Previous Page Next Page 
డాళింగ్ పేజి 20

 

    "మధ్యాహ్నం లంచ్ టైం లో నేనో ప్రశ్న వేసాను. దానికి మీరు జవాబు చెప్పలేదు." విమల్ జ్ఞాపకం చేసాడు.
    "ఏంటది" జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టుగా అడిగింది మాధురి.
    "ఇంతవరకూ నేనెవర్ని ప్రేమించలేదన్నారు. నిజంగా ప్రేమించలేదా?"
    మంచు కిందపడుతున్న శబ్దం విచిత్రంగా వుంది.
    మాధురి జవాబివ్వలేదు.
    విమల్ మనసులోని సంఘర్షణ , మనసులోని ప్రశ్నలు మాధురికి అర్దమవుతున్నాయి.
    "నా చుట్టూ నేను గీసుకున్న గీతల మధ్య బతకాలనే దృక్పధం నాది మాధురి. అందరిలాగే బతకాలనే ఆశ నాకూ వుంది. ప్రేమంటే నాకిష్టం. ప్రేమించబడటమంటే నాకూ ఇష్టం. ఇష్టమైన వ్యక్తీ, చేతుల్లో చెయ్యి వేసుకుని నడవాలని టీనేజ్ లో ఏ కలలైతే కన్నామో, ఆ కలల్ని నిజం చేసుకోవాలని నా కోరిక. బతికున్న రోజుల్లో మా అమ్మగారు అంటుండేవారు స్త్రీ కయినా, పురుషుడికయినా, అనందం, సంతృప్తి ఏంటంటే , చక్కని భర్త, లేదా చక్కని భార్య, పిల్లలు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని , ఇవ్వలేని అనందం , కుటుంబంలోనే లభ్యమవుతుందని , మానసిక మైన సంతృప్తి కుటుంబ జీవితంలోనే ఉందని, కుటుంబాన్ని చేజేతులా కాలదన్నుకుని, వెళ్లిపోయిన వాళ్ళే జీవితంలో నిరాశావాదులుగా, తీవ్రవాదులుగా మారతారని, కుటుంబ వ్యవస్థమీద నమ్మకం ఉన్నవాళ్ళే, యోగిలయ్యారని , పురుషులు, మహా పురుషులయ్యారని అంటుండేవారు, ఆలోచిస్తుంటే అందులో ఎంతో నిజముంది మాధురీ.
    ఒక భర్త, ఒక భార్య , పిల్లలు ఒక కుటుంబాన్ని ఊహించుకోండి . భర్త కోసం బతికే భార్య, భార్య కోసం, పిల్లల కోసం బతికే భర్త. వాళ్ళని పోషించడానికి ఆ భర్త పడే శ్రమ వెనక ఎంత సంతృప్తి ఎంత అనందం ఉంది!
    అలిసిపోయి ఇంటికొచ్చే భర్తకి, ప్రతిరోజూ సేద తీర్చే  భార్య చూపుల్లోని మమత, ఇద్దరి హృదయాల్లో ఒకరిపట్ల ఒకరికుండే ఆప్యాయత, అనురాగం .......
    అలాంటి జీవితం కోసం కలలుగన్నాను మాధురీ, కానీ నాకన్నీ ఉన్నా అలాంటి జీవితం దొరకలేదు. నిరంతర వ్యదే మిగిలింది. అందుకే నాకిప్పుడనిపిస్తుంది, ఏ దూర తీరాలకో, ఎక్కడికో , మనిషి అనే ప్రాణి కనబడని ఏ మారుమూల అడవుల్లోకో, వెళ్ళిపోదామని. కానీ , జీవితం ......జీవితం చుట్టూ పెనవేసుకున్న రంగు, రంగుల ఆకర్షణ."
    చెప్పుకు పోతున్నాడు విమల్.
    అలా వింటోంది మాధురి.
    విమల్ మనసు లోపల దాగిన సున్నితత్వాన్ని మొట్టమొదటిసారి చూస్తోంది.
    "ఇప్పుడేమైంది విమల్. ఎందుకలా బాధపడుతున్నారు."
    అతని చేతిని తన చేతులోనికి తీసుకుని నెమ్మదిగా నిమురుతూ అంది. ఇద్దరి అరచేతుల మధ్య నలిగిపోతున్న మంచు తడి.
    "మీకు తెలీదు మాధురీ. నేనొక ఊబిలోకి వెళ్ళిపోతున్నాను. రోజు రోజుకీ కూరుకుపోతున్నాను. కొన్నాళ్ళకు నేననేవాడిని లేకుండా పోతానేమో....." ఆ సమయంలో విమల్ గొంతులో అంతులేని నిరాశ.
    "ఏంటా మాటలు. ఇప్పుడెం జరిగింది. ఎవరూ లేనట్లు ఒక్కరై పోయినట్లు."
    "ఎవరున్నారు నన్నర్ధం చేసుకునే వ్యక్తీ ఎవరున్నారు" చెప్పండి మాధురి. మా అమ్మగారు చనిపోయాక నేను మరీ వంటరివాడ్ని అయిపోయాను."
    "లేదు, మీరెప్పుడూ వంటరివారు కాదు. నేనుండగా."
    అకస్మాత్తుగా మాధురి నోటివెంట ఆ మాట వచ్చేసరికి.
    కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య లోతైన నిశ్శబ్దం. ఆ తరువాత తేరుకొని మాధురి రెండు చేతులూ పట్టుకున్నాడు విమల్.
    "మాధురీ ఐ లవ్ యూ........ఐ లవ్ యూ..........ఐ లవ్ యూ."
    గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిలిలో ఉక్కిరిబిక్కిరైపోయింది మాధురి. మధురోహల్ని తట్టిలేపే మృదుమధురమైన స్పర్శ తొలిసారి. అనుభూతి చెందింది. అది శాశ్వతమైతే బాగుండుననే ఫీలింగ్. కానీ వెంటనే తేరుకుంది.
    "ప్రతి చిన్న విషయానికి మదనపడటం మంచి పద్దతి కాదు. ఇక నుంచీ మీ ప్రతి సమస్యా నాకు చెప్పండి, అలాగేనా." అతని చేతుల్లోంచి విడిపడుతూ అంది గుసగుసలాడుతున్నట్లుగా.
    "అలాగే" అన్నాడు విమల్ అస్పష్టంగా.
    దూరంగా జలపాతం నుంచి వస్తున్న శబ్దం ఉరుములు, ఉరుముతున్నట్టుగా ఉంది.
    "చాలా సేపయింది కదూ, వచ్చి వెళదామా" మాధురి లేస్తూ అంది.
    "ఏం....నిద్రస్తుందా."
    "రాదా?"
    "అయితే పదండి."
    విమల్ మనసు ప్రశాంతంగా వుంది.
    చాలాసేపటి నుంచి అతని చేతిలో మాధురి చెయ్యి ఉంది.చెయ్యి మృదుత్వపు స్పర్శ హాయిగా వుంది.
    పార్కులోంచి రోడ్డు మీద , రోడ్డు మీద నుంచి హోటల్ వేపు నడుస్తున్నారు.
    హోటల్ దగ్గర పడింది.
    మసక వెల్తురు వాళ్ళిద్దరి మీదా పడుతోంది.
    మాధురి అరచేతిని, పెదవుల దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
    ఆ తోలి ముద్దుకు మాధురి పరవశించిపోయింది.
    భావం లేని చూపుతో విమల్ వేపు చూసింది.
    "మంచులో ముద్దయిపోయాం కదూ. "చేతిని నెమ్మదిగా విదిపించుకుంటూ అంది.
    ఆ మాటకు జవాబు చెప్పలేదు విమల్.
    "ఓ.కే. గుడ్ నైట్ ....." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS