గోపీచంద్ టైము చూసుకున్నాడు.
ఇక తనూ బయలుదేరాల్సిన టైమైంది.
అతడు తన ముందున్న డ్రాయరు సొరుగు తీసి రివాల్వరందుకుని కోటు జేబులో వేసుకున్నాడు.
"ఆ పాతకురాలు గనుక -- నిజంగానే నన్ను వంచిస్తే - దాన్ని బ్రతకనివ్వను" అనుకున్నాడతడావేశంగా.
3
నిర్మల ఇంట్లోంచి బయలురేరాక కాలి నడకనే సందులు గొందులు తిరిగి ప్రసాద్ ఇల్లు చేరుకుంది. దొడ్డి గుమ్మాన ఇంట్లో ప్రవేశించింది.
ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు.
ఒక గదిలో బల్ల మీద ఆమెకు కవరు కనబడింది.
నిర్మల కవరు విప్పింది.
అందులో ఒక ఫోటో - ఆ ఫోటోలో....
ఒక యువతి , యువకుడు.
యువకుడామెకు తెలుసు. గోపీచంద్ ....తన భర్త!
యువతి ఎవరో ఆమెకు తెలియదు... కానీ ఆమె భార్య అయిన తనకంటే మిన్నగా అతడిని హత్తుకు పోయింది.
వారిద్దరికీ సంబంధమున్నదని వేరే చెప్పక్కరలేదు.
ఫోటో తో పాటు కవరు లో ఓ ఉత్తరం .....
"ఈ ఫోటోతో నీ భర్తను బ్లాక్ మెయిల్ చెయ్యి అలా డబ్బు సంపాదించి అది నాకియ్యి, ఇదే నేను నీకు చెప్పదలచుకున్న వుపాయం."
సంతకం లేదు.
నిర్మలకు వళ్ళంతా వణికింది.
ఆమెకు భర్త గురించి బాగా తెలుసు.
అతడు తన తప్పును ధైర్యంగా ఒప్పుకుంటాడు.
తనకు పరస్త్రీ పరిచయ మున్నదని - అది తన వ్యాపార దృష్ట్యా అవసరమనీ అతడు నిర్మలకు చెప్పి ఉన్నాడు.
"నేనెవరితో మసలినా అతిగా తిరగను. ఎవరితో తిరిగినా వారికీ భార్య అర్హత లేదు. నీవు నా భార్యవు. నీ ద్వారా నా వంశం సృష్టి కావాలి. నీ సంతానానికే నా ఆస్తి వారసత్వంగా సంక్రమిస్తుంది" అని అతడొకసారి ఆమెతో అన్నాడు.
"మరి మీరు నీతిగా ఉండనవసరం లేదా?" అంది నిర్మల.
"నాకు నీతులు చెప్పకు. నువ్వు నీతిని తప్పకు" అన్నాడతడు.
తానతడిని ఫోటో చూపించి బ్లాక్ మెయిల్ చేయగలదా?
నిర్మలింకా ఏమో ఆలోచిస్తుండగా అక్కడ అడుగుల చప్పుడయింది.
ఆమె భయపడింది.
ఎవరది వస్తుంట?
బ్లాక్ మెయిలరా - లేక ప్రసాదా!
లేక ప్రసాదే బ్లాక్ మెయిలరా?
ఇద్దరూ కాకపొతే ?
మూడో వ్యక్తీ కంట పడటం ఆమె కిష్టం లేదు.
ఆమె వెంటనే దగ్గిరలో ఉన్న బీరువా చాటున దాక్కుంది.
తొంగి చూస్తుంటే ఆమెకు గదంతా స్పష్టంగా కనబడుతోంది కానీ - బయటివాళ్ళ కామె కనపడదు.
క్రమంగా అడుగుల చప్పుడు దగ్గరయింది.
గదిలోకి ఓ వ్యక్తీ ప్రవేశించి ఆగాడు.
అతడి నామే చూసింది.
ఒక్కసారి గుండె ఆగిపోయిందా అనిపించిందామెకు.
ఆ వచ్చింది గోపీచంద్ ! తన భర్త....
ఇదెలా సాధ్యం?
తన భర్తకు ప్రసాద్ తో పరిచయం లేదు. తను చెప్పలేదు. వ్యాపారపరంగా సంబంధం లేదు.
పోనీ ప్రసాద్ గొప్పవాడు కాబట్టి పరిచయమయ్యాడనుకుందుకూ లేదు. అతడు సామాన్యుడు.
అతడి మొత్తం యిల్లంతా కలిసి నిర్మల బెడ్రూం మంత లేదు.
మరి తన గురించి భర్తకేలా తెలిసింది?
అనుకోకుండా తన నతడు చూసి వెంటపడి వచ్చాడా? లేక బ్లాక్ మేయిలరే అతడి నిక్కడకు రప్పించాడా?
అయితే బ్లాక్ మేయిలరలా ఎందుకు చేస్తాడు? అతడికి తననించి డబ్బు కావాలి. భర్త యిక్కడకు వస్తే తనని చూస్తె -- అసలుకే మోసం వస్తుంది.
నిర్మల భర్తనే చూస్తోంది.
ఆమె చూస్తుండగా అతడా గది దాటి వెళ్ళాడు.
నిర్మల క్షణం కూడా ఆలస్యం చేయకుండా బీరువా వెనుక నుంచి బైటపడి దొడ్డి గుమ్మం దారిన వెనక్కు వెళ్ళిపోయింది.
4
గుమ్మానికి దగ్గరలో పడి వుందొక యెర్ర చీర.
ఆ చీరను గుర్తుపట్టాడు గోపీచంద్.
ఆ చీరనే ధరించి నిర్మల ఆ యింట్లో ప్రవేశించింది.
ఆమె వంటి మీదుండాల్సిన చీర - నేలమీద పడుంది.
గోపీచంద్ శరీరంలో ఆవేశం ప్రవేశించసాగింది.
చీరకు కాస్త దూరంగా - లోదుస్తులు ....
గోపీచంద్ ఆవేశం పెరిగింది.
అంటే - శ్రేయోభిలాషి నంటూ అతడెవరో చెప్పిన దాంట్లో యిసుమంత కూడా అబద్దం లేదు.
నిర్మల బరి తెగించింది.
తను నిర్మల కేమన్యాయం చేశాడు.
ఆస్తి, హోదా అన్ని యిచ్చాడు. సమాజంలో ఆమెకు ప్రత్యేకమైన గౌరవస్థానం కల్పించాడు.
ప్రతిఫలంగా ఆమె భర్తకే అన్యాయం చేస్తుంది.
బహుశా తానితర స్త్రీలతో తిరుగుతున్నందుకు ప్రతీ కారంగా ఆమె ఆ పని చేస్తుందేమో! అలాంటప్పుడు తనకా విషయం చెప్పొచ్చుగా?
ఏమో - తన ఆవేశానికి భయపడిందేమో!
"నిర్మలా! నా ఆసలయిన అవేశాన్నిప్పుడు చూస్తావు. నీ యీ తప్పును నేను క్షమించను" అనుకుంటూ గోపీచంద్ ఓ అడుగు ముందుకు వేశాడు.
అప్పుడతడికి గది లోపలి భాగం స్పష్టంగా కనబడుతోంది.
మరీ అంత చిన్న గది కాదు.
గోడ వారకూ కిటికీ కి దగ్గరగా వుందొక మంచం.
నాలుగున్నరడుగుల వెడల్పు, ఆరడగుల పొడవు వుంటుందా మంచం.
కిటికీ తలుపులు వేసున్నాయి. కాని పయిన అద్దాలుండటం వల్ల గదిలోకి వెలుతురూ వస్తుంది.
ఆ అద్దాల వెలుతురులో మంచం మీద పడుకున్న యువతి స్పష్టంగా కనబడుతోంది.
ఆమె వంటి మీద దుస్తులు లేవు.
అటుగా తిరిగి పడుకుని ఉంది.
నల్లని కురులామే వీపును కప్పేశాయి.
అంతకు మించి ఆమెను కప్పడాని కింకేమీ లేదు.
గోపీచంద్ ఆమెనే చూస్తున్నాడు.
తన భార్య - నిర్మల - పరాయింట్లో యిలా -
ఛీ ...ఛీ ....
అతడి ఆవేశం ఉదృతమైంది.
ఆమె వీపుకు బాగా దిగువున నల్లని పుట్టుమచ్చ....
గోపీచంద్ ఆ పుట్టుమచ్చను గుర్తించాడు.
ఆవేశం పెల్లుబికిందతడిలో--
జేబులోంచి రివాల్వర్ తీసి గురిచూసి ఆమెను కాల్చాడతడు.
గుండామె వీపును తాకింది. రక్తం ఒక్కసారిగా చిమ్మింది.
గోపీచంద్ మరోసారి రివాల్వర్ పేల్చి వెనక్కి తిరిగాడు.
అతడి ఆవేశం కాస్త తగ్గింది.
తనేం చేశాడో అతడికి తెలుసు.
చేసిందాని కతడిలో విచారం లేదు. తప్పు తన నంట కుండా తప్పించుకోవాలని అతడి తపన. అందుకతడికి ఆవేశం నిదానంగా మారింది.
అతడు రివాల్వర్ ను జేబులో వేసుకున్నాడు.
ఆ గదిలోంచి బయటపడి బీరువా ఉన్న గదిలోకి వచ్చాడు.
రుమాలు తీసి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు.
అప్పుడతడికి అడుగుల చప్పుడు వినబడింది.
ఇంట్లో నిర్మల ప్రియుడెక్కడో ఉండే ఉంటాడు. రివాల్వర్ చప్పుడు విని అతడు వస్తాడు. తన్ను చూస్తాడు.
ఇప్పుడు గోపీచంద్ కి ఆవేశం స్థానంలో భయం ప్రవేశించింది.
అతడు చటుక్కున బీరువా చాటుకు వెళ్ళాడు.
వీలు చూసుకుని ఇంటిలోంచి పారిపోవాలి.
అవసరమైతే నిర్మల ప్రియుణ్ణి కూడా చంపేయాలి.
గోపీచంద్ ఆలోచిస్తున్నాడు.
నిర్మల అతణ్ణి ఏకాంతంలో కలుసుకుందుకు వచ్చింది. అంటే ఇంట్లో అతడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు.
తాను అతణ్ణి కూడా హతమార్చితే - నిర్భయంగా పారిపోవచ్చు.
గోపీచంద్ కి అడుగుల చప్పుడు దగ్గరయింది.
అతడు బీరువా చాటు నుంచి బయటకు వచ్చి -
"హేండ్సప్" అన్నాడు . అప్పుడు గోపీచంద్ చేతిలో రివాల్వరుంది.
కానీ గోపీచంద్ ఎదుట నిలబడి ఉన్నది సామాన్యుడు కాడు.
పోలీసు యూనిఫాం లో ఉన్నడొక వ్యక్తీ.
"మిస్టర్! రివాల్వర్ దించు. నువ్వు నన్నేమీ చేయలేవు. ఇంటి చుట్టూ పోలీసులున్నారు...." అన్నాడతడు.
"ఇంటి చుట్టూ పోలీసులా -ఎందుకు ?"
"ఈ యింట్లో స్మగ్లింగ్ జరుగుతోందని మా కిప్పుడే కబురొచ్చింది ."
