Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 19


    "ఇప్పుడు గుర్తుపట్టగలవా అతణ్ణి-ఫోటోలో వున్న వ్యక్తిలాగే వున్నాడా!"
    "లేడు, బహుశా మారువేషం కావచ్చు....."
    "నేరస్థుడు చాలాతెలివైనవాడిలాగున్నాడు....."అన్నాడు రామారావు.
    "మీరు ముగ్గురూ కూడా మీకు ఆయా వస్తువులెలా వచ్చాయో చెప్పలేరు. రహస్యంగా వుంచమని నేరస్థుడు చెప్పాడా?" - అనడిగాడు సూర్యారావు.
    ముగ్గురి దగ్గర్నుంచీ కూడా అవునని సమాధానం వచ్చింది.
    "నేరస్తుణ్ణి నేను చూశాను. అతను హోటల్ శాంతి భవనంలో పన్నెండో నంబరు గదిలో వుంటున్నాడు. ఈ వస్తువులనీ-అతన్ని కలిపి పట్టిస్తే మనకు పదివేలు బహుమతి లభిస్తుంది. అయితే ఒక చిన్న మనవి. పదివేలూ ముగ్గురూ సమంగా పంచుకుందాం. కానీ అర్జంటుగా నాకు అయిదువేలు అవసరం. మీరు ముగ్గురూ కలిసి యింకో రెండువేల అయిదువందలు నాకు అప్పుగా యివ్వాలి...." అన్నాడు సూర్యారావు.
    "అయితే నేరస్తుణ్ణి మనం పట్టుకోగలమనే అనుకుంటున్నావా?" అన్నాడు సాంబమూర్తి.
    "మనం నలుగురం కలిస్తే అతణ్ణి పట్టుకోవడం ఏమంత కష్టసాధ్యం కాదనిపిస్తోంది. దానికి తోడు అపురూపమైన ఈ మూడు వస్తువులూ మన చేతికి చిక్కాయి" అన్నాడు సూర్యారావు.
    "వీటినే యధాతధంగా పోలీసులకిచ్చేసి-నేరస్థుడి వివరాలు చెప్పేస్తే..." అన్నాడు రంగనాధం.
    "మీరుచెప్పే విషయాలు కట్టుకథల్లా వున్నాయి. ఈ వస్తువులు మీకెలా వచ్చాయోనని పోలీసులను మానపడి ముందు మిమ్మల్ని లాకప్ లో పడేస్తారు....." అన్నాడు సూర్యారావు.
    "అయితే మనమేం చేయాలంటావ్?" అన్నాడు సాంబమూర్తి.
    "ఆ మనిషినీ-ఈ వస్తువులనీ కలిపి పోలీసుల కప్పగించాలి...." అన్నాడు సూర్యారావు.
    "మనమా సామాన్యులం. వాడేమో తెగించినవాడు. ప్రమాదముండదంటావా?" అన్నాడు రంగనాధం.
    "ప్రమాదకరంగా మనం ప్రవర్తించవద్దు. వాడి వునికి తెలుసుకుని పోలీసులకు చెప్పేద్దాం. ఈ వస్తువుల్నీ వాణ్ణి పట్టిచ్చినట్టవుతుంది....." అని-"వాడు పారిపోయి ఈ ఊరొచ్చాడు. వాణ్ణి పోలీసులు అనుమానించడం జరిగింది. అందుకే తాత్కాలికంగా తన వస్తువులు మీదగ్గర దాచాడు. పదండి శాంతి భవనం హోటల్ కి వెడదాం -" అన్నాడు సూర్యారావు.
    
                                        3

    మిత్రులు ముగ్గురూ తమతమ వస్తువులతో శాంతి భవనం హోటల్ కు బయల్దేరారు. సూర్యారావుని వదిలి పెడితే మిగతా ముగ్గురికీ మనసులోకాస్త బెదురుగానే వుంది వాడు తాత్కాలికంగా ఆ వస్తువులు తమదగ్గర దాచిపెట్టాడు విషయాన్ని రహస్యంగా ఉంచమని హెచ్చరించాడు. ఇప్పుడది బయటపడితే తమ ప్రాణాలకే ముప్పువస్తుంది.
    హోటల్ శాంతిభవనం చేరుకోగానే సూర్యారావుతిన్నగా రిసెప్షన్ దగ్గరకువెళ్ళి రూంనెంబరు పన్నెండులోని వ్యక్తిని కలుసుకోవాలన్నాడు.
    రిసెప్షనిస్టు సూర్యారావును చూసినవ్వి-"సార్ మీరు నాకు తెలిసినవారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని పట్టించి వుండేవాణ్ణి. అతనికోసం ఎవరువచ్చినా-పోలీసులకు చెప్పమని ఆర్డర్ వుంది...." అన్నాడు.
    సూర్యారావు స్వరం తగ్గించి-"ఈరోజు పేపరులో అతనిఫోటో చూసాను. మీ హోటల్లో అతనుంటున్నట్లు చూశాను. నేను పోలీసులకు సాయపడదామనే వచ్చాను. అతని సంగతి పోలీసులకు తెలిసిపోయిందా? అసలేం జరిగింది?"-అన్నాడు. అతని కంఠంలో నిరుత్సాహం ధ్వనించింది.
    "నిన్న సాయంత్రం కాబోలు సార్-ఏదో రహస్యవ్యవహారం చేస్తూ అతను పోలీసుల కంటబడ్డాడు. వాళ్ళ తన్ని ఫాలో అయ్యారు. తిన్నగా మా హోటల్ కి వచ్చారు అతను గదికి వెళ్ళిపోగానే నన్ను వివరాలడిగారు. నాకు తెలిసినవి చెప్పాను. తరువాత వాళ్ళతని గదికివెళ్ళారు. గది తలుపులు లోపలవేసి వున్నాయి. ఎంతతట్టినా ఎవరూ తలుపు తీయలేదు.
    ఆఖరికి బలవంతంగా తలుపులు తెరచి వెళ్ళారు. లోపల ఎవరూలేరు. గదంతా వెదకగా అతనికి సంబంధించిన కొన్ని వివరాలు దొరికాయి. దాన్నిబట్టి అతను అనేక నగరాల్లో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న స్మగ్ లర్ ప్రముఖుడని తెలిసింది. పోలీసులు వెంటనే అప్పటికప్పుడే ప్రకటన వేయించారు.
    మా హోటల్లో బసచేసినవారి ఫోటోలుంచడం మా అలవాటు. ఆ విధంగా వారికి ఫోటోకూడా లభించింది. ప్రస్తుతం ఆ స్మగ్లర్ ఊళ్ళో తిరుగుతున్నాడు. యెవరు పట్టుకుంటేవారికి పదివేలు బహుమానం. మళ్ళీహోటల్ కు వస్తే నేనే పట్టుకుని ఆ పదివేలూ సంపాదిద్దామనుకుంటున్నాను సార్! కానీ వాడు మళ్ళీ యిక్కడికి వస్తాడా-అది కలలోనిమాట...." రిసెప్షనిస్టు నిట్టూర్చాడు.
    సూర్యారావుతోపాటు మిత్రులు ముగ్గురి ముఖాల్లోకూడా నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముగ్గురు బయటకు వచ్చారు.
    "వాడూళ్ళో వున్నాడు కాబట్టి, మన యిళ్ళకు వచ్చే అవకాశముంది...." అన్నాడు రంగనాధం.
    "ఒక పని చేద్దాం. మీరంతా నా గదికి వచ్చేయండి. ఎవరయినా మీకోసం మీ యిళ్ళకువస్తే మా ఇంటికి రమ్మనమని చిరునామా చెప్పండి. వాడు తప్పక మీ యిళ్ళకు వెడతాడు. ఆ తర్వాత మా యింటికీ వస్తాడు. అప్పుడు మనం నలుగురం, వాడొక్కడు. పదివేలు ఈజీగా సంపాదించవచ్చు...." అన్నాడు సూర్యారావు.
    "కానీవాడు స్మగ్లర్. మనం సామాన్యులం...." అన్నాడు రంగనాధం.
    "భయపడకు నాయనా నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. సరా?"-అన్నాడు సూర్యారావు. తాము నలుగురు కలిసి అప్పుడే పదివేలు సంపాదించినట్లే అతను భావిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS