"కాంతారావా? మనింటికి వచ్చేశాడా?" కొంప మునిగిందే --" అంటూ అయన ఉలిక్కిపడి లేచి గబగబా బట్టలు మార్చుకుని హాల్లోకి బయల్దేరి వచ్చాడు.
"రామానికి వ్యవహారమంతా కుతూహలంగా వుంది. అతనూ తండ్రి వెనకే వచ్చాడు.
"ఏమిటిలా అర్ధాంతరంగా వచ్చేశావ్!" అన్నాడు విశ్వనాధం.
"నేను కావాలని వచ్చానా--నువ్వు రాప్పించావు గానీ ....." అన్నాడు కాంతారావు. అతడి ముఖంలో కోపం దాచుకుందామన్నా దాగడం లేదు.
"పొరపాట్లు ఒకోసారి ఎంతవారికీ వస్తుంటాయి. అంతా నా దురదృష్టం!" అన్నాడు విశ్వనాధం.
"మన వస్తువు ఎదుటి వారి దగ్గర పోయినప్పుడు అది పొరపాటా, నమ్మక ద్రోహమా అన్నది మనకు వారి మీద ఉండే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది --" అన్నాడు కాంతారావు చురుగ్గా విశ్వనాధం వంక చూస్తూ.
"అంటే -- ఏమంటావ్ ?' అన్నాడు విశ్వనాధం.
"నాకు నీమీద నమ్మకం నువ్వు పొరపాట్లు చేయవని. అదే నమ్మకం నమ్మకద్రోహం విషయంలో ఏమనుకోవాలాంటావ్? ఎందుకంటె -- నీవల్ల జరిగింది -- పొరపాటో, నమ్మక ద్రోహమో తప్ప మరొకటి కాదు...." అన్నాడు కాంతారావు.
"నువ్వు చాలా ఖచ్చితంగా నీ మనసులోని మాట చెప్పావు. అందుకు నేను నిన్ను తప్పు పట్టను. కానీ నన్నెలా నమ్ముతావో, నిన్ను నమ్మించడం కోసం నేనేం చేయాలో నువ్వే చెప్పు!" దీనంగా అన్నాడు విశ్వనాధం.
రామం ఆశ్చర్యంగా తండ్రి వంక చూశాడు. విశ్వనాధం కు కోపం బాగా ఎక్కువ. ప్రతిదానికీ చిరాకు పడడం అయన అలవాటు. అలాంటిది కాంతారావు అంతలేసి మాటలంటుంటే ఎలా సహించగలిగాడు? కాంతారావు చాలా గొప్పవాడా? తన తండ్రిని కూడా శాసించగలడా?
'ఆత్మ విశ్వాసం ఉన్నవాడు చిన్న చిన్న తప్పులే చేస్తాడు. నీ ఆత్మ విశ్వాసం మీద నాకు గౌరముంది. నువ్వు చాలా చిన్న తప్పు చేశావని ఇప్పుడే నిరూపిస్తాను. నిరూపించలేని పక్షంలో నీ ముందు నిలబడి లెంపలు వేసుకుని మరీ వెడతాను --" అన్నాడు కాంతారావు.
'అంత మాటనకు, అసలేం చేయాలో చెప్పు!" అన్నాడు విశ్వనాధం.
"నేను పంపిన పెట్టె ఎలా పోయిందో చెప్పు !" అన్నాడు కాంతారావు.
విశ్వనాధం వివరించాడు.
"సరే- అయితే ఓసారి మీ పక్క వాళ్ళింటికి వెడదాం -- " అన్నాడు కాంతారావు. అయన, విశ్వనాధం , రామం -- ముగ్గురూ పక్కింటి కి వెళ్ళారు.
ఇంట్లో అ ఇద్దరబ్బాయిలూ ఉన్నారు.
విశ్వనాధాన్ని చూస్తూనే ఒకబ్బాయి -- 'ఇంక మీ పెట్టిని మీరు తీసుకుని పోతారా?" లేక ఇంకా అది పోయిందనే చెప్పాలా?" అన్నాడు.
విశ్వనాధం తెల్లబోయి "పోయిందని చెప్పడమేమిటి?" అన్నాడు.
"నిన్న రాత్రి నుంచి దీని గురించి నిద్రలేదు. ఎన్నో ఎంక్వయిరీలు, అందరికీ మీరు చెప్పినట్లే అది పోయిందని చెబుతున్నాం. ఇంక మీరు దాన్ని తీసుకు వెళ్ళిపోవడం మంచిదను కుంటాను--" అన్నాడు రెండో అబ్బాయి.
రామానికీ, విశ్వనాధానికీ నోట మాట రాలేదు. నిన్న జరిగిందేమిటి/ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?"
విశ్వనాధం క్షణాల మీద తేరుకున్నాడు-- "ముందా పెట్టి ఎక్కడుందో చూపించండి--"
"మీ పని వాళ్ళెక్కడ పెట్టారో అక్కడే వుంది-" అంటూ అ అబ్బాయి లిద్దరూ పక్క గదిలోకి దారి తీశారు.
ఆ గదిలో వీణ పెట్టి వుంది. దాన్ని రామం గుర్తు పట్టి- "ఇదే నాన్నా- నిన్న వీళ్ళింట్లో పెట్టినదిదే!" అన్నాడతను గట్టిగా.
"దీన్ని మీరు తెరిచి చూశారా?" అన్నాడు విశ్వనాధం.
"చూడమని మీరు చెప్పలేదు గదా! మీరు చెప్పింది మాత్రమే చేశాం మేము. ఇరుగూ పొరుగూ అన్నాక ఆమాత్రం సాయం చేసుకోవడము లో విశేషమేముంది?" అన్నాడా బ్బాయి.
"ఒక్కసారి అంతా గదిలోంచి వెళ్ళిపోతే నేనో చిన్న పరీక్ష చేసుకోవాలి -" అన్నాడు కాంతారావు.
అంతా గదిలోంచి బయటకు వచ్చేశారు. కాంతారావు తలుపులు వేసుకున్నాడు. ఓ పావుగంట తర్వాత అయన బయటకు వచ్చి - "విశ్వనాధం -- ఈ పెట్టెను నా కారు మీద పెట్టించు. కారు పైన చట్రం వుందిలే --" అన్నాడు.
'అంతా సక్రమంగా ఉందా ?' అన్నాడు విశ్వనాధం ఆత్రుతగా.
'అన్నీ తర్వాత చెబుతాను. ముందు నేను చెప్పినట్లు చేయించు --"
పావు గంటలో అన్ని ఏర్పాట్లు జరిగాయి.
"మరి నేను వస్తాను...." అన్నాడు కాంతారావు....
"పెట్టి నువ్వే తీసుకు వెళుతున్నావు ...." అన్నాడు విశ్వనాధం.
"బుద్ది తక్కువై నీతో వ్యాపారం ప్రారంభించాను. తెలివైనవాళ్ళు రెండు పొరపాట్లు చెయ్యరు. ఇంక నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు..." అన్నాడు కాంతారావు.
'అంతా అయోమయంగా వుంది నాకు. నన్నేం మాట్లాడనివ్వడం లేదు నువ్వు. సుడిగాలిలా వచ్చి వెళ్ళిపోతున్నావు. అసలేం జరిగిందో చెప్పడం లేదు...." అన్నాడు విశ్వనాధం.
"చెప్పడానికే ముంది-- నా శ్రేయోభిలాషి ఒకరు ఫోన్ లో నన్ను నీ మోసం గురించి హెచ్చరించడం జరిగింది. సమయానికి వచ్చి నా సరుకు నేను దక్కించుకున్నాను...." అన్నాడు కాంతారావు.
అయన కార్లో కూర్చున్నాడు. క్షణాల మీద కారు రివ్వుమంటూ దూసుకుపోయింది.
రామం, విశ్వనాధం ఇంట్లోకి వెళ్ళారు.
"అయన మీ మీద అంత అధార్టీ చేలాయిస్తాడేమిటి?' అన్నాడు రామం కోపం , ఉక్రోషం మిళితం చేసి.
"అయన భాగస్వామిగా ఉంటె ఎంత అధార్టీ చేసినా భరించవచ్చు. చూస్తుండగా రెండు మూడు లక్షల బేరం పోయింది -" అన్నాడు విశ్వనాధం.
"పొతే పోయిందిలే నాన్నా-- మనం మరో వ్యాపారంలో కూడా దీసుకోవచ్చు. మీరు విచారించకండి!" అన్నాడు రామం.
"ఈ ఒక్క బేరం గురించి కాదు నా బెంగ! ఇలాంటి బేరాలు మొత్తమన్నీ పోయాయి. కాంతారావు దగ్గర్నుంచి ఇలాంటివి నెలకు రెండు తక్కువ కాకుండా దొరుకుతాయి. అదీకాక కాంతారావు నాతొ విడిపోయాడని తెలిస్తే ఇంకా చాలామంది నానుంచి విడిపోతారు. మన దర్జాలంతా ఈ చిల్లర వ్యాపారాలతోనే తప్ప అసలు వ్యాపారాలతో కాదు. అసలు నేను దియేటర్ ఎలా కట్టాననుకుంటున్నావ్?" అన్నాడు విశ్వనాధం, అయన గొంతు దీనంగా ఉంది.
తండ్రి చాలా పెద్ద దెబ్బే తిన్నాడని గ్రహించాడు రామం. ఆ పెట్టిలో కొన్ని లక్షలు చేసే సరుకుండి ఉంటుంది. ఇలా తండ్రి చాలా లాభాలు గడిస్తున్నాడు. ఆ లాభాలన్నీ ఇప్పుడు ఆగిపోయాయి.
"ఇదంతా ఆ పక్కింటి వాళ్ళు చేశారు. వాళ్ళని నాలుగు తంతే బుద్ది వస్తుంది...." అన్నాడు రామం.
"ఇంట్లో బాంబు సంగతి మరిచిపోకు...." అన్నాడు విశ్వనాధం.
"అది నిజమో, కాదో !" అన్నాడు రామం.
'అలాగని రిస్కు తీసుకోలేము గదా!" అన్నాడు విశ్వనాధం.
"ఆసలు పక్కింటి వాళ్ళింటి కి వెడుతుంటేనే మనకు అనుమానం రావాలి. మనింట్లో ఏదైనా పెల్తుందా అని- అలాంటిదేం జరుగలేదు ...." అన్నాడు రామం.
ఇంతలో ఒక పనివాడలా పరుగున వచ్చి -- "దొడ్లో రేకుల షెడ్డు కూలిపోయిందండి -- " అన్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ కంగారు పడ్డారు.
ఆ మధ్య మేడమీద కొత్త గదులు కట్టినప్పుడు సిమెంటు దాచడం కోసమని దొడ్లో రేకుల షెడ్డు ఒకటి కట్టారు. అదిప్పుడు కూలిపోయింది.
తండ్రీకొడుకు లిద్దరూ దొడ్లోకి పరుగెత్తారు.
షెడ్డు కూలిపోవడం నిజమే! అదెలా జరిగిందో తెలియదు.
విశ్వనాధం మొహం కడుక్కుంటూ ఉండగా ఫోన్ కాల్ ఒకటి వచ్చింది-- "మిస్టర్ విశ్వనాధం! ఇంట్లో గదెందుకులే అని దొడ్లో రేకుల షెడ్డు తో వదిలి పెట్టాను. శాంపుల్ చూశావుగా. మీ పొరుగింటి వాళ్ళు అమాయకులు. వాళ్ళ జోలికి వెళ్ళకు. అమాయకుల జోలికి వెడితే నీ యింట్లో బాంబు పేలుతుంది...."
రామం అందుకుని విన్నాడది. కంఠం స్త్రీది.
స్త్రీ అనగానే అతడికి సునంద గుర్తుకొచ్చింది.
అవును - ఆ కంఠం సునందదే!
రామం సునంద ఇంటికి పరుగెత్తాడు. అసలీ నాటకమంతా ఏమిటో ఆమెను అడిగి తెలుసుకోవాలి. గట్టిగా హెచ్చరించాలి.
అతను నిన్న తను వెళ్ళిన ఇంటికి వెళ్ళాడు.
ఓ యువకుడు తలుపు తీశాడు.
"సునందతో మాట్లాడాలి!"అన్నాడతను.
"సునంద ఎవరు?' అన్నాడా యువకుడు.
రామం ఎంత చెప్పినా సునంద ఎవరో ఆ యువకుడికి అర్ధంకాలేదు. అలాంటి పేరు గల అమ్మాయి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండలేదని అతను నొక్కి వక్కాణించాడు.
"పోనీ -- నా తృప్తి కోసం -- ఒక్కసారి సునంద ఉందని నేననుకున్న గదిని చూడనిస్తారా?" అన్నాడు రామం.
