బాబు కళ్ళు తెరవకుండానే అస్పష్టంగా పలవరించాడు. "నా....న్న..."
"అయ్యో, తండ్రీ! ఇది నీకు తల్లి కాదురా. ఎక్కడో మృత్యుదేవతలా దాపురించిందిరా నీ ప్రాణానికి!" బాబు బుగ్గలు నిమురుతూ, దుఃఖ పడుతూ రూపను తిట్టసాగింది.
మానావమానాలకు భేదం తెలియని అయోమయ దైన్యస్థితిలో ఉన్నది రూప. కృష్ణప్రియ ఎన్ని అన్నా మౌనంగా భరిస్తూంది.
"ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకు. వెళ్ళు. త్వరగా వెళ్ళు బాబును కల్యాణ్ కు అప్పగించు. అతడు తన ప్రాణమైనా ఒడ్డి బాబును బ్రతికించు కొంటాడు." రూపను తొందరచేసి కళ్యాణ్ అడ్రసు ఇచ్చి మద్రాసుకు ప్రయాణం కట్టించింది కృష్ణప్రియ.
11
మద్రాసులో ఓ మేడముందు టాక్సీనుండి దిగింది రూప. ఆమె భుజంమీద స్మారకం లేని బాబు ఉన్నాడు.
హాలులో కూర్చుని ఏదో పత్రిక తిరగవేస్తూన్న విరిబాల రూపను చూచి ఆశ్చర్యపోయింది. రూపను చూచి కాదు; ఆమె అవతారం చూచి, విషాదమేఘాచ్చాదితమైన ఆమె ముఖం ఎన్నాళ్ళుగానో జ్వర పడిన దానిలా పీక్కుపోయింది. రేగిన జుట్టు. నిద్రాహారాలు లేనిదానిలా తూలుతున్నది.
కళ్యాణ్ ద్వారా తెలిసిన రూప చరిత్ర మనసులో మెదలగా ఆదరంగా పలకరించలేకపోయింది.
రూప వచ్చింది, ఎవ్వరి ఆదరసత్కారాలకోసం కాదు. విరిబాల మౌనప్రవర్తనకు బాధ పడలేదు. "బాబుతండ్రి ఉన్నారా?" వీరస్వరంతో ప్రశ్నించింది.
"బాబుతండ్రి ఎవరు?" నవ్వి, హేళనగా ఎదురు పశ్నించింది విరిబాల.
బాబు బరువుతో భుజం పీక్కుపోతున్నది, నిలబడే ఓపిక కూడా లేదు. బాబును ఒళ్ళో వేసుకుని కిందకూలబడిపోయింది రూప. "బాబుతండ్రి ఉంటే పిలవండి ఇటు. వీణ్ణి ఆయన పాదాలవద్ద పడవేసి పోతాను."
వింతగా చూచింది విరిబాల. లేచి బాబు దగ్గరికి వచ్చి తాకి చూచింది. "అబ్బ! ఏమిటీ జ్వరం?"
"వారిని పిలవండి."
మేడమీదికి వెళ్ళి తిరిగివచ్చిన విరిబాల, కళ్యాణ్ సమాధానం ఈవిధంగా వినిపించండి, "కళ్యాణ్ ఇంకా మనిషిగానే బతికి ఉన్నాడని చెప్పమన్నాడు!" చెప్పి, 'శాస్తి జరిగిందా?' అన్నట్లు చురుగ్గా చూసింది రూప ముఖంలోకి.
బాబును నేలమీద పడుకోబెట్టీ పైకి వెళ్ళింది రూప.
కళ్యాణ్ తలకు చేతులు పట్టుకొని కూర్చొని ఉన్నాడు.
"ఇది పంతాలకూ, పౌరుషాలకూ సమయం కాదు, డాక్టర్! బాబు ప్రమాదంలో ఉన్నాడు. వచ్చి మీ బాబును బ్రతికించుకోండి. మీ రొక్కసారి వాడి కళ్ళలో పడితే చాలు. వాడు బ్రతుకుతాడు."
కళ్యాణ్ ముఖం పక్కకు తిప్పుకొన్నాడు.
దిక్కు తోచకుండా పోయింది రూపకు. కళ్యాణ్ పాదాలు గట్టిగా పట్టుకొంది. "లేవండి! వచ్చి మీ బాబును బ్రతికించుకోండి. "నాన్న ..... నాన్న" అంటూనే జ్వరం తెచ్చుకొన్నాడు బిడ్డడు. వాడు మీ బాబే. ఈ జన్మలో పొరబాటునకూడా బాబు వంక తిరిగి చూడనని ప్రమాణంగా చెబుతున్నాను. నా మాట నమ్మండి!"
గదిలో అడుగు పెట్టిన విరిబాల, ఉదయభాను కనిపించిన సన్నివేశాన్ని చూచి విస్తుపోయారు. అక్కడికీ ఉలుకూ పలుకూ లేకుండా రాయిలా కూర్చున్న కళ్యాణీ భుజం మీద చెయ్యివేసి గంభీరంగా అన్నాడు ఉదయభాను: "ఎవరిని సాధిస్తున్నావు కళ్యాణ్? ఆమెను తరవాత సాధించవచ్చుగాని మొదట నీ బాబును చూచుకొందువుగాని రా. వాడి పరిస్థితి ఏమీ బాగులేదు. నిమిషాలు, గంటలమీద ఉన్నది!"
"ఆఁ!" పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు కళ్యాణ్. అతడి బింకం ఒక్కసారిగా సడిలిపోయింది. ఒక్క ఊపున లేచి వెళ్ళాడు. ఉదయభానుచేత సోఫాలోకి చేర్చబడిన బాబు స్మారకం లేకుండా పడి ఉన్నాడు. "గోకుల్, గోకుల్" అంటూ ఒళ్ళోకి తీసుకొన్నాడు కళ్యాణ్. నిలువల్లా కంపించిపోతున్నాడతడు. ఆత్రంగా బాబు చెంపలు నిమురుతూ, "నేనురా, నాన్నని ఒక్కసారి కళ్ళు విప్పి చూడమ్మా" అన్నాడు.
అస్పష్టంగా మూలిగాడు బాబు. పెదవులు మెల్లిగా కదిల్చాడుగాని ధ్వని బయలువెడలలేదు.
సిరెంజికి మందు ఎక్కించి బాబుచేతిని చేతిలోకి తీసుకొన్న ఉదయభాను ముఖం వివర్ణమైంది. ఒక్క నిట్టూర్పు విడిచి చెయ్యి వదిలిపెట్టాడు.
గొల్లుమన్నాడు కళ్యాణ్. "భానూ! నా గోకుల్ ను బ్రతికించు. వీడు లేనిది నేను బ్రతకలేను, భానూ!" కళ్యాణ్, బాబు కళేబరంమీద పడి విలపిస్తున్న హృదయవిదారకమైన ఆ సన్నివేశం చూడలేక కళ్ళు మూసుకొన్నాడు ఉదయభాను.
విరిబాల బావను ఓదార్చడానికి తన శక్తి అంతా వినియోగిస్తున్నది కాని ఫలితం శూన్యం.
బాబు మరణవార్తవిని చైతన్యంలేకుండా నేలమీద పడిపోయిన రూపను పట్టించుకొన్నవారు ఒక్కరూ లేరు!
12
కొక్కొరో అన్న కోడికూతతో ఒళ్ళు విరుచుకుంది పల్లె, ఉషఃకన్యకు స్వాగతగీతా లాలపిస్తూన్న పక్షుల కలకల నినాదాలు అడవులకు వెళ్ళుతున్న పశువుల పదఘట్టనలతో అంతరించిపోయాయి. ఇళ్ళముందు కళ్ళాపిచల్లి ముగ్గులు వేస్తున్నారు పల్లెపడతులు.
పైపైకి వస్తున్నాడు సూర్యభగవానుడు. ప్రొగ్ధిశాభాగంలో ఉషాసుందరి అద్దిన వన్నెలు క్రమంగా కరిగిపోతున్నాయి.
డాబామీద పడుకొని ఉన్న కళ్యాణ్ ఒళ్ళు విరుచుకొని పక్కమీదినుండి లేచాడు. నౌకరు ముఖానికి నీళ్ళు పెట్టేలోగా చిత్రఫలకంపై 'ఉషస్సులో పల్లె' అన్న చిత్ర మొదలుపెట్టాడు.
"బాబుగారూ!" నౌకరు స్టూల్ మీద టూత్ పేస్టూ, బ్రష్షూ పెట్టి పిలిచాడు.
కళ్యాణ్ కుంచె కిందపెట్టి ముఖం కడుక్కువచ్చాడు.
నౌకరు కాఫీ తెచ్చి పెట్టాడు.
కళ్యాణ్ కాఫీ కొంచెం కొంచెంగా తాగుతూ టేబుల్ మీద ఉన్న ఫోటోవంక చూస్తూ కూర్చున్నాడు. ఫోటోలో ఆరు మాసాల వయస్సులో ఉన్న గోకుల్ కళ్యాణ్ కేసి చేతులు చాచి నవ్వుతున్నాడు.
'గోకుల్! నా ఒడి శూన్యంచేసి భగవంతుని ఒడి చేరావా, బాబూ? ఆయన ఒడిలో ఆనందపుపంట పండిస్తున్నావా?'
"బాబుగారూ!" సగం కాఫీ తాగి ఇక తాగకుండా ఫోటోవంక ఆర్ద్రనయనాలతో చూస్తూ కూర్చున్న యజమానిని చూచిన నౌకరు హృదయం ఆర్ద్రమైంది. "బాబుగారూ! కాఫీ చల్లారిపోతున్నది. తాగండి. మీకు గోకుల్ బాబుమీద ఎంత ప్రేమ ఉన్నా ఇలా నిత్య నూతనంగా బాధ పడుతూండడం మంచిది కాదు. మరిచిపోవడానికి ప్రయత్నించాలి, బాబుగారూ!"
"మరిచిపోయే పిల్లవాడు కాదు, రంగన్నా, నా గోకుల్. ఈ జీవితంలో మరుపురాడు," గ్లాస్ నౌకరుకు అందించి లేచాడు. కలతపడిన మనస్సు చిత్రలేఖనంలో లగ్నం చెయ్య ప్రయత్నించాడు.
ఆవేళే అక్కగారికి ఒక ఉత్తరం వ్రాశాడు కళ్యాణ్. గోకుల్ వియోగంతో తనలో కలిగిన మనస్తాపాన్ని పోగొట్టుకుందుకు పల్లెజీవితంలో ప్రశాంతి ఉంటుందన్న ఆశతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వచ్చాక జరిగిన సంగతులన్నీ దానిలో తెలియజేశాడు.
"అనుకొన్నట్లుగానే ఈ పల్లెజీవితం కొంత హాయిగానే ఉంది, కృష్ణక్కా! అయినా గోకుల్ ను మరిపించే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదేమో అనిపిస్తూంది. నేనూ గోకుల్ దగ్గిరికే వెళ్ళిపోవాలనిపిస్తూంటుంది ఒక్కోసారి.
"ఇక్కడికి నా రాక, అమ్మానాన్నలతో అంతరించి పోయిన వైభవాన్ని పునరుద్ధరించినట్లు అయింది. మన అయ్యగారి కొడుకు ఇంతవాడై వచ్చాడు ఊరికి అన్న సంబరమేకాదు. శాంతికోసం వచ్చిన నేను, వైద్యం చెయ్యాలని లేకపోయినా నా డాక్టరీ నిష్ప్రయోజనం కానియ్యడంలేదు. ఉదయం పది గంటల వరకూ ఊపిరి తీసుకోడానికికూడా తీరిక ఉండదు, ఎక్కడెక్కడినుండో వచ్చే రోగులతో, ఆదాయం లేక పోయినా అప్పుడప్పుడూ నా చేతినుండే పెట్టవలసి వస్తూంది బీదరోగులకు. అయినా పోయిందేముంది, ఎందరు కూర్చొని తిన్నా తరగని లక్షల ఆస్తి ఉన్నది కదా? మనిషిగా పుట్టినందుకు నాద్వారా ఈ విధంగా కొంత మానవసేవ జరగడం సుకృతమని భావిస్తున్నాను.
"మిగిలిన సమయం చిత్రలేఖనంలో గడపడం; సాయంకాలాలలో పొలాలగట్లకేసి షికార్లు కొట్టడం-నిర్మలాంతరంగులూ, అమాయికులూ అయిన ఈ పల్లెవారి మధ్య హాయిగానే గడిచిపోతున్నది జీవితం.
"మన ఊరు ఎప్పుడో చిన్నప్పుడు చూశావు కదూ? మరిచిపోయి ఉంటావు. ఇంతలో వీలు చూచుకొని నిన్ను తీసుకువస్తాను. మన ఇంటినీ, మన తోటల్నీ చూసి కొన్నాళ్ళు ఉండిపోదువుగాని. ఇంతకూ, నువ్వు నీ అత్తగారి ఊరికి పోయిన తరవాత ఒక్క ఉత్తరంకూడా వ్రాయలేదు. అక్కడి సంగతులు తెలుపుతూ ఉత్తరం వ్రాయి."
వారం తిరగకుండానే కృష్ణప్రియనుండి జాబు వచ్చింది.
"గోకుల్ ను మరవలేక బాధ పడుతున్నావా, కృష్ణా? మరిచే పిల్లవాడు కాదుకదా! ఆ నల్లని కళ్ళూ, ముద్దుమాటలూ జ్ఞాపకం వస్తూంటే కళ్ళలో మెదులుతాడు. కాని, మరవక తప్పదు. ఎంత ప్రాణాధికమైనవారైనా పోయినవారితో మనమూ పోలేం. ఏమైనా ఒకనాటికి మరవక తప్పదు. ఒక్కో సారి అనిపిస్తూ ఉంటుంది నాకు, వాడు నీ జీవితాన్ని తలకిందులు చేసిపోవడానికే వచ్చాడేమోనని. భోగభాగ్యాలకు లోటు లేకపోయినా ఏమిటి మన జీవితాలు అనిపిస్తుంది. అమ్మా నాన్నా బుద్ధి తెలియకముందే పోయారు. నా జీవితం ఇలా అన్యాయమై పోయింది. భార్యాపిల్లలతో ఆనందంగా సాగవలసిన నీ జీవితం అలా పాడైపోయింది. ఇవి ఒక దరికి చేరేది ఎన్నటికి?
"మొన్న ఈమధ్య పెదమామయ్య వచ్చాడు. గోకుల్ మరణం ఆయనకు సంతృప్తి కలిగించినట్లుంది. ఎవరి స్వార్ధాలు వారివి! ఇక నువ్వు పెళ్ళికి ఒప్పుకొన్నావన్నట్లే అనూరాధతో నీ వివాహం మాఘమాసంలో చెయ్యడానికి నిశ్చయించినట్లు చెప్పాడు. ముఖ్యంగా అనూరాధ బావనుతప్ప పెళ్ళాడనని పట్టుబట్టిందిట. ఇంతలో ఆయన అక్కడికి రావచ్చు, ఆ సంగతులు నీకు తెలపడానికి.
"నువ్వు ఒక ఇంటివాడిని కావడంకన్న నాకు కావలసింది ఏముంది కృష్ణా? మీ దంపతులు ఆనందంగా ఉంటే చూసిపోవడానికి వస్తాను నాలుగు రోజుల పాటు; ఇప్పుడు ఏముంది, రావడానికి? నా సంసారం సంగతులు ఏమున్నాయి? ఆ పొలాలూ, అవీ పెద్ద మామయ్య వస్తూ చూస్తుంటాడు. ఇక ఒంటరిదాన్ని అన్న జారేమీ లేదు. కొంచెం ఉదారంగా చెయ్యి విదిలించానంటే ఆశ్రితులకు కొరత ఏముంది? లోకమంతా నావారే!"
'అనూరాధతో నా వివాహం!'
తనతో ప్రస్తావించకుండానే మామ చేసిన నిర్ణయానికి కొంచెం ఆశ్చర్యపోయినా ఆ విషయంలో నిర్లిప్తంగా ఊరుకోదలిచాడు కళ్యాణ్. 'కానీ! ఒకసారి పెద్దలమాట ధిక్కరించి చెడిపోయాను. ఇంకా ఎందుకు వారికి ఎదురు చెప్పడం?' అనుకొన్నాడు.
సాయంత్రంవేళ ఒకరిద్దరు పేషెంట్లు తప్ప ఎక్కువ రారు. ఆ ఒకరిద్ధరైనా పొరుగూరి వారే అయి ఉంటారు. ఉదయం పది, పదకొండు గంటలు అయ్యేసరికల్లా ఇంచుమించు పల్లె అంతా కాళీ అవుతుంది. గొప్ప ఇంటి వారుతప్ప అందరూ కూలినాలికి అడవులకు వెళ్ళి పోయి పొద్దుగూకుతూంటే తిరిగివస్తారు.
పొద్దు వాలుతున్నది.
వచ్చిన ఒకరిద్దరు పేషెంట్లను చూసి పంపివేసి షికారుకు బయలుదేరాడు కల్యాణి, కెమేరా భుజాన తగిలించుకొని.
ఊరు అంచునుండే మొదలయ్యాయి వరిఫైర్లు. దూరంగా అగుపిస్తూన్న చిన్న కొండలవరకూ పచ్చని తివాసి పరిచినట్లుగా ఉంది. కొంగల గుంపులు వరి పైర్ల మీద ఎగురుతున్నాయి.
వరిగట్ల మీద నడుస్తూ కొండ ఎక్కాడు కళ్యాణ్.
కొండల మధ్య రాళ్ళమీద ప్రవహిస్తూంది ఒక సెలయేరు. ఇరుపక్కలా దట్టంగా, ఎత్తుగా ఎదిగిన వృక్షాలూ, వాటిని అల్లుకొని గజిబిజిగా అడవిలతలూ అక్కడి ప్రశాంత మనోహరప్రకృతిని చాటుతున్న ట్లుగా, సెలయేటి గలగల సవ్వడులకు శ్రుతి వేస్తున్నట్లుగా చెట్లగుంపులలో కలకల నినాదాలు చేస్తున్నాయి రకరకాల పక్షులు.
అచ్చటి ప్రకృతి రమణీయకతకు పరవశించిపోతూ సన్నగా కూనిరాగం తీస్తూ ఎత్తుగా ఉన్న కొండ ఎక్కి దూరంగా దృష్టి సారించాడు కళ్యాణ్, ఫోటో తియ్యడానికి హృద్యమైన దృశ్యంకోసం.
శాఖోపశాఖలుగా ఉన్న చిటికేశ్వరం చెట్టుకొమ్మ ఒకటి సెలయేటి మీదికి వాలి ఉంది. కొమ్మలనిండా గుత్తులు గుత్తులుగా పూసిన రంగురంగుల పూలు సాయంసూర్యుని బంగారు కిరణాలు పడి వింత సోయగాలు వెదజల్లుతున్నాయి. నీళ్ళలో తేలిఉన్న ఓ రాతిమీద నీళ్ళలో కాళ్ళు ఆడిస్తూ ఓ యువతి కూర్చొని చేతులు తిప్పుతూ సంభాషిస్తూంది. సమీపంలో మనిషి ఎవ్వరులేరు. పరీక్షగా చూశాడు కల్యాణ్. ఆమె మాట్లాడుతున్నది, కొమ్మమీది పక్షి జంటతో!
ఆశ్చర్యంతో కిందికి దిగి ఆమెకు కొంచెం దూరంలో ఆగిపోయాడు కళ్యాణ్ ఉలికిపాటుతో. 'నరరూపరాక్షసి! నా గోకుల్ ను చంపిన ఘాతకి! ఇక్కడ ఇలా ప్రత్యక్షమైనదేం?' ప్రశాంత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న కళ్యాణ్ ఆనందం రూప సందర్శనంతో ఒక్కసారిగా విచ్చిన్నమైపోయింది! జుగుప్సా క్రోధాలతో నిండిపోయింది అతడి అంతరంగం.
ధవళవస్త్రాలలో ఆమె దేహశాంతి వింతశోభ తీరుతూంది. మనిషి పూర్తిగా చిక్కిపోయినా ఆ ముఖంలో అపూర్వమైన కాంతి ఏదో తరుక్కుమంటూంది. అమాయికమైన రూపులలో పసిపాపలా ప్రకృతిలో సంభాషిస్తున్న ఆ ముగ్ధయువతిని చూస్తే విచిత్రానుభూతి ఏదో కలుగుతున్నది.
