వజ్రాల భరిణ
ఇన్ స్పెక్టర్ ఈశ్వర్రావు తీవ్రాలోచనలో వున్నాడు. ఊళ్ళో స్మగ్లింగ్ ఆపరేషన్సు బాగా యెక్కువై పోయాయి. లక్షల విలువచేసే వజ్రాలు ప్రతిరోజూ చేతులు మారిపోతున్నాయి. ఆపరేషన్సు కొత్తపద్దతిలో జరుగుతున్నవేమో-ఏమీ క్లూ దొరకడం లేదు.
ఈశ్వర్రావు సమర్దుడిగా డిపార్టుమెంట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల ఆ పేరు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఎన్నడూ లేనిది మొదటిసారిగా పై ఆఫీసరుచేత చీవాట్లుకూడా తిన్నాడతడు.
అతడు నగరంలో అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ పరిశీలించాడు. మెరికల్లాంటి కాన్ స్టేబుల్ని ఊరంతా నిఘా వేయించాడు. నేరస్థుల జాబితాలో వున్న వ్యక్తులందరిమీదా ఓ కన్నువేసి వుంచాడు. పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న వారి గురించికూడా తగు జాగ్రత్తలో వున్నాడు.
స్మగ్లింగ్ ఆపరేషన్సుకు ఎటువంటి అవకాశాలుంటాయో-తనకు తెలిసిన మేరకు ఊహించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ వజ్రాల స్మగ్లింగ్ కొనసాగిపోతూనే వున్నవి.
అసలు స్మగ్లింగ్ అన్నది కొనసాగడంలేదనీ-తను తీసుకున్న చర్యల అనంతరం-స్మగ్లింగ్ సాధ్యపడదనీ ఈశ్వర్రావు పై అధికారులకు చెప్పిచూశాడు. అయితే వారు అంగీకరించలేదు.
దిక్కూ మొక్కూ తెలియని ఓ శవం దగ్గర వారికో చిన్న ట్రాన్సిస్టర్ వంటి సాధనం దొరికింది. అది ఒక రిసీవర్ సెట్.
ఒక బాస్ నుంచి ఆ సెట్ సందేశాలను అందుకుంటున్నది.
పోలీసులకు ఆ సెట్ ను బట్టి ఈ క్రింది విషయాలు తెలిశాయి.
ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జోరుగా వ్యవహరిస్తున్నది. ఈ ఊరిలో మొత్తం పాతికమందివద్ద ఇటువంటి సెట్స్ వున్నవి. ఆ సెట్స్ సందేశాలను అందుకునేందుకే తప్ప పంపడానికి పనికిరావు. ఆ సందేశాలు కూడా ఎక్కువ సమాచారాన్నందజేసేవిగా లేవు. ఆ సందేశాలు పాతికమందికీ ఒకేసారి ఉద్దేశించబడినవి.
"మీ కారణంగా నిన్న నలభై లక్షల విలువైన వజ్రాల మార్పిడి జరిగింది. గుడ్ వర్క్.....థాంక్స్...."
"ఈ రోజు రికార్డు. ఒక కోటీ అయిదు లక్షలు. కీ పిటవ్ - థాంక్స్...."
"ఈ రోజు పది లక్షలు మాత్రమే.....డోన్ట్ వర్రీ......మీ ఇబ్బందులు నాకు తెలుసు. రేపు ఇది మేకప్ చేసేయాలి...బెస్టాఫ్ లక్..."
సందేశాలు అస్తమానూ రావడంలేదు. ఒకోసారి రోజు విడిచి రోజు. ఒకోసారి పదేసి రోజుల వ్యవధి అనంతరం.....ఒకసారి మూడు వారాల గ్యాప్ కూడా వచ్చింది.
పోలీసులు ఆ రిసీవర్ సెట్ ను నిత్యం ఆన్ చేసి వుంచుకున్నారు. సందేశం ఎక్కడినుంచి వస్తున్నదో, ఎవరికీ చేరుతున్నదో వారికి తెలుసుకొనడం సాధ్యపడ లేదు. కానీ స్మగ్లింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని మాత్రం తెలిసింది.
ఈశ్వర్రావుకిది ప్రాణాంతకంగా వున్నది. ఈ రిసీవర్ సెట్ లో ఎవరైనా తమను ఫూల్ చేయడం లేదుగదా అని అతడికి అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని అతడు పై అధికారులముందు వ్యక్తం చేయలేదు. వారు తనతో ఏకీభవించరని అతడికి బాగా తెలుసు.
అందుకే యేం చేయాలో తెలియక ప్రతిరోజూ ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
ఆ రోజు అతడు మరింత తీవ్రాలోచనలో వున్నాడు. ఆలోచనలో టైము రాత్రి పది దాటిందని కూడా అతడు గుర్తించలేదు.
అప్పుడు-"సార్!" అన్న పిలుపు వినిపించి తలెత్తి చూశాడతను.
ఈశ్వర్రావు ప్రశ్నార్ధకంగా అతడివంక తలెత్తి చూశాడు.
"మన స్టేషన్ కు పక్కగా వున్న బస్ స్టాపులో ఓ మనిషిని చూశాను సార్! ఓ బిచ్చగాడికి అతడు తింటున్న వేరుశనక్కాయల పొట్లం దానంచేశాడు. ఆ దానం ఎలా గున్నదంటే - అతడు ఆ బిచ్చగాడి కోసం యెదురు చూస్తున్నట్లూ-అతడికివ్వడంకోసమే తనచేతిలో వేరుశనగకాయల పొట్లం ఉంచుకున్నట్లూ-నాకు అనిపించింది-"
ఈశ్వర్రావు చిరాగ్గా-"కొంతమంది అంతే-ఏమైనా తింటూండగా బిచ్చగాళ్ళు అడిగితే వెంటనే అది ఇచ్చేస్తారు. ఇందులో విశేషమేమీలేదు...." అన్నాడు.
"కానీ సార్....అతడి జేబులో ఓ వస్తువు చూశాను. వేరుశనగకాయల పొట్లం తీసేటప్పుడు-అదీ బయటకు వచ్చింది. పొట్లం చేతిలో వుంచుకుని దాన్నతడు మళ్ళీ జేబులోకి తోసేశాడు. పొట్లంలోంచి ఓ రెండు వేరుశనగలు తిన్నాడో లేదో-బిచ్చగాడు వచ్చాడు....."
"ఏమిటా వస్తువు?"
"అది మనవద్దనున్న రిసీవర్ సెట్ లాగున్నది సార్.." అన్నాడు కాన్ స్టేబుల్.
ఈశ్వర్రావు ఉలిక్కిపడి లేచి నిలబడి-"వాడెక్కడ?" అన్నాడు.
"ఓ కాన్ స్టేబుల్ అతణ్ణి వాచ్ చేస్తున్నాడు సార్" అన్నాడు కాన్ స్టేబుల్. ఈశ్వరరావు వెంటనే స్టేషన్ లోంచి బయటకు వచ్చి ఆ యువకుణ్ణి చూశాడు.
అతడికి గుబురు గెడ్డం వున్నది. బహుశా అది పెట్టుడు గడ్డమై ఉండాలి. కాన్ స్టేబులు, ఈశ్వర్రావుకి అతణ్ణి చూపించాడు.
ఈశ్వర్రావు అతడివైపు నడిచాడు.
బస్ స్టాపులో వున్నతను ఈ పోలీసుల వ్యవహారం చూశాడు. అయిన కదలలేదు. ఓరకంట పోలీసులను గమనిస్తున్నాడు.
ఈశ్వరరావు అతడిని సమీపించాడు. అతడు ఈశ్వరర్రావు వంక చూడలేదు.
"మిష్టర్! నిన్ను సోదా చేయాలి-" అన్నాడు ఈశ్వర్రావు.
"ఎందుకు?"
"సోదాచేశాక చెబుతాను..." అన్నాడు ఈశ్వరరావు.
అతడు చేతులెత్తి నిలబడ్డాడు.
ఈశ్వరరావు అతడిని సోదాచేయడానికి ముందుకు వచ్చాడు.
అతడూ ఒకడుగు ముందుకువేసి చటుక్కున ఈశ్వర్రావుని ఒక్కతోపు తోసి అక్కణ్ణించి ఒక్క పరుగుతీశాడు.
ఇది ఊహించలేదు ఈశ్వర్రావు.
ఈశ్వర్రావు వెనుకనే వున్న కాన్ స్టేబుల్ వెంటనే విజిల్ వేశాడు.
ఈశ్వర్రావు....ఇద్దరు కాన్ స్టేబుల్స్.....అతడిని వెంట తరిమారు.
అతడు రెండు సందులు తిరిగి ఆపద్దర్మంగా చటుక్కున ఓ యింట్లో దూరాడు. ఆ యింటి తలుపులు ఓరవకిలిగా తెరిచి వున్నాయి.
ఈశ్వర్రావు ఆ యింట్లోకి అడుగుపెట్టేసరికి అతడు దొడ్డిదారిన ఎటో పారిపోయాడు.
గదిలో కూర్చున్నాయన-కంగారుగా-"అతడెవరు సార్-అలా హఠాత్తుగా యింట్లో చొరబడ్డాడు-" అన్నాడు.
ఈశ్వర్రావు క్లుప్తంగా వివరంగా చెప్పి - "దొంగ దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు-అంతా నా దురదృష్టం-" అన్నాడు.
"హఠాత్తుగా ఇంట్లో చొరబడేసరికి నా బుర్ర పనిచేయలేదు. ఆపైన ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు-సమయానికి నేనూ మీకు సాయపడలేకపోయాను-" అన్నాడాయన.
ఇన్ స్పెక్టర్ ఈశ్వర్రావు ఆయన వివరాలు తెలుసుకున్నాడు. ఆయన పేరు సుబ్బారావు. బ్యాంకు ఏజంటుగా పనిచేస్తున్నాడు.
ఈశ్వర్రావు వెళ్ళిపోయాక సుబ్బారావు గదిలో మూలకు చూశాడు. ఇందాకా దొంగనుంచి జారిపడి మూలగా దొర్లివెళ్ళిన కాగితం పొట్లం ఇంకా అక్కడే వున్నది. ఆ వచ్చిన ఇన్ స్పెక్టర్ మనిషికోసమే వచ్చిన మూలాన ఇంటిని శోధించలేదు.
సుబ్బారావు వీధి తలుపులువేసి ఆ పొట్లం తీశాడు. అందులో వేరుశనగకాయలున్నవి.
సుబ్బారావు ఒక్కడూ అక్కడ కూర్చుని ఏదో ఇంగ్లీషు నవల చదువుకుంటున్నాడు. ఆ పొట్లంలోని వేరుశనగకాయల నాయన తన ఎదురుగా వున్న బల్లమీద గుట్టగా పోశాడు. అప్పుడు చూశాడాయన. ఆ పొట్లం అడుగున ఒక చిన్న ప్లాస్టిక్ భరిణ వున్నది.
సుబ్బారావు ఆ భరిణ మూత తీశాడు. వెంటనే కళ్ళు జిగేల్ మన్నాయి.
అందులో ధగధగలాడే వజ్రాలున్నవి.
