జరిగిందేమిటో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు శాస్త్రి. ఆ రాత్రి జంబులింగం మనిషి కళ్యాణి ని బలవంతంగా అనుభవించి వుంటాడు. అ అవమానాన్ని భరించలేక తన ప్రాణాల నంతం చేసుకుని వుంటుంది కళ్యాణి. ఆ మనిషి ఆమె చావును ఆత్మహత్య గా నిరూపించడానికి ప్రయత్నించి వుంటాడు. అందుకే ఓ చీటీ రాసిపెట్టి వుంటాడు. ఆ చీటీలోని దస్తూరీ కళ్యాణీది కాక పోవడానికి కారణమిదే అయుండాలి !"
హత్య గానీ, ఆత్మహత్య గానీ - కళ్యాణి చావు గురించి ఆ మనిషికి తెలిసుండాలి. ఆ మనిషెవరో సుబ్బన్న కు తెలుసు. కానీ వాడు చెప్పడు. ఈ విషయం మాత్రం వాడి నుంచి రాబట్టడం కష్టం. ఎందుకంటె సుబ్బన్న నిజం చెబుతున్నాడో అబద్దం చెబుతున్నాడో తనకూ తెలియదు.
శాస్త్రి ని వేధిస్తున్న అనుమాన మింకోకటుంది. కళ్యాణి తెలివైంది. జంబులింగం వలలో పడకుండా తెలివిగా తప్పించు కుంటోంది. అటువంటి మనిషి ఆరోజు దొడ్డి తలుపులు ఎందుకు తెరచి వుంచింది? జంబులింగాన్ని మోసంచేయాలనుకుంటే ఆమె పధకం ఏమిటి?"
బహుశా ఇంకో మనిషేవరైనా ఆమెకు తోడు వస్తున్నారా? వస్తే ఆ మనిషి ఎవరు? అతడు ఎందుకు కళ్యాణి ని రక్షించలేకపోయాడు ?
శాస్త్రి కి సమాధానాలు దొరకడం లేదు. హటాత్తుగా అతనికి ఓ ఆలోచన వచ్చింది. సుబ్బన్న కు ధన్యవాదాలు చెప్పి అతనక్కడ్నించి కదిలాడు.
9
"నమస్కారం కూర్చోండి !" అన్నాడు జంబులింగం.
"కూర్చుంటాను కానీ మీకు చాలా అ ప్రియమైన వార్త చెప్పడానికి వచ్చాను" అన్నాడు శాస్త్రి కూర్చుంటూ.
జంబులింగం పెద్దగా చలించలేదు. "చెప్పండి !' అన్నాడు.
"మీరు కళ్యాణిని హత్య చేయించినట్లు ఋజువైంది. విషయం ఇంకా పోలీసులదాకా వెళ్ళలేదు. నాకే తెలుసు" అన్నాడు శాస్త్రి.
"ఏ కళ్యాణి? అన్నాడు జంబులింగం ఏమీ ఎరుగనట్టుగా.
శాస్త్రి వివరాలన్నీ చెప్పాడు . కానీ తను సుబ్బంనాను కలిసినట్లు చెప్పలేదు. "మీరు కళ్యాణిని చేరచడానికి నియోగించిన మనిషి విధిలేని పరిస్థితుల్లో ఆమెను చంపేశాడు. శవం పక్కనున్న దస్తూరి అతని దస్తూరితో సరి పోలినది. ఆ మనిషిని నేను కలుసుకుని మాట్లాడేను. మీరే ఆ హత్య చేయించారని చెప్పాడు. ఇంకా చాలా వివరాలు చెప్పాడు. మీరు సంఘంలో పెద్దమనిషి కాబట్టి పోలీసుల దగ్గరకు వెళ్ళే ముందు మీ దగ్గర కోసారి వచ్చాను."
జంబులింగం ముఖం చిన్నబోయింది. "శాస్త్రి గారూ! అనవసరంగా పోలీసుల లిస్టులోకి వెళ్ళడం నాకిష్టం లేదు. ఈ హత్య కేసులో నాకేవిధమైన సంబంధమూ లేదు. నన్ను నమ్మండి. " అన్నాడు.
"తప్పకుండా నమ్ముతాను. కాని సాక్ష్యాలు కావాలి."
"నా మనిషి కళ్యాణి ఇంటికి వెళ్ళి మాట నిజం. కానీ కళ్యాణి రాకముందే అక్కడ కింకో మనిషి వచ్చాడు. "
"ఎవరా మనిషి ?"
"మమ్మల్నందర్నీ మించిన వాడు. నగరంలోని పోలీసులకు సింహస్వప్నం . రామచంద్రం!" అన్నాడు జంబులింగం.
"ఎలా తెలుసు?"
"నా మనిషి చెప్పాడు. అతన్ని చూడగానే నా మనిషి కాళ్ళూ చేతులూ ఆడలేదు. తన తరపునా, నా తరపున క్షమార్పణ చెప్పి అక్కణ్ణించి బయట పడ్డాడట...."
"రామచంద్రాన్ని కలుసుకోవడం ఎలా?"
"నాకు తెలియదు."
రామచంద్రం ఎలా వుంటాడో , ఎక్కడ వుంటాడో పోలీసులకు తెలియదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వారు అతని కోసం వెతుకుతున్నారు. అయితే కళ్యాణికి రామచంద్రానికీ సంబంధం ఏమిటి?
రామచంద్రం ఆమెకు ఎలా తెలుసు ? అతడు గొప్ప నేరస్థుడని ఆమెకు తెలియదేమో - అతడినామె ప్రేమించిందేమో - ఏదో పొరపాటున అతడు నోరుజారి తన గురించి చెప్పగానే పోలీసులకు పట్టి ఇస్తానని ఆమె బెదిరించిందేమో - అప్పుడు రామచంద్రం ....
శాస్త్రి తన ఊహాశక్తిని అభినందించుకున్నాడు. బహుశా ఇలాగే జరిగి వుంటుంది. లేకపోతె కళ్యాణి ఎందుకు చనిపోతుంది ?
ఒకవేళ రామచంద్రం ఆమెను హత్య చేసి వుండకపొతే కళ్యాణి కి అతడి గురించిన నిజం తెలిశాక జీవిత మంటే విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నదని అనుకోవాలి!
ఏది ఏమైనా తనిప్పుడు అర్జంటుగా రామచంద్రాన్ని కలుసుకోవాలి. ఏళ్ళ తరబడి గాలిస్తున్నా పోలీసులకు దొరకని ఆ రామచంద్రం తనకు దొరుకుతాడా ?
శాస్త్రి అక్కణ్ణించి బయట పడ్డాక బుర్రలో మెరుపులా ఏదో మెరిసింది. కమాలాకరానికి కళ్యాణి పరిచయస్తుఅందరు తెలిసి వుంటారు. అతన్నా వివరాలడిగితే రామచంద్రం గురించి తెలియవచ్చు.
10
తలుపు తట్టాడు కానీ జారగిల వేసుందని గ్రహించి నెమ్మదిగా తోశాడు శాస్త్రి. ఎదురుగా కనబడ్డ దృశ్యం చూసి అతను స్తంభించిపోయాడు.
కమలాకరం నేలమీద పడి వున్నాడు. గదిలో కప్పుకు వున్న కొక్కేనికి ఒక తాడు వేలాడుతోంది. బాగా పరీక్షించగా అతడికి అర్ధమైనదేమిటంటే కమలాకరం ఆత్మహత్యా ప్రయత్నం చేశాడనీ -- మధ్యలో తాడు తెగి క్రిందపడి తలకు గాయం తగలగా స్పృహ తప్పి పడిపోయాడని.
ఇది కమలాకరం చేసిన ఆత్మహత్య ప్రయత్నమా. లేక ఎవరైనా అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించి ఇలా నిరూపించడానికి ప్రయత్నించారా?
రెండోది నిజమైతే ఈ పని రామచంద్రంచేసి వుండాలి. జంబులింగానికి రామచంద్రానికి పెద్ద సంబంధముండి వుండాలి.
అప్పుడే శాస్త్రి దృష్టిని అక్కడ టీపాయ్ మీద పేపరు వేయిట్ క్రింద వున్న కాగితం ఆకర్షించింది. దాని మీద ఒకే ఒక్క వాక్యం వ్రాసి వుంది.
"ఇది ఆత్మహత్య !"
శాస్త్రి ఆ కాగితం చూసి ఉలిక్కి పడ్డాడు. నిస్సందేహంగా కాగితం మీద అక్షరాలూ, కళ్యాణి శవం పక్కనున్న కాగితం మీద అక్షరాలూ ఒకే వ్యక్తీ రాసినవి. దస్తూరీ గురించి సుధాకర్ పదేపదే చెప్పడం వల్ల అతను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ కాగితం మీది అక్షరాలూ చూసి గుర్తు పెట్టుకు వచ్చాడు.
ఈ దస్తూరి ఎవరిది? కమలాకరానిదా, రామచంద్రానిదా లేక జంబులింగానిదా?....ఈ కేసును సాధించడానికిది చాలా ముఖ్యమైన క్లూ!
శాసవెళ్ళి కమలకరానికి స్పృహ తెప్పించడానికి ప్రయత్నించాడు. అతని కృషి ఫలించి అయిదు నిముషాల్లో కమలాకరానికి స్పృహ వచ్చింది.
"మిమ్మల్ని కోట్టిందేవరు?" అనడిగాడు.
"నన్నెవరూ కొట్టలేదు. నా దురదృష్టం కొద్దీ ఆత్మహత్య ప్రయత్నం ఫెయిలయింది. నా కళ్యాణి లేని బ్రతుకు శూన్యమనిపిస్తోంది , అందుకే ...."
"అబద్దం ...." అన్నాడు శాస్త్రి - "ఈ కాగితం మీద దస్తూరీ మీది కాదు."
"అది నాదేనని ఈ క్షణంలో ఋజువు చేస్తాను..." అంటూ కమలాకరం అదే వాక్యం అప్పటికప్పుడు మళ్ళీ రాశాడు. దస్తూరీ సరిపోయింది.
"రైట్. మీరు ఆత్మహత్య చేసుకున్నారని నమ్ముతున్నాను/ అలాగే కళ్యాణి ని మీరే హత్య చేశారని కూడా నిరూపించగలను...."
కమలాకరం చటుక్కున లేచి నిలబడి శాస్త్రిని బలంగా కొట్టాడు -- "ఈ రహస్యం తెలిసిన నిన్ను బ్రతకనివ్వను" అన్నాడతను.
కమలాకరం దెబ్బకు తమాయించుకోవడమే కాక, అతడిని బలప్రయోగంతో అదుపులోకి తీసుకురావడానికి శాస్త్రికి ఎంతో సేపు పట్టలేదు.
"శాస్త్రి గారూ! మీకు నేను చేతులెత్తి మ్రొక్కు తాను. కళ్యాణి గురించిన ఈ నిజం ఎవ్వరికీ చెప్పవద్దు. కళ్యాణి చనిపోయిన రాత్రి నేనామెను అనుసరిస్తూ కాలం గడిపాను. ఆమెతో పాటు ఆమెకు తెలియకుండా వాళ్ళింటి దొడ్డిదారిన ఇంట్లో ప్రవేశించాను. అక్కడ ఆమె నిజ స్వరూపం బయటపడింది.
కళ్యాణి విలాస జీవితానికి బానిస అన్న కఠోర సత్యం అప్పుడే నాకు తెలిసింది.
ఆమె అప్పుడు రామచంద్రం తో వుంది. అతడెవరో నాకు తెలియదు కానీ వాళ్ళ సంభాషణ విన్నాక వివరాలు తెలిశాయి. రామచంద్రంతో ఆమె చాలా విచ్చల విడిగా ప్రవర్తించింది. అతడితో మాత్రమే కాక అతడి లాంటి వాళ్ళు చాలామందితో ఆమెకు అక్రమ సంబంధ మున్నదని వాళ్ళ సంభాషణ నాకు తెలియజెప్పింది. ఆ ముఠాలకు స్మగ్లింగ్ వ్యవహారాల్లో ఆమె సాయం చేస్తోంది.
తనకు చాలామంది ప్రేమిస్తున్నామంటున్నారనీ, పెళ్ళి చేసుకోవడం తన కిష్టం లేదని కళ్యాణి ఆ రామచంద్రంతో అంటుంటే నేను సహించ లేకపోయాను.
అప్పటికప్పుడు దొడ్డి దారిన బయటకు వెళ్ళి విషం తీసుకు వచ్చాను. రామచంద్రం వెళ్ళిపోయే వరకూ ఆగి కళ్యాణి తాగే మంచినీళ్ళ గ్లాసులో ఆ విషం కలిపాను. కళ్యాణి మంచినీళ్ళు తాగేవరకూ రహాస్యంగా వేచి వున్నాను. ఆమె మంచినీళ్ళు త్రాగింది. క్షణంలో ఆమె ప్రాణం పోయింది. అమెది ఆత్మహత్య అని ఓ కాగితం రాసిపెట్టి అక్కణ్ణించి వచ్చేశాను.
కళ్యాణి నేననుకున్న విధంగా దేవత కాదనీ, సైతాన్ అని తెలియగానే ఆమెకు చంపాలనుకున్నాను. కళ్యాణి పోయాక నాకూ బ్రతకాలని లేదు. కానీ కళ్యాణి కులట అని ఈ ప్రపంచానికి తెలియదు. ప్రేమించినందుకు నేనామేకు చేయగల ఉపకారమదొక్కటే , అందరూ కళ్యాణి నిప్పు లాంటి మనిషి అనుకోవాలి. అందుకే వెంటనే నా ప్రాణాలు తీసుకోలేదు.
మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. కళ్యాణి గురించి మీరు కనుగొన్న వివరాలు ఎవరికీ చెప్పకండి. ఆఖరికి ఆమె అన్న సుధాకర్ కి కూడా! అతడికి కళ్యాణి తప్ప వేరే లోకం లేదని విన్నాను. మీ కబురు వింటే అతడు గుండె పగిలి చస్తాడు. కావాలంటే ఎంత డబ్బయినా మీకు ఫీజుగా ఇచ్చుకుంటాను. కళ్యాణి కులట అని ఈ లోకానికి తెలియనివ్వకండి ."
"మిస్టర్ కమలాకరం! ఈ విషయం నేను పోలీసులకు చెప్పను. కానీ సుధాకర్ కి చెప్పడం నా విధి. అతని కోరిక మీదనే ఈకేసును చేపట్టాను. నువ్వు హంతకుడివి కాబట్టి ఎన్ని కల్లబొల్లి కబుర్లైనా చెబుతావు. నువ్వు నిజంగా కళ్యాణి ని ప్రేమించి వున్నట్లయితే ఆమె తప్పులను క్షమించి ఉండేవాడివి. ఆమె శీలం మీద వున్న ప్రేమ ఆమెపై లేదు నీకు. అన్న విషయం అలా కాదు. చెడిపోయినా కడుపులో పెట్టి చూసుకుంటాడు చెల్లెల్ని - నేనీ విషయం సుధాకర్ కి రాస్తాను" అంటూ అక్కణ్ణించి కదిలాడు శాస్త్రి.
కమలాకరం హత్య చేశాడని కలలో కూడా ఊహించలేదు శాస్త్రి. అలాగే కళ్యాణి కులట అని అనుకోలేదు. కేసు ఈ విధంగా కొత్త మలుపు తిరగడం అతనికి చాలా ఆశ్చర్యంగా వుంది.
తర్వాత సుధాకర్ కి ఓ వుత్తరం రాసి తన పరిశోధనల వివరాలను రిజిస్టరు పోస్టులో పంపాడు శాస్త్రి. వారం రోజుల్లో శాస్త్రికి రిజిస్టరు పోస్టులో పన్నెండు వేల రూపాయలకు ద్రాప్టు వచ్చింది. అందులో ఉత్తరం ఏమీ లేదు.
మరి వారం రోజులకు కమలాకరం హత్య చేయబడ్డాడు. ఇంకో రెండు రోజులకు సుధాకర్ శవం ఊరి చివర దొరికింది. ఆ మర్నాడు శాస్త్రికి ఉత్తరం వచ్చింది. అది సుధాకర్ దగ్గర్నుంచి.
"నా చిట్టి చెల్లెల్ని చంపిన దుర్మార్గుడిని హత్య చేశాను. నా చిట్టి చెల్లెలు కులట అని తెలిసి మరి బ్రతకలేక ప్రాణాలు తీసుకుంటున్నాను. దయ వుంచి నా కధను పోలీసులకు చెప్పకండి !"
ఉత్తరం లోని సారంశమిది.
* * * *
ఇన్ స్పెక్టర్ శేఖర్ శాస్త్రి వంక చూసి -- "కళ్యాణి మరణం గురించి ఇదివరలో మీరు కొంత పరిశోధించినట్టు తెలిసింది. కమలాకరం హత్య, సుధాకర్ ఆత్మహత్య లకు ఈ కేసులో సంబంధముందనుకుంటున్నాను. ఈ పరిశోధనలో మీ సహకారం ఆశిస్తున్నాను" అన్నాడు.
"క్షమించండి ఇన స్పెక్టర్ -- నేను డిటెక్టివ్ వృత్తి మానుకున్నాను."
శేఖర్ నివ్వెరపోయాడు. అతనెంత అడిగినా శాస్త్రి నుంచి వేరే నిజాలు రాలేదు. నిరుత్సాహంగా వెళ్ళి పోయాడతను.
శాస్త్రి భార్య వెంకటరమణ భర్త నిర్ణయానికి చాలా ఆనందించింది. అయితే రమణమూర్తి మాత్రం నిరుత్సాహపడ్డాడు.
"ఒక హత్య కేసు పరిశోధిస్తే ఒక నేరస్తుణ్ణి పట్టుకోవచ్చు ననుకున్నాడు. కానీ నా పరిశోధన ఒక అమాయకుడిని హంతకుడిగా మార్చడమే కాక అతడి ప్రాణాన్ని బలిగొంది" అన్నాడు శాస్త్రి బాధగా.
రమణమూర్తి , శాస్త్రి ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.
----అయిపొయింది ----
