Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 19

    రమణరావు  రోశయ్య కు క్లోరో ఫాం వాసనా చూపి స్పృహ పోగొట్టాడు. ఆయన్ను నెమ్మదిగా పెట్టెలోకి చేర్చి మూత వేశాడు. మూత వేస్తూ రోశయ్య వంక జాలిగా చూసి "నాకోసం మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను గదా!' అనుకున్నాడు.
    అతడికి రోశయ్య ను ఎక్కువసేపు ట్రంకు లో వుంచడం ఇష్టం లేదు. అందుకని వేగంగా ఓ రిక్షాను పీల్చుకుని వచ్చాడు. పెట్టె చూపించి మీనాక్షి కి బేరమాడాడు.
    రిక్షావాడు పెట్టెనోసారి కదిపి "చాలా బరువుందండి. దీన్ని నేనే రిక్షా లో వేసి మీరూం దాకా మోసుకు రావాలంటే మొత్తం పది రూపాయలివ్వాలి" అన్నాడు.
    "సరే -- అలాగే" అన్నాడు రమణరావు .
    పదిరూపాయల బేరం రిక్షా వాడికి ఎనలేని బలాన్ని తెచ్చి పెట్టింది. వాడొక్కడే ఈడ్చి ఆ పెట్టెను రిక్షాలోకి జేరవేశాడు. రిక్షాను శరవేగంతో హోటల్ కు తీసుకుపోయాడు.
    రమణరావునీ, పెట్టెనూ కూడా అక్కడ చాలామంది విచిత్రంగా చూశారు. రమణరావు ఎవర్నీ పట్టించుకోకుండా పదహారో నంబరు గదికి వెళ్ళిపోయి కాలింగ్ బెల్ మ్రోగించాడు.
    కౌముది వచ్చి తలుపు తీసింది. రమణరావు  వంకా, అతడి వెనుకనే వున్న రిక్షా వాడి నెత్తి మీద పెట్టి వంకా సంతృప్తిగా చూసిందామె. పెట్టి లోపల పెట్టాక రిక్షా వాడికి డబ్బులిచ్చి పంపేశాడు రమణరావు .
    అప్పుడు తలుపులు లోపల్నుంచి గడియ వేసి "ట్రంకు పెట్టి తేరు!' అంది కౌముది.
    హటాత్తుగా మారిన ఆమె సంబోధనకు ఆశ్చర్యపడ్డాడు రమణరావు .
    "ఈ క్షణం నుంచీ నిన్నిలాగే పిలుస్తాను. అప్పుడే నిన్ను నా ఆత్మీయుడిని చేసుకున్నాను" అంది కౌముది.
    'చాలా సంతోషం కౌముది!"అంటూ ట్రంకు పెట్టి తెరిచాడు రమణరావు . అందులోకి ఆత్రుతగా చూసింది కౌముది. అప్రయత్నంగా ఆమె పళ్ళు పటపటా లాడాయి.
    "వాణ్ని బయటకు తీయి. త్వరగా స్పృహ తెప్పించు" అంది కౌముది.
    రమణరావు రోశయ్యను పెట్టెలోంచి బయటకు తీసి మంచంమీద పడుకోబెట్టాడు.
    కౌముది రోశయ్య వంకే కొద్ది క్షణాలు పరిశీలనగా చూసి ఏదో ఆలోచనలో పడిపోయింది. ఆమె ఆలోచనల్లో వుండగానే రోశయ్య కు స్పృహ వచ్చి కళ్ళు తెరిచి - "నేనెక్కడున్నాను?' అంటూ గింజుకోసాగాడు.
    "నా ఎదురుగా?' అంది కౌముది అదోలా నవ్వుతూ.
    "ఎవర్నువ్వు?' నువ్విక్కడికేలా వచ్చావ్?' అన్నాడు. రోశయ్య. అతడు తన బంధనాలు విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
    "నిన్నీ మనిషి నాకోసం తీసుకువచ్చాడు?' అంది కౌముది.
    అప్పుడే రోశయ్య రమణరావుని చూశాడు "నీచుడా! ఇదా నువ్వు చేసిన పని! నన్నెందుకిలా బంధించి ఇక్కడికి తీసుకొచ్చావు?' అన్నాడు.
    "ఆమె కోరింది. నేను తెచ్చాను. నేనామెకు విధేయుడ్ని!" అన్నాడు రమణరావు .
    "ఆమెకు విదేయుడివా - నన్నామే చంపమన్నా చంపుతావా?' అన్నాడు రోశయ్య.
    "నేను చంపమనడమూ, అతను చంపడమూ , నువ్వు చావడమూ -- అన్నీ తధ్యమే!"అంది కౌముది.
    రోశయ్య ఆమె వంక చూసి -- "ఎవర్నువ్వు?' అన్నాడు.
    "ఇందుమతీ కూతుర్ని " అంది కౌముది.
    "ఇందుమతీ ఎవరు?"
    "నీ చేతుల్లో చచ్చిపోయిన మా అమ్మ!" అంది కౌముది.
    "నువ్వనేదేమీ నాకు అర్ధం కావడం లేదు" అన్నాడు రోశయ్య.
    "నీ చేతుల్లో ఎంతమంది అమ్మాలు చచ్చిపోయారో -- అంతమందిలో ఇందుమతి గుర్తుందనుకోవడం నా తెలివి తక్కువ" అంది కౌముది.
    కొండమెట్లు ఎక్కుతుంటే నలిగే కాలి కింది చీమలు గురించి రోశయ్య చెప్పడం గుర్తొచ్చింది రమణరావుకి.
    "నిజంగా నాకేం తెలియదు" అన్నాడు రోశయ్య.
    "తప్పు ఒప్పుకో" అంది కౌముది.
    "తప్పు చేయనపుడు ఎలా ఒప్పుకునేది?'అన్నాడు రోశయ్య.
    "ఒప్పుకోకపోతే ...." అని ఆవేశంగా ఆగింది కౌముది.
    "ఊ ఒప్పుకోకపోతే ...."అన్నాడు రోశయ్య.
    "నాకసలే ఆవేశం ఎక్కువ. నేను స్వయంగా నిన్ను క్రూరంగా చంపేస్తాను."
    "ఒప్పుకుంటే...."
    "ఒప్పుకుంటే నాక్కాబోయే భర్త చేతిలో నీ మరణం సంభవిస్తుంది. అతడికి నాకున్న ఆవేశం లేదు. కాబట్టి ఒకే ఒక్క కత్తి పోటుతో నీ ప్రాణం పోవచ్చు--"
    "ఎలాగూ నాకు చావు తప్పదన్న మాట" అన్నాడు రోశయ్య. తర్వాత అయన రమణరావు  వంక తిరిగి -- "నిన్ను నమ్మాను. నాకిలా అన్యాయం చేయడం నీకు న్యాయమా?' అన్నాడు.
    "నేను కౌముది కి విధేయుడ్ని!"అన్నాడు రమణరావు .
    రోశయ్య కళ్ళు మూసుకుని "నిన్ను నమ్మినందుకు నాకు మంచి శాస్తి జరిగింది. ఎలాగూ చచ్చేటప్పుడు సుఖంగా చావడమే మంచిది " -- అని -- "అమ్మా-- కౌముదీ తప్పు ఒప్పుకుంటున్నాను" అన్నాడు.
    "ఒప్పుకుంటే చాలదు. నువ్వు చేసిన పాపం నీ నోటితో వివరంగా చెప్పాలి" అంది కౌముది.
    "ఏం -- కూడా ఏదైనా టేపు రికార్డరు తెచ్చావా?" అన్నాడు రోశయ్య.
    కౌముది అదోలా నవ్వి -- "నిన్ను జైలుకు పంపడానికి ప్రాణం లేని టేపు రికార్డరెందుకు? ప్రాణాలున్న మీనాక్షే వున్నారు..."అంది.
    రోశయ్య ఉలిక్కిపడి - "మీనాక్షి బ్రతికే వుందా ?' అన్నాడు.
    "మీనాక్షి ఎవరు?" అన్నాడు రమణరావు  ఆశ్చర్యంగా.
    మీనాక్షి ఎవరో నువ్వే రమణరావు కు చెప్పు!"అంది కౌముది.
    "అది నా వ్యక్తిగత విషయం. ఎవరికీ చెప్పను--" అన్నాడు రోశయ్య.
    "నువ్వు చెప్పక్కర్లేదు. ఆ కధ చెప్పడానికి మీనాక్షి వుంది"అంది కౌముది.
    రోశయ్య కంగారుగా రమణరావు  వంక చూసి -- "రమణరావ్! ఈమె ప్రమాదకరమైన వ్యక్తీ! మీనాక్షి కధ  బయటకు వస్తే పునాదులు కదుల్తాయి. మీ నాన్న, నేను కలిసికట్టుగా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ ప్రభుత్వం పాలవుతుంది. ముందు నా కట్లు విడిపించు" అన్నాడు.
    రమణరావు  శరీరంలో వణుకు ప్రారంభమైంది.
    ఎవరీ కౌముది? ఆమె చెబుతున్న మీనాక్షి ఎవరు?మీనాక్షి కధతో తమ అస్తులేలా ముడిపడి వున్నాయి. ఇందులో తన తండ్రి పాత్ర ఏమిటి?
    కౌముది రమణరావు  వంక చూసి -- "క్షణం ఆలశ్యం చేయకు. వీడ్ని చంపేయ్" అంది.
    ఆమె నోటి నుంచి ఆ మాట వచ్చిందే తడవుగా రమణరావు  తన వద్ద నున్న కత్తితో మూడు పోట్లు పొడిచాడు. రోశయ్యను. మొదటి పోటుకు రోశయ్య పెద్దగా అరిచాడు. రెండో పోటుకు సన్నగా మూలిగాడు. మూడో పోటుకు మరి మాట్లాడలేదు.
    "చచ్చాడు!" అన్నాడు రమణరావు . అతను తన జేబులోంచి రుమాలు తీసి కత్తిని దాంట్లో చుట్టి మళ్ళీ జేబులో వుంచుకున్నాడు!
    "దేశానికి పీడా విరగడైంది. ముందు వీణ్ణిక్కడ్నించి తీసుకుపోయి మళ్ళీ రా!" అంది కౌముది.
    రమణరావు రోశయ్య ను జాగ్రత్తగా ట్రంకు లోకి ఎక్కించాడు. తర్వాత ట్రంకు మూసి "మరి నేను వెడతాను. నువ్విక్కడే వుంటావుగా" అన్నాడు.
    "ఉంటాను. నీకోసం ఎదురు చూస్తూ!' అంది కౌముది.
    రమణరావు  బైటకు వెళ్ళాడు. కొద్ది నిముషాల్లో అతను ఓ కూలివాడ్ని తీసుకుని వచ్చాడు. ట్రంకు సహా అతను బైటకు వెళ్ళాడు. కౌముది తలుపులు వేసుకొంది.


                                    7
    సరిగ్గా అరగంటైనా కాకుండా ఎవరో  తలుపు తట్టగా వెళ్ళి తలుపు తీసింది కౌముది.
    తలుపుల అవతల రమణరావు  కనిపించాడు. అప్పుడే అతను శవాన్ని వదిలించుకు రాగలిగినందుకు ఆశ్చర్యపోతూ ఏదో అడగబోయి ఆగిపోయింది ఆమె. రమణరావు  హడావుడిగా లోపలకు జొరబడ్డాడు. ట్రంకు నెత్తి మీద పెట్టుకుని వున్న కూలివాడు అలా ఎక్కువసేపు నిలబడలేక తనూ లోపలకు జొరబడ్డాడు.
    త్వరగా ఆ ట్రంకు లోనికి దించారు. కూలివాడు వెళ్ళిపోయాడు.
    తను తలుపులు వేసి "ఏమిటిది?' అని అడిగింది కౌముది.
    "ఏకారణం గానో ఊరంతా పోలీసులు తిరిగుతున్నారు. ఎవరైనా రాజకీయనాయకుడు వచ్చాడో, వస్తాడో ఏమోనని అనుమానం వుంది. తెల్లవారే లోగా ఎలాగో అలా ఈ శవాన్ని వదుల్చుకు వస్తాను. ఈలోగా ఏదో కులాసాగా గడపాలని అనిపించింది...." అన్నాడు రమణరావు .
    "అయితే ఈ ట్రంకును మంచం క్రిందకు తోసేద్దాం" అంది కౌముది.
    ఇద్దరూ కలిసి కష్టపడి సాయం పట్టి ట్రంకును మంచం క్రిందకు తోసేశారు.
    రమణరావు  చనువుగా కౌముది భుజం మీద చేయి వేసి దగ్గరగా లాక్కోసాగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS