Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 19

 

    'సరే నువ్వు వెళ్ళు....." అన్నాడు షాజహాన్.
    "వెడుతున్నాను బాస్. వెళ్ళే ముందు మీకు మరో సారి చెబుతున్నాను. మీకై మీరు తలపడితే తప్ప నేను మీ జోలికి రాను. అప్పుడు కూడా తప్పనిసరి అయితే తప్ప మీమీద ఎదురుదెబ్బ తీయను" అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు రవి.

                                   3
    కరెంట్ పోయిన కారణంగా మ్యీట్నీ షో వదిలేసరికి ఇంకో అరగంట ఆలస్యమవుతుంది. ఫస్టు షోకి వచ్చిన వారందరి ముఖాల్లోనూ అసహనం కొట్టివచ్చినట్లు కనబడుతోంది. దియేటర్ వద్ద నీరజ కూడా అసహనంగా పచార్లు చేస్తోంది. ఆ సమయంలో ఎవరో ఆమెను పలకరించి - మిస్ నీరజ మీరే కదూ" అన్నారు.
    తన్ను పలకరించిన వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది నీరజ. అతను తనకు పరిచయస్తుడు కాడు. చూడ్డానికి నడి వయస్కుడిలాగున్నాడు. ముఖం రఫ్ గా వుంది కానీ పెద్ద మనిషిలాగే కనిపిస్తున్నాడు.
    'అవును -" అందామె.
    "మీతో అయిదు నిముషాలు మాట్లాడాలి. అలా ఎదురుగా వున్న పార్కు కు వస్తారా?" అన్నాడతను.
    "మీరెవరో నాకు తెలియదు" అంది నీరజ అనుమానంగా.
    "నన్ను రవి పంపించాడు. చాలా అర్జంటు విషయం మీతో మాట్లాడాలి."
    "మీపేరు?"
    "శంకరం" అన్నాడతను.
    నీరజ "పదండి" అంది. ఇద్దరూ కలిసి ఎదురుగా వున్న పార్కులో కి వెళ్ళారు.
    "చెప్పండి. రవి ఏమని చెప్పాడు?" అంది నీరజ ఆత్రుతగా.
    "నన్ను రవి పంపలేదు" అన్నాడతను నవ్వి.
    "మరి?"
    "మీతో మాట్లాడడం కోసం చిన్న అబద్దం చెప్పాను...."
    నీరజ ముఖంలో కంగారు కనపడింది. "ఏమిటీ మీ ఉద్దేశ్యం?"
    "ఏమీ లేదు, రవి విషయంలో చిన్న హెచ్చరిక చేసి పోదామని వచ్చాను."
    నీరజ మాట్లాడలేదు. చెప్పమన్నట్లుగా చూసింది.
    "మీరూ రవీ ప్రేమించుకున్నారు. అంతవరకూ నాకు తెలుసు. ఆ ప్రేమ ఇక మీదట కొనసాగడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను."
    "అంటే?"
    "మీరు రవిని మరిచిపొండి."
    "మరిచిపోకపోతే?"
    "మీ తలిదండ్రులు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంటిల్లిపాదీ ఘోరంగా అవమానించబడి హత్య చేయబడతారు" చాలా తాపీగా అన్నాడతను.
    నీరజ కళ్ళలో భయం కనపడింది. "ఎందుకు?"
    "మీరు రవిని మరిచిపోనందుకు?"
    "నేను రవిని మరిచిపోవడం వల్ల మీకేమిటి ప్రయోజనం?"    
    "అది మీ కనవసరం."
    "నా కనవసరమైన మీ కవసరం కాబట్టి చెప్పాలి. రవి నుంచి మీరేదో ప్రయోజన్నాశిస్తున్నారు. మా ప్రేమ కారణంగా ఆ ప్రయోజనం సిద్దించదని భయపడుతున్నారు. అదేమిటో నాకు తెలిస్తే -- నేను రవిని ప్రేమిస్తూనే మీ ప్రయోజనం సిద్దించేలా చేయగలను" అంది నీరజ.
    ఈ పర్యాయం శంకరం ముఖంలో ఆశ్చర్యం కనబడింది. అతినీ విధమైన సమాధానానికి సిద్దపడినట్లులేడు. క్షణం మాత్రం అలోచించి "అదేం కుదరదు. రవిని మీరు మర్చిపోవలసిందే....' అన్నాడు.
    "రవిని నేను మరిచిపోవడం అసాధ్యం..." అంది నీరజ.
    "అయితే సర్వనాశనానికి సిద్దపడ్డట్లేనా?"
    నీరజ మాట్లాడలేదు.
    "చూడండి. నా గురించి మీకు పూర్తిగా తెలిసినట్లు లేదు. నేను వేళాకోళనికి మీకివన్నీ చెప్పడం లేదు. అన్నంత పనీ చేయగలను నేను" అన్నాడు శంకరం.
    "ప్రమాదకరమైన వ్యక్తులతో వేళాకోళలాడ్డం నాకూ ఇస్జ్తముండదు. కానీ నేను రవిని ప్రేమించాను. అతడు లేకపోతె నేను బ్రతకలేను. అతను లేకుండా జీవించడం కంటే సర్వనాశన మైపోయినా బాధ లేదనిపిస్తుంది నాకు."
    "మీరు రవిని మాత్రమే ప్రేమించారా? మీవారేవ్వరినీ ప్రేమించడం లేదా? మీకు జీవితం మీద ఆశ లేకపోయినంత మాత్రాన వారందరికీ ఉండకూడదని లేదు గదా-- మీకోసం వారందర్నీ బలిచేయడం బాగుందా నీకు"అన్నాడు శంకరం.
    "లేదు. కానీ ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు. ఇతరుల కోసం నేను రవిని వదులుకోలేను" అంది దృడంగా నీరజ.
    'అయితే సర్వనాశనం తప్పదు."
    "మీరూ మరొక్కమారు ఆలోచించండి. రవి నుంచి మీరశిస్తున్న ప్రయోజనమేమిటో చెప్పండి. ఆది తప్పక నెరవేరుస్తాను. ఆవిధంగా ఉభయులకూ జననష్టం లేకుండా పని జరుగుతుంది" అంది నీరజ.
    ఈ పర్యాయం శంకరం కాస్త ఆలోచనలో పడ్డట్లు కనపడ్డాడు.
    అయిదు నిముషాల సేపు వారిద్దరిమధ్యా మౌనం రాజ్యమేలింది.
    "షాజహాన్ పేరు విన్నారా మీరు?' అన్నాడు శంకరం.
    "విన్నాను. ఆ పేరు వింటేనే నా ఒళ్ళు జలదరిస్తుంది భయంతో" అంది నీరజ.
    "నా పనులు కావాలంటే అతనితో భేటీకీ సిద్దపడాలి" అన్నాడు శంకరం.
    "ఎందుకని?"
    "అతను నేనూ గూడా నాలుగు ప్రయోజానాలు సాధించాలని ప్రయత్నిస్తున్నాం. అందుకు రవి లాంటి సమర్ధుడి అవసరమెంతైనా ఉంది. రవి నాకోసం అవి సంపాదించాలంటే అతను విధిగా షాజహాన్ తో భేటీ కావాలి . సిద్దమేనా?"
    "సిద్దమే?" అంది నీరజ.
    "షాజహాన్ అంటే భయం లేదు..."
    "రవిని దక్కించుకోడానికి దేవుడితో భేటి వచ్చినా భయపడను."
    శంకరం ముచ్చటగా ఆమె వంక చూసి "ప్రేమ కధల్లో తప్ప ఉందనుకునేవాణ్ణి. ఆమాట అబద్దమని ఇప్పుడనిపిస్తోంది. అయితే రవి నుంచి నేనశించే మొదటి ప్రయోజనమేమిటో చెబుతాను విను" అన్నాడు. 'ఇన్ స్పెక్టర్ రఘురాం వద్ద నా వేలిముద్ర ఫోటో లున్నాయి. అవి నావి అని వారికి తెలియదు. నేరం జరిగిన ప్రాంతంలో నెలరోజుల క్రితం పోలీసులు వాటిని కనుగొన్నారు. అవి పోలీసు రికార్డు లో ఉండడం నా కిష్టం లేదు. వాటిని నాకు సంపాదించి పెట్టాలి."
    "సరే - వీటి వల్ల షాజహాన్ కేం ప్రయోజనం?" అంది నీరజ.
    "మేమిద్దరం ప్రత్యర్దులం. ఆ బేరం జరిగిన ప్రాంతంలో మా ఇద్దరివీ కూడా వేలిముద్ర లున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వెళ్ళడం వల్ల జరిగిందది. ఎవరి వేలిముద్రలు సంపాదించడానికి వాళ్ళం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో విజయం ఒకరిని మాత్రమే వరించడం తధ్యం. ఒకసారి మోసం జరిగితే రెండోసారి విషయంలో పోలీసులు జాగ్రత్త పడిపోతారు...." అన్నాడు శంకరం.
    "మరి మీ వేలిముద్రలను గుర్తు పట్టడమెలా?"
    శంకరం తన చొక్కా జేబులోంచి ఒక చిన్న కవరు అందించాడు నీరజకు. "ఇందులో నా వేలిముద్రల ఫోటో ఒకటుంది. అయిడేంట్ ఫికేషన్ కు పనికొస్తుంది."
    నీరజ అందుకుంది.
    "చూడండి. మిమ్మల్ని అనుక్షణం నీడలా వెన్నాడు తుంటాను. మిమ్మల్ని నమ్మి నా పని అప్పగిస్తున్నాను. మోసం జరిగితే మాత్రం మీకు సర్వనాశం తప్పదు. పోలీసులతో లాలూచీ పడ్డా, ఈఫోటోలు ప్రింట్స్ తీయడానికి ప్రయత్నించినా సహించను. నన్ను నేను రక్షించుకునెందుకు నా ఏర్పాట్లు నాకున్నాయి...." అన్నాడు శంకరం.
    "మోసం ప్రసక్తి లేదు." అంది నీరజ.
    'అయితే ఈపని చేయడానికి సరిగ్గా రెందేరోజులు వ్యవధి ఇస్తున్నాను. ఎల్లుండి సాయంత్రం మిమ్మల్నిక్కడ ఇదే సమయంలో కలుసుకుంటాను. ఒంటరిగా ఒక్కరూ రావాలి మీరు. రవిని కూడా తీసుకురావడం కానీ, మీకు రక్షణగా నిఘా ఏర్పాటు చేసుకోవడం కానీ జరుగకూడదు...."
    "అలాగే" అంది నీరజ. శంకరం గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు.
    నీరజ ఆలోచనలో పడింది. తన ప్రేమ ఫలిస్తుందా? అని అదేపనిగా అలోచిస్తోందామే. పరిస్తితులు తన ప్రేమ కనుకూలంగా వున్నట్లు లేవు.
    రవితో మాట్లాడి ఇందుకు ఒప్పించినా పోలీసుల వద్ద నుంచి వేలిముద్రలు సంపాదించడం అతి సామాన్యమైన వ్యవహారం కాదు. ఒకవేళ సంపాదించినా అదింకా శంకరం కోరిన మొదటి పని మాత్రమే. అలాంటివి మరో మూడు చేయాలి.
    నీరజకు సినిమా చూడాలని లేదు. అయినా తప్పదు ఏడున్నరకు హాలు దగ్గర కలుసుకుంటానని చెప్పాడామెకు రవి.

                                 4
    నీరజకు సినిమా బుర్రలోకి ఎక్కడం లేదు. ఆమె వుండి వుండి టైము చూసుకుంటోంది. టైము ఏడున్నర కాగానే నిట్టూర్చి హాల్లోంచి బయటకు వచ్చిందామె. బయట ఆమె కోసం ఎదురు చూస్తున్న రవి వెంటనే కనిపించాడు.
    "రవీ!" అందామె ఉత్సాహంగా. ఆమెను చూస్తూనే రవి ముఖం వెలిగిపోయింది.
    "ఎక్కడికి పోదామో చెప్పు" అన్నాడు రవి.
    "చాలా సీరియస్ విషయం మాట్లాడాలి రవీ" అంది నీరజ.
    "నీతో సీరీయస్ విషయాలు మాట్లాడడం నాకిష్ట ముండదు" అన్నాడు రవి.
    "కానీ నేను కావాలనుకుంటే తప్పదు...." అంది నీరజ.
    ఇద్దరూ హాలు కెదురుగా ఉన్న పార్కులోకి వెళ్ళాక ఓ మూల కూర్చున్నాక నీరజ రవికి తన దగ్గరున్న కవరు అందించింది.
    "ఇదేమిటి?'అన్నాడు రవి.
    "ఇన్ స్పెక్టర్ రఘురాం వద్ద ఈ కవర్లో ఉన్నలాంటి ఫోటో ఉంది. అది సంపాదించాలి నువ్వు" అంది నీరజ.
    "ఎందుకు?"
    "నన్ను వివరాలాడగోద్దు. ఈ పని నీవల్ల అవుతుందో కాదో చెప్పు. దాని మీదే మన పెళ్ళి ఆధారపడి ఉంది...."
    రవి ముఖంలో అనుమానం తొంగి చూసింది. "నేను షాజహాన్ ను వదిలిపెట్టింది నీ ప్రేమకోసం. కానీ నువ్వూ ఇంకో షాజహాన్ లా ప్రవర్తిస్తున్నావు. నా ప్రేమను నీ స్వంత పనులు కుపయోగించుకోవాలనుకుంటున్నావు."
    నీరజ బాధగా రవి వంక చూసి "నువ్వు నన్ను నమ్మలేవా?' అంది.
    "కానీ నువ్వు చెప్పిన పని...."
    "నిజంగా నా స్వంత పని కోసం కాదు. కేవలం మన ప్రేమ ఫలించడం కోసం. ఇప్పుడే ఇలా అనుమానిస్తే ఎలా? ఇంకా ఇలాంటివి మరికొన్ని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన పెళ్ళి జరుగుతుంది."
    "నేను చేయకపోతే...."
    "నీ నీరజ కుటుంబసహితంగా దారుణహీంసలకు గురవుతుంది. ఆతర్వాత చచ్చిపోతుంది."
    నీరజ నెవరో బెదిరించారని రవికి అర్ధమైంది. ఆ బెదిరించిన వ్యక్తీ షాజహాన్ కావచ్చునని కూడా అతనికి తోచింది -- అందుకే "నేనీ పనులు చేసినంత మాత్రాన మన ప్రేమ ఫలించి మన వివాహం జరుగుతుందని నీకు నమ్మకంగా ఉందా?" అన్నాడు.
    "ఉంది, అవన్నీ నేను చూసుకోగలను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS