"అయితే చంపడానికి ఎవర్ని నియోగిస్తున్నావ్ !"
"నేను నియోగించడమేమిటి ? చంపవలసిన అవసరం నాకేమిటి? చంపే ఉద్దేశ్యమే నాకుంటే హెచ్చరించే పనికి ఎందుకు వూరుకుంటాను? నా దురదృష్టం కొద్దీ ఎవరూ నా హెచ్చరికను పాటించడం లేదు -" అన్నాడు చలం.
"ఇప్పుడు జనార్దనం చచ్చిపోయాడంటే నీకు సంతోషం కలుగుతుందా, దిగులు పడతావా ?" అనడిగాడు శేఖర్.
"సుగుణ్ , ప్రకాష్ ల విషయంలో అయితే దిగులు పడ్డాను. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా వుంటుంది --" అన్నాడు చలం.
శేఖర్ అతడి వంక కోపంగా చూస్తూ -- "సాటి మనిషి చచ్చిపోతే -- ఎంత శత్రువైన సరే కంటతడి పెడతారు అలాంటిది ....నువ్వు ...." అని మాటలు రాక ఆగిపోయాడు.
"సార్ -- ఎవరికైనా స్వంత ప్రాణం తర్వాత ఎదుటి వారి ప్రాణం. నేను నిస్వార్ధపరుణ్ణి కాబట్టే లీల గురించీ సుగుణ్ ని, ప్రకాష్ ని హెచ్చరించాను. ఇప్పుడు జనర్ధనాన్ని హెచ్చరించాను. కానీ ఫలితం ఏమిటి? నా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. నాకు తెలిసిన విషయం చెప్పి నిండు ప్రాణాన్ని కాపాదాలనుకుందుకు అంతా నన్నే హంతకుడిగా అనుమానించే పరిస్థితి ఏర్పడింది.
మీరే చెప్పిండి సార్..... ఒక ఆడదాని కోసం -- అందులోనూ పరాయి మగాళ్ళను ప్రేమిస్తున్న ఆడదాని కోసం ఎవడైనా హత్యలు చేస్తాడా .....మీరే ఆలోచించండి సార్! అందుకే ఇప్పుడు జనార్దనం నేను లాకప్ లో వుండగా చచ్చిపోతే -- అది నాకు ఎంతో మేలు చేస్తుంది. నామీద ఎవరికే అనుమానాలున్నా పోతాయి. అప్పటికే మీ అనుమానం పోకపోతే -- నన్నిక్కడే కొన్నాళ్ళుంచండి. లీల ఎవర్ని ప్రేమిస్తే వాళ్ళు చస్తాను. అది మీరు కళ్ళారా చూస్తారు ...." అన్నాడు చలం ఇన్ స్పెక్టర్ వంక ఉత్సాహంగా చూస్తూ.
"ఎలా చస్తారంటావ్?"
"బహుశా ఆమె స్పర్శలో ఏదో మాయ వున్నది. ఆమె గురించి అదే పనిగా ఆలోచిస్తే బుర్ర పాడవుతుందని నా అనుమానం . ఆత్మహత్య చేసుకోవాలన్న బుద్ది పుట్టవచ్చు --"
శేఖర్ ఆలోచిస్తూ -- "నిన్ను లాకప్ లో వుంచాను కానీ నీ కేసు రిజిష్టర్ చేయలేదు. సులభంగా తేలిపోయిన కేసును క్లిష్టతరం చేయడం నా కిష్టం లేదు. అందుకే నీ మాటలు నమ్మి నిన్ను వదిలి పెడుతున్నారు. అయితే ఇంకోసారి -- నీ విషయంలో ఇంకేమైనా అనుమానాలు కలిగితే మాత్రం మొత్తం అంతా తిరగతోడతాను --" అన్నాడు.
"థాంక్యూ సార్ -- ఇంతకీ జనార్దనం నిజంగా చచ్చిపోయాడా ?"
"ఆ ఆత్మహత్య చేసుకున్నాడు -- " అన్నాడు శేఖర్.
చలం ఆనందంతో కేక పెట్టాడు.
"మిష్టర్ చలం!" అన్నాడు వెంకన్న.
అప్పటిదాకా డిటెక్టివ్ వెంకన్న ఉనికి పట్టించుకోని చలం -- "మీరే కదూ సార్ -- నన్ను పిలిచారు అన్నాడు.
"అవును , నువ్విప్పుడు నాతొ రావలసి వుంది -- " అన్నాడు వెంకన్న.
"తమరెవరు సార్?" అన్నాడు చలం.
'అయన పేరు వెంకన్న. ప్రసిద్ది పొందిన ప్రయివేట్ డిటెక్టివ్. అయన కారణంగానే నిన్ను వదిలి పెడుతున్నాను. నువ్వు ఆయనతో వెళ్ళు--" అన్నాడు ఇన్ స్పెక్టర్ నవ్వుతూ.
11
"మిస్టర్ చలం ! నేను నీకు మిత్రుణ్ణి కాదు. నిర్దోషినని నేను నమ్మడం లేదు. నా క్లయింట్ ప్రకాష్ నీ కారణంగానే చనిపోయాడు. అతడిది ఆత్మహత్య పోలీసులు అన్నప్పటికీ నేనది నమ్మలేదు. మర్యాద నీకు తెలిసిన నిజాలు నువ్వు నాకు చెప్పకపోతే -- నేను నిన్ను వేటాడతాను. నా వేట చాలా ఘోరంగా వుంటుంది --" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
"మీరు నానుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?"
వెంకన్న నవ్వి -- "ఇన్ స్పెక్టర్ శేఖర్ నీ విషయంలో ఉదాసీన భావం వహిస్తే అందుకు కారణం నేను అర్ధం చేసుకోగలను. నేనలా వదిలి పెట్టను నిన్ను, నీకు లీల గురించి ఎప్పట్నించి తెలుసు? ఎలా తెలుసు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి --" అన్నాడు వెంకన్న.
"లీలను నేను తోలి చూపులో ప్రేమించాను . ఆమెను పరిచయం చేసుకున్నాను. మా పరిచయం ప్రేమగా మారేలోగానే ఒకరోజున ఆమె బస్సు కింద పడిపోబోతుంటే ప్రమాదం నుంచి కాపాడాను . అప్పుడామే -- "చలం ---నీ ఋణం ఎలా తీర్చుకోను ?" అనడిగింది. మనం పెళ్ళి చేసుకుందాం -- అన్నాను. ఆమె ఒప్పుకోలేదు. నా ప్రాణ దాతవు -- నీ ప్రాణాలెలా తీయనూ అంది...."
చలం చెప్పుకు పోతుండగా -- "బాస్ !" అన్నది సీతమ్మ.
""ఏమిటి?" అన్నాడు వెంకన్న.
"ఇతడు చెప్పేవన్నీ అబద్దాలు !" అన్నది సీతమ్మ.
"ఎలా తెలుసు నీకు ?" కోపంగా అన్నాడు చలం.
మిష్టర్ - కోప్పడకు ....నీవు కూర్చున్న కుర్చీలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయి. లై డిటెక్టివ్ ..... అనగా అబద్దాలు కనిపెట్టే యంత్రం గురించి నీవు విన్నావా ?" అన్నాడు వెంకన్న.
'అంటే?"
"అబద్దం చెప్పేటప్పుడు మనిషి మెదడులో కొన్ని భావాలు చెలరేగుతున్నాయి. ఆ భావాలకు అనుగుణంగా నరాలు కంపిస్తాయి. నరాల కంపనాన్ని బట్టి మనిషి నిజం తెబుతున్నాడో , అబద్దం చెబుతున్నాడో తెలుసుకోవచ్చు. నువ్వు చెప్పేవి అబద్దాలని సీతమ్మ అంటున్నది. ఆమె చేతిలో లై డిటెక్టర్ ఉన్నది. అది నీ కుర్చీకి కనెక్టు చేయబడి వున్నది --" అన్నాడు వెంకన్న.
చలం తెల్లముఖం వేశాడు.
"మిష్టర్ --- ఇప్పుడు నిజం చెప్పు --" అన్నాడు వెంకన్న.
"నిజం చెబితే నా ప్రాణం పోతుంది --" అన్నాడు చలం.
"నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను --" అన్నాడు వెంకన్న.
'అది మీవల్ల కాదు -- " అన్నాడు చలం.
"నావల్ల కానిపని లేదు -- " అన్నాడు వెంకన్న.
'అయితే ప్రకాష్ ప్రాణాలు యెందుకు రక్షించలేకపోయారు ?"
'చాలా మంచి ప్రశ్న వేశావు ---" అని నవ్వాడు వెంకన్న - "ప్రకాష్ ప్రాణాలు రక్షించాల్సిన అవసరం ఉంటుందని నేననుకోలేదు. అందుకే అలక్ష్యం చేశాను. ఇప్పుడు ప్రకాష్ ని చంపిన హంతకుడెవరో తెలుసుకోవాలని పట్టుబట్టాను. తెలుసుకుంటాను. నేను తెలుసుకున్న వివరాలన్నీ పోలీసులకు అందజేస్తాను. నువ్వు ఎవరికైనా భయపడుతూ ఉండిన పక్షంలో ఆ వ్యక్తీ బ్రతుకు నేనెలాగూ బయట పెట్టగలను...."
"మీరు తెలుసుకున్న విషయాలను రహస్యంగా వుంచగలరా?"
"నేరస్థుల మనసులో మార్పు తీసుకుని రావడం తప్ప శిక్ష నా ధ్యేయం కాదు. నువ్వు నిజం చెబితే బహుశా నేను నిన్ను రక్షించగలను ...."
చలం ఆలోచిస్తూ ...."మీరు నిజమే చెబుతున్నారా?' అన్నాడు.
"నా దగ్గరున్న రహస్యాలన్నీ పోలీసులకు అప్ప జెప్పే మాటైతే ఈ ఊళ్ళో సగం మంది జైల్లో ఉండేవారు -- " అన్నాడు వెంకన్న.
"సరే -- చెబుతాను. కానీ మీరు నా ప్రాణాలను రక్షించాలి --" అంటూ ప్రారంభించాడు చలం.
చలం సామాన్యుడు. అతడికి లీల చిన్నప్పట్నించి తెలుసు. ఇద్దరికీ రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. అతడికి లీల అంటే ప్రాణం. లీలకు పుస్తకాల పిచ్చి, ఆ పుస్తకాల ప్రభావమూ ఏమో కాని తను బానిస జీవితం అనుభవిస్తున్నాన్న అభిప్రాయం ఆమెకు కలిగింది. ఆమెకు విలాస జీవితాల పైన మోజు ఎక్కువయింది. అప్పుడు చలం లీల కోసం ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుని ఈ ఊరు వచ్చాడు.
ఈ ఊళ్ళో అతడి చిన్ననాటి స్నేహితుడొకడు చాలా పేరుపొందిన వ్యాపారస్థుడయ్యాడు. చలం అతణ్ణి కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. అతడు అవినీతి కరమైన పనులు చాలా చేస్తున్నాడు. తనకు వాటిల్లో సాయం చేస్తే చలం త్వరలోనే ధనవంతుడు కావచ్చునని అతడన్నాడు. సామాన్యుడైన చలం అందుకు భయపడ్డాడు. తనకు కావలసిందల్లా నలుగురూ నడిచే బాటలో డబ్బు సంపాదించడం -- అని స్పష్టం చేసి తన ఊరు వెళ్ళిపోయాడు.
అప్పుడు లీల అతన్ని వదిలి పెట్టాలనుకున్నట్లు చెప్పింది. ఆమె పుట్టింటి కి పోయింది. పుట్టింట్లో అంతా ఆమెను తిడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈలోగా ధనికుడైన ఆ స్నేహితుడు చలం ఊరికి వచ్చాడు. చలాన్ని కలుసుకున్నాడు. అతడి పరిస్థితి విన్నాడు.
"నీ భార్య అమాయకురాలు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా వుంది. అలా చేస్తే -- చివరికి ఏ వ్యభిచారుల కొంపలోనో తెల్తుంది -" అన్నాడు స్నేహితుడు.
"ఏం చేయను ?" అన్నాడు చలం.
"నేనో యువతినీ పంపుతాను. ఆమె ప్రోత్సాహంతో నీ భార్య మా ఊరు వస్తుంది. అ యువతీ ఆమెకు మగవాళ్ళను వెతికి పెడుతుంది -"
