Previous Page Next Page 
మారిన విలువలు పేజి 20

 

    సంక్రాంతి పండుగ చల్లగా గడిచిపోయింది. ఆనాటి సంఘటన తరువాత జానకి, సూర్యారావు ఎదురుపడి మాట్లాడుకోలేదు. ఎవరి నిర్ణయాలు వారు చేసుకొని, వర్చించే ముందు చలనం లేక ఆకాశాన్ని అంటి పెట్టుకొన్న మేఘాల్లా ఉన్నారు.
    పండుగ వెళ్ళిన పది రోజులకు ప్రకాశం తన పుస్తకాల కొట్టును బజారు వీధికి మార్చేశాడు. ఒకరిద్దరి పెద్దవాళ్ళ సహాయం వల్ల మరికొన్ని పత్రికల ఏజెన్సీ లు దొరికేయి. ఇంటింటికి పోయి పాత పుస్తకాలు కొని,సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ ఒకటి కొత్తగా పెట్టేడు. ఇదివరలో ప్రకాశం సహాయం పొందిన వాళ్ళంతా స్వయంగా పిలిచి తమ ఇళ్ళలోని పాత పుస్తకాలు ఇచ్చేరు. చూస్తుండగానే కొట్టులో చాలా భాగం పాత పుస్తకాలతో నిండిపోయింది.
    ఏదైనా ఒక పుస్తకం గురించి కొనేవారికి నచ్చచేప్పాలంటే , దాని గురించి అమ్మేవాడికి కొంత తెలిసి ఉండడం అవసరం అనుకొన్నాడు ప్రకాశం. అతని మనసులోకి వచ్చే అభిప్రాయాలు కార్యరూపం దాల్చేందుకు అట్టే సమయం పట్టదు. మరునాటి నుండి మరిచిపోతున్న చదువును కేలుక్కొంటూ పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. పనిలేని వేళల్లో పగలు చదవడమే కాక రాత్రి ఇంటికి కూడా పుస్తకాలు  తీసుకుపోయి చదువుతుండేవాడు. ఆ చదువుతున్న వాటిలో మంచివి, చెడ్డవి కూడా ఉండేవి.
    "ఇటువంటి పుస్తకాలు ఎందుకు చదువుతావు ప్రకాశం" అనేది జానకి.

                                      
    "మనుష్యులలో మంచివాళ్ళు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కా ! మంచి వాళ్ళని మాత్రమే ఊళ్ళో ఉండనిచ్చి, చెడ్డ వాళ్ళని తగలేయి అంటే ఎక్కడికి పోతారు? నిజానికి తమతో పాటు చెడ్డ వాళ్ళుండ బట్టే , మంచి వాళ్ళ మంచితనం మరీ బాగా కనిపిస్తుంది. ఒక చెత్త పుస్తకం చదివి, ఒక మంచి పుస్తకం చదివితే అందులో మంచి బాగా తెలిసొస్తుంది" అనేవాడు ప్రకాశం.
    "నీ వాదనలో అర్ధం లేదు, ప్రకాశం. కాలిన చోట నామం సుద్ద రాస్తే చల్లగా ఉంటుందంటే అది తెలుసుకొందికి చెయ్యి కాల్చుకోవాలన్నట్లున్నది.
    "మంచి పుస్తకాలు చదువుతుంటే, మనసులు వికసిస్తాయి. మనుష్యుల ఆలోచనా శక్తి వృద్ది పొంది , ఏ విషయం లోనైనా తనకు తానుగా ఆలోచించుకొని తన అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకొనే అవకాశం కలుగుతుంది."
    'చెత్త పుస్తకాలు చదివితే, ఆ బాధలెం ఉండవు, అక్కా! అందులో అలోచించి తెలుసుకోవలసిన సరుకు ఉండదు లే" అని సంభాషణ తేల్చి పారేసేవాడు ప్రకాశం.
    ఈ పట్టుదల చదువుకునే రోజుల్లో ఉంటె, ఈ పాటికి వాళ్ళన్న పాటు బి.ఏ క్లాసులో ఉండేవాడు అనుకొనేది సుందరమ్మ.
    జానకి ఏ వేళలో చూసినా సాంబశివం చేతిలో పుస్తకం తోనే కనిపించేవాడు.
    "మరీ అంత చేటుగా చదువడమేమిటిరా సాంబూ! ఎంత పరీక్షలైనా మనిషికి, మనసుకి కాస్త విశ్రాంతి ఉండొద్దూ?" అన్నది జానకి.
    "ఏం చదవడమో అక్కా! మొన్న పరీక్షల్లో అన్నీ పాడు చేసెను. చేతిలోకి పేపరు తీసుకునే వరకూ, అంతా వచ్చినట్లే అనిపించింది. ఈ పరీక్షలతో క్లాసులో నా పొజిషన్ ఎక్కడుందో తెలుస్తుందనుకోన్నాను. దీని మీద పబ్లిక్ పరీక్ష కి చూసి చదువు కోవాలనుకొన్నాను. పెన్ను చేతిలోకి తీసుకొనే సరికి బుర్రలో ఉన్నదంతా ఎక్కడి కేగిరి పోయిందో? చదివినదంతా ఏం గంగలో కలిసిందో ఒక్కటంటే ఒక్క విషయం సరిగా జ్ఞాపకం రాలేదు.
    "పరీక్ష హాలు విడిచి రాగానే అంత తెలివి తక్కువ జవాబులు ఎలా రాయగలిగానా అని బాధపడ్డాను. క్లాసు పరీక్షల్లోనే నా పని ఇలా ఉంటె, ఇంక పబ్లిక్ పరీక్ష లలో ఎలా నెగ్గుతానో!" అన్నాడు సాంబశివం దిగులుగా.
    "ఇది నీ చదువుకీ, తెలివి తేటలకి వచ్చిన లోటు కాదు రా, సాంబూ! చదువు పట్ల మనిషిలో భయం మొలకెత్తకూడదు. దానికి చక్కటి బోదె చేస్తున్నాడు మీ అన్నయ్యా" అన్నది జానకి అక్కసుతో.
    "నువ్వన వాడెం చేసేడే? ఇంట్లో అంతా వాడి మీద లేస్తారేం? మీకు చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి, సంసారాన్ని ఓ ఒడ్డుకి తీసుకొచ్చిందికి బాధ పడుతున్నాడనా?" సుందరమ్మ పెద్ద కొడుకును వెనకేసుకొచ్చింది.
    "ఇంకా ఏం చెయ్యాలమ్మా! ఆ ప్లీడరు రామారావు గారి సంబంధం వీడి పీకల మీదికి తెచ్చేడు. దానితో శాంత పెళ్ళి ముడి పెట్టేడు. శాంత పెళ్ళిని తన పరువు, ప్రతిష్టలకి జోడించేడు. రోజులు తిన్నగా లేక ఈ ఏడు సాంబు పరీక్ష తప్పితే-- నా ఉద్దేశం లో అలా జరగధనుకో-- అన్నయ్య పరువు ప్రతిష్టలను సాంబు నాశనం చేసినవాడవుతాడన్నమాట.
    "ఈ పరిస్థితుల్లో నేనో, ప్రకాశమో ఉంటె అన్నయ్య పరువు ప్రతిష్టలని జాగ్రత్తగా మూట కట్టి భద్రంగా ఓమూల వుంచి, మా పని చూసుకొనేవారిమి. దురదృష్టవశాత్తూ ఈ భారం సాంబు మీద పడింది."
    "అంతా విడ్డూరంగా మాట్లాడుతావే,మ జానకీ! అన్నయ్య మాత్రం ఏమన్నాడు? బుద్దిగా చదువు కోరా తండ్రీ! పెద్దింటి పిల్ల నిచ్చి పెళ్ళి చేస్తానన్నాడు మామగారు పెద్ద చదువులు చెప్పిస్తారు. దర్జాగా బ్రతుకుదువు గాని అన్నాడు. ఆ మాట తప్పా?"
    "తప్పో, ఒప్పో నేను చెప్పబోవడం లేదమ్మా! అసలు సాంబు చదువుతో ఈ లంకెలు పెట్టడం బాగా లేదనే నే చెప్తున్నది. వాడు అసలే భయస్తుడు. అన్నయ్య ఇలా నూరి పోస్తూ అనవసరంగా వాడి మనసు పాడు చేస్తున్నాడు."
    "అసలు ఆ పిల్లని సాంబన్నయ్య పెళ్ళి చేసుకోడమే నాకు బాగులేదు. నల్లగా పాత చింత పండు లా ఉంటుందిట. బుర్ర మీద రెండు పుంజీల వెంట్రుకలూ, ఇంత ముందికి పొడుచు కొచ్చిన ముక్కూ...." శాంత పెళ్ళి కూతుర్ని వర్ణిస్తూంటే వెలపరం వచ్చిన వాడిలా ఓ గుటక మింగేడు సాంబశివం.
    "నువ్వెప్పుడు చూసేవే శాంతా?" ప్రకాశం ప్రశ్నించేడు.
    "మా స్నేహితురాలు శారద పినతల్లి కూతురేగా! ఇలా మా అన్నయ్య కిస్తామన్నారంటే చెప్పింది."
    "పైగా ఇల్లరికం కూడా పంపాలిట కదా? నే చెప్తే అయన వినిపించు కోరు కాని, ఇంత ఇంట్లో పుట్టిన దొరబాబు లాంటి పిల్లాణ్ణి ఎక్కడా గతి లేనట్లు ఇల్లరికం పంపడమేమిటి?" అన్నది కనకం.
    'సాంబూ! ఈ పెళ్ళి చేసుకోనని అన్నయ్యతో ఖచ్చితంగా చెప్పెయ్యరా. శాంత పెళ్ళి కోసం నీ బ్రతుకు పాడు చేసుకొంటావా? శాంతకి మనం పెళ్ళి చెయ్యలేక పొతే మరే ముంచుకు పోదు. అక్కలా ఉద్యోగం చేసుకొంటుంది. అన్నయినా, చెల్లెలైనా ఇంకొకరి కోసం నువ్వెందుకు గోతిలో పడాలి?" అన్నాడు ప్రకాశం.
    "అబ్బబ్బ! మీరంతా కలిసి నా బుర్ర పాడు చేస్తున్నారు. నా బాధలేవో నేను పడతాను కాని, ఈపాటికి దయతో నన్ను వదిలి పెట్టండి" అన్నాడు సాంబశివం రెండు చేతులు జోడిస్తూ.
    "పదండర్రా , పదండి. వాణ్ణి చదువుకోనీండి. తాచెడ్డ కోతి ఈ వనమంతా చెరిచిందన్నట్లు, మీరు వాడికేం బుద్దులు నూరి పోయ్యక్కర లేదు. నా బాబు లక్ష్మణస్వామి లాంటి వాడు. వాళ్ళన్న మాట నెగ్గించి తీరుతాడు" అన్నది సుందరమ్మ.

                            *    *    *    *
    సాంబశివం పరీక్షలు దగ్గరవుతున్న కొద్ది, ప్లీడరు రామారావు గారి దగ్గరి నుంచి ఉత్తరాలు తరుచు రాసాగేయి. ఆ ఉత్తరం వచ్చిన రోజున సూర్యారావు తమ్ముడికి ఒక గంటైనా హితబోధ చేసి, అతడి బాధ్యత గుర్తు చేసేవాడు.
    "నా ఆశలన్నీ నీమీద పెట్టుకొన్నాను రా, సాంబూ! ఇంట్లో అంతా నా మీద కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. నువ్వయినా నాచేయి ఆసరా కాకపోతే, నేను దేశాలు పట్టుకు పోవలసిందే. నలుగురిలో తలెత్తుకొని తిరగలేను" అనేవాడు.
    "అలాగే, అన్నయ్యా! నాకు శక్తుంటే తప్పకుండా సాయపదతాను . నేను చేయగలిగింది ఏమైనా ఉంటె తప్పక చేస్తాను" అనేవాడు సాంబశివం.
    ఇంట్లో మిగిలిన వాళ్ళంతా సూర్యారావును వ్యతిరేకిస్తున్న కొద్ది, సాంబశివానికి అతని పట్ల సానుభూతి పెరగసాగింది. అన్నయ్య తన సుఖం చూసుకోకుండా ఎవరి శ్రేయస్సు కోసం పాటు పడుతున్నాడో వాళ్ళే అతనికి ఎదురు తిరగడం అన్యాయం అనుకొన్నాడు. కనీసం అతని ఆశలను ఆలోచనలకు జీవం పోయ్యాలనుకొన్నాడు.
    సాంబశివం పరీక్షలు పది రోజులు ఉన్నాయన గానే ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పచ్చడి చేసి , దేవుడికి నైవేద్యం పెట్టి, ముందుగా సాంబశివం చేతిలో వేసింది సుందరమ్మ. తల్లి చేతిలో వేసిన పచ్చడిని నోట్లో వేసుకొని, "అబ్బా! ఇంత చేదుగా ఉన్నదేమమ్మా?" అన్నాడు.
    "ఉగాది పచ్చడి మరెలా ఉంటుందిరా? చేదుగా, తియ్యగా, జీవితంలో కష్ట,సుఖల్లా......"
    'అయితే ఈ సంవత్సరం నా జీవితానికి కష్టమే రాసి పెట్టినట్లుంది. ఈ పచ్చడి నా నోటికి చాలా చేదుగా తగులుతున్నది. తీపన్న మాటే లేదు" అన్నాడు సాంబు.
    'అత్తయ్యా, చితక్కొట్టి పెట్టిన బెల్లం పచ్చడి లో కలపకుండా అలాగే వదిలి పెట్టేరేం?" అన్నది వంట ఇంట్లోంచి కనకం.
    సుందరమ్మ చిన్న పుచ్చుకొన్నది. తన మతిమరుపుకి తిట్టుకుంది. ఎందుకిలా జరిగింది? తను ఎంతో ప్రేమగా పిల్లాడి చేతిలో ఉగాది పచ్చడి వేసి ఆశీర్వదిద్దామని వచ్చి, ఉగాది నాటి ఉదయాన్నే వాడి నోరు చెదు చేసింది. 'ఇది వాడి ముందు బ్రతుకుకు అపశకునం కానియ్యకు తండ్రి!" అని దేవుణ్ణి ప్రార్ధించుకొని  లెంపలు వేసుకొంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS