేజీ కి వెళ్ళడం, అక్కణ్ణించి అరుణతో పాటే ఇంటికి రావడం, అప్పుడప్పుడు పుస్తకాల్ని ముందు వేసుకుని చదువుకోడం -- ఇటువంటి వన్నీ చూచి సేతుపతి గారు నిజంగా సంతోషించారు. అంతటికీ ఆరుణే కారణమను కుని మరింత తృప్తి పొందారు.
    కానీ....విధి లిఖిత మనండి, మరేదైనా అనండి! ఒక వ్యక్తీ జీవితం దాని దారిని అది నడుస్తుంది గానీ, ఆ వ్యక్తీ ఇష్టానిష్టాల మీద , ఆ వ్యక్తీ శ్రేయోభిలాషులు వేసిన పూల బాట వెంట నడవదు . చాదస్తులు దాన్ని కర్మ అనీ, పురాకృతమనీ, విధి లిఖితమనీ అంటారు! మరి, ఆధునికు లేమంటారో?    
    అసలు వచ్చిన గొడవంతా ఆ కాలేజీ హాస్టల్లో ని విద్యార్ధులు వార్డెన్ ని మార్చాలనడం తో వచ్చింది. ఎందుకు మార్చాలీ అంటే, విద్యార్ధులు తమకున్న కష్ట నిష్టూరాలేవో చెప్పుకున్నారు. ప్రిన్సిపాల్ గారికి అవేవీ అంత పట్టించు కోవలిసినవిగా అగుపించలేదు. వార్డెన్ ని మార్చ వలసిన అగత్యం లేదన్నరాయన. స్ట్రైక్ అన్నారు హాస్టల్ లోని విద్యార్ధులు.
    ఆ హాస్టలు కూ, రఘూ కు అసలు సంబంధం లేదు. కానీ, రఘూ స్టూడెంటు యూనియన్ ప్రెసిడెంట్ . అందుకని వాళ్లతో కలిశాడు. ఇతరులను కలిసేలా చేశాడు. కాలేజీ కి ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదని తీర్మానించారు. ప్రొఫెసర్లూ, లేక్చరర్లూ వెళుతుంటే అటకాయించారు. విద్యార్ధులూ, విద్యార్ధిను లూ వస్తుంటే ఆపారు. మరీ వెళతామన్న వారి పుస్తకాలు లాక్కున్నారు! వాళ్ళని నానా బూతులూ తిట్టారు! ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మీద, హాస్టల్ వార్డెన్ మీద, అందరి మీద వాడుక బాష లో కెక్కిన నినాదాలన్నీ చేశారు. సరిగా ఆ సమయానికే అరుణ వచ్చింది. రఘుపతే ఆమెను ఆపాడు.
    "ఆరూ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు!"
    "ఏం? ఎందుకు వీల్లేదు?"
    "సమ్మె!"
    "దేని కోసం? మీరందరూ చదువు కాకూడదని చదువు మీద సమ్మె చేస్తే ఇళ్ళకు వెళ్లి పేకాట ఆదుకోండి. అందరూ మీ ఇష్టాను సారమే నడుచుకోవాలని మీ ఆజ్ఞకు కట్టుబడి ఉండాలనీ ఎక్కడ వ్రాసి పెట్టి ఉంది?"
    "అవన్నీ డిస్కస్ చెయ్యడానికి ఇప్పుడు టైం లేదు. 'వెళ్ళద్దు' అన్నాం! వెళ్ళద్దు. అంతే!' అన్నాడు మరొక స్టూడెంట్ లీడర్.
    "నేను వెళ్లి తీరతాను!" అంటూ అరుణ అక్కడే అసహయులై నిలుచున్న విద్యార్ధులనూ, విద్యార్ధిను లనూ ఉద్దేశించి "నడవండి . మనమంతా కాలేజీ ల్లో చేరిందేందుకూ ? చదువు కోడాని కెనా? ఇష్టం లేని వాళ్ళు మానచ్చు. ఇష్టం ఉన్నావాళ్ళని మాన్పించదానికి పనీ పాటా లేని యీ పెద్ద మనుషులేవరు? రండి!" అంది.
    అంతే, అరుణ ను గురించి నానా పోలికేకలూ పెట్టారు. గుంపు లో నుంచి కొందరు ఆ అమ్మాయి మీద రాళ్ళు రువ్వారు. పాపం , అరుణ కు తల మీద పెద్ద గాయమే తగిలింది. సరిగా ఆ సమయానికే పోలీసులూ ప్రత్యక్ష మయ్యారు! సమ్మె చేసిన విద్యార్ధులు పోలీసుల మీదా రాళ్ళు రువ్వారు. లాఠీ చార్జి జరిగింది. లీడర్లు అనుకున్నవారిని అరెస్టు చెయ్యడమూ జరిగింది. పోలీసులే అరుణ ను రాయపేట హాస్పిటల్ కు తీసుకు వెళ్లి, తలకు తగిలిన గాయానికి కట్టు కట్టించారు. ఆనాడు కాలేజీ మూసి వెయ్యడం వల్ల, అరుణ ఆ కట్టు తోటే ఇల్లు చేరుకుంది.

 

                                


    అరుణను ఆ పరిస్థితుల్లో తొలుత చూసింది సంబంధం. "ఏమమ్మా? ఎమయిందీ? అయ్యో....."
    "సంబంధం గారూ, నాకేమీ కాలేదు. దయచేసి దీన్ని గురించి మీరేమీ రగడ చెయ్యద్దండీ!"
    "మంచి మాటన్నారు లెండి!" అంటూ అయన అమ్మగారిని కేకవేశాడు, అయ్యంగార్ ని కేకవేశాడు. వాళ్ళతో పాటు ఆ ఇంటి లోని నౌకర్లంతా అరుణ చుట్టూ మూగారు. అప్పుడప్పుడే సేతుపతి గారు కూడా వచ్చి వీరందరినీ చూశారు.
    "ఏం జరిగింది? అరె! అరుణా! తల మీద ఆ దెబ్బ ఏమిటమ్మా? ఎలా తగిలింది? సంబంధం, డాక్టరు గారికి ఫోన్ చెయ్యి. కూర్చోమ్మా అరుణా..... కూర్చో...."
    "అబ్బబ్బ మామయ్యగారూ , నాకేమీ కాలేదు. కాలేజీ లో మేడమేట్లు ఎక్కుతున్నాను. ఏదో....కళ్ళు తిరిగినట్టయింది! పడబోతూ , గోడను ఊతగా తీసుకుందామనుకుంటే , తల గోడకు డీ కొంది. ఈలోగా రఘు పట్టుకున్నాడు. డాక్టర్ దగ్గిరికి నేనే వెళ్లాను. ఇంజెక్షన్ ఇచ్చి, అయన కట్టు కట్టారు. అంతే."
    చాముండేశ్వరికి  మాచెడ్డ విసుగేసుకొచ్చింది.
    "మా అమ్మ, మా తల్లి! అంతేకదా? ఏదో మద్రాసు మీద బాంబు పడినంత గొడవ చేశాడు సంబంధం! సరిలే , వెళ్ళండి , వెళ్ళండి! నువ్వు కూడా వెళ్ళమ్మా.... అరుణా. వెళ్లి రెస్టు తీసుకో" అంది ఈసడింపు గా. అంతటితో అందరూ ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు.

                                     28
    ఆనాడంతా రఘుపతి జాడ అగుపడలేదు! రాత్రి భోజనాల వేళకు కూడా అబ్బాయి ఇల్లు చేరుకోలేదు.
    "రఘు ఎక్కడికి వెళ్లి నట్టండీ? కాలేజీ నించి ఇంటికి కూడా రాలేదు!" అంది చాముండేశ్వరి తల్లిగా తనకున్న ఆదుర్దా నంతటిని వెళ్ళగక్కుతూ.
    "మీ సుపుత్రుడిగారికి స్నేహితు లేక్కువయ్యారండీ! ఏ సినిమా హల్లో ఉన్నాడో....ఏ క్లబ్బు లో ఉన్నాడో ఎవరి కేరిక?" అన్నారు సేతుపతి కాస్త కటువుగానే. దానితో చాముండేశ్వ రి మూతి మూరెడు పొడవు చేసుకుని, భోజనాఅయిపోయే దాకా కూడా మరేమీ మాట్లాడలేదు.
    అరుణకు అన్నీ తెలుసు. రఘును పోలీసులు పట్టుకు వెళ్ళారేమో? తన సందేహాన్ని వేదనను, తనలోనే ఉంచుకుని, పైకి మాత్రం మామూలుగానే ఉన్నట్టు నటించడానికి ప్రయత్నించింది. అప్పుడు మిగిలిన వారు ఎవరూ తామున్న ధోరణి లో అరుణను గురించి ప్రత్యేకంగా పట్టించుకోలేదు. అదే చాలనుకుంది అరుణ.
    రాత్రిమాత్రం ఎంతకాలం ఉంటుంది? దాని వ్యవధి అయిపోగానే వెలురురు వచ్చింది. మళ్ళీ బెడ్ కాఫీలూ, మొదలయిన హడావిడి బయలుదేరింది ఆ ఇంట్లో. సేతుపతి అలవాటు చొప్పున పైప్ వెలిగించి, పేపర్ లోని హెడ్ లైన్స్ చూచి, పరధ్యానంగా పేజీలు  తిప్పారు. ఏడవ పేజీ లో ఇంతింత లావు అక్షరాలతో ఉన్న ఒక హెడ్ లైన్ అయన కంట పడింది. ఒక్క నిమిషం పాటు అసలు విషయాన్ని చదివి జీర్ణించు కున్నారాయన. కోపాతిరేకంతో మనిషి గజగజలాడిపోయాడు. ఆవేశ పడడం అయన కసలు అలవాటు లేదు. అయినా.. అంతటి నిండుకుండ కూడా తొణికి పోయింది.
    కోపంగా.....బిగ్గరగా ...."నాయర్ , నవనీతం , సుబ్బంనా, సంబంధం!" అంటూ అందర్నీ కేకవేశారు సేతుపతి. ఇద్దరు ముగ్గురు పరుగులేత్తుతూ వచ్చారు ఆ గదిలోకి.
    "నవనీతం , అరుణను తక్షణం ఇక్కడికి రమ్మను! మీరంతా వెళ్లిపోవచ్చు." నవనీతం తో పాటు అందరూ వెళ్ళిపోయారు.
    అరుణ ఆ గదిలో అడుగు పెట్టిందో లేదో....సేతుపతి గారు అందుకున్నారు-- "ఏమమ్మా అరుణా, నిజం చెప్పు. ఆ దెబ్బ నీకెలా తగిలింది? మీ కాలేజీ విద్యార్ధులంతా సమ్మె చేశారు. వారు వద్దన్నా మీలాటి వారు వెళ్ళడానికి ప్రయత్నించారు. వాళ్ళు రాళ్ళు రువ్వారు. అందువల్లనే నీకా గాయం తగిలింది . అవునా?"
    "అవునండీ, అందువల్లనే!" అరుణ లాటి ముద్దరాలికి కళ్ళ నీరు నిండడం ఎంతసేపు? పైగా తప్పు ఇప్పుడు తనది! దాన్ని వేలెత్తి చూపిస్తున్నారు సేతుపతి.
    "మరి ఎందుకమ్మా నాతొ అలా అన్నావు నిన్న?"
    "రఘును మీరేమైనా అంటారని...."
    "ఒక్కగా నొక్కడు కాబట్టి, వాణ్ణి చండి వెనకేసుకు రావచ్చు. నేనూ ఆ పొరపాటు చెయ్యవచ్చు. కానీ, అన్నీ తెలిసిన నీవు కూడా వాడు రేసులకు వెళ్ళడానికి డబ్బిచ్చి, అక్రమ మార్గాల్లో వాడు నడుస్తున్నట్టు తెలిసి కూడా.....కప్పి పుచ్చినందు వల్ల చెడిపోయే దేవరు? మన రఘేగా?"
    "ఆ కన్నె ఏమనగాలుగుతుంది? ఏడ్చింది.
    "తప్పమ్మా , తప్పు! అయిందేదో అయిపొయింది. ఊరుకో!"
    "నాకేదో భయంగా ఉందండీ, మామయ్యగారూ!"
    "వాణ్ణి కూడా పోలీసులు అరెస్టు చేశారనేనా?"
    "ఊ. మేమంతా అక్కడ ఉండగానే పోలీసులు వచ్చారు. వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు. లాఠీ చార్జి కూడా జరిగింది. మమ్మల్ని పోలీసులు వెళ్ళిపొమ్మన్నారు. ఆ తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు."
    "జరగవలసిందే జరిగి ఉంటుంది! దట్ ఫూల్ ఆఫ్ ఏ డాంకీ! వాడి కేందుకూ ఈ పాలిటిక్స్? వాణ్ణి కాలేజీ కి పంపింది, వాడు డిగ్రీ పుచ్చు కోవాలనా.....లేక వాడొక పెద్ద యూనియన్ లీడర్  కావాలనా? అల్ రైట్! ఒకటి రెండు రోజులు జైల్లో పడి వుంటే గాని వాడికి బుద్ది రాదు! ఈరోజు నీవు కాలేజీ కి వెళ్ళద్దమ్మా!"
    "అంటే.....మీరు జామీను....."
    "అవసరం లేదు ,....ఈ బడుద్దాయి ల్ని కాస్త బెదిరించి వదిలేస్తారు! కేసూ, గీసూ ఏమీ ఉండదు. అయినా....అయ్యంగార్ ని కమీషనర్ గారి దగ్గిరికి పంపి పొజిషన్ తెలుసుకుంటాను. ఆ గాయం ఎలా ఉంది?"
    "అబ్బే....ఏమంత పెద్ద గాయం కాదండీ. మానిపోతుంది."
    "దాని ఇష్టం వచ్చినప్పుడు అది మానడం కాదమ్మా! సంబంధం తో చెప్పి డాక్టరు గారికి కబురు చెయ్యి. ఆ .....ఈ గొడవలన్నీ చండికి తెలియ వలసిన అవసరం లేదు.
    "అలాగేనండీ " అని, వెళ్ళిపో బోయి , ఆగి, తన కళ్ళను సేతుపతి గారికి అప్పగించి నిలుచుంది అరుణ.
    "ఏం తల్లీ?"
    "నేనేంతెంత గానో చెప్పానండీ....."
    "నాకు తెలుసు. తల్లీ. వాడిది కుక్కతో కలాటి బుద్ది!"
    "అది కాదండీ....ఈ ఊళ్ళో ఉంటె రఘు బాగుపడడండి. అన్నీ చెడు సావాసాలే!"
    "పొరుగూరు వెళితే మాత్రం ఇటువంటి సాహసాలు అబ్బవని నమ్మక మేమిటమ్మా? మనల్నిబట్టి.....మన తత్త్వాలను బట్టి అబ్బుతాయి ఏవైనా! నీవు చెడు సావాసాలు చెయ్య;లేదేం మరి? ఈనాటికి నాకటువంటి అలవాట్లేమీ లేవేం? నువ్వెళ్ళు తల్లీ, నే నాలోచిస్తాలే."
    అరుణ వెళ్ళిపోయింది. మళ్ళీ పైపు వెలిగించి పచార్లు చెయ్యడం మొదలు పెట్టారు సేతుపతి. అయినా........ఈ రఘు ఇలా తయారవడానికి కారణం మేమిటి? ఏమిటి? ఆ తండ్రి తన కొడుకును గురించిన ఆలోచనలతో తగని బాధ పడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS