Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 19


    వెంకన్న బెదిరింపుకు రామ్మూర్తి భయపడ్డాడు. అతడు వెంటనే-"నా బుద్ధి మంచిదికాదు. అందమైన ఆడపిల్లల వెంటపడడం నా అలవాటు. చాలామంది నాకు లొంగిపోవడంవల్ల నా ధైర్యం పెరిగింది. వసంత చేతిలో నేను పరాభవం చెందాను. అంతటితో ఆమెను మర్చిపోవాలనుకున్నాను. కానీ శ్రీకాంత్ నన్నుపయోగించుకోవాలనుకున్నాడు. సుబ్బారావు హత్య కేసుకో కొత్తమలుపు తేవాలనుకున్నాడతడు. అనుమానం వసంతమీదకే మళ్ళించాలని అతడి ఆశయం. గతంలో పరాభవంచెంది ఉన్న మూలాన నేనూ అందుకంగీకరించాను" అన్నాడు.
    "మరి-అందువల్ల నువ్వు ప్రమాదంలో పడతావనీ-హత్య కేసులో ఇరుక్కుంటాననీ భయపడలేదా?" అన్నాడు వెంకన్న.
    "శ్రీకాంత్ నాకు హామీ యిచ్చాడు...."
    "హామీని నమ్మి-ప్రాణాల మీదకు తెచ్చుకున్నావంటే నమ్మశక్యంకాదు. నువ్వు నిజంగా సుబ్బారావుని హత్యచేశావు...."
    శ్రీకాంత్ గురించి సుధాకర్ చెప్పిన నిజాన్నే రామ్మూర్తి కూడా చెప్పడానికెంతోసేపు పట్టలేదు. రామ్మూర్తి మద్యం రుచిమరిగి శ్రీకాంత్ చెప్పినట్లు విన్నాడు. ఆ మద్యం రుచి అలాంటిది!
    వెంకన్న సరాసరి శ్రీకాంత్ ని కలుసుకున్నాడు.
    "నగరంలో పలువురిని మత్తు పదార్ధాల కలవాటు చేస్తున్నారని మీమీద ఆరోపణలున్నాయి. అందుకు ఋజువులు, సాక్ష్యాలు ఉన్నాయి-" అన్నాడు వెంకన్న.
    శ్రీకాంత్ చలించలేదు-"మత్తు పదార్ధాల గురించిన మీ ఆరోపణ తప్పు నా దగ్గర పాతకాలంనాటి విదేశీ మద్యాలున్నాయి. మద్యం అలవాటైన వారికి తప్ప వాటి రుచి అర్ధంకాదు. అందులో యేవిధమైన మత్తు పదార్ధాలు కలుపబడలేదు. ఆ మద్యాలకోసమే చాలామంది నాతో స్నేహం చేస్తున్నారు. ఆ మద్యాలను నేనేమీ రహస్యంగా దాచలేదు. వాటి శాంపుల్సు-ఎప్పుడైనా యెవరైనా పరీక్షించవచ్చు. నేను నా స్నేహితులతో మద్యం తీసుకునే సమయంలో కూడా యెవరైనా వచ్చి-మేము పుచ్చుకునే మద్యాన్ని పరీక్షించుకోవచ్చు-" అన్నాడు ధైర్యంగా.
    వెంకన్న మద్యం శాంపిల్సు తీసుకున్నాడు శ్రీకాంత్ వద్ద వాటిలో యేవిధమైన మత్తుపదార్ధాలూ కలవలేదని అతడికి ఋజువయింది. మరి?
    శ్రీకాంత్ సుబ్బారావుని హత్యచేయడానికి కారణమేమిటి? అది  తెలిసేదాకా తను శ్రీకాంత్ నేమీ చేయలేడు.
    అయితే వెంకన్న అట్టే శ్రమపడకుండానే కారణమతన్ని వెతుక్కుంటూ వచ్చింది-రిజిస్టర్డు లేటరు రూపంలో!
    ఉత్తరం ప్రవీణ్ కుమార్నించి-సుబ్బారావుకి!
    ప్రవీణ్ కుమార్ పేరిటవచ్చే ఉత్తరాలన్నీ తనింట్లో డెలివరీ చేయించే ఏర్పాటు చేశాడు వెంకన్న.
    ఉత్తరంలో-
    "డియర్ సుబ్బారావు!
    నేను మద్యానికి దాసుడినన్న కిటుకు శ్రీకాంత్ పట్టేశాడు. నా నుంచి రహస్యాలు లాగడానికి కతడు నన్ను వాళ్ళింటికి పిలిచేవాడు. నేను మోసం గ్రహించడానికి కొంతకాలం పట్టింది. శ్రీకాంత్ ననుమానించేక చేసేదేముంది? మద్యం నా బలహీనత, ఆ బలహీనతను జయించకపోతే నా వృత్తికి న్యాయం చేకూర్చలేను. నీకా విషయం చెబితే నువ్వు నాకోసం ప్రత్యేక పరిశోధనలు కావించావు!
    అసలు ఆల్కహాల్సుకి సంబంధించిన నీ పరిశోధనల వివరాలు పేపర్లో రాబట్టి నాకు నీ గురించి తెలిసింది. మద్యం పుచ్చుకునేవాడు-ఆ రుచిన ఎంజాయ్ చేస్తూ తన్ను తాను మరిచి పోకుండా ఉండడానికి బెంజాయిడ్, అజిపిన్సు, వాలియం, లిబ్రియమ్ ల నుంచి లభించే కొన్ని డ్రగ్సు సాయపడతాయనీ-వీటిపై లోతుగా పరిశోధించడానికి భయపడుతున్నట్లూ ఒక సైంటిఫిక్ మాగజైన్లో వ్రాశావు. కారణం-నీ పరిశోధన మధ్యపన్ని ప్రోత్సహిస్తుంది. నువ్వు కనిపెట్టే డ్రగ్ మనిషెంత మద్యం పుచ్చుకున్నా-పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించేలా చేస్తుంది. మనిషిని తన్నుతాను మరిచిపోకుండా చేస్తుంది. కానీ మద్యంవల్లనుండే ఇతర ప్రమాదాలను నివారించదు.
    నీ వ్యాసం చదివి నీతో పరిచయం పెంపొందించుకున్నాను. నాకోసం పరిశోధన కొనసాగించమన్నాను. మన పరిశోధనలు రహస్యంగా ఉంచమన్నాను. నువ్వు తయారుచేసిన డ్రగ్ సత్ఫలితాలనిచ్చింది. శ్రీకాంత్ ఇచ్చే మద్యం రుచిని ఎంజాయ్ చేస్తూ కూడా నేను-అతడికి నా రహస్యాలను చెప్పకుండా - అతడి రహస్యాలను లాగగలిగాను. నేను మత్తులో ఉన్నానన్న భ్రమ అతడికి కలిగించాను. అతడికి తప్పుడు సమాచారాన్నందించాను. ఫలితంగా ఓ పెద్ద ముఠా కొద్ది రోజుల్లో బైటపడుతుంది. అందుకు నీకే అభినందనలు.
    ఒక్క విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. శ్రీకాంత్ తో నీ కాట్టే పరిచయంలేదు. అతడికో బలహీనక్షణంలో నీ డ్రాగ్ గురించి చెప్పేశాను. అతడికి విషయం తెలిసిపోయింది. అందుకే నేనికన్నించి మకాం ఎత్తేశాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పగ నా మీదే కానీ నీమీద వుండదని నా నమ్మకం. అయినా యెందుకైనా మంచిదికదా!
    మనం మళ్ళీ కలుసుకుందాం. విలువైననీ పరిశోధన ఫలితాలను-ఇంకా పబ్లిక్ చేయకూడదని నీవనుకుంటే అది నీ యిష్టం. నువ్విచ్చిన డ్రగ్ ఇంకా నా దగ్గరుంది. అదయ్యాక మళ్ళీ నీ కుత్తరం రాస్తాను.
    శ్రీమతి వసంత భోజనం రుచి శ్రీకాంత్ మద్యాల రుచిని మించింది. ఆమెకు నా అభినందనలు, ధన్యవాదాలు చెప్పు.
    ఇప్పట్లో మనం కలుసుకునే అవకాశం లేదు. ప్రస్తుతానికి నేను నా అడ్రసు కూడా ఇవ్వలేను. నీకీ ఉత్తరమందాక రెండు నెలల్లో ఓ పెద్ద ముఠా బైటపడుతుంది. అది నీ డ్రగ్ మహత్యమే!
    సెలవు                                                                               నీ
                                                                                     ప్రవీణ్ కుమార్ -"

    ఉత్తరం చదవగానే-వెంకన్నకు జరిగిందేమిటో అర్ధమయింది. ఉత్తరం ప్రవీణ్ కుమారీ ఊళ్ళో ఉండగానే రాశాడు. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకి రిజిస్టర్డు లెటరు.
    అది చేరడానికింతకాలం పట్టింది.
    వెంకన్న ఉత్తరం చడివి పెద్దగా అరిచాడు. ఆ అరుపువిని కంగారుగా లోపల్నుంచి అతడి భార్య పద్మావతీదేవి, వసంతకూడా పరుగున వచ్చారు.
    "ఏమయింది!" అంది పద్మావతీదేవి.
    "హత్యకు యెవర్ని తప్పుపట్టాలో తెలిసిపోయింది.."
    "ఎవరిని?"
    "పోస్టల్ డిపార్టుమెంటుని...." అన్నాడు వెంకన్న.
    ఆ తర్వాత.....
    నెలరోజుల్లోగానే శ్రీకాంత్ జైల్లో ఉన్నాడు. నగరంలో ఓ ముఠా బైటపడి-పురప్రముఖులు కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.


                              -:ఐ పోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS