"గుడ్ మార్నింగ్ చెప్పండి ....తెల్లారి పొతుందిగా."
అంతవరకూ గమనించలేదు విమల్.
తూర్పు వేపు సన్నని వేలుగురేకలు కన్పిస్తున్నాయి.
"ఓ.కే. .....మాధురీ." విమల్ తన సూట్ కేసి వెళ్ళిపోయాడు. మసక చీకట్లో వెళ్ళిపోతున్న విమల్ వేపు చూస్తూ నిలబడిపోయింది మాధురి.
* * * *
రూంలోకి రాగానే గోడ గడియారం వేపు చూసాడు విమల్.
నాలుగు పదిహేను నిమిషాలైంది.
ప్రస్తుతం విమల్ ఆలోచనల్లో కేంద్ర బిందువు మాధురి.
అంత మంచులో, అన్ని గంటలు తడిసినా , విమల్ కు చలివేయ్యడం లేదు.
అతని మనసు వెచ్చగా వుంది. శరీరం కూడా వెచ్చగా వుంది.
మాధురి ......మాధురి......మాధురి.
ఒక్కసారి అతని ఆలోచనలు తెగిపోయాయి.
దానిక్కారణం ........
ఫోన్......
ట్రింగ్....ట్రింగ్ .......ట్రింగ్........
"ఎవరై ఉంటారు." కనుబొమ్మలు చిట్లించి మోగుతున్న ఫోన్ వేపు చూసాడు.
గబుక్కున రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు.
"మళ్ళీ డిస్ట్రబ్ చేస్తున్నాను కదూ,"
మళ్ళీ అదే గొంతు.
ఆ గొంతు మళ్ళీ వినగానే భయపడ్డాడు విమల్.
కృష్ణనందన.
"ఇవ్వాళ ....రాత్రి పాపం . మీకు నిద్ర లేనట్లుంది కదూ." కృష్ణనందన గొంతులో ఎంతో హేళన.
మూడు గంటల క్రితం రూమ్ లోంచి బయటకెళ్ళిన మీరు, ఇపుడే వచ్చినట్టున్నారే."
విమల్ మాట్లాడలేదు.
అతని శరీరంలో అంతవరకూ పేరుకున్న వెచ్చదనం, నెమ్మదిగా చల్లబడుతోంది.
"బాగా అలిసిపోయినట్టున్నారే."
ఆ మాటకు విమల్ కు కోపం వచ్చింది.
"ఎప్పటికప్పుడు నా ఫోన్ మీదా, నా రూమ్ మీద, నా మీద నిఘా వేస్తున్నావన్నమాట."
"నిఘా..ఏం వెయ్యకూడదా. మీరు మీ రూంలోనూ, లేరు, మధురి రూం లోనూ లేరు. ఇద్దరూ కల్సి బయటికెళ్ళరా."
"రాన్రానూ ......నువ్వు డెవిల్ గా మారుతున్నావ్." నిస్సహాయంగా అన్నాడు విమల్.
"టాపిక్ మార్చకండి. నాకు అన్సర్ కావాలి. ఆ మాధురితోనెగా మీరు బయటికెళ్ళింది. ఎక్కడ కెళ్ళారు. ఇంతసేపేం చేసారు. మాధురిని మీరు ప్రేమిస్తున్నారా!"
వరసగా ప్రశ్నలు . ఫోన్లో కృష్ణనందన గొంతు విసురుగా ఉంది. క్రూరంగా ఉంది - ఆ ధాటిని విమల్ తట్టుకోలేకపోతున్నాడు.
ఆ సిట్యుయేషన్ అతనికి అనీజీగా వుంది - అన్ బెరబుల్ గా ఉంది.
కొన్ని వేల మైళ్ళ దూరాన వున్న కృష్ణ నందన , తననలా శల్య పరీక్ష చేయడం -
అతను సహించలేకపోతున్నాడు.
"షటప్ ఐసే .ఫోన్ పెట్టేయ్. నువ్వు ఊహించుకుంటూన్న రిలేషన్ మా మధ్య ఏం లేదు, అర్ధమైందా. నైట్ ఫోన్ చేస్తాను. నీవు పెట్టేయ్" విసురుగా అన్నాడు విమల్.
విమల్ గొంతులోంచి వచ్చిన ఆ మాటలకు వెంటనే కృష్ణనందన మాట్లాడలేదు.
ఫోన్లో ఏడుపు విన్పిస్తోంది ------వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా విన్పిస్తోంది.
"నైట్ ఎన్ని గంటలకు ఫోన్ చేస్తారు." ఊపిరిని ఎగదోసుకుంటూ అడిగింది కృష్ణనందన.
"ఆప్టర్ నైన్......." చెప్పేసి , టక్ మని ఫోన్ పెట్టేశాడు విమల్.
అప్పటికి పూర్తిగా తెల్లారిపోయింది.
అప్పుడే లోనికోచ్చాడు ప్రొడక్షన్ మేనేజర్.
"గుడ్ మార్నింగ్ సర్.......అప్పుడే లేచిపోయారే."
ఏం మాట్లాడలేదు విమల్.
"ఏడు గంటలకు కారుతో రెడీగా వుంటాను సర్.....ఒక్కసారి రిమైడ్ చెయ్యడానికొచ్చాను........"
"ఓ.కే......"
ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళిపోయాక, ఏదో కోల్పోయిన వాడిలా సోఫాలో కూర్చుండిపోయాడు విమల్.
* * * *
ఒక నలుపు రంగు నేపధ్యం.
ఒక ఎరుపు రంగు నేపద్యం.
ఒక తెలుపు రంగు నేపద్యం.
ఒక వలపు రంగు నేపద్యం.
అన్నీ కలిసిన హరివిల్లు మెరుపు రంగు నేపద్యం.
అందమైన తెనేరంగు హల్లో మసక, మసక దీపాలు వెలుగు తున్నాయి. ఆ దీపాల మాటున, గోడలకు ఒకవేపు ఆకుపచ్చని ఊటీ లోని అందమైన పచ్చని చెట్ల పొడవాటి దృశ్యం.
మరోవేపు నిలువెత్తు నీలగిరులు నిలబడిన నిలువెత్తు లాస్యం ఆ హాలు మధ్యన సృష్టించిన కృత్రిమ గిరుల లోయల్లోంచి కొత్త సొగసులతో ప్రవహిస్తున్న జలపాతం .......దూరంగా కెమెరా - కెమెరాలో ఫ్రేం చూస్తూ కెమెరా మాన్ --అప్పుడొక 'యాడ్' ఫిల్మ్ షూటింగ్ జరగడానికి సిద్దంగా వుంది.
దేశంలో ప్రసిద్ది పొందిన ఒక కంపెనీ , తమ కొత్త ఫోన్ "సిల్వర్ ప్రెస్ ని ' ఇంటర్ద్యుస్ చేస్తున్నారు.
