Previous Page Next Page 
మేఘమాల పేజి 20

   
    'అంటే?' నుదురు చిట్లించింది అర్ధం కానట్లుగా శకుంతల.
    'ఆమె నా మరో ప్రాణమవ్వటం వలననే!' అన్నాడు నవ్వి -- గుండెల లోతుల నుండి!
    'నా బుర్ర అంత పదునైనది గాదు-- తేటతెల్లంగా చెప్పండి!' అన్నది సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి.
    'నా మరో ప్రాణం గానే ప్రేమించాను.... కానీ, ఆమె నన్ను ప్రేమించ లేక పోయింది....నన్ను మోసం చేసింది..... నా గుండెల్ని నలిపివేసింది.... అసలు నన్ను నమ్మనేలేక పోయింది!' ఎంత అపుకుందామనుకున్నా ఆవేశాన్ని ఆపుకోలేక పోయాడు.
    ఇక ఆ విషయం మీద మాట్లాడటం ఇష్టం లేదన్నట్లుగా లేచి నిలబడి, 'నేను వెళతాను!' అన్నాడు.
    శంకుంతల భయంగా, 'కోపంతోటా!' అన్నది.
    'నేనంత మూడుడ్ని గాదు!"
    బయట కొచ్చేశాడు.
    --సరిగ్గా అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలయింది.
    హాస్పిటల్ నుండి స్టేషను కు నడుస్తుంటే దారిలో స్వామి కనబడ్డాడు.
    'నిన్న చెప్పిన పుస్తకాలు కొన్నావా?'
    'ఇంకా లేదు, సార్!'
    'ఏం.... ఆలస్యం దేనికి.... మళ్ళా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయ్యేవో?'
    'కొంటాను సార్.... రెండు రోజుల్లో.... సిగ్గుపడుతున్నట్లు తల వంచుకున్నాడు.
    త్యాగరాజు సంశయిస్తూనే , 'డబ్బులు లేవా?' అడిగాడు.
    స్వామి మాట్లాడలేదు. తల మరింతగా కృంగిపోయింది.
    'ఇక్కడకు దగ్గరలో ఏదైనా పుస్తకాల షాపు వున్నదా?'
    'ఎందుకు సార్.....రేపో , ఎల్లుండో నేను కొంటాను!' అన్నాడు త్వరత్వరగా.
    "ఫరవాలేదు లేవోయ్.... పద....షాపు ఎక్కడ వున్నదో చూపించు!'
    "మీరు.....కొనవద్దు సార్!'
    'ఊ.... నేను చెప్పిందానికి అడ్డు చెప్పబోకు....పద!' అన్నాడు గంబీరంగా ముందుకు అడుగులు వేస్తూ.
    స్వామి మాట్లాడలేక పోయాడు.
    'మోండా ఎదురుగ్గానే వున్నాయి షాపులు!' చాలా చిన్నగా అన్నాడు.
    త్యాగరాజు వెనుతిరిగాడు.
    స్వామి అనుసరించాడు.
    కావాల్సిన పుస్తకాలు షాపులో కొన్నాడు.
    వచ్చి ఒకటో నెంబరు బస్సు ఎక్కారు.
    బస్సు ఎక్కుతుంటే స్వామి అడిగాడు. 'ఇంటికి కాదా, సార్!' అని.
    'చిక్కడపల్లి లో వో చిన్నపని వున్నది- అది పూర్తీ చేసుకొని వెళ్దాం!'
    స్వామి తిరిగి మాట్లాడలేదు.
    ఎక్కడో పక్క సీట్లో దూరంగా కూర్చోబోతుంటే పిలిచి పక్కనే కూర్చో బెట్టుకున్నాడు త్యాగరాజు.
    ఉదయాన రాజేశ్వరికి చెల్లెలు వ్రాసిన ఉత్తరం చదివినప్పటి నుండి -- ఇక తమ వివాహ విషయంలో ఎలాంటి తత్సారమూ చేయగూడదు అనుకున్నాడు.
    'ఆమె మనస్సును ఏమాత్రమూ కష్టపెట్టగూడదు!'
    అందుకే చిక్కడపల్లి ప్రయాణం గూడా!
    వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళి- రేపుదయాన్నే వివాహం జరిగే టందుకు గాను కావాల్సిన ఏర్పాట్లు చేయాలి!
    ఇద్దరు చిక్కడపల్లి లో బస్సు దిగారు.
    వేంకటేశ్వరుని గుడికి నడిచారు.
    స్వామిని వాకిట్లోనే వుండమని త్యాగరాజు లోపలికి వెళ్ళి ఓ పది నిముషాల్లో బయటకు వచ్చాడు.
    దేవాలయము నుండి బయటకు వస్తున్న అతడిలో తృప్తి చిరునవ్వు రూపంలో వెలుగుతుంది.
    మనిషి నిండుగా వున్నట్లనిపించింది.
    ఉత్సాహంగా అడుగులు వేయసాగాడు.
    'రాజేశ్వరి తను చేసిన ' పనికి ఎంత గానో సంతోషిస్తుంది?'
    నాంపల్లి వెళ్ళే బస్సు కోసం ఎంత సేపు నిల్చున్నా బస్సు రాలేదు.
    పైన ఎండ మాడిపోతుంది.
    చమటలు పడుతుంటే చికాగ్గా వున్నది త్యాగరాజుకు.
    అంతేగాకుండా తను తీసుకున్న నిర్ణయాన్ని, చేసిన ఏర్పాట్లను గురించి ఎంత త్వరగా రాజేశ్వరి కి చెపుదామా అనే ఆతృతలో వున్నాడు--
    ఆమెలోని ఆనందాన్ని చూచి ఆనందించాలి!
    వెళ్ళాలి.... వెంటనే వెళ్ళి ఆమె ముందు వాలాలి.....
    అతడిని  తెలియని ఉద్వేగం ఆవరించింది.
    -ఆలస్యాన్ని భరించలేక పోతున్నాడు.
    రాని బస్సు మీద విసుక్కున్నాడు.
    చికాకు కలిగిస్తున్న చమట మీద విసుక్కున్నాడు.
    తనకు అవసరం లేని వస్తున్న బస్సుల మీద విసుక్కున్నాడు.
    చివరకు చిరాగ్గా -- అటు వెళుతున్న ఖాళీ రిక్షా పిలిచి ఎక్కి కూర్చున్నాడు.
    స్వామి, 'నేను వెళ్ళి మధ్యాహ్నం వస్తాను సార్!' అన్నాడు నమస్కరిస్తూ.
    'పని వున్నదా?'
    'అవునండి!'
    'మంచిది....అలాగే!'
    రిక్షా పల్లంలోకి జారిపోయింది.
    త్యాగరాజుకు అలా పోతుంటే చాలా హాయిగా వున్నది.
    సర్వం మరిచిపోయాడు. బాధను మర్చిపోయేడు - వేదనను మర్చిపోయాడు. దిగులు మర్చిపోయేడు. చంద్రాన్ని మర్చిపోయాడు. శకుంతలను మర్చిపోయాడు. సత్యవతిని మర్చిపోయాడు. రాణిని మర్చిపోయాడు.
    అతడికి కళ్ళముందు రాజేశ్వరి మెదులుతున్నది.
    ఆమె ఆనందమే మెదులుతున్నది.
    --అదే అతడికి తృప్తి!
    'తను రేపు వివాహితుడవుతున్నాడు!' అనుకున్నాప్పుడు పెదిమల మీద చిరునవ్వు దానంతటదే అలుముకు పోయింది.
    అతడు సంతోషంలో తెలిపోసాగాడు.
    ఇంటికి వచ్చేటప్పటికి ఓ పది నిమిషాలు పట్టింది.
    చాలా ఆలస్యమయి పోతున్నదేవో నన్నట్లుగా క్షణ క్షణానికి ముందుకు వంగి ఎంతదూరం వచ్చానా అని చూచుకో సాగాడు.
    దూరం నుండి తన ఇంటిని చూస్తూనే గుండెల మీద బరువు తీరినట్లుగా ఫీలయ్యాడు.
    వాకిటి దగ్గరి నిలబడి రోడ్డు మీదకు చూస్తున్న రాజేశ్వరిని చూస్తూనే దోకుతున్నట్లుగా రిక్షా దిగాడు.
    త్వరత్వరగా లోపలికి పోయి రాజేశ్వరికి చెప్పాలి-- తమని ఇంకెవ్వరూ వేలెట్టి చూపలేరని!
    రిక్షా డబ్బు లిచ్చేసి మెట్లేక్కుతున్న త్యాగరాజు వంక ఆత్రంగా చూస్తున్న రాజేశ్వరి తలుపు దగ్గరకు లాగుతూ, 'హాస్పిటల్ దగ్గరకు వెళదాం పదండి!' అన్నది.
    'దేనికి! ఏదో భయం నీడలా అవరిస్తుండగా అడిగాడు.
    'చంద్రం పోయారట!'
    'రాజేశ్వరి!' గట్టిగా అరిచాడు త్యాగరాజు.
    
                               *    *    *    *
    ఓ నల్లటి భయనకరమైన మేఘం ఆవరించి ఆ యింటి లోపల మనుష్యుల మనస్సుల మీద అశాంతి తెరను కప్పివేసింది.
    అది రాత్రి. సమయం పది గంటలు, అస్తవ్యస్తమైన మనస్సుతో అంతకు కొద్ది నిముషాల క్రితమే త్యాగరాజు ఎంగిలి పడ్డాడు.
    రాజేశ్వరి కంచాల్లో అన్నం పెట్టి ఓ మూలగా చాప మీద పడుకొని వున్న సత్యవతిని భోజనానికి లేపేటందుకుగాను ప్రయత్నిస్తున్నది.
    'ఈనాటికి నీవు భోజనం చేసి మూడు రోజులు.... అంతేగాదు , తలకు నూనె రాసుకొని, స్నానం చేసి గూడా మూడు రోజులే .... జుట్టు చూడు ఎంత అసహ్యంగా తయారయి జడలు గడుతుందో..... మొకం పీక్కుపోయి కళ్ళు కనబడకుండా పోతున్నాయి... నీవు ఇలా అయిపోవటం వలన ఏం సాధించగలుగుతావ్?' అన్నది రాజేశ్వరి ఆమె పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని ఆమె వెన్ను మీద అనునయంగా చేయి వేసి రాస్తూ.
    'నీవు చెప్పినవన్నీ చేసి గూడా సాధించేదేవిటి?' అడిగింది వస్తున్న వెక్కును ఆపుకుంటూ.
    'నీవు బ్రతకడం నీకిష్టం లేదా?'
    'నేను బ్రతికి చేసేదేమున్నది-- ఎవరి కోసం బ్రతకాలి?'
    రాజేశ్వరి కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లినాయి.
    'సత్యవతీ!' విచలిత అవుతూ, కాస్త గంభీర వాతావరణాన్ని తేలిక పరుస్తున్నట్లుగా వో పీల నవ్వు నవ్వి 'భారత దేశపు జనాభా ఎంతో నీకు తెలుసా?' అడిగింది.
    త్యాగరాజు కిటికీ లో నుండి బయటకు చూస్తూ మనస్సును వాళ్ళ సంభాషణ మీద లగ్నం చేశాడు.
    సత్యవతి తల అడ్డంగా వూపింది.
    'ఇప్పటికే వున్న కొన్ని కోట్ల జనాభా రోజురోజుకు లెక్కకు మించి పెరిగి పోతోంది.... చచ్చిన ప్రతి ఒక్కరితో పాటు మరొకరు చచ్చిపోవాలనుకుంటే జనాభా పెరుగుదల సమస్య ప్రభుత్వానికి వుండేదే గాడు-- కాని, ఎందుకలా జరగటం లేదంటావ్?-- ప్రభుత్వానికిగాని, ప్రజలకు గాని ఆ విషయం తెలియకనా?' వ్యంగ్యంగా నవ్వింది రాజేశ్వరి.
    సత్యవతి తీక్షణంగా రాజేశ్వరి మొఖంలోకి చూచింది.
    'లే, లే! నా మీద కోపముంటే నన్ను నాలుగు చివాట్లు పెట్టు...కాని భోజనం చేయకుండా మాత్రం పడుకోబోకు-- నామీద ఒట్టే!'
    రాజేశ్వరి మాటలనయితే భరించలేనట్లుగా కాస్త ఎంగిలయితే పడింది గాని, ఆకలిని మాత్రం చంపుకోవటానికి ప్రయత్నించలేదు.
    దూరంగా ఉన్న పాన్ షాపు చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు.
    ఉదయం శకుంతల వద్ద నుండి వస్తుండగా కనబడిన దృశ్యం -- ఈగల్లా మూగుతున్న ఆ జనాన్ని చూస్తుంటే -- గుర్తు కొచ్చింది త్యాగరాజుకి!
    ....తను తల వంచుకు నడుస్తున్నాడు.
    చంద్రం చనిపోయిన తరువాత తను రోడ్డు మీదకు వచ్చింది ఆరోజే.
    అది ఆసుపత్రి లో వున్న శంకుంతలను చూడటానికి గానూ వచ్చాడు....
    తను స్టేషన్ కు వెళ్ళే దారిలో రోజూ వో యింటిని ఒక్కసారి తలెత్తి చూస్తుండేవాడు.
    -అంటే ఆ యింటి మీద ఆవాజ్యమయిన ప్రేమతోనూ గాదు, అపెక్షతోనూ గాదు!
    అక్కడకు వచ్చేటప్పటికి కళ్ళు అనుకోకుండా అటువైపుకు తిరిగేవి.
    సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని జతల యువతుల కళ్ళు తన కళ్ళల్లోకి చూచేవి.... అసహ్యంగా తల తిప్పుకుంటుండేవాడు,
    రోజూ ఆ యింటి వంక  ఎంత చూడగూడదనుకుంటున్నా కళ్ళను అదుపులోకి తీసుకోలేక పోతూ వుండేవాడు'!
    -ఇక ఆ యింటి ముందు ఎప్పుడూ నిలబడి వుండే కార్లన్నా, స్కూటర్ల న్నా , రిక్షాలన్నా అసహ్యమే!
    స్త్రీలు సిగ్గు లేకుండా సంచరించే గృహం  అది!
    నరకానికి మారుపేరు ఆ గృహం!
    అయితే నేం--
    డబ్బున్న విలాస పురుషులకు స్వర్గ ధామం అది!
    సరిగ్గా ఆ యింటిని దాటుతున్న సమయంలో తన యింటి యజమాని అ గృహం నుండి త్వరత్వరగా బయటకు వస్తూ కనబడ్డాడు.
    తను ఉలిక్కిపడ్డాడు!
    తనలో అయన మీద ఏర్పరచుకున్న గౌరవమూ, ఉన్నత భావాలూ, జారి ఒక్కసారిగా పటాపంచలయినాయి.
    నిజం!
    అసహ్యమేసింది--
     తను ఇన్నాళ్ళూ ఆవిడను ఓ శిఖండి గానూ, పరమ రాక్షసిగానూ ఊహించుకుంటూన్నాను.
    తన ఊహలు తల్లక్రిందులయినందుకు గాను విభ్రాంతి చెందాడు.
    -ఆమె అలా ప్రవర్తించటంలో అనుచితం లేదేవో ననిపించింది.
    అడుగులు ముందుకు పడుతున్నాయి సర్వం మరిచి.
    'పోనీయ్....ఎవరెలా పొతే నాకేం,' మనస్సులోనే అనుకున్నాడు.
    'క్షమించాలి!.... నేనంటే మీకు చాలా అసహ్యమేస్తున్నది గదూ?' అన్నాడు అయన -- తన యింటి యజమాని -- పెలవపు  నవ్వుతో.
    కలవరపడ్డాడు తను.
    'నాకు తెలుసు.... మీరేగాదు.... నన్ను చూచినా ఎవరైనా అలాగే భావిస్తారు.... కాని ఒక్క మాట చెబుతాను వినండి-- నాకు వివాహమయి యిరవై సంవత్సరాల యింది...పద్దెనిమిది సంవత్సరాలు ఆమె  మాటలు వింటున్న లోకుల దృష్టిలో వ్యభిచారినే, అయినా, త్రాగుబోతునే అయినా, నేను మాత్రం ఎంతో పవిత్రంగానే జీవితాన్నే గడిపాను....కాని రెండు సంవత్సరాల బట్టే ఈ ఊబిలో ఇరుక్కు పోయింది నేను-- అదీ దేని కనుకుంటున్నారు, దాని మాటలు భరించ లేక -- అన్ని మాటలు పడుతూ, అనుభవించటం చేత కాని చవటను కాలేక!.... ఆవేశంగా చెప్పుకు పోతున్నాడు.
    "నాకెందుకు చెబుతారు అవన్నీ!' వడివడిగా ఆయన్ను తప్పించుకుంటున్నట్లుగా ముందుకు అడుగులు వేశాడు తను.
    త్యాగరాజు ఆ కిటికీ లోంచి చూస్తూ తనలో తాను నవ్వుకున్నాడు.
    ఎవరు దోషులు?
    ఎవరు నిర్దోషులు?
    ఎవర్ద్గి తప్పనాలి?
    ఎవరిది ఒప్పనాలి?
    - వెనుదిరిగి వచ్చి చాప మీద కూర్చుంటున్న సమయంలో నాలుగు మెతుకులు ఎంగిలి పడ్డ సత్యవతి చేయి కడుక్కు వచ్చి మూలగా అప్పటివరకూ పడుకున్న చాప మీద, మెడ వరకూ దుప్పటి కప్పుకుని ముడుచుకుని పడుకున్నది.
    సత్యవతిని ఎలా వోదార్చాలి--?
    ఆమెను ఎలా మనిషిగా తయారు చేయాలి?
    మనస్సంతా కలత బారింది.
    'భగవంతుడా! నా చంద్రాన్ని తీసుకు వెళ్ళి నీవు పొందిన లాభం ఏమిటి?-- ఎవరూ లేని నన్ను ఎందుకు తీసుకు వెళ్ళ లేకపోయావ్?'
    "ఏం చేస్తున్నారు చీకట్లో?' రాజేశ్వరి గొంతుకు ఉలిక్కిపడ్డాడు త్యాగరాజు.
    'లైటు కావాలనే అర్పారా?'
    'దేనికి లైటు?" అన్నాడు తడారని కళ్ళతో.
    'సరే! మీ ఖర్మ! ....నేనేం చేస్తాను?' గిరుక్కున వెనక్కు తిరిగి వంట యింట్లోకి వెళ్ళిపోయింది -- అక్కడ వదిలి వచ్చిన గిన్నెలను సర్దేటందుకు.
    '--దిగుళ్ళ అగాధం లో కావాలని కూరుకుపోతున్న వాళ్ళను ఎవరు మాత్రం రక్షించగలరు?" విసుక్కున్నది రాజేశ్వరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS