రాజకుమారుడు - బ్రహ్మ రాక్షసి

త్రిరూపదేశపు రాజకుమారి స్వరూప రాణి త్రిలోక సుందరిగా పేరు పొందింది. ఆమె చిత్రపటాన్ని చూసి ఎందరో రాజకుమారులు మతులు పోగొట్టు కున్నారు. ఆమెను చేపట్టే అదృష్టం తమకు కలగాలని దేశదేశాల రాజకుమారులు కలలు గంటున్న సమయంలో రాజకుమారి స్వయం వర ప్రకటన దేశ దేశాలకు పంపబడింది.
స్వరూపరాణి అడిగే క్లిష్టమైన ప్రశ్నకు సరియైన సమాధానం అందరి కంటే ముందు తేగగిలిగిన రాజకుమారుణ్ణి ఆమె వరిస్తుంది.
ఇది వింటూనే దేశ దేశాల రాజకుమారులు ఉత్సాహంగా త్రిరూప దేశానికి బయల్దేరారు.
విరూపదేశపు రాజకుమారుడు వీరచంద్రుడు అలా బయల్దేరిన వారిలో ఒకడు. అయితే సమయానికి అతడి తండ్రి అస్వస్థుడు కావడం వల్ల అతడి ప్రయాణం ఆలస్యమైంది. అతను త్రిరూపదేశం రాజధాని నగరం చేరుకునే సమయానికి అక్కడ బొత్తిగా స్వయం వర కోలాహలం ఏమీ లేదు. అయినప్పటికీ వీరచంద్రుడు తను వచ్చిన విషయం స్వరూపరాణికి కబురు చేశాడు.
రాజకుమారి అతన్ని ఆహ్వానించి ఇంత ఆలస్యంగా వచ్చారేమని అడిగింది.
స్వరూపరాణి అందం చూస్తూ మైమరచి పోయిన వీరచంద్రుడామే ప్రశ్నకు వినలేదు. ఆమె మళ్ళీ అదిగాక కాని అతను జవాబు చెప్పలేక పోయాడు.
"ఇప్పటికే తొంబై తొమ్మిది రాజకుమారులు నా ప్రశ్న విని వెళ్ళారు. మీరు నూరవ వారు. వందమందికి మించి ప్రశ్న అడిగే ఉద్దేశ్యం నాకు లేదు. మీరు చాలా అదృష్టవంతులు. మరికాస్త ఆలస్యమై ఉంటే మీరు వచ్చిన దారినే వెనక్కు వెళ్ళవలసి ఉండేది" అంది స్వరూపరాణి.
వీరచంద్రుడు తన అదృష్టాన్ని తనే అభినందించుకుని, "మీ ప్రశ్న అడగండి" అన్నాడు.
"తాండవ వన మధ్యం లో విధ్వంసక పర్వతం ఉంది. అందులో ఒక గుహ ఉంది. ఆ గుహలోంచి ఐ=నిత్యం ఆగకుండా పొగలు వస్తాయి. ఆ గుహలో ఏముందో తెలుసుకుని చెప్పాలి నాకు " అంది స్వరూపరాణి.
వీరచంద్రుడు వెంటనే లేచి నిలబడి, "ఇప్పటికే ఆలస్యమయింది. నేను బయల్దేరతాను " అన్నాడు. రాజకుమారి అతణ్ణి ఒక్క క్షణం ఆగమని ఓ ఉంగరాన్ని చేతికిచ్చి , "దీన్ని ధరించండి. ఒకసారి వ్రేలికి పెట్టుకున్నాక ఇది బయటకు రాదు" అంది.
వీరచంద్రుడా ఉంగరం ధరించి, "దీని ప్రయోజనమేమిటి ?' అనడిగాడు.
"ఆ ఉంగరం మీది సంఖ్య చూడండి" అంది స్వరూపరాణి.
వీరచంద్రుడు చూశాడు. ఉంగరం పైన రాళ్ళు పొదగవలసిన స్థానంలో వంద అంకె వేసి ఉంది.
"నేనడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనది. జవాబు తెలుసుకోవడంలో ఎన్నో ప్రమాదాలుంటాయి. అవేలాంటివో ఊహించడం కూడా కష్టం. నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి రాజకుమారుడికీ ఒక ఉంగరం ఇచ్చి ఆ సంఖ్యనూ, అతడి పేరునూ రాసుకుంటున్నాను. తర్వాత మిమ్మల్ని గుర్తించడానికి ఈ ఉంగరం మీది సంఖ్య మాత్రమే ఆధారం కావచ్చు " అంది స్వరూపరాణి. ఆమె చెప్పిన వివరాలు వింటూ వీరచంద్రుడు అదిరి పడ్డాడు. "నిజం గానే ఇది ప్రమాదకరమైన ప్రయత్నమా లేక రాజకుమారి తనను భయపెట్టడానికి ప్రయత్నిస్తోందా?'
ఏది ఏమైనా అతడు కార్యం సాధించుకు రావాలనే అనుకున్నాడు. స్వరూపరాణి అందంలో ఉన్న ఆకర్షణ అటువంటిది.
2
త్రిరూపదేశంలో ఎవరినడిగినా తాండవనం గురించి ఏ వివరాలు చెప్పలేకపోయారు. ఒక గ్రామంలో వృద్దుడు మాత్రం అది ప్రతీన దేశంలో ఉన్నట్లు తన తాత అనేవాడని అన్నాడు. ఆమాత్రం సమాచారం లభించగానే వీరచంద్రుడు ఉత్సాహంగా తానెక్కిన ఉత్తమాశ్వాన్ని ప్రతీపదేశానికి మళ్ళించాడు. మధ్య మధ్య మజీలీలు వేసుకుంటూ రెండు రాత్రులూ, రెండు పగళ్ళూ ప్రయాణం చేసి అతను ప్రతీప దేశం చేరుకున్నాడు.
ప్రతీప దేశం ఎంతో విశాలమైనది. జనాభా చాలా తక్కువ. పూరుకీ ఊరుకీ మధ్య అరణ్యాలు, కొండలు ఉంటున్నాయి. ఈ కారణాలవల్ల దేశానికి రాజున్నా ఏ ఊరికా ఊరే స్వతంత్రంగా ఉన్నట్లుంది.
వాకబు చేయగా తాండవనం సిరిపల్లె అనే గ్రామాన్నానుకుని ఉన్నట్లు తెలిసింది. వీరచంద్రుడు ప్రజల్ని దారి అడిగి తెలుసుకుని సిరిపల్లె వేపు బయల్దేరి మునిపల్లె అనే గ్రామాన్ని చేరుకొని రాత్రి కావడంతో అక్కడ విశ్రమించాడు.
మునిపల్లె చిన్న గ్రామమే అయినప్పటికీ ఊళ్ళో వంద దాకా ఇళ్ళు న్నాయి. విచిత్ర మేమిటంటే ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. అతడు విశ్రమించడానికి ఎన్నుకున్న పూటకూళ్ళవ్వ కూడా ఏమీ మాట్లాడలేదు. అతడిచ్చిన డబ్బును మౌనంగా తీసుకుని అతడు కోరిన వన్నీ చేసి పెట్టింది.
వీరచంద్రుడికి విషయం అర్ధం కాలేదు. అక్కడి వారంతా మూగవారేమోనని పించింది. కానీ అదెలా సాధ్యం ? ఒక ఊరిలో ఉన్నవారంతా మూగ వాడు కావడం ఎక్కడా ఉండదు.
వీరచంద్రుడు అవ్వనడిగి ఎన్నో వివరాలు సేకరించాలనుకున్నాడు. కానీ ఆమె అతణ్ణి మాట్లాడ వద్దన్నట్లు సైగలు చేసింది. ఆఖరికి విసిగిపోయి అతడు నిద్రలో పడ్డాడు.
ఓ రాత్రి వేళ పెద్ద కలకలం వినిపించి వీరచంద్రుడు ఉలిక్కిపడి లేచాడు.
మునిపల్లె గ్రామంలో కలకలమా ? అదీ అర్ధరాత్రి సమయంలో !
అతడు లేచి బయటకు వెడుతుంటే వెళ్ళవద్దన్నట్లుగా అవ్వ సైగ చేసింది. కాని అతడు వినిపించు కోకుండా బైటకు వెళ్ళాడు. అక్కడి దృశ్యం అతణ్ణి చకితుణ్ణి చేసింది.
అక్కడ పది గుర్రాలున్నాయి. గుర్రాలపై రౌతులున్నారు. వారి చేతుల్లో కొరడాలున్నాయి. వాళ్ళు గ్రామ పౌరుల్ని ఇళ్ళ లోంచి బైటకు లాగి, "ముని ఎక్కడ !" అనడుగుతున్నారు. ఎవ్వరూ జవాబు చెప్పడం లేదు. వాళ్ళ దెబ్బలు భరిస్తున్నారు. బాధతో అరుస్తున్నారు. తమకు తెలియదు మొర్రో అని ఏడుస్తున్నారు. కానీ ఆ మనుషులు చాలా దుర్మార్గుల్లా ఉన్నారు. మగవాళ్ళనే కాక చిన్న చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళ ని కూడా క్రూరంగా హింసిస్తున్నారు.
వీరచంద్రుడి రక్తం మరిగింది. అతడు వెంటనే తన గుర్రం ఎక్కి వాళ్ళ మధ్యకు, వెళ్ళి, "ఎవరు మీరు ? మీకేం కావాలి ?" అనడిగాడు.
గుర్రపు రౌతులు వీరచంద్రుని వంక చూసి, "నువ్వెవరు ? సాయానికి నిన్ను పిలిపించారా వీళ్ళు " అన్నారు.
"నన్నెవరూ పిలిపించలేదు. నేనే వచ్చాను. మీరెవరో చెప్పండి !" అన్నాడు వీరచంద్రుడు.
"మేమెవరిమో మా కొరడాలు చెబుతాయి" అంటూ ఒకడు కొరడా ఝూళి'స్తూ వీరచంద్రుడి మీదకు వచ్చాడు. వాడు విసిరిన కోరడాను చటుక్కున చేత్తో అందుకుని బలంగా లాగాడు వీరచంద్రుడు. కొరడా మనిషి ఆ బలానికి నిలదొక్కుకోలేక కొరడా వదిలిపెట్టి గుర్రం మీంచి కింద పడ్డాడు.
అంతే ! వీరచంద్రుడు విజ్రుంభించాడు.
అతడి బలం అసామాన్యం. అతడిది మెరుపు వేగం. ఆ బలానికీ, ఆ వేగానికి , గుర్రపు రౌతుల వద్ద సమాధానం లేకపోయింది. అంతా నేల కరిచాడు. అప్పుడు ఊరంతా ఏకమై వాళ్ళందర్నీ తాళ్ళతో బంధించాడు.
"ఎవరు బాబూ? సమయానికి దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడావు " అన్నాడు వారిలో ఓ ముసలి వ్యక్తీ .
"నేను విరూపదేశపు రాజ కుమారుణ్ణి. పేరు వీరచంద్రుడు. కార్యార్దినై తాండవవనానికి బయల్దేరి మధ్య దూరంలో ఇక్కడ విశ్రమించాను. మీ కధే నాకు అంటూ పట్టకుండా ఉంది" అన్నాడు వీర చంద్రుడు.
