తిన్నగా హోటల్ మేనకకు బయలుదేరాను. కౌంటర్లో నా అయిడెంటిఫికేషన్ కార్డు అందజేశాను.
"పేరు" కౌంటర్లో వ్యక్తీ అడిగాడు. చెప్పాను.
'అడ్రస్"
చెప్పాను.
"ఊహు" అని తల పంకించాడతను. "ఆమెకు సంబంధించిన మరికొన్ని వివరాలు చెప్పగలరా --అంటే ఇంట్లో ఎంత మంది సభ్యులుంటారు? ఆమె ఏం చేస్తోంది చదువు కుంటుందావగైరాలన్నమాట."
'అన్నీ వివరాలు చెప్పలేను. నాకు తెలిసిందల్లా ఆమె పేరు, చిరునామా మాత్రమే. అయితే ఏ పరిస్థితుల్లోనూ నా గురించి ముందుగా ఆమెకు తెలియనివ్వద్దు" అన్నాను.
'అలాగే ఆమె పేరేమిటన్నారు" అని ఒక్కసారి తన నోట్ బుక్ లోకి చూసుకుని "శ్రీ మహాలక్ష్మీ గుడ్ మీరు ఎల్లుండి సాయంత్రం నాలుగున్నరకు వస్తే ఆమె ఫోటో చూసుకోవచ్చు. ఫైనల్ కన్ ఫర్మేషన్ అయ్యేక మరో రెండ్రోజుల్లో ఆమె మీకు లభిస్తుంది."
"నిజంగానే తప్పకుండా లభిస్తుందంటారా?' అన్నాను దీనంగా.
"మీరిచ్చిన వివరాలు సరైనవైతే మీకోరిక తప్పక సిద్దిస్తుంది."
అతని మాటలు నన్నానందపర్చలేదు. దారుణంగా నిరుత్సాహ పర్చాయి. నీరసంగా అక్కణ్ణించి బయటపడ్డాను.
ఇప్పుడెం జరుగుతుంది? మేనక ఏజంట్లు మా ఇంటి మీద పడతారు. సీమను కలుసుకుని మాట్లాడతారు. అప్పుడేం జరుగుతుంది. సీమ వాళ్ళకెలా బుద్ది చెబుతుంది? తమ హోటల్ పూనుకున్న పనేంత అసాధ్య కరమైనదో సీమ మూలంగా వాళ్ళకు తెలియవస్తుందా?
7
"ముప్పై రెండ్రూపాయలివ్వాలి సార్౧"
"ఇదివరలో ఒక ఫోటో కు పాతిక రూపాయలకు మాత్రమే ఖర్చయింది."
"బాగుందండీ కేసును బట్టి ధరమారుతుంది. ఈమె భర్తతో కాపురం చేసుకుంటున్న ఇల్లాలు. సుఖంగా జీవితం గడువుతోంది. ఫోటో తీయడాని కెంత కష్టమైందో తెలుసా?"
అయే ఉంటుందని పించింది. నా అర్ధాంగి శ్రీ మహాలక్ష్మీ అద్బుత సౌందర్యం కళ్ళు చెదిరిపోయేలా ఆ ఫోటో లోకి వచ్చింది. నేను నవ్వి , "ఈ ఫోటో కాఫీ ఒకటి నాక్కావాలి. ఎంతయినా ఇస్తాను" అన్నాను.
"మీరు లక్ష రూపాయ లిస్తానన్నా ఈ ఫోటో ఇవ్వం. మీ వ్యవహారం అనంతరం ఈ ఫోటో మరెవ్వరి కళ్ళా పడకుండా చేస్తాం. లేకపోతె ఇలాంటి బిజినెస్సు చేయలేం." అన్నాడతను.
'అది సరే - ఇంతకూ ఎప్పుడు?" అన్నాను.
"ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటలకి. నాలుగున్నర కల్లా మీరామేను వదిలిపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటె ఆమె వివాహితురాలు. భర్త ఆఫీసు నించి తిరిగి వచ్చే సమయాని కల్లా ఆమె ఇంటి వద్ద వుండాలిమరి!" అన్నాడతను.
` "ఇంతకూ చార్జి ఎంత?"
"కాస్త ఎక్కువగానే ఉంటుంది. వివాహితులు . సంప్రదాయపు మనిషి . మా నేర్పూ ఓర్పూ పరీక్షించిందామె. చిట్ట చివరకు విజయం సాధించాం. మీ బిల్లు ఎనిమిది వందలు దాటవచ్చు...."
మనసంతా బాధగా అయిపొయింది. "వస్తాను ......" అని బయటపడ్డాను ఫార్మాలిటీస్ ముగించుకుని.
ఇంటి దగ్గర శ్రీమతి నా కోసం ఎదురు చూస్తోంది. నేను రాగానే నవ్వి "మీకో తమాషా కబురు చెప్పనా?" అంది.
'చెప్పు -" అన్నాను.
"నాకొక కొత్త పరిచయం దొరికింది."
"ఎవరు?" అన్నాను కుతూహలంగా.
"కూర్చోండి. ముందు చెబుతాను !" అన్నాక ఇద్దరం కూర్చున్నాం.
"ఆవిడ చాలా గొప్ప వ్యక్తీ. బాగా భాగ్యవంతురాలనీ కూడా అనుకుంటాను-" అంది శ్రీమతి సాలోచనగా.
నా మనసు కుదుట పడింది. ఎవరో స్త్రీ తో పరిచయం . "ఊ చెప్పు" అన్నాను.
"నిన్న మధ్యాహ్నం మనింటి కొచ్చింది -- " అంది శ్రీమతి.
"ఎందుకు?"
"ఏదో లేడీస్ క్లబ్ కావిడ ప్రెసిడెంటుట లెండి--" మెంబర్స్ నన్వేషిస్తూ మనింటి కొచ్చింది --" అంది శ్రీమతి.
"నువ్వూ చేరావా?"
"అంత గొప్పవిడోచ్చి అడుగుతుంటే కాదనడమెలా గండీ --అయిదు రూపాయలు మాత్రం ఎంట్రెన్స్ ఫీజు. ఆ అయిదు రూపాయల విలువా అప్పుడే ముట్టేసింది లెండి. ఆవిడ నాకో ఫోటో తీసింది కూడా. క్లబ్ మెంబర్స్ ఫోటో లోక ఆల్బం లో పెడతారట. ఈ రోజప్పుడే ఆవిడ స్వయంగా వచ్చి నాకు ఫోటో కాపీ అందజేసి వెళ్ళింది" అంది శ్రీమతి. అంటూ ఒక ఫోటో తీసి నాకు అందించింది. అంతవరకూ ఆమె చేతిలో ఉన్న ఆ ఫోటో ను నేను గమనించలేదు.
చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ ఫోటో సరిగ్గా నేను మేనకా హోటల్లో చూసిన ఫోటోయే!
"సీమా -- ఆవిడ ఇంకా ఏమైనా చెప్పిందా?" అనడిగాను.
"ఇంకేమీ చెప్పలేదండి. ఎప్పుడైనా క్లబ్ మీటింగ్ ప్రత్యేకమైనది ఉన్నప్పుడు కారు పంపిస్తాను. తప్పక రావాలని చెప్పింది. క్లబ్ మీటింగ్స్ క్కడ జరుగుతుంటాయోతెలుసా ? హోటల్ మేనక లో. అది ఈ ఊళ్ళో కల్ల గొప్ప హోటలని చెప్పుకోగా విన్నాను" శ్రీమతి కళ్ళలో మెరుపు కనపడింది.
నా బుర్ర గిర్రున తిరుగసాగింది.
రేపే నా జీవితంలోని ముఖ్య ఘట్టం. మేనకా హోటల్లో ఏవైనా మోసముంటే తెలుస్తుంది. లేదా సీమ వంచితురాలని రుజువౌతుంది. అదే జరిగితే నా సంసార జీవితంలో ఇది చరమ ఘట్టమౌతుంది.
8
తొమ్మిదో నంబరు కౌంటర్లో వంద రూపాయలు కట్టాను. వెయింటింగ్ రూమ్ నెంబరు 27 లో సినిమా చూసేను. స్పెషల్ రూమ్ పన్నెండు లో యంత్రం లోకి చూస్తున్నాను.
సీమ ఒక నడి వయస్కురాలితో మాట్లాడుతోంది. నేను వచ్చేటప్పుడు ఇంట్లో ఏ బట్టలతో అయితే చూశానో అవే బట్టలు ధరించి ఉంది. ఆ నడి వయస్కురాలిని కూడా గుర్తు పట్టాను. శాంతితో సంభాషించిన ఆమె ఈమె.
ఓ పదినిముషాల అనంతరం యంత్రంలో అంధకారం అలుముకుంది. పక్క నున్నతనికి చెప్పాను.
"గుడ్. ఆమె బయల్దేరింది. వెయింటింగ్ రూమ్ 27 లోకి వెడుతోంది. మీతో అనుభవానికి సైకలాజికల్ ప్రిపరేషన్ జరుగుతుంది. మీరు అండర్ గ్రౌండ్ రూమ్ నంబర్ 6 ముందుండే గ్లాస్ రూంలో ఎదురు చూడండి. ఆమె గదిలో కి వెళ్ళగానే ఒక్క నిముషం ఆగి మీరూ వెళ్ళవచ్చు --" అన్నాడు.
"థాంక్యూ--" అని బయల్దేర బోయాను.
"చిన్న రిక్వస్ట్ . ఇది ఒక స్త్రీ పచ్చని కాపురానికి సంబంధించిన విషయం. గదిలో ఉన్నంతసేపూ ఆమెను మాట్లాడించడానికి ప్రయత్నించవద్దు. ఆమె ముఖాన్ని వెలుగులో చూడ్డానికి ప్రయత్నించవద్దు. గదిలోంచి బయటకు రాగానే ఆమెనీ, ఆమెతో అనుభవాన్నీ మరిచిపోవాలి. మా హోటల్ పది కాలాల పాటు మీ బోటివారికి సర్వీస్ చేయగలగాలంటే ఈ మాత్రపు సహాయం మీరు చేయాల్సుం టుంది " అన్నాడతను.
నేను నీరసంగా అక్కణ్ణించి బయటపడి నిర్ణీత స్థలం లోకి చేరుకున్నాను. గ్లాస్ రూమ్ లో అడుగు పెడుతుండగానే నా ఒళ్ళు తిరిగినట్లనిపించింది. నామీద నాకే కంట్రోలు తప్పి కుప్పలా కూలిబోతుండగా యెవరో పట్టుకున్నట్లు గుర్తు.
తర్వాత యెవరిదో కంఠం వినపడింది. "మెలకువ వచ్చిందా ?" అనడుగుతోందో పురుష కంఠం.
"నేనిప్పుడెక్కడున్నాను ?' లేవడానికి ప్రయత్నిస్తూ అన్నాను.
"అండర్ గ్రౌండ్ రూమ్ నంబర్ సిక్స్ లో ఉన్నారు. గ్లాస్ రూం లోకి వెళ్ళగానే ఎందు వల్లనో పడిపోయారు. నేను మిమ్మల్ని మంచం మీదకు చేర్చాను. నౌ యూ ఆర్ అల్ రైట్?--" అనడిగాడతను.
"ఊ" అన్నాను.
"గుడ్ . ఆమె వచ్చే టైమవుతోంది. మీరు బయటకు రాకండి. గదిలోనే ఉండండి. నేను వెడుతున్నాను. విష్యూ హాపీ టైం " అతను బయటకు వెళ్ళిపోయాడు.
నాకు స్పృహ తప్పడం హోటల్ వాళ్ళ పన్నాగమే అనిపించింది. గదిలోకి రాబోయేది సీమ కాదు. అందుకనే అలా చేశారు. ఈ ఆలోచన రాగానే నామనసు తేలిక పడింది. అప్రయత్నంగా పాంట్ లోపలి పాకెట్ తడిమి చూశాను. నా పెన్ టార్చి, క్లోరో ఫాం బాటిల్ అలాగే ఉన్నాయి.
ఈరోజుతో హోటల్ మేనకా బండారం బయట పడిందనుకున్నాను.
అంతలో గది తలుపులు తెరచుకుని మూసుకున్నాయి. ఆమె సీమ కాదని నాకు తెలుసు. ఆ తలపు అంతవరకూ జరిగిన అనుభవం నాలో ఎనలేని ఉద్రేకాన్ని కలిగించగా వెళ్ళి ఆమెను సమీపించాను.
అనుభవం పూర్తయింది. ఆమె పరవశంగా నన్ను పెనవేసుకుని ఉంది. వెళ్ళి పోబోయేముందు ఒక్కసారి అమె ముఖాన్ని చూసి తీరాలి. నాకీ తలపు వచ్చిన మరుక్షణం లో నా చేతిలోని క్లోరో ఫాం గుడ్డ ఆమె ముక్కుకు అదిమి పెట్టాను. కొద్ది క్షణాల్లో ఆమె మంచం మీదకు జారిపోయింది.
కటిక చీకట్లో నాపెన్ టార్చి వెలుతురూ కిరణాలు ప్రసరించింది. అవి మామూలు కిరణాలు. అనువును భిన్నం చేసి అటంబాంబును పెల్చగల కిరణాలు.....
