'నువ్వు బాపనోడివి . నేను మాదిగ దాన్ని. అంటే మనుసు లందర్లో నువ్వెక్కువొడివి , నేను తక్కువదాన్ని. ఇప్పుడేమైంది? నా కాలితో నీ తల మీద తన్నాను.... ధూ! ఇప్పుడేమైంది నీ కులం, బాపనోడా?' ...నీలి పిచ్చిదానిలా నవ్వుతూ, తను పిలిచినా ఆగకుండా వెళ్లి పోయింది.
'స్మర గరళ ఖండనం
మమ శిరసి మండనం
దేహి పద వల్లవ ముదారమ్!' -- తనకు జయదేవుడంతటి వాడు తోడున్నాడని నీలి కెట్లా చెప్పడం?
ఒక్క నెల గడిచింది. మామ రమ్మని కబురు పంపించాడు. నీలి ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ ఇండ్ల కెళ్లి కలుసుకుంటే ఏం లాభం?
కల ఫలించినట్లు, మళ్లీ చెరువు కట్ట దగ్గర దూడను తోలు కెళుతూ కనిపించింది.
'నీలీ!'
చూసింది; పలకలేదు.
'కోపమొచ్చిందా?'
'ఏం? పోగొట్టే మందు తెచ్చినవా?'
'ఆ... ఇవ్వమంటావా?'
"ఏం? మళ్లా ఆకలయితందా?'
తనకే సిగ్గు కలిగింది నీలి మాటకు.
'నేను రేపు ఎల్లి పోతున్నా....'
'లచ్చనంగా....మళ్ళా రావాకు...'
'అంతేనా?'--
'అంతేగాక ...నీ పెండ్లాన్నా?'
'అదే! అడగాలను కున్నాను. చెప్పు, నీలి! నీకిష్ట మేనా?'
'మీవాళ్ళోప్పు కుంటారా?'
'ఒప్పుకోరు . నువ్వోప్పుకుంటే చాలు, కూలి కెళ్లి బతుకుదాము....'
నీలి తన ముఖం చూసింది.
'నువ్వు మాదిగోనీవై ఎందుకు పుట్టలేదు?' అంది దిగులుగా.
'అబ్బ! ఎవరై పుదితేనేం! ఇప్పటి సంగతి చూడు!'
'మీ వాళ్లకు తెలియకుండా అయితే నే నొప్పుకోను.'
'దొంగతన మెందుకు? చెపుతాను.'
ఈనాటికీ సావిత్రి లాంటి వాళ్ళున్నప్పుడు ఆరోజుల్లో తన నిర్ణయ మెంత సంచలనం కలిగించిందో చెప్ప పని లేదు. తండ్రి తిలోదకాలు విడుస్తా నన్నాడు. తల్లి గుండె లవిసేలా ఏడిచింది. మేనమామ ఊరెళ్ళి చెప్పాడు. అతను చేసిన ఆర్భాటం తో ఊరంతా తెలిసిపోయింది. లక్షణంగా బిడ్డ నిచ్చి, ఆస్తి కంతా వారసుణ్ణి చేస్తా నంటే వీనికేం పిచ్చి! అని తన ముందరే నవ్వుకున్నారు. చివర కంతా తనను బహిష్కరించారు. ఆ అనుభవం ముగించుకుని, నీలి దగ్గరకు పరుగెత్తు కొచ్చాడు.
నీలి నవ్వుతూ ఎదురుగా నిలుచుంది. మెడలో పసుపుతాడు , కాళ్ళకు మెట్టెలు! పెళ్ళి కూతురు!
తన కళ్ళకు మసకేక్కింది . ఊపిరి బిగాపట్టింది.
'పాపం! నిన్ను పెళ్ళి జేసుకుంటా ననుకున్నావా?'
నీలి నవ్వు శూలం తో పొడిచి చిత్రహింస పెట్టింది.
జీవచ్చవం గా మారిపోయాడు. తరవాత మేనమామ పిలిచినా, తాను వెళ్ళలేక పోయాడు. పిచ్చివాడిలా ఉన్న తనను, కన్నతండ్రి, ఎమనలేక పోయాడు. తన వాలకం చూసి నీలి తన నెంత మోసం చేసింది చెప్పుకుని నవ్వేవాళ్ళు!
మూడు నెలలయింది. తను చెరువు వేపుగా వచ్చి! సరీగ్గా నీలినీ మొట్టమొదట కలుసుకున్న చోట కూర్చున్నాడు. ఒకతనోచ్చాడు; ఏడుపు రాకుండా బిగపట్టుకుంటున్నట్లు కనిపించాడు.
'నీలి ఒక్కసారి వచ్చి పొమ్మంటున్నదని చెప్పాడు.
తను రానన్నాడు.
ఆ మనిషి కన్నీళ్ళ తో బ్రతిమాలాడు. అతను నీలి మొగుడు!
ఈ మలిన వస్త్రాల్లో ఇంత మోటుగా ఉన్న ఇతను, తన భార్య కోరిక తీర్చడానికి వేరే మగవాణ్ణి బ్రతిమాలు తున్నాడు. ఎంత అకుత్రిమ సంస్కారం!
గుడ్డి దీపం కునుకుతున్న గుడిసె లో , మంచం మీద నీలి!
తనకు ఆశ్చర్యం వేసింది. నీలి ఇలా అయిందా? ఏం?
కళ్ళు తెరిచి తన నల్లాగే చూసింది. కళ్ళ నించీ దూకి, శల్యావశిష్టమైన చెక్కిళ్ళ మీద ఆగిన కన్నీరు. పక్కలో చిరుగుల బొంతల కుళ్ళు వాసన!
దగ్గరగా రమ్మన్నట్లు చూసింది! నీలి కన్నీటి కధ అర్ధమయింది.
అగ్రవర్ణుల మనుకుంటున్న వాళ్ళ మీద కక్ష రగిలింది. అందుకు అవకాశంగా తను దొరికాడు. అవమానించి, బాధించి , ప్రతీకారం తీర్చుకోవాలను కుంది. ఆ విషం తలకెక్కి, హృదయం సంగతి మరచి పోయింది.
చేయాలనుకున్న పని చేసిన తరవాత ఎన్నడూ విడవని హృదయం మిగిలింది. అప్పుడర్ధ మయింది. ఎంత మోసం చేసుకుందో? పెళ్ళి చేసుకున్న మగణ్ణి ఎంత మోసం చేసిందో? ఆ నిరంతర ఘర్షణ కు శరీరం శిధిల మయింది!
కన్నీరు తుడిచి బైటి కొచ్చేశాడు. వైద్యానికి డబ్బు సహాయం చేసినా ప్రయోజనం లేకపోయింది.
మనసు బాగుండక ఊరక తిరగసాగాడు. ఒక్కచోట రాఘవరెడ్డి తటస్థ పడటం, ఈ ఊరికి లాక్కుని వచ్చి, తలో ఇంత గ్రాస మిప్పించి, రాత్రి వేళ పురాణం చదివే కాలక్షేపం ఏర్పాటు చేశాడు. తనూ ఊళ్ళో ఒకడయ్యాడు. పిత్రార్జితం లో భాగం పంచుకోలేదు. తమ్ముళ్ళ కే ఇచ్చేశాడు. ఒక్క సంవత్సరం గడిచేసరికి సుందరరామయ్య కుమార్తె నిచ్చి ఇంట్లో ఉంచుకుంటా నన్నాడు. రాఘవరెడ్డి ఒప్పించాడు. మళ్ళీ ఇన్ని బంధాలు పెరిగాయి!
'నాయనా!' ఎదురుగా వాసవి. తనీ మధ్య ఒంటరిగా కూర్చుని దుఃఖ పడుతున్నాడని ఆందోళన పడుతున్నాడు వాసవి. అనంతయ్య హృదయం లో కొడుకు మీద వాత్సల్యం కురిసింది.
'ఏం, నాయనా?' అన్నాడు మృదువుగా.
'ఇక్కడెందుకు ఒంటరిగా -- ఇంట్లోకి పద.' నవ్వుకున్నాడు.
'సరే, పద....' అని లేచాడు.
ఇద్దరి మనస్సులో ఒకటే అర్ధం!
'అద్వైతం సుఖ దుఃఖ యోరమగతం, సర్వస్వవస్తామయ
ద్విశ్రామో హృదయస్య యత్ర జరపాయస్మిన్న హర్యోరసః
కాలేనా వరణాత్యయత్పరిణతే యత్ప్రే మసారేస్థితం
భద్రంతస్య సుమానుషన్య కధను ప్పే కంపాతత్ర్సార్ధ్యేతే!'
* * * *
'సరస్వతీ! నువ్వు వ్రాసిన ఉత్తరం చేరింది. జరిగిన విపత్తు నించీ, మళ్ళీ జీవితం కదిలి పోతున్నందుకు సంతృప్తి కలిగింది. నేను కూడా ఇప్పటికి విడుదల పొందాను. ఆరోజు ఆ పెళ్ళికి సాక్షీ భూతుడైన వెంకటేశ్వర స్వామిని గూడా నిన్దించాను. సరస్వతీ! ఇప్పుడాలోచిస్తే, స్వామి నా దోషానికి విధించిన శిక్ష . అందులో మళ్లీ నా మీద చూపిన దయ ఎంత అద్భుతంగా ఉంది! కమల ఎవరైందీ, ఆమె సంగతీ నీ కింతకు ముందు వ్రాశాను. ఆమె వెళ్ళిన తరవాత చట్ట సమ్మతంగానే నతని నుంచీ విడుదల పొందటం కష్టమన్నాడు పద్మనాభయ్య గారు. నేను చావటం తప్ప మరో మార్గం లేదనుకున్నాను. చివరికి అతని నీచమైన ధనదాహమే నా భవిష్యత్తు కు బాటగా మారింది. నా పిత్రార్జితం నించీ, అతని నించీ నాకు విడుదలయింది. ఇంత ఆస్తి అతని పరమైనందుకు పద్మనాభయ్య గారు బాధపడ్డారు. అతన్ని భర్తగా అంగీకరించడమే మంచి దన్నారు. మృత్యువే అంతకంటే మంచిదని నా అభిప్రాయం! అతని షరతు ప్రకారం, ఆస్తి భిక్షగా పారవేసి విడాకులు పొందాను నేను. ఆస్తి పోయినందుకు నా కిప్పుడు చింత లేదు.
ఆ రాహు గ్రహణం నించీ బైట పడ్డాను. ఒకనాడు విన్నాను నేను పద్మనాభయ్య గారి ద్వారా! నాన్నగారు చనిపోయేటప్పుడు ఇల్లూ, పదెకరాల భూమీ మీ నాన్నగారి పేర వ్రాశారనీ, కానీ అయన అందు కొప్పుకోక, పద్మనాభయ్య గారి దగ్గరనే చించి వేశారనీ!
స్నేహం స్వార్ధానికి ఉపయోగించటం తను సహించలేననీ, న్యాయమైన వారసురాలు గోదాదేవేనని ఆయనన్నాదుట! అప్పుడు నా కళ్ళకి కప్పిన తెర విడి పోయింది. ఒకనాడు ఈ ఆస్తి అన్న అహంకారంతో ఆత్మీయుల్ని పోగొట్టుకున్నాను. ఆ అహంకారపు పొర తొలగించాడు; వివాహమనే ఆచెర వదిలించాడు! స్వామి కల్పించుకోకపోతే , ఇంత న్యాయం జరుగుతుందా?
వాసంతి కి నా ఆశీస్సులు.
-- నీ గోదాదేవి'
కొన్నాళ్ళు గడిచాయి.
* * * *
'గోదాదేవి!
మన జీవితా లిట్లా మలుపు తిరిగి ఒక్కసారిగా కలిసి పోతాయని ఒక నెల ముందు ఊహించనైనా లేదు.
నాన్నగారీ మధ్య ఒక శతకం రచిస్తున్నారు. మొన్న కొన్ని పద్యాలు చదివి వినిపించారు. ఎంత అద్భుతంగా ఉన్నాయని! 'కాళహస్తీశ్వర శతకం" రచించిన స్తుతమతి ధూర్జటి కవిత్వాన్ని తలపించింది. "ఎప్పటికి పూర్తీ చేస్తారు?' అన్నాను. "మీ పెళ్లి నాటికి' అని నవ్వాడు. అది అయన అనుజ్ఞ! ఆయనొక ఋషి! ఆ కన్న తండ్రిని తలుచుకున్నప్పుడు నాకు గర్వం అనివార్య మౌతుంది.
నీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను (ఒకప్పుడన్నావు). ఆస్తి పోగొట్టావు. నేనా బక్క రైతును. అందునా రాయలసీమ మెట్ట రైతును! నిన్నెట్లా పోషించేది! సరస్వతి పెద్ద కామందు. ఆమె పొలం పాలికి చేసుకుని బ్రతుకుదాము. అంతేనా? నేను సేద్యం చేస్తుంటాను. నువ్వు చేని కాడికి మధ్యాహ్నం అన్నం తీసుకొస్తావు. ఇద్దరం కలిసి తింటాము. ఎద్దులు నెమరేస్తూ పడుకుంటాయి. నీ ఒళ్లో తల పెట్టుకుని, నీ కళ్ళ లోకి చూస్తూ ఒక్క పాట పాడమంటాను.
"పాడుట కోప్పనేని....లేత మనసుల్ తడిసేసెడి....
కొమ్మల నాకుల వోలె వొక్క మాటాడక కూరుచుంద
మనువైన పోలమ్ముల గట్టు విడలన్."సరేనా? కళ్ళు మూసుకుని చూడు! ఎలా గుంది!
ఇప్పుడు రాత్రులు మిద్దె మీద పడుకుంటున్నాను....ఆషాడ మొచ్చేస్తుంది. మేఘాలు ఆకాశం లో సందడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. పెద్ద వర్ష మొచ్చినప్పుడు క్రిందకు పరుగెత్తాలి! మేడ లేదుగా మనకు? అచ్చంగా కృష్ణ రాయల మట్టి మిద్దెల వాళ్లం!
ఒక్కసారి వస్తుందను కున్న వర్షం కన్నీటి బొట్లుగా మారి వెళ్లి పోతుంది. ఆ చినుకుల్ని దాచుకున్న మన దొడ్లో ని వేప చెట్టు ఏ తెల్లవారు జామున వీచిన పిల్ల గాలికో జల్లున నా మీద చిలకరిస్తుంది! అప్పుడు నాకీ శ్లోకం జ్ఞప్తి కి వస్తుంది.
'మామాకశ ప్రణిహిత నిర్దయాశ్లేష హేతో
ర్లబ్దయన్తే కధమపి మయా స్వప్న సందర్శనేషు
పశ్చన్తినాం నఖలు బహుశోకేన స్థలీ దేవతానాం
ముక్తా స్థూలాస్తరు రుకిసలయే ష్వశ్రులేశః పతన్తి.'
యక్ష పతీ! ఎప్పుడు మన కీ శాప విముక్తి మరి!
---నీ వాసవి.'
మరి కొన్ని రోజులు జరిగినాయి.
* * * *
వాసవి కీ గోదాదేవి కి పెళ్లయింది. పద్మనాభయ్య కుటుంబం ఒక వారం ఉండి సంతృప్తి గా, నూతన వస్త్రాల కష్కలతో వెళ్ళిపోయారు. ఆ పెళ్లి కాన్కగా సరస్వతి గోదాదేవి కి గొప్ప బహుమతి నిచ్చింది. ఆ విషయం అంతవరకూ ఎవరికీ తెలియదు. అంతా సంభ్రమాశ్చర్యంలో మునిగి పోయారు. కన్నీట తడిసిన రెప్పలెత్తి సరస్వతి కేసి చూసింది గోదాదేవి. సరస్వతి 'పద్మకర్ణిక కొలు వున్న పద్మ వోలె' నవ్వింది! ప్రిత్రార్జిత మైన ఆస్తి సర్వమూ గోదాదేవి పేరిట చేయబడిన 'రిజిస్టర్' అది. కొద్ది రోజుల క్రిందట ఆస్తి అమ్మేసి డబ్బు చేసుకోవాలని రవీంద్ర వచ్చాడు. ఆ సంగతి నన్నయ్య ద్వారా సరస్వతి తెలుసుకుంది. ఒక్కసారిగా అంత ఆస్తి కొనగలిగిన వాళ్ళు ఆ ఊళ్ళో ఇద్దరే! వాళ్లు సుబ్బరామయ్య, సరస్వతీ! నైతికంగా బలహీనుడై దిగజారిన సుబ్బరామయ్య పోటీ తగల్లేక పోయాడు. విధి లేక వచ్చి నంతకు రవీంద్ర సరస్వతి కి అమ్మి వేశాడు. సరస్వతి గోదాదేవి పేర రిజిష్టర్ చేయించింది. ఈ పని ఎవరికీ తెలియకుండా సరస్వతీ, నన్నయ్యా సాధించారు.
లేకపోతె ఈ ఇంట్లోకి ప్రవేశించే హక్కు లేకపోయేది. అంతా అప్పటి లాగే ఉంది. అక్కడే పుస్తకాల బీరువాలు! ఆమె లేచి పక్క పరిచింది. వాసవి ఇంకా రాలేదు.
బీరువా తెరిచి పుస్తక మందుకుంది. వాసవి అప్పుడప్పుడూ వ్రాసుకున్న కవితా ఖండికలు! అందులో నించి ఒక కవరు ముందుగా జారింది. అది చదివిన ఆమె ఆగ్రహంతో కంపిస్తూ "నీచుడా!' అనుకుంది. అది రవీంద్ర వాసవి కి వ్రాసిన ఉత్తరం! గోదాదేవి అఘ్రాణిత పుష్పమనీ, తొలి భ్రమరం తనేననీ వ్రాశాడు. ఆ ఉత్తరం ముక్కలుగా చించి, కిటికీ గుండా విసిరేసింది. కళ్ళలో నీరు తిరిగింది. ఆ ఉత్తరాన్ని గురించి వాసవి తనతో చెప్పనే లేదు. అతని సంస్కారాని కామె హృదయం విన్రమమయింది.
చిత్రంగా దుఃఖ మింకా పెరిగింది! కన్నీళ్లు జడిగా కురిసి అగినాయి.
అప్పుడు దుఃఖం పోయింది. మనస్సు ప్రశాంత మయింది. 'భగవాన్! ఎంత దయ జూపావు! మరుభూమిగా మారబోయే ఈ బ్రతుక్కి అమృత వర్షం కురిపించావు....'
కూర్చొని పుస్తకం పేజీలు తిప్పుతూ ఉంది. ఆఖరి పేజీలో ఆగింది. అక్కడ ఆరోజు తారీఖు ఉంది. ఆ అక్షరాల మాల అప్పుడు కూర్చినట్లు 'తాజా' గా ఉంది.
'అతి ముద మిచ్చి ముందు, తరువాత ననాదరణీ య
వర్షశూ
న్యత , నవ కొమలమ్మయిన యశల సస్యములో
సరిల్లి, యీ
బ్రతుకు పోలమ్ము వాడు తరి, వచ్చితి జీవన మిచ్చి,
దేవి! యే
ఋతుపవనాలు కన్న కలలో! ఫలియించెను పైడి
పంటగా!'
ఇంతకూ ముందు అంతా ననుకోన్నదే వాసవి వ్రాసుకున్నాడు. ఇద్దరి భావా లొక్కటి!
ఆమె పుస్తకం మూసి పెట్టి , వాసవి కోసం నిరీక్షిస్తుంది.
(సమాప్తం)
