Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 20

   
    నుదుట తిలకం దిద్ది, వీర పత్నిగా తన పురుషుని యుద్ద రంగానికి పంపిస్తుంది. అనుకున్న చోటికి తీసుకెళ్ల లేదని , వస్తానన్న వేళకు రాలేదనీ, భర్త పై అలిగి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఇంత పరస్పర వైవిధ్య ప్రకృతీ , స్త్రీ ప్రకృతిలో భాగమే!
    'నిద్ర రాలేదు.....' అంటూ కమల వచ్చేసింది. గోదాదేవి కూర్చుని ఆహ్వానించింది. కమల వస్తూనే పక్కనున్న కుర్చీలో కూర్చో బోయి , అందులో ఉంచిన ఫోటో తీసి మంచం మీద ఉంచబోతూ పరిశీలించింది.
    'ఇది ఇక్కడే ఉందన్న మాట, పొద్దున బట్టలు సర్దుకుంటూ ఇక్కడ పెట్టాను. తరవాత జ్ఞప్తి లేదు'
    'అందులో ఉన్నవారెవరు?'
    'నా చిన్నప్పటి ఫోటో అది. వాళ్ళిద్దరూ నా తలిదండ్రులు!'
    'మీ తల్లిగారెంత బాగున్నారు! ఆమె పేరేమిటో?'
    'భువనేశ్వరి....' గోదాదేవి కంఠం కొంచెం వణికింది. కమల లేచి ఫోటో గోడకు తగిలించింది.
    "ఏం మాట్లాడుతున్నారర్రా...' అంటూ అలివేణి ప్రవేశించింది.
    'అలివేణి కమల చూపులు కొత్త రకంగా మాట్లాడుకున్నాయి. 'ఇక చెపుదామా?' అన్నట్లున్నాయి. బహుశా ఏ సినిమాకో , లేక ఉదయం కొండ పై కెళ్ళే ప్రోగ్రామో అయి ఉంటుందనుకుంది గోదాదేవి.
    'కమల జీవితంలో ఒక విషాదకర సమస్య వచ్చింది. ఎట్లా పరిష్కరించాలో నాకూ, నాన్నకూ కూడా అర్ధం కాలేదు. నువ్వూ వింటావా?'
    'నేను మాత్రం ఏమైనా చెయ్యగలనా?'
    "కనీసం విని, సానుభూతి చూపించినా మంచిదే గదా!'
    కమల ఎక్కడో చూస్తూ ఆలోచిస్తుంది. ఇంతకూ ముందు శారదాకాశంలా ఉన్న అ ముఖాన్ని వార్షుక మేఘా లావరించినాయి! ఆమెలో అంత దుఃఖముందని అనుకోలేదు గోదాదేవి. కమల కేసి చూస్తూ , అలివేణి చెబుతున్నది వింటుంది.
    'కర్నూలు లో కమల తలిదండ్రులు ఒక చిన్న పూట కూలి లాంటిది పెట్టుకుని, బ్రతుకుతూ ఉండినారు. పదిమందికి అన్నం బెట్టి వచ్చిన ఆదాయంతో క్లుప్తంగా గడుపుకుంటూ కమలను స్కూల్ ఫైనల్ వరకూ చదివించుకున్నారు. ఒకనాడు సైకిల్ లో వస్తున్న కమల తండ్రి, లారీ డీ కొనడం వల్ల చనిపోయాడు. అంతటితో కమల చదువాగి పోయింది. తల్లి పూర్తిగా బాధ్యత వహించింది. అప్పటికి వాళ్ళింట్లో భోజనం చేస్తున్న, స్వంత కాపురాలు లేని ఉద్యోగస్తులు కాక, ముగ్గురు కాలేజీ చదువుకుంటున్న కుర్రవాళ్ళు! వాళ్ళలో ఒక అబ్బాయి బీదావాడు. తండ్రి ఎక్కడో పల్లెలో పెద్ద రైతింట్లో జీతానికి ఉండేవాడు. అతడప్పుడప్పుడూ బోజనానికి తగినంత డబ్బు కూడా ఇవ్వలేక పోయేవాడు. కమల తల్లి కనికరం తో ఇచ్చినంత పుచ్చుకునేది. "పాపం! ఇంక రెండేళ్ళు చదివితే డిగ్రీ చేతి కొస్తుంది. తరవాత ఏదో ఉద్యోగం దొరికితే తన బ్రతుకు తను బ్రతగ్గలడు" అనుకునేది. ఏ మాలోచించిందో , ఆమె ఆ అబ్బాయిని అల్లుడుగా చేసుకుంది. రెండేళ్ళు తన డబ్బుతో చదివించింది. డిగ్రీ తీసుకున్న కొద్ది కాలానికే అతనికి ఉద్యోగం దొరికింది. ఇల్లు తీసుకుని, కమలను తెచ్చుకుంటానని చెప్పి వచ్చి నాలుగైదు నెలలు కాలం గడిపాడు. తరవాత ఒకరోజు -- కమల తనకు నచ్చలేదనీ, పూట కూటింటి పిల్లగా ఆమె నైతిక ప్రవర్తన్ను గూర్చి ఎన్నో అసహ్యకరమైన మాటలు విన్నాననీ, అందుకు బాధ్యత తల్లిదేననీ, ఈనాడు సాంఘికంగా ఉన్నత స్థానం లో ఉన్న తాను కమల ను భార్యగా అంగీకరించ లేననీ....విడాకులు కోరుతూ ఉత్తరం వ్రాశాడు. అదివరకే కమల తల్లికి టి.బి వచ్చేసింది. అందువల్ల పూట కూళ్ళ భోజనం పడిపోయి, ఆర్ధికంగా అవస్థ అయింది. అప్పుడు పిడుగు లాంటి ఆ ఉత్తరం! ఆమె బ్రతకలేకపోయింది! మిగిలింది కమల. ఆమెకు ఈ మధ్య వాళ్ళ పక్కింటి అయన వల్ల ఒక వార్త వింది! అయన, కొండ పైన కమల భర్త వేరే యువతిని పెళ్లి చేసుకోవడం కళ్ళారా చూశాడు....'
    కమల   భైటికి పరుగెత్తింది. అలివేణి ఇక చెప్పడమేట్లాగో తెలియక ఆగిపోయింది.
    గోదాదేవి గుండె కొట్టుకుంటుంది. ఈ గుండె కేమయింది? పగిలిపోతుందా? ఆగిపోతుందా?
    ఈ శరీర మెందు కిట్లా వణికి పోతుంది? మంచులో మునిగి పోతుందా. అగ్ని లో కాలిపోతుందా? నాలిక ఎండిపోతుంది. దాహమా? కంఠం నొక్కుకుని పోతుంది. పీక పిసుకు తున్నారా? లేక ఉరితాడు తగిలిస్తున్నారా? ధైర్యం తెచ్చుకుంది. సర్వశక్తుల్నీ కేంద్రీ కరించింది. అలివేణి భుజం పట్టుకుని ఊపింది.
    ;ఎవడా కమల భర్త?'
    అలివేణి వెర్రిగా చూస్తుందా మూర్తిని.
    "ఊ....చెప్పు!....'
    'రా....రవీంద్ర....'
    అమె చప్పున చేతులు కాలినట్లు వెనక్కి తీసుకుంది. మంచం లో బోర్లా పడిపోయింది. అలివేణి ఎంత పిలిచినా పలకలేదు. కదిలిస్తే కదల్లేదు. ఆ పిలుపులు విని, అంతా పరుగెత్తుకొచ్చారు.
    'అమ్మా!' అన్నాడు పద్మనాభయ్య.
    గోదాదేవి లేచి కూర్చుని నిర్వికారంగా చూసింది.
    'నాకు నిద్రొస్తోంది.....' అంది.
    ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
    'భయపడకండి! నాకు పిచ్చిపట్ట లేదు. చచ్చిపోవాలను కొను. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాను/ కమల కంటే గోప్పదాన్నా నేను?' ఆమె కమలను లాక్కుని కౌగలించుకుంది.
    ఆ ఇద్దరూ హత్తుకు పోయారు. ఇద్దరి కళ్ళలో నీళ్లు! ఒకరి మీదోకరు అసూయ పడవలసిన వాళ్ళిద్దరూ ఒక్కటి గావటం ఆశ్చర్యంగా కనిపించింది.
    'తెల్లవారిన తరవాత ఆలోచిద్దాం....అందాకా అందరం నిద్ర బోదాం...' అంది నవ్వుతూనే.
    అంతా వెళ్ళిపోయారు...
    మెడలో తాళీ, గోడకు వెంకటేశ్వర స్వామి పటం! పెద్ద పెట్టున నవ్వొచ్చిందామెకు. ఈ తాళి బొట్టు సర్వసాక్షి అయిన స్వామి సాన్నిధ్యం లో కట్టబడింది. ఇంత అధర్మం జరుగుతుంటే, నోరు విప్పకుండా సాక్షి మాత్రంగా ఎట్లా చూస్తూ ఉండగలిగాడు? కలియుగ ప్రత్యక్ష దైవ మైనందుకు నిదర్శనమా? "ఇందంతా నీ పురాకృత కర్మ" అంటాడా? ఏం చెబుతాడు సమాధానం? అలోచించి, ఏడ్చి, ఏడ్చి , మూర్చ లాంటి నిద్రలో మునిగిపోయిందామె!
    తెల్లవారి లేవడంతో దిండు కింద రెపరెప లాడుతున్న కాగితం కనిపించి అందుకుంది.
     'అక్కా!
    నిన్ను నోరారా అక్కా! అని పిలవాలనుకున్నాను. నా లోపలి నించి ఆ పిలుపు బైటి కొచ్చే అవకాశం లేదు నాకు. ఒకనాడు అమ్మ పెట్టె లో అట్టడుగున ఒక ఫోటో కనిపించింది. దాన్నంతకు ముందు అమ్మ అప్పుడప్పుడూ చూసుకుని, కళ్ళ నీళ్ళు పెట్టుకుని, మళ్లీ దాచుకోవడం గమనించాను. వాళ్ళెవరని అడిగాను. ఎవరో బంధువు లంది. చించేస్తానన్నాను. వద్దంది, కంగారుగా. అయితే ఎవరో చెప్పమన్నాను. ఏడుస్తూ చెప్పింది. నిన్న సాయంత్రం, నీతో మాట్లాడుతున్నప్పుడు , మళ్లీ అవే పేర్లు! ఊరి పేరు విన్నాను. రాత్రి కదే ఫోటో చూశాను. అర్ధమైంది నిజం. నువ్వు నా అక్కవు. మనకిద్దరికీ అమ్మ ఒక్కతే! నువ్వు నన్ను కౌగలించు కున్నావు. ఆ కౌగిట్లో ని నాకు ఇట్లా చెయ్యటమే మార్గ మనిపించింది. అతనికి నా మీద ఇష్టం లేదు. కోర్టు కెక్కి ఏం సాధించాలి? అతను నిన్ను, నువ్వతన్ని ఇష్టపడ్డారు. ఇది నాకు సంతోషంగా కూడా ఉంది. నా దిగులు పెట్టుకోకు!
    
                                                                                     నీ చెల్లెలు.
                                                                                     ---కమల.'
    అయ్యో! కమలా! ఎంత పోరపడ్డావు ! రవీంద్ర తో దాంపత్యమా? అతని అవినీతి కే గాదు, నిన్ను దూరం చేసినందు కతన్ని క్షమించగలనా? అప్పుడే చెప్పి ఉంటె ఆ ముఖాన్ని తనివి తీరా చూసేదాన్ని, వెళ్ళ నిచ్చే దాన్నా? మనకు మొగుళ్ళు లేకపోతేనేం? మన మిద్దర ముంటే చాలు! లోకం లో ఎంతమంది ఒంటరి వాళ్లు లేరు?....
    గోదాదేవి , పద్మనాభయ్య. అలివేణి బస్ స్టాండు ల్లో రైల్వే స్టేషన్ల లో , కొండ పైన తిరిగి తిరిగి గాలించారు. చివరికి నిరాశతో తిరిగొచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS