ఉత్తరంలో ఉపాయం
జొన్నలగడ్డ రామలక్ష్మీ
నిర్మల రిసీవరేత్తి - "హలో !" అంది.
"మాట్లాడేది నిర్మలేనా?" అందవతలి గొంతు.
ఆ గొంతు పురుషుడిదేనని తెలుస్తోంది కానీ ఎవరో తెలియడం లేదు. కావాలని గొంతు మార్చి బొంగురుగా మాట్లాడుతున్నాడతను.
"అవును నువ్వెవరు?" అంది నిర్మల.
"నీ గుండెల్లో రాయిని--" అందా గొంతు.
'అంటే?"
"నీకు పెళ్ళయింది . నీ భర్త గోపీచంద్ లక్షాధికారి. సమాజంలో అతడికి పేరు ప్రతిష్ట లున్నాయి. అతడి కారణంగా నీకూ గౌరవముంది -"
'అయితే ?"
"నేను తలచుకుంటే క్షణంలో నీ బ్రతుకు నడి బజారు పాలు చేయగలను -" అందా గొంతు.
"ఎవరునువ్వు ?" అంది నిర్మల.
"నీకూ ప్రసాద్ కి ఉన్న సంబంధం -- అనగా పెళ్ళికి ముందున్న సంబంధం -- నాకు తెలుసు -"
అప్పుడు నిర్మల గుండెల్లో నిజంగానే రాయి పడింది.
"మీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు -- ఒకరి కొకరు రాసుకొన్న ఉత్తరాలు నా దగ్గిరున్నాయి...."
"ఏం కావాలి నీకు?" అంది నిర్మల.
"లక్ష రూపాయలు ...." అన్నాడతడు.
'అంత డబ్బు నేనెక్కడి నుంచి తేగలను ?"
"నీ యింట్లోంచి !"
"ఒక్కసారి లక్షరూపాయలు తెచ్చే శక్తి నా దగ్గిర లేదు...."
"అయితే నీ రహస్యం నీ భర్తకు తెలుస్తుంది ...."
"వద్దు --" అంది నిర్మల.
"అయితే లక్ష రూపాయలు తెచ్చి నాకివ్వు "-- అన్నాడతడు.
"ప్లీజ్ -- ఇంకేదైనా ఉపాయం చెప్పు -" అందామె.
"ఒకే ఒక్క ఉపాయం చెప్పగలను. ఆ తర్వాతింకో ఉపాయం చెప్పమని అడక్కూడదు--"
"ముందు నీ ఉపాయం చెప్పు...."
'చెబుతాను . కానీ ఈ ఉపాయం నీకు నచ్చకపొతే - వెంటనే నాకు లక్ష రూపాయలు తెచ్చివ్వాలి...."
"ముందు నీ ఉపాయం చెప్పు ...."
"అదంత సులభంగా చెప్పను. దానికో తంతుంది ...."
"ఊ"
'సాయంత్రం నాలుగింటికి నీ యింటికో కుర్రాడోస్తాడు. వాడి చేతిలో ఓ పోలితీన్ బాగుంటుంది తీసుకో. వాణ్ణించి నీ కింకే వివరాలూ లభించవు. ఆ సంచీలో ఓ ఎర్ర చీరటుంది. ఆ చీరకు మ్యాచింగ్ జాకెట్ నీ దగ్గిరుందని నాకు తెలుసు. రెండూ వేసుకో. తిన్నగా ప్రసాడింటికి రా...."
'అక్కడికేందుకు ?"
"ప్రసాదంటే నీకు నమ్మకమని నాకు తెలుసు . నేనక్కడ నీ కుపాయం చెబుతాను ...."
"ఎలా ?"
"మనిషిని కనపడను. గదిలో టీపాయ్ మీద నీ కోసం ఓ కవరు పెడతాను. ఆ కవర్లో ఉత్తరం ఉత్తరంలో ఉపాయం...."
"ఏమిటా ఉపాయం ?"
"అడప్పుడే ఎలా తెలుస్తుంది ? నేను చెప్పినట్లు చేయి...."
'చేయకపోతే ?"
"నీ బ్రతుకు నడిబజారు పాలు..."
"నువ్వక్కడ నామీద అఘాయిత్యం చేస్తే ?"
"ఫోన్ లో ఆమెకు నవ్వు వినిపించింది.
"నిర్మలా! ఈ ప్రపంచంలో ఏదైనా డబ్బు తర్వాతనే! ఆఖరి కాడది కూడా! ఈ రహస్యం తెలిసిన నా కాడదంటే ఆకర్షణ లేదు. డబ్బును నమ్ముకున్న వాడెవ్వడు స్త్రీ వ్యామోహానికి గురికాడు. నీకు నమ్మకంగా ఉంటుందనేగా ప్రసాద్ ఇంట్లో మన సమావేశం ఏర్పాటు చేశాను...."
"ఇంతకీ నువ్వెవరు ?"
"అది తెలుసుకొందుకు ప్రయత్నించకు. నీలాంటి ప్రేమికులు నాకొక వరం. నీవంటి వారి తొందరపాటు నా ధనం --"
అవతల క్లిక్ మంది.
నిర్మల రిసీవర్ క్రెడిల్ చేసింది. ఆమె ముఖం నిండా చెమటలు, వళ్ళంతా వణుకు.
ఏం జరుగుతుందిప్పుడు ?
ఆమె సామాన్య మధ్యతరగతి యువతి. ప్రసాద్ ను ప్రేమించింది. వారి ప్రేమ చాలా దూరం వెళ్ళింది. ఒకే ఊళ్ళో ఉంటూ కూడా ఒకరి కొకరు ఉత్తరాలు రాసుకునే వారు. తరచూ సినిమాలకు వెళ్ళేవారు. పార్కుల్లో కలుసుకునేవారు.
చివరకు పెళ్ళికి ముందు వరకూ ఉండాల్సిన దూరం కూడా ఉంచలేదు.
తల్లిదండ్రులీ విషయం గ్రహించి కంగారు పడి - ప్రసాద్ తో పెళ్ళి మాటలు కదిపారు.
ప్రసాద్ తలిదండ్రులు బాగా కట్నమడిగారు.
నిర్మల ప్రసాద్ ని నానామాటలూ అంది.
"నేను స్వతంత్రుడిని. నా తలిదండ్రులను కాదని నిన్ను పెళ్ళి చేసుకొందుకు సిద్దంగా ఉన్నాను. అయితే నా తండ్రికి నెలరోజుల క్రితమే హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన్ను దాన్నించి తెరుకోనీ -- " అన్నాడతడు.
కట్నమడగడాని కడ్డు రాని హార్ట్ టాక్ -- కట్నం లేని పెళ్ళి కడ్డు వస్తోంది.
నిర్మల చేసిది లేక ఊరుకుంది.
ఆ సమయంలో గోపీచంద్ నుంచి కబురు వచ్చింది.
అతడామె నేదో పెళ్ళిలో చూశాడు. ఆమె అతడికి నచ్చింది. వివరాలు సేకరించాడు. తమ కులం పిల్లేనని తెలిసింది.
కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటానన్నాడు.
సంబంధం ఎంత మంచిదంటే నిర్మలకు కాళ్ళూ చేతులూ కట్టయినా సరే ఈ సంబంధం చేయాలని తలిదండ్రులనుకున్నారు.
నిర్మలకు ప్రసాద్ అంటే కసిగా ఉండడం వల్ల -- ఆలాంటవసరం లేకుండానే ఈ పెళ్ళి చేసుకుంది.
నిర్మల పెళ్ళి అయిపొయింది.
ఆ తర్వాత ఆర్నెల్లకు ప్రసాద్ పెళ్ళి అయిపొయింది.
నిర్మల్ ప్రసాద్ ను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది. చాలావరకూ అందులో కృతకృత్యురాలయింది కూడా.
గోపీచంద్ మంచివాడు. భార్యంటే అతడి కిష్టం. అయితే అతడావేశపరుడు. చాలా తొందరగా అతడి క్కోపం వచ్చేస్తుంది. ఆవేశంలో అతడెంతపనయినా చేసి ఆ తర్వాత పశ్చాత్తాపపడతాడు.
ఒకాసారతడు పనివాళ్ళ ముందు భార్య మీద చేయి చేసుకున్నాడు.
నిర్మల రోజంతా ఏడ్చింది.
జరిగిన పొరపాటుకు -- ఆవేశం తగ్గేక గోపీచంద్ కూడా బాధపడి - "కావాలంటే పనివాళ్ళ ముందే నిన్ను క్షమార్పణ కోరుకుంటాను" అని అన్నంత పని చేశాడు.
నిర్మల నొచ్చుకుని- "అడుసు తొక్కనేల - కాలు కడుగ నేల " అంది బాధగా.
"అది నా అసహాయత . అందుకే నువ్వింట్లో అడుసుంచకు" అన్నాడతడు.
"అంటే?" అంది నిర్మల.
"నలుగురు ముందూ నన్ను రెచ్చ గొట్టకు. నేనేమన్నా భరించు. అదే మనిద్దరి పరువూ నిలబెడుతుంది" అన్నాడతడు.
"మీ పరువు నిలబెట్టడం కోసం నా పరువు గురించి కూడా చూసుకోను" అంటూ హామీ ఇచ్చింది నిర్మల అతడికి.
"పరువు మాటల్లో లేదు. డబ్బులో ఉంది. నీ పరువును పెంచడానికి నేను డబ్బిస్తాను " అన్నాడతడు.
భార్య పేరున అకౌంట్స్ ఓపెన్ చేసి - వాటిలో అయిదు లక్షలు వేశాడు. తన యావదాస్తికి ఆమె ఏకైక వారసురాలని విల్లు రాశాడు.
ఈ కారణాల వల్ల నిర్మల భర్తను ప్రేమించడం మొదలెట్టింది. అతడి నర్దం చేసుకుందుకు ప్రయత్నించసాగింది.
నలుగురిలో చిన్నబుచ్చే అతడి ఆవేశం కాస్త యిబ్బంది కరంగానే వున్నా క్రమంగా మనస్పూర్తిగా భరించడం నేర్చుకుంది.
ఇప్పుడీ టెలిఫోన్ కాల్....
లక్ష రూపాయలు బ్లాక్ మెయిలర్ కివ్వాలి.
అకౌంట్ ఆమె పేరునే ఉన్నప్పటికీ తన డబ్బు మీద వచ్చే వడ్డీని మాత్రామే చిల్లర ఖర్చులకు పాకెట్ మనీగా వాడుకోమని అతడామెకు సలహా యిచ్చాడు.
'అర్ధాంతరంగా నాకేదయినా అయితే వెంటనే నీకే యిబ్బంది కలక్కూడదనీ ఈ డబ్బు నీ పేరున అకౌంట్లో వేశాను. ఇది నువ్వు వాడుకుందుకు కాదు. నీ కనీవసరాలన్నీ నేనే భరిస్తాను. బయట షాపింగు లో నీకయ్యే ఖర్చులన్నీ బిల్లుల రూపంలో నాకే - వస్తుంటాయి. అయినప్పటికీ నాకు తెలీకుండా ఇంకా నీకు చిల్లర ఖర్చులుంటే ఈ అయిదు లక్షల మీదా వచ్చే వడ్డీ డబ్బును వాడుకో -"
ఇది భర్త సలహా కాదు అజ్ఞా!
నిజానికి తనకు డబ్బవసరం లేదు. అన్ని అవసరాలు భర్త ద్వారా తీసుకునే వున్నాయి.
ఇప్పుడు భర్తకు తనకూ, ప్రసాద్ కూ ఉన్న సంబంధం గురించి తెలిస్తే కొంప మునిగి పోతుంది.
ఈ వైభవ ముండదు. ఈ సుఖముండదు.
ఆన్నింటికీ మించి ప్రసాద్ కు కూడా వివాహమైంది.
తన జీవితం బజారు పాలయితే ఆదరించే నాధుడు కూడా ఉండడు.
ప్రసాద్ మీద నిర్మలకు నమ్మకముంది. ఆ యింట్లో తన మీద ఏవిధమైన అఘయిత్యమూ జరగదని ఆమె నమ్మకం. అందుకే ఆమె అతడింటికి వెళ్ళాలనే అనుకుంది.
అయితే ఈ బ్లాక్ మెయిలర్ కి తన గురించిన వివరాలన్నీ ఎలా తెలిశాయి? అతడు తనని ప్రసాదింటికి రమ్మని ఎందుకన్నాడు?
ఇందులో ప్రసాద్ పాత్ర గానీ లేదు కదా?
'ఉన్నప్పటికీ అతడికి భయపడనవసరం లేదు. అతణ్ణి నేను చీవట్లేయగలను " అనుకుంది నిర్మల.
బ్లాక్ మెయిలర్ చెప్పిన ప్రకారం సరిగ్గా సాయంత్రం నాలుగింటికో కుర్రాడోచ్చి ఆమెకో ప్యాకేట్టిచ్చి వెళ్ళి పోయాడు. వాడి నడిగితే ఆమెకే వివరాలూ లభించలేదు.
ప్యాకట్ లో చీరతో పాటు ప్రసాద్ ఆమె భుజం మీద చేతులు వేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్న ఫోటో కాపీ నిర్మలతడికి రాసిన ఉత్తరానికి జిరాక్స్ కాపీ ఉన్నాయి. చిన్న కాగితం మీద- "నీ నమ్మకానికి శాంపిల్ గా " అని వ్రాసి ఉంది.
వాటి విషయ మెలాగున్నా -- "చీర మాత్రం చాలా బాగుంది" అని ఆమె అడమనసు మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
2
"హలో!" అన్నాడు గోపీచంద్.
"గోపీచంద్ గారేనా ? నమస్కారం " అందవతలి గొంతు.
"నమస్కారం - ఎవరు మీరు?"
"మీ శ్రేయోభిలాషిని ."
"అంటే?"
"మీ భార్యకు తలదన్నే అందగత్తెను పరిచయం చేస్తాను. మీరు మీ భార్యను విడిచి ఆమెను పెళ్ళి చేసుకుంటే సంతోషిస్తాను."
"ఎవర్నువ్వు?" కోపంగా అన్నాడు గోపీచంద్.
"చెప్పానుగా -- మీ శ్రేయోభిలషిని !" అందవతలి గొంతు.
'ఇంతకీ నువ్వు చెప్పదలచుకున్న దేమిటి?"
"మీ భార్య కులట ..."
"షటప్ " అన్నాడు గోపీచంద్.
"నా మాట మీద మీకు నమ్మకం లేకపోతె - ఒక్క అరగంటాగి బయలుదేరండి. నేను చెప్పిన చిరునామాకు వెళ్ళండి. కాస్త దూరంగా నిలబడితే నేను చెప్పినిల్లు దొడ్డి గుమ్మం మీకు కనబడుతుంది. కాసేపటిలో ఆ దొడ్డి గుమ్మం ద్వారా మీ భార్య ఆ యింట్లో ప్రవేశిస్తుంది. వెంటనే వెళ్ళిపోకుండా కాసేపాగి ఆ దొడ్డి గుమ్మానే మీరు లోపలకు వెళ్ళండి. మీ భార్య అసలు స్వరూపం కంటబడుతుంది " అందవతలి గొంతు.
"ఏయ్ మిస్టర్ - ఎవర్నువ్వు ?"
"నేను మీ శ్రేయోభిలషిని. అవసరం వచ్చేక నేనే మీ కంటపడతాను. ప్రస్తుతానికి నేను చెప్పిన అడ్రసు రాసుకోండి. టైము నోట్ చేసుకోండి ...."అందవతలి గొంతు.
"నువ్వు నా శ్రేయోభిలాషివి కాదు" అంటూనే గోపీచంద్ అతడు చెప్పిన అడ్రస్ నోట్ చేసుకున్నాడు.
"మీరంటే నాకెంతో గౌరవం . అందుకే మీరు నన్ను నువ్వన్నా నేను మిమ్మల్ని మీరనే అంటున్నాను...." అందవతలి గొంతు.
ఆ తర్వాత క్లిక్ మన్న చప్పుడు విని ఫోన్ క్రింద పెట్టేశాడు గోపీచంద్.
అప్పుడతడి బుర్ర చకచకా పని చేయసాగింది.
ఎవరో తన భార్య మీద అభియోగం చేస్తున్నారు. ఎందుకు ?
అతడు నిజంగా శ్రేయోభిలాషా లేక తన సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నాడా!
గోపీచంద్ వెంటనే యింటికి ఫోన్ చేశాడు.
పనివాడోకడు అవతల ఫోనందుకున్నాడు.
'అమ్మగారు బయటకు వెళ్ళారు" అని సమాధానం వచ్చింది.
