గోపీచంద్ బుర్ర చకచకా పని చేసింది.
ఎదురుగా పోలీసాఫీసరు...
ఇంటి చుట్టూ పోలీసులు....
ఇప్పటికే ఈ ఇంట్లో తానొక హత్య చేశాడు.
ఈ పోలీసాఫీసర్ని చంపినా తాను పోలీసుల బారి నుండి తప్పించు కాలేడు. ఆ తర్వాత చేతులకు సంకెళ్ళు .... కటకటాల వెనుక జీవితం....
పేపర్ లో తన గురించిన వార్తలు....
ఒకరోజున తనకు ఉరిశిక్ష....
"నో!" అంటూ అరిచాడు గోపీచంద్.
"మిస్టర్ - మర్యాదగా లొంగిపో " అన్నాడా వ్యక్తీ.
"ఇన్ స్పెక్టర్ - లొంగిపోయే ముందు నాదో చిన్న మనవి. నేను నేరస్తుడ్ని కాదు- హంతకుణ్ణి కాదు. ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా భార్య నన్ను మోసం చేసి పరాయి మగాడితో విచ్చలవిడిగా తిరుగుతుంటే ఆవేశం చంపుకోలేక ఆమెను హత్య చేశాను. ఆదామెకు తగిన శిక్ష అని నా అభిప్రాయం. అయితే చట్టం నన్నిందుకు క్షమించదు. ఇంతకాలం ఎంతో పరువుగా, పేరు ప్రతిష్టలతో బ్రతికాను. ఇప్పుడు నేరస్తుడిగా కటకటాల వెనుక నా జీవితాన్నంతం చేసుకులేను. అందుకే ఇప్పుడే ఈ క్షణమే నన్ను నేనంతం చేసుకుంటాను. నా కధ పదిమంది మనసులూ కరిగించాలి. నా భార్యను ప్రపంచమంతా వేలెత్తి చూపి నిందించాలి. ఇంతే నేను మిమ్మల్ని కోరేది!"
గోపీచంద్ ఇక మాట్లాడలేదు. అతడు రివాల్వర్ నుదుటికి గురి పెట్టుకుని తన్ను తాను కాల్చుకున్నాడు.
5
"ఊ" చెప్పు - తర్వాతేం జరిగింది?" అంది నిర్మల.
"ఏం జరుగుతుంది? నా యింట్లో నీ ఫోటో, ప్రేమ లేఖలు చూశాక నా భార్య నన్ను సాధించడానికి బదులు - నిన్ను సాధించమని వేదించసాగింది. జరిగిందేదో జరిగిపోయింది- అందుకు మిమ్మల్ని క్షమిస్తున్నాను- కానీ ఈ ఉత్తరాలతో మనకు బంగారు గ్రుడ్లు పెట్టె బాతు దొరికింది -- ఉపయోగించుకుని మన అంతస్తు పెంచుకుందామంటుందామె. నేనెంత చెప్పినా వినలేదు సరికదా - నాకు తెలియకుండా మనకు సంబంధించిన ఫోటోలు , ఉత్తరాలు కొన్ని తను రహస్యంగా దాచిపెట్టి - నేను పూనుకోక పొతే తనకు తెలిసిన వారి ద్వారా నిన్ను సాధిస్తానంది. మన వ్యవహారం మరో వ్యక్తీ చేతుల్లో పడటం నా కిష్టం లేదు. అందుకే బాగా అలోచించి మాస్టర్ ప్లాన్ వేశాను...." అన్నాడు ప్రసాద్.
"ఊ"
"మీవారు ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి అయన గురించి చాలామందికి తెలుసు. అయన మనస్తత్వాన్ని బాగా స్టడీ చేయగలిగానా విధంగా. తర్వాత బ్లాక్ మేయిలర్నయి నీకూ ఆయనకూ ఫోన్ చేశాను. ఒకేలాంటి రెండు చీరలు కొని- ఒకటి నీకు పంపాను. రెండో చీరను నీ భర్త ఆవేశం రెచ్చ గొట్టడాని కుపయోగించాను. ఆ సమయంలో నిద్ర మాత్రలతో నిద్ర పోతోంది. నా భార్య ఆమెకు లేని పుట్టుమచ్చ నేర్పరచి అతడి కళ్ళ బడేలా చేశాను...."
"ఊ"
'అతడామెను హత్య చేసి బీరువా వెనుక నక్కితే - పోలీసాఫీసరు వేషంలో భయపెట్టాను. నిజానికి నేను పెద్ద రిస్కే తీసుకున్నాను. ఇంటి చుట్టూ పోలీసులున్నారని అబద్దం చెప్పాను. అయినా అయన నన్ను చంపి మళ్ళీ పారిపోవచ్చు. కానీ అదృష్టవశాత్తు అంతా నేననుకున్నట్లే జరిగింది. అతడు తన్ను తాను కాల్చుకోగానే నేను పోలీసు దుస్తులు మార్చి - మామూలు వేషంతో హడావుడిగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి - ఎవరో వ్యక్తీ నా భార్యను కాల్చి తన్ను తాను కాల్చుకున్నాడంటూ కధ చెప్పాను."
'అంటే నిజానికి నీవు రెండు హత్యలు చేసినట్లు ...." అంది నిర్మల సాలోచనగా.
"కావచ్చు అయితే తాను తప్పుదారిన నడుస్తూ తన భార్య పొరపాటు చేస్తే కాల్చి చంపాలనుకునే ఆవేశ పరుడి చేతిలో -- సుఖంగా కాపురం చేసుకుంటున్న ఓ యిల్లాలి జీవితంలో నిప్పులు పోయాలనుకునే మరో ఆడది చచ్చేలా చేశాను. నీ భర్త వల్ల నీకేరోజైనా ప్రమాదముంది. నా భార్య వల్ల- ఏనాడైనా ఎవరికైనా ప్రమాదముండొచ్చు. నేను చేసింది మంచో చెడో నాకు తెలియదు. కానీ నీకోసం, నిన్ను నా కోసం దక్కించు కోవాలన్న స్వార్ధం కోసం చేశాను. నువ్వు నన్నర్ధం చేసుకుని క్షమించ గలిగితే సరే! లేదా - నువ్వు నన్ను క్షమించే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. నిన్ను కాదని మరో యువతిని పెళ్ళాడి ఓ తప్పు చేశాను. రెండోసారి అలాంటి తప్పు చేయను...."
నిర్మల ఆలోచిస్తుంది---
గోపీచంద్ , ప్రసాద్ భార్యల చావుకి కారణమేమిటి? వారి మనస్తత్వమా - ప్రసాద్ పదకమా?
చనిపోయేముందు గోపీచంద్ ప్రసాద్ తో - తన భార్యను కులటగా ప్రచారం చేయమని కోరాడు. ఆ సమయంలో తన లోపం గురించి అతడాలోచించినట్లే లేదు. అలాంటి వాడి చేతిలో ఈ రోజు కాకపోతే మరో రోజైనా తాను చావాల్సిందే!'
ఆరునెలల తర్వాత వారిద్దరికీ మళ్ళీ వివాహం జరిగింది.
గుండె జబ్బుతో బాధపడుతున్న ప్రసాద్ తండ్రి వధూవరుల నెంతో ఆప్యాయంగా - కలకాలం సుఖంగా జీవించమని దీవించడానికి - ఆ పెళ్ళికి వచ్చాడు.
***
