"కలా? కలేమిటి? .... నిజంగా..... నా కళ్ళారా చూశాను" అంది సుజాత.
మధు ఆమెను గట్టిగా కుదిపి-"నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? రాత్రి మనిద్దరం కలిసి పడుకున్నాం. ఈలోగా నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావు? ఏం హత్య చేశావు?" అన్నాడు.
అప్పటికి సుజాత ఈ లోకంలోకి వచ్చింది. మరోసారి చుట్టూచూసి, "అవును నేనెక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే వున్నాను. అయితే ఇదంతా కలన్నమాట!" అని నిట్టూర్చింది.
"నీకు వచ్చిన ఆ భయంకరమైన కలేమిటో నేనూ తెలుసుకోవచ్చా?" అన్నాడు మధు.
"అది కలలా లేదండీ-కళ్ళముందు జరుగుతున్న నిజంలా వుంది. అది కలంటే నాకూ నమ్మకం కలగడం లేదు" అంటూ సుజాత తన కల వివరాలన్నీ చెప్పింది.
"ఇలాంటి కల నీకెందుకు వచ్చింది? ఎక్కడయినా ఎప్పుడయినా హత్య చూశావేమిటి?" అన్నాడు మధు.
"లేదండీ-కలలో కాబట్టి బ్రతికిపోయాను గానీ నిజంగా ఇలాంటి హత్యచూస్తే నా ప్రాణాలు ఆ క్షణంలోనే పోయి వుండేవి-" అంది సుజాత.
"అయితే మనం క్రైమ్ పిక్చర్స్ చూడ్డం మానేయాలి. వాటి ప్రభావమే అయుంటుందిదంతా-" అన్నాడు మధు.
"బాగుందండీ - ఆ లెక్కన క్రైమ్ నవల్సుకూడా చదవకూడదు. సినిమాలు చూసీ, నవల్సు చదివీ పాడుచేసుకునేటంత బలహీనపు బుర్రకాదు నాది. ఈ కల ఎందుకు వచ్చిందో చెప్పలేను....."
"నిజమేలే-కలలెందుకు వస్తాయో సరయిన కారణం ఇంతవరకూ ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు...." అంటూ లైట్లు ఆర్పడానికి వెళ్ళబోయాడు మధు.
"వద్దండీ-ఈ రాత్రికి లైటు వెలగనివ్వండి...." అంది సుజాత.
"ఇప్పుడేకదా బలహీనపు బుర్ర కాదన్నావు. మళ్ళీ ఇంతలోనే భయం ఎక్కణ్ణించి వచ్చింది?" అన్నాడు మధు వేళాకోళంగా.
"హత్యచేసే సమయంలో వాడెంత భయంకరంగా వున్నాడో మీరూహించలేరండీ. అలాటి మనిషి ఎప్పుడయినా నాకు తటస్థపడితే భయంతో గుండె ఆగి చచ్చిపోతానేమో కూడా" అంది సుజాత.
మధు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.
2
"ఈరోజు రాత్రి మనింటికి ఒక అతిధి భార్యా సమేతంగా వస్తున్నాడు. వంటకాలన్నీ అద్బుతంగా వుండాలి" అన్నాడు మధు.
"ఏమిటి విశేషం?" అంది సుజాత.
"క్లబ్బులో పరిచయమయ్యాడతను. చాలా కలుపుగోలు మనిషి. పేరు సుధాకర్. చాలా అందగాడని ఆడవాళ్ళుకూడా అంటారు. అతనిది ప్రేమ వివాహమనుకుంటాను. అతని భార్య చాలా బాగుంటుంది. తన భార్య అందమైనదని అతనికి బాగా గర్వముంది. ఆ గర్వం అణచడానికే అతన్ని మనింటికి ఆహ్వానించాను...." అన్నాడు మధు.
"బాగుందండీ-నేనేమైనా ఆటబొమ్మననుకున్నారా అతిథులముందు ప్రదర్శించడానికి..." అంది గర్వంతో సిగ్గును మిళితం చేస్తూ సుజాత.
"అదికాదు సుజా, క్లబ్బులో మేము కలుసుకున్నప్పుడల్లా అతను తన భార్యను అదేపనిగా పొగుడుతుండేవాడు. తన భార్యకు అందంతో పాటు అలంకరించుకునే తెలివితేటలున్నాయిట. చీరకట్టులో ఆమె స్పెషల్ ట. ఇల్లు ఎలా అమర్చుకోవాలో అంతా ఆమె దగ్గర నేర్చుకోవాలిట. వంటచేసిందంటే ఆ రుచికి తిన్న వారందరూ మూర్చపోవాలిట. ఆమెకు రానిపని లేదు. ఇన్నిపనులూ చేసి కూడా ఆమె అప్పుడప్పుడూ భర్తతోపాటు క్లబ్బుకు కూడా వస్తుంది.
అలా వచ్చినపుడు ఓసారి నాకు అతనామెను పరిచయంచేసి-'సాధారణంగా ఆడవాళ్ళు క్లబ్బుకు రాక పోవడానికి రెండే కారణాలు. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. రెండు ఇంటిపనులతో సతమతమవుతుండడం. మా ఆవిడకు ఈ రెండు సమస్యలూ లేవు-' అన్నాడు. అప్పుడు నాకు బాధ కలిగింది. బహుశా నీ గురించి అతనలాగా అనుకుంటున్నాడేమో ననిపించింది. క్లబ్బు వాతావరణం నీకు పడదనీ-అందుకే నేనుకూడా కర్టెసీ కోసం ఇక్కడ అటెండెన్సు వేయించుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోతాననీ అతనికి చెప్పాను. కానీ అతను అప్పుడు అదోలా నవ్వాడు. ఆ నవ్వు చూడగానే ఆ దంపతులకు నిన్ను చూపించాలనిపించింది" అన్నాడు మధు.
"మీకు నాపైనగల అభిమానానికి చాలా సంతోషం కానీ మీకింతటి కాంప్లెక్సు పనికిరాదు. మనం బ్రతికేది ఎదుటి వాళ్ళకోసం కాదండీ మనకోసం, మన ఆనందం ఫస్టు. మిగతావన్నీ నెక్స్ట్ సరే-ఈసారికి మీకోరిక తీరుస్తాను గానీ, ఇకముందెన్నడూ ఈ కారణంగా అతిథులను పిలవకండి. మనని అభిమానించేవాళ్ళూ మనం కావాలనుకునే వాళ్ళూ-వీళ్ళు మాత్రమే మన స్నేహితులు" అంది సుజాత.
మధు వెళ్ళిపోయాక సుజాత ఇల్లంతా నీటుగా సర్దింది. సుమారు గంటసేపు ఆలోచించింది వంటకాలు గురించి. అన్నీ ముందుగానే ఆలోచించుకున్నా మధ్యాహ్నం ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు. సుధాకర్ నిజంగా అంత అందగాడా? తన భార్య తప్ప ఈ ప్రపంచంలో అందగత్తెలే లేదనుకుంటున్నాడా? తన్ను చూసేక అతని అభిప్రాయం మారుతుందా?
సాయంత్రం వంట పూర్తయ్యేక సుజాత అలంకరణకు రోజూకంటే చాలా ఎక్కువసేపు పట్టింది. అద్దంలో తనను తాను తృప్తిగా చూసుకొని-"ఇంతకూ అలంకరణమీద ఎన్నడూలేని శ్రద్ధ ఈరోజు నాక్కలగడానికి కారణమేమిటి? నేను నా భర్త కోరికను తీరుస్తున్నానా? లేక సుధాకర్ ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నానా?" అని తనను తాను ప్రశ్నించుకున్న దామె. సమాధానం సంతృప్తికరంగా లేదు.
ఏడుగంటల ప్రాంతంలో మధు, సుధాకర్ కలసి వచ్చారు. మధు సుజాతను తన స్నేహితుడికి పరిచయం చేశాడు. సుధాకర్ భార్య రాధికను సుజాత లోపలకు తీసుకువెళ్ళింది. సుధాకర్ కళ్ళలోని ఆశ్చర్యాన్ని గమనించిన మధు లోలోన సంబరపడ్డాడు.
సుధాకర్ మధు ఇల్లంతా తిరిగి ఆ ఇంటివారి అలంకరణలన్నీ, అభిరుచుల్నీ మెచ్చుకోలేకుండా ఉండలేక పోయాడు. మధుకు ఎంతో తృప్తిగా వుంది.
ఎనిమిది గంటల ప్రాంతంలో అంతాకలిసే భోజనాలకు కూర్చున్నారు. సుజాత అన్నింటినీ పొందికగా టేబుల్ మీద సర్దింది.
భోజనానికి కూర్చుంటూ-"మావారికి నన్ను పొగడటం మినహా వేరే పనిలేదు. ఇలాంటి చోట్లకు నాలుగయిదు సార్లు వస్తే ఆ పని మానతారేమో చూడాలి. నాకు మాత్రం ఈ ఇల్లుచూశాక-మా ఆయన నన్ను పొగుడుతున్నందుకు సిగ్గుగాకూడా వుంది. మీరు మా యింటికి వచ్చారంటే రాజునుచూసిణ కళ్ళతో ఇంకెవర్నో చూసినట్లుంటుంది" అంది రాధిక.
సుజాత నవ్వి-"నాకు తెలుసులెండి. ఈ విధంగా మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. మా ఇల్లు కూడా చూడండి అని సవాల్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తూనే మీవి ఉత్తమ అభిరుచులని తెలుసుకోగలిగాను. మీ కర్టెసీకి చాలా థాంక్స్" అంది.
"అబ్బ-ఎంత తెలివిగా మాట్లాడేరండీ. మిగతా విషయాలు చెప్పలేను గానీ - ఇంత తెలివిగా మాట్లాడటం మాత్రం మా ఆవిడకు రాదు" అన్నాడు సుధాకర్.
సుజాత బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి.
"సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలంటే నాకు చాలా ఇష్టం. కానీ మా ఆవిడకు సిగ్గుపడడం చేతకాదు....." అన్నాడు సుధాకర్.
