Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 21


    ఆ ఊరు దగ్గరగా ఉన్న పొలాలకు వేరుసెనగ వేసినప్పుడు పందుల పోరెక్కువ! ముట్టేలతో తవ్వి, కాయలు నమిలేస్తూ పైరంతా ధ్వంసం చేస్తాయి. వాటి బారి నుండీ పైరును రక్షించు కోవడానికి, ఎప్పుడో ఎవరో ఒకాయన ఆ ఊళ్ళో ఒక ఆయుధం కనిపెట్టాడు. అది గోళీ కాయంత సైజు లో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పైరులో సాళ్ళ మధ్యగా అక్కడక్కడా పూడుస్తాడు. పంది వచ్చి దాని పైన అడుగు పెట్టడమో, లేక ముట్టేతో దానికి ఒత్తిడి కలిగించడమో చేసిన వెంటనే అది భయంకరంగా పేలిపోతుంది. అంత చిన్న వస్తువు పందిని నాలుగు బారల దూరం విసిరేసి, దాని శరీరాన్ని చిన్నాభిన్నం చేసి వేస్తుంది. దాన్ని అనుకుని రెండు మూడున్నా బ్రతకవు; లేదా దూరంగా ఉంటె భయపడి పరుగెత్తి పోతాయి. అంత శక్తి గల నాటు బాంబు అది. ఆ బాంబు నిర్మాణం ఆ ఊళ్ళో వాడుకయింది. అవి పచ్చిగా ఉన్నప్పుడు విసిరి నేలకేసి కొట్టినా పేలవు కనక ప్రమాదం ఉండదు. ఎండబెట్టిన తరవాత వాటిని దాచుకోవడం లో , వాడడం లో చాలా జాగ్రత్త అవసరం!
    ఎండబెట్టిన అలాంటి వాటిని తీసి, జాగ్రత్త గా కుదుపు కలగకుండా, బుట్టలో కేత్తుతుంది శ్యామల. అది చేయడం, ఎత్తి పెట్టడం అక్కడి ఆడవాళ్ళ కి కూడా అలవాటే! అప్పుడు శ్యామల దగ్గరికి సావిత్రమ్మ వచ్చేసింది.
    'మామయ్యతో ఏమని చెప్పావు?' తీక్షణంగా అంది.
    శ్యామల పలకలేదు.
    'పలకవేమే, దయ్యమా?'
    'మామయ్య చెప్పలేదూ?'
    'నే బ్రతకాలని లేదా?'
    'అమ్మను చంపుకునేవాళ్ళుంటారు....'
    'అప్పుడు నీలాంటి వాళ్లూ ఉంటారు.'
    'నోర్మూయ్! దరిద్రపు మోఖమా? ఇంత బ్రతుకూ బ్రతికి.....'
    'ఇంత బ్రతుకు? ఎంత బ్రతుకు బ్రతికామమ్మా మనం? తాగి వచ్చిన నాన్నతో తిట్లు తిని, దెబ్బలు తిని, ఆస్తి కరిగిపోతే కష్టం చేసుకుని బ్రతకటం చేతకాక, కుటుంబ గౌరవమంటూ ఇంట్లో కూచుని, ఎవరైనా దయదలిచిన భిక్షంతో కాలం గడిపి, ఇప్పుడు తాతయ్య మీద పడి బ్రతుకుతున్నాము.... అంతే మన బ్రతుకు.'
    'అవునే , పాడుదానా! ఆస్తి పోగొట్టుకున్నాము, కులం పోగొట్టుకోలేదు.'
    'అమ్మా! నాన్న జీవితం -- జాతి, మత , వర్గ భేదం నాశనం చేసే గుణ పాఠం ! అయితే , నువ్వట్లా ఆలోచించటం లేదు. నాన్నకు సీరా భార్యతో సంబంధం, మాదిగే గంగి తో సంబంధం -- నే చెప్పకూడదు. నీకు తెలుసు. ఇదంతా తెలిసి కూడా కులం పోలేదనే అభిప్రాయ ముంటే , ఆ కులమెం చేసినా పోదు. నాన్న అన్ని అప్రయత్నాలు చేసీ, చెడగొట్టలేని కులాన్ని నేను మాత్రం చెడ గొట్ట గలనా?' బుట్ట ఎత్తుకుంది. తండ్రిని గూడా లెక్క పెట్టని ఈ తర్కం సావిత్రమ్మకు పిచ్చి కోపం కలిగించింది. ఆరోజు నన్నయ్యకు రక్తమిచ్చిన నాడు, అణుచుకున్న కోపం, అసహ్యం ఒక్కసారిగా పెల్లుబికినాయి. 'ఉండు! పాపిష్టి దానా! ఎక్కడికి పోతావు?' శ్యామల ను గుంజి నిలబెట్టి , బుట్ట నేలకేసి కొట్టింది. భయంకరమైన ప్రేలుడుతో పాటు -- 'అమ్మో!' అన్న హృదయ నిదీర్ణమైన కేకలు!
    
                             *    *    *    *
    'యధా కాష్టంచ కాష్టంచ
    సమయేతాం మహోదధౌ
    సమత్యచ వ్యసేయేతాం
    తధ్వద్భూత సమాగమమ్!'
    ఆదికవి దివ్యవాణి అమృత వర్షం కురుస్తూ బాదోపశమనం చేస్తున్నట్లు నిర్వికారంగా కూర్చున్నాడనంతయ్య . సరస్వతి సౌభాగ్యం కోల్పోయి ఒక్క నెల కాలేదు. ఇంతలో అతి విషాదకరమైన సావిత్రి, శ్యామలల దారుణ మరణం! తత్త్వజ్ఞుల మానవ జీవితాన్ని ప్రకృతి పరిణామాలతో పోలుస్తారు. అది అన్ని సందర్భాలలో సరిపడదేమో! అమావాస్య వెంట అంతకంటే భయంకరమైన అమావాస్యలు సంభవించే జీవితానికీ,దానికీ ఉపమాన ధర్మ మెక్కడ? సావిత్రి హృదయం లో ఇంత ఘోరం చెయ్యాలని నిర్ణయించుకుని ఉంటుందా? కులభేదాల్ని గురించి మూడ నమ్మకాలు పెంచుకుని, తనను తాను వంచించుకున్న మనస్సు క్షణి కొద్రేకం తో చేసిన మారణ కాండ! తనకు లేని, వాసవి కి , సరస్వతి కి లేని జాతి వివక్ష తాసర్పం , సావిత్రి లో ఎంత విషం కక్కుతూ ఉండగలిగింది! మానవత్వం లో ఇక్యం కాని కులమంటూ లేదని అర్ధం చేసుకోలేక పోయింది. ఈ కుల వివక్షత మాన వైక్యాని కెంత ఆటంకం?
    అనంతయ్య ఆలోచన అయన అనుభవాల దారిలో వెనక్కి వెళ్లి, ఒక్కచోట ఆగి అక్కడే పరిభ్రమిస్తుంది!
    మహాత్ముడు ఆంధ్రదేశం లో పర్యటించాడు. బసవరాజు అప్పారా వన్నట్లు -- 'నాల్గు పరకల పిలక , నాలుగు వేదాల సార మెరిగిన పిలక !' ఆ నాల్గు పరకల పిలక , మోకాళ్ళు దాటని అంగ వస్త్రం , ఆ బక్క మనిషి నోట ఉపనిషద్వాక్కులు! 'అస్పృశ్యత అనేది హిందూ మతం లో లేదు. అస్పృశ్యత పాటించడం కంటే మహాపాపం మరొకటి లేదు. దాన్ని నిర్మూలించండి. మానవులంతా ఒకటే!" ఆ మాటలు తనను కదిలించాయి! అది రాజకీయ నాయకుని ఉపన్యాసం కాదు. అది రుషి హక్కు!
    తన ఊరు అనంతపురం జిల్లాలోని యెల్లనూరు. బ్రహ్మణా గ్రహారం! 'రాధా మాధవం' రచించిన చింతల పూడి ఏళ్ళనార్యునికి శ్రీకృష్ణ దేవరాయలు దానమిచ్చినట్లు జన శ్రుతి! యెల్లన ఊరు యెల్లనూరయింది! ఆరోజు ఎవరి ముఖం చూచినా, క్రోధ చ్చాయ గుబులుకుంటుంది. మాది గెలు దేవాలయ ప్రవేశం చేయాలని సంకల్పించారట! అది కారణం. బ్రాహ్మణులూ, కాపులు -- అంతా ఒక్కటై నారు. సాయంత్రం ఆలయం వద్ద గుమికూడారు. కర్రలన్నీ ఒక వేపున గుట్టగా పడవేశారు. కాశీ మజిలీ కధలో మహమ్మదీయ స్త్రీ కాశీ విశ్వనాధుని దర్శిస్తుందని బ్రాహ్మణులు కావలి కాచిన గాధ జ్ఞప్తి కి వచ్చింది. భగవంతుడా! నీ దర్శనం చేసుకోవడానికి రక్తపాతం జరగాలా? ఆస్తి మితంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తన మాట లెవ్వరూ పట్టించు కోలేదు. చేసేది లేక చూస్తున్నాడు. వస్తున్నారు! వస్తున్నారనే కేకలు!
    అబ్బ! ఎంత దైన్యంగా , ఎంత దారుణం గా ఉన్నారు! వాళ్ళ కళ్ళలో కక్ష! వాళ్లు భగవంతుని మీద భక్తీ తో రాలేదు; ఏదో నిగ్గదీసి అడగటాని కొచ్చినట్లున్నారు.అంతా ముందు కోస్తున్నారు. 'ఆగండి!' వంద కంఠల కేక! వాళ్లకు వినిపించినట్లే లేదు. తప్పదు. ఆ నల్లని శరీరాల నుంచీ ఎర్రని రక్తం ప్రవహించక తప్పదు. భగవంతుడా! కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడు కాదు గానీ, ఒక దేవత ప్రత్యక్ష మైంది! ఆమె కాళిదాసు స్తుతించిన శ్యామలాదేవి! మాతంగి ని, మధుశాలిని! ఎర్రని చీరె, నల్లని రవికె , జడలో ఎర్రని గన్నేరు పువ్వు ఆ రక్త లోచనాలు!
    'ఎందుకొచ్చారీడికి? ఎల్లండి, ఎర్రి మొకాల్లారా? దేవుడు ఇంత పపంచేకమంతా ఇడిసి పెట్టి వచ్చి ఈ గుడిలో నక్కి కూసున్నడా? ఆ దేవుడు వాళ్ళకే ఉడ్నీ.... ఎనక్కి తిరగండి!' వంద జనాన్ని చూచినా చెదరని మొండి వాళ్లు, ఆమె అజ్ఞాను నిశ్శబ్దంగా పాలించారు!
    నిద్రలో ఆ స్త్రీ దయ్యం లా, మంత్రగత్తె లా, రాణి లా కనిపించింది. బాణుడి 'కాదంబరి' లో లక్ష్మీ దేవి చండాల కన్యకగా పుట్టిన ఘట్టం మాటిమాటికి జ్ఞప్తి కొస్తుంది. ఆ సాయంత్రం ఏమీ తోచక చెరువు కట్ట మీదుగా షికారు వెళ్ళాడు. మునిమాపు వేళ అయింది! చెరువు లో నీళ్లు నలుపు కలుపు కుంటున్నాయి. ఒకే ఒక పిట్ట చెరువు మీదుగా అరుస్తూ వెళుతుంది. 'ఏ విహంగము గన్న....' అన్న పెద్దన మనోజ్ఞ కల్పన మనస్సు ను రసార్ద్రం చేస్తుంది.
    'ఇదిగో ! ఓ బాపనయ్యా! కాసింత కడవేత్తుదూ?' తిరిగి చూస్తె అల్లనాటి ఆమె!
    'ఓహో! తగలకూడ్దు గదూ?' అంది.
    'నిజంగా ఎత్తమంటావా?'
    'అయితే, నిజంగా ఎత్తతావంటావా?'
    తను దగ్గరగా వచ్చాడు.
    'ఉండు....ఉండు, నువ్వంటరాని వాడివి.' చిలిపి గా నవ్వుతూ చివుక్కున కడవ నేత్తుకుంది. మోసం! కడవెత్తుకోవడం లో ఆ ఒళ్ళు ఊపు మెరుపులా కదిలి కొట్టింది! వెనక్కి తిరిగి నవ్వింది.
    వరకూ దాచుకో!' మన్నట్లూ.
    తరవాత వారం రోజులు ఎక్కడా కనపడలేదు.
    'రోజూ కాలువ కి కావలున్నందుకు నీకు జీతమెంతేటి?'
    అంటే రోజూ తన్ను చూస్తూనే ఉందన్న మాట! 'నేను రావడం నీకోసం కాదులే....'
    'అబ్బే! ఎందుకయిందీ? నీళ్ల కొచ్చి నోళ్ళ కు కడ వేత్తడానిగ్గనీ!'
    తనకూ నవ్వొచ్చింది.
    'నీ పేరేమిటి?'
    'రాసుకుంటావా?'
    "ఆ...'
    "పోత్తమేదీ?'
    'ఇదిగో , ఇక్కడ ....' గుండెలు జూపాడు.
    'ఓ యబ్బో! సంబడం!' -- అని, 'నీలి' అంది.
    నీలి! ఎంత అద్భుతంగా ఉంది పేరు కూడా! కడవ నీళ్ళలో ముంచుతుంది.
    'ముంచింది దాని కడవ ములుగు పువ్వుల చాయ కడిగింది దాని కడవ కలువ పువ్వుల ఛాయ!'
    -- జానపద సాహిత్యం జ్ఞప్తి కొస్తుంది!
    'ఏ ఊరు నీది?' అంది ఠీవి గా, రాణీ లాగా.
    'నీదే ఊరు?'
    'నేనీ ఊరు కొచ్చి నాలుగేండ్లయితది...'
    'నేనీ ఊరు విడిచి ఆరేండ్లయితది...'
    నవ్వింది. 'ఎక్కడున్నావ్? మిలిట్రీలోనా?'
    'మిలిటరీ లో గాదు....మేనమామ గారింట్లో.'
    'పెండ్లాం తయ్యారు గుందా?'
    'ఆ...పక్కనే ఉంది...ధైర్యం తెచ్చుకున్నాడు.
    'అబ్బో! బాపనోడి సరసం, సిత్తా కారితి వోరుసం! రొంత జరుగు...'
    నీలి చూపులు, అందులో 'సరసం' అన్న ఎత్తి పొడుపు తనకు చనువిచ్చినాయి. కడవేత్తుకోబోతున్న నీలినీ కౌగిలించుకున్నాడు! నీలి సిగ్గుగా నవ్వుతూ, 'సి! కళ్ళు మూసుకో!' అంది.
    తనకు తెలియకుండానే పారవశ్యంతో కళ్ళు మూతలు పడ్డాయి. నెత్తిన జలపాతం! నీలి నవ్వుతూ కడవ నీళ్లు గ్రుమ్మ రించింది.
    'ఒళ్ళు ఉష్టమేక్కిందా , బాపనయ్యా!'
    తేరుకుని చూచేలోపల పారిపోయింది.
    ఆ తడిసిన గుడ్డలతో ఊళ్ళో కెళ్ళలేక అరెంత వరకూ ఆ చీకట్లో ఉండిపోయాడు. నీలి మీద పెద్ద కోప మొచ్చింది. ఆ కోపంతో పాటు అర్ధం కాని ఆకర్షణ కూడా పెరిగింది. పొలం దారి గుండా, గడ్డి మోపు నెత్తిన బెట్టుకుని వస్తూన్న నీలి కనిపించింది. వెతకగా వెతకగా ఆ గోచీ పోసుకుని కట్టుకున్న చీరే, ఆ భంగిమ ---చూస్తూ నిలుచున్నాడు.
    "ఏం, ఆకలిగా ఉందా? గడ్డి తింటావా?" అంది నవ్వుతూ.

                                  
    ఉక్రోష మొచ్చింది. ఆరోజు సంఘటన మెదిలింది. గడ్డి మోపు లాక్కుని విసిరేశాడు. నీలినీ తోశాడు. గడ్డి మోపు మీద పడిపోయిన నీలి కళ్ళు పెద్దవి జేసి సోద్యంగా చూసింది. నీలి కళ్ళలో భయం చూసి, తనకు వెర్రి సాహసం విజ్రుంభించింది. కోపంతో, రోషంతో కొంతసేపు ప్రతిఘటించిన నీలి, కఠోర నిశ్చయంతో అగ్నికి ఆహుతి కావడానికి సిద్దపడినట్లు నిశ్చలంగా ఉండిపోయింది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS